బండి నడుపుతుంటే కళ్లు తిరుగుతున్నాయి!

7 Jul, 2014 22:44 IST|Sakshi
బండి నడుపుతుంటే కళ్లు తిరుగుతున్నాయి!

డాక్టర్ సలహా
 
నా వయసు 44. డ్రైవర్‌ని. నాకు అప్పుడప్పుడూ సడన్‌గా కళ్లు తిరుగుతున్నాయి. ఆ తర్వాత చూపు మసకగా కనిపిస్తోంది. అందుకు ఇంగ్లిష్ మందులు వాడుతున్నాను. వాటిని వేసుకున్న మరుసటి రోజు బాగానే ఉంటోంది. వేసుకోని మరుసటి రోజు కళ్లు తిరగడం, మసక వస్తోంది. నాకు తగిన వైద్యాన్ని సూచించగలరు.    
- రామకృష్ణ, ఏలూరు


మీ వయసు, ఉద్యోగంలో ఒత్తిడి దృష్టిలో ఉంచుకుని మీరు చెప్తున్న లక్షణాలను పరిశీలించినట్లయితే... ముందుగా మీరు రక్తపోటు (బి.పి) పరీక్ష చేయించుకోవాల్సి ఉంది. అలాగే మధుమేహం పరీక్షలు కూడా చేయించాలి. మీరు చెప్తున్న లక్షణాలకు మధుమేహంతో నేరుగా సంబంధాలు లేకపోయినప్పటికీ మధుమేహం అనుబంధంగా మరికొన్ని రుగ్మతలు తోడయినప్పుడు ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. ఉన్నట్లుండి కళ్లు తిరగడాన్ని ఆయుర్వేదంలో అపస్మారకం (ఎపిలెప్సీ)గా పరిగణిస్తారు. బ్రెయిన్ స్కాన్ చేసి ఆ సంబంధిత రుగ్మతలు ఉన్నాయేమోనని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లోపుగా మీరు పై లక్షణాలకు ఆయుర్వేదం సూచించిన ప్రాథమిక ఔషథాలను తీసుకోండి.
 
ఔషధం:
లఘుసూతశేఖరరసం (మాత్రలు) ఉదయం రెండు రాత్రి రెండు, స్ట్రెస్‌వీన్ క్యాప్సూల్స్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి, అర్జునారిష్ఠ (ద్రావకం) నాలుగు చెంచాలు ఉదయం నాలుగు చెంచాలు రాత్రి సమానంగా నీటిని కలిపి తీసుకోవాలి.
 
ఆహారం: ఈ మందులు వాడుతూ బలవర్ధకమెన ఆహారం తీసుకుంటూ ఉప్పు, నూనెలు తగ్గించాలి. ఖర్జూరం, నువ్వుపప్పు, తాజాపండ్లు తీసుకోవాలి.
 
విహారం: రాత్రివేళ కనీసం ఆరేడు గంటలు నిద్రపోవాలి. ఉదయం, సాయంత్రం ఖాళీ కడుపుతో ఐదు నిమిషాల సేపు ప్రాణాయామం చేయాలి.
 
- డాక్టర్ వి.ఎల్.ఎన్. శాస్త్రి, ఆయుర్వేద నిపుణులు, హైదరాబాద్
 

మరిన్ని వార్తలు