జంక్‌ఫుడ్‌ ఎందుకు తినకూడదంటే..?

23 Jun, 2018 00:09 IST|Sakshi

టీనేజీ పిల్లల క్రేజ్‌ అంతా జంక్‌ఫుడ్డే. అలా నిలబడి త్వరత్వరగా తినడానికి అది అనువుగా ఉంటుంది. చేతికేమీ అంటకుండా ఫ్రెండ్స్‌ అంతా కలిసి తినేయడానికి వీలుగానూ ఉంటుంది. అందుకే టీనేజీ పిల్లలు వాటిని ఎగబడి తింటుంటారు. పిజ్జా, బర్గర్, పఫ్స్‌ వంటివాటికి ప్రాణం పెడుతుంటారు. కానీ వాటి గురించి టీనేజ్‌ పిల్లలకు కాస్త అవగాహన కల్పిస్తే వారు వీటికి దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఆ వయసు లో వారిలో శారీరకంగా ఎదుగుదల కనిపిస్తుంది. మానసిక వికాసం చోటు చేసుకుంటూ ఉంటుంది. వారికి వ్యక్తిత్వ నిర్మాణమూ  కొనసాగుతుంటుంది. వీటన్నింటినీ జంక్‌ఫుడ్‌ దెబ్బకొడుతుంది. 

జంక్‌ఫుడ్‌తో అనర్థాలివే... బేకరీ ఐటమ్స్, పిజ్జా, బర్గర్, బాగా పాలిష్‌ చేసిన ధాన్యాలతో తయారు చేసే పదార్థాలు వంటి జంక్‌ఫుడ్‌ ఎందుకు అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయో తెలుసుకుంటే, వాటి నుంచి దూరంగా ఎందుకుండాలో కూడా తెలుస్తుంది.   ఫైబర్‌ చాలా తక్కువ : జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంలో పీచుపదార్థాల (ఫైబర్‌) భూమిక ఎంతో ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, క్యాన్సర్‌ను నివారించడం, మలబద్దకాన్ని దూరం చేయడానికి పీచుపదార్థాలు ఉపయోగపడతాయి. అయితే జంక్‌ఫుడ్‌లో మాత్రం ఆహారాన్ని పేగుల్లో సాఫీగా  కదిలేలా చేసే పీచుపదార్థాలు చాలా తక్కువగా ఉంటుంది. ∙హానికారక ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువ: జంక్‌ఫుడ్‌ చాలా కాలం పాటు నిల్వ ఉండటానికి వీలుగా వాటి తయారీకి హైడ్రోజెనేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ ఉండే నూనెలను ఎక్కువగా ఉపయోగిస్తారు. కాని వాటి వల్ల భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ∙చెడు కొవ్వులూ ఎక్కువే : రుచి పెరగడానికి వాడే కొన్ని కొవ్వు పదార్థాల వల్ల... ఈ ఆహారం కారణంగా ఒంట్లో చాలా త్వరగా అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ పేరుకుపోయేందుకు అవకాశాలు ఎక్కువ ∙దీర్ఘకాలం నిల్వ ఉండేలా చేసేందుకు ఉప్పు ఎక్కువగా వాడతారు. అది భవిష్యత్తులో హైపర్‌టెన్షన్‌ (హైబీపీ) వంటి ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. 
 

మరిన్ని వార్తలు