వైశాఖ  పర్వం శుభప్రదం

15 Apr, 2018 01:50 IST|Sakshi

మాసం

భక్తులందరూ అత్యంత శుభప్రదమైనదిగా భావించే అక్షయ తదియ, పరశురామ జయంతి, సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం, బసవేశ్వర జయంతి,  శంకర జయంతి, రామానుజ జయంతి, గంగోత్పత్తి, విద్యారణ్య జయంతి, హనుమజ్జయంతి, నారసింహ జయంతి తదితర పర్వదినాలన్నింటికీ ఆలవాలం వైశాఖ మాసం. చంద్రమానాన్ని అనుసరించే ప్రజలు చైత్రశుద్ధ పాడ్యమిని సంవత్సరారంభంగా ఏ విధంగా భావిస్తారో  సౌరమానాన్ని ఆచరించే జనులు వైశాఖమాసం మొదలయ్యే రోజును అంటే వైశాఖశుద్ధ పాడ్యమిని సంవత్సరాదిగా భావిస్తారు. వైశాఖమాసంలో ప్రతిరోజూ పుణ్యతీర్థాల్లో స్నానం చేయటం విశేష ఫలితాన్నిస్తుందని పద్మ పురాణం చెబుతోంది. కార్తీక మాసంలో లాగే స్నానానికి, దానానికి, శుభకార్యాలకీ ఈ మాసం అత్యంత అనువైనది.  వైశాఖ స్నానానికి పుణ్యతీర్థం, చెరువు, సరస్సు లేక బావి... వీటిల్లో ఏదైనా యోగ్యమైనదే! సంకల్ప పూర్వకంగా వైశాఖ స్నానాన్ని ఆచరించడం మంచిది. నెల పొడవునా స్నానం చేయలేకపోతే కనీసం శుక్లపక్ష త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ – ఈ మూడు తి«థుల్లో అయినా స్నానం చేయటం సకల పాప క్షయకరం. స్నానం తర్వాత అత్యంత భక్తి శ్రద్ధలతో తులసిదళాలతో విష్ణుపూజ చేయాలి. ఈ విధంగా త్రికాలపూజ చేసే వారికి పునర్జన్మ ఉండదని పద్మపురాణ వచనం. వైశాఖంలో సముద్రస్నానం ఎంతో ప్రశస్తమైనదని శాస్త్ర వచనం.

ఈ మాసంలో ఏకభుక్త వ్రతాన్ని అంటే ఒక పూట భోజనం చేసి, మరోపూటఏదైనా అల్పాహారం తీసుకుంటూ, విష్ణుపూజ చేసేవారికి కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయని వామన పురాణం చెబుతుంది. పాడి ఆవును, పాదుకలు, చెప్పులు, గొడుగు, విసనకర్ర, శయ్య, దీపం, అద్దం– వంటి వాటిని దానంగా ఇవ్వాలి. వీలైనంత మందికి భోజనం పెట్టి నీటితో నింపిన కలశాలను, యవలను దక్షిణ సహితంగా దానం ఇవ్వాలి. అందుకు శక్తి లేనివారు సంకల్ప సహితంగా స్నానం చేసి, పులగం వండి పదిమందికి భోజనం పెట్టాలి.  ఆచారాలపై విశ్వాసం లేకున్నా, వైశాఖంలో చలివేంద్రాలు నిర్వహించటం, బాటసారులకు చెరుకు రసం, మామిడి పండ్లు, దోసకాయలు, మజ్జిగ తేట, సుగంధ ద్రవ్యాలు దానం చేయడం, పేదలకు చెప్పులు, గొడుగు, పల్చని వస్త్రాలు, చందనం, పూలు, పండ్లు,  నీటితో నింపిన కుండని దానం చేయటం వల్ల గుండె నిండుతుంది.   

మరిన్ని వార్తలు