వచ్చేస్తోంది విండోస్ 10!

1 Oct, 2014 22:30 IST|Sakshi
వచ్చేస్తోంది విండోస్ 10!

మైక్రోసాఫ్ట్ ఒక నంబర్‌ను తప్పించింది. విండోస్ 8 సీరిస్ నుంచి ఒకేసారి విండోస్ 10కు అప్‌గ్రేడ్ అవుతున్నట్టుగా ప్రకటించింది. విండోస్ ఎయిట్ విషయంలో తీవ్రంగా నిరాశచెందామని.. విండోస్ టెన్ మాత్రం తమ గొప్ప ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫారమ్ అవుతుందని మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో కంప్యూటర్లను వాడుతున్న వారి సంఖ్య కోట్లలో ఉంటుంది.

విండోస్ ఎక్స్‌పీ, విండోస్ 7, విండోస్ 8 సీరిస్‌లోని వివిధ వెర్షన్లపై కొన్ని కోట్ల కంప్యూటర్‌లు పనిచేస్తున్నాయి. అయితే విండోస్8 విషయంలో మైక్రోసాఫ్ట్ ప్రభ మందగించింది. ఇది యూజర్లను అంతగా ఆకట్టుకోలేకపోయింది. మైక్రోసాఫ్ట్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకొంటోంది. చాలా తక్కువమంది వినియోగదారులు మాత్రమే విండోస్ ఎయిట్‌కు అప్‌డేట్ అయ్యారని ఆ సంస్థ ధ్రువీకరించింది.

అనేకమంది టెక్ పండితులు కూడా విండోస్ ఎయిట్‌ను ఒక అన్‌పాపులర్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో విండోస్ ఎయిట్ విషయంలో కూడా మైక్రోసాఫ్ట్ కూడా భారీ ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. కానీ పెద్దగా ప్రయోజనం కనపడినట్టు లేదు. కేవలం 20 శాతం సంస్థలు మాత్రమే విండోస్ 8కి మారాయని మైక్రోసాఫ్ట్ గణాంకాలు చెబుతున్నాయి. చాలామంది విండోస్ ఎయిట్‌ను ఇష్టపడలేదని.. టచ్ ఇన్‌పుట్ కోసం రూపొందించిన ఈ ఓఎస్‌ను వారు స్వీకరించలేదని విశ్లేషకులు అంటున్నారు.
 
ఈ నేపథ్యంలో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. పర్సనల్‌కంప్యూటర్‌లు, విండోస్ ఓఎస్‌పై పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లకు విండోస్ 10 మంచి ఆపరేటింగ్ సిస్టమ్ అవుతుందని మైక్రోసాఫ్ట్ సంస్థ హామీ ఇస్తోంది. మరోవైపు ఈ విండోస్ 10 అనేది మైక్రోసాఫ్ట్‌కు అత్యంత కీలకమైనదని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మైక్రోసాఫ్ట్ తన సత్తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
 
ఒకవైపు స్మార్ట్‌ఫోన్‌ల ఆపరేటింగ్ సిస్టమ్ విషయంలో ఆండ్రాయిడ్, ఐఓస్‌లు దూసుకుపోతున్నాయి. మెజారిటీ స్మార్ట్‌ఫోన్‌లు ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీదే పనిచేస్తున్నాయి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా స్మార్ట్‌ఫోన్‌లపై ఉనికిలో ఉన్నప్పటికీ అది మరీ ప్రభావాత్మకమైన స్థాయిలో అయితే లేదు. ఈ నేపథ్యంలో విండోస్ 10 ద్వారానైనా మైక్రోసాఫ్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై తన ముద్రను వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
 
మరి విండోస్ 10 ఎప్పుడు విడుదల అవుతుంది... ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయం గురించి మైక్రోసాఫ్ట్ స్పష్టమైన ప్రకటన చేయలేదు. 2015 వసంత రుతువు కళ్లా ఈ కొత్త ఓఎస్ అందుబాటులోకి వస్తుందని మాత్రం హామీ ఇస్తోంది. విండోస్ యూజర్లు అయితే ఎక్స్‌పీ, విండోస్ 7లతోనే కంఫర్ట్‌గా ఉన్నారు. అలాంటి వారిని మైక్రోసాఫ్ట్ విండోస్ 10తో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి!
 

మరిన్ని వార్తలు