మహిళలు మందిరాలు

11 Feb, 2016 22:36 IST|Sakshi
మహిళలు మందిరాలు

స్త్రీలను నిరోధిస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు
శని శింగణాపూర్‌లో తైలాభిషేకానికి స్త్రీలకు అనుమతి లేదు
హాజీ అలీలో ప్రవేశం కోసం హైకోర్టు జోక్యం
కాలంతో పాటు ఆచారాలూ మార్చుకోవాలని స్త్రీల ఉద్యమం
మహిళా పూజారుల ఏర్పాటు కోసం డిమాండ్
ఖాజీల స్థానం తీసుకుంటున్న ముస్లిం మహిళలు
శబరిమలపై కూడా సాగుతున్న చర్చ

 
వ్యక్తులు ఎప్పటికప్పుడు తమను తాము కనుగొంటూ ఉంటారు. తాము ఏమి పొందుతున్నారో, ఏమి కోల్పోతున్నారో చైతన్యవంతమైన దృష్టితో తెలుసుకుంటూ ఉంటారు.ఆ తెలుసుకున్నది వెంటనే సాధించుకుంటే ఘర్షణ లేదు. ఆ తెలుసుకోవడమే ఒక ఘర్షణకు కారణమైతే అది శింగణాపూర్ ఘటన అవుతుంది.
   
గుడికొస్తాం.
రండి.
పూజిస్తాం.
పూజించండి.
తైలాభిషేకం చేస్తాం.
అది మాత్రం కుదరదు. కేవలం మగవారికి మాత్రమే.
ఏం... ఆడవాళ్లు ఏం పాపం చేశారు?
అదీ ప్రశ్న. అదీ ఘర్షణ. అదే ఇప్పుడు దేశంలో నలుగుతున్న చర్చ.
   
2015.. నవంబర్ 28.  ఆ రోజు ఉదయం..
ఓ మహిళ శింగణాపూర్ దేవాలయంలోకి వెళ్లింది. ఆ ఆలయంలో స్త్రీలకు ప్రవేశం ఉంది కాబట్టి అది విశేషం కాదు. కాని ఆవరణలోని శని శిలకు మగవాళ్లు నిర్వహించినట్టే తైలాభిషేకం చేసింది. అది మాత్రం విశేషమే. ఆ సమయంలో దీనికి ఆలయ పూజారులు కానీ, అక్కడున్న సిబ్బంది కానీ అడ్డు చెప్పలేదు. కాని ఈ సంఘటన సోషల్ మీడియాలో వీడియోగా ప్రచారం కావడంతో ఆలయ ధర్మకర్తల మండలి విస్తుపోయింది. మహిళ చేసిన తైలాభిషేకం వల్ల శనిదేవుడి శిల, ఆ ప్రదేశం అపవిత్రమైందంటూ శని దేవుడి శిలకు క్షీరాభిషేకం చేసి శుద్ధి నిర్వహించింది.

సమస్య మొదలు..
ఈ ఉదంతం దావానలంలా వ్యాపించింది. కొందరు తప్పు పట్టారు. కొందరు దీనికి మద్దతు పలికారు. మహారాష్ట్రలోని ‘భూమాతా రణరాగిణి బ్రిగేడ్’ అనే మహిళా ఉద్యమాల సంస్థ ఈ సమస్యను తన ప్రస్తుత ఎజెండాగా స్వీకరించింది. ఈ బ్రిగేడ్ అధ్యక్షురాలైన 32 ఏళ్ల తృప్తి దేశాయ్ శని శింగణాపూర్ ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించాలనే ఆందోళనకు అభిప్రాయ సమీకరణ చేస్తున్నారు. ‘ఇప్పటికే అనేక మూఢనమ్మకాలు, అర్థంలేని ఆచారాలతో మహిళలను అణగదొక్కుతున్నారు. స్త్రీలను దేవుడి దగ్గరకు కూడా రానీయకుండా చేస్తున్నారు. దైవం దైవమే. అక్కడ ఆడ, మగ తేడా ఏంటి? ఏ సంప్రదాయాలైనా మనం సృష్టించుకున్నవే.  సతి ఆచారంగా సాగిన భూమి మీదే అది దురాచారంగా మారిన సందర్భం లేదా? మారుతున్న కాలానికి అనుగుణంగా సంప్రదాయాలూ మారాలి.. మార్చుకోవాలి. ఆ మాటకొస్తే రాజ్యాంగమే స్త్రీ, పురుషులకు సమాన హక్కులు కల్పించింది’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తృప్తి ్తదేశాయ్.  వీళ్లకు మహారాష్ట్రలోని అంధశ్రద్ధ నిర్మూలన సమితి (మూఢనమ్మకాల నిర్మూలన సమితి)తోపాటు దేశంలోని ఎన్నో మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. అయితే శని శింగణాపూర్ ధర్మకర్తల మండలి మాత్రం శని దేవుడి శిలకు మహిళలు తైలాభిషేకం  చేసేందుకు ససేమిరా అన్నది. దీనికి తృప్తి దేశాయ్ సేన వెనక్కి తగ్గలేదు. జనవరి 26న  మొత్తం 400 మంది మహిళలతో కలిసి  శనిశింగణాపూర్‌లో పూజలు చేసేందుకు ప్రయత్నించారు. వీళ్ల ప్రయత్నాన్ని మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. దీనిపై ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ఓ మధ్యేమార్గాన్ని సూచించడానికి ముందుకు వచ్చారు. ఆ ప్రస్తావనా తమకు సమ్మతంగా లేదని తృప్తి దేశాయ్ బృందం నిరాకరించింది.  
 
ట్రస్టీలో మహిళలకు చోటు
 పదకొండు మంది సభ్యులున్న శని శింగణాపూర్ ఆలయ ట్రస్టీలో ఇప్పటి వరకు ఒక్క మహిళకు కూడా స్థానం లేదు. పూజలు ఎలాగూ చేయనివ్వట్లేదు కనీసం ట్రస్టీలోనైనా స్త్రీలకు స్థానం కల్పించాల్సిందిగా స్థానిక మహిళలు పోరాడారు. దాంతో మొన్న జనవరి 11న జరిగిన ట్రస్టీ ఎన్నికల్లో ఆడవాళ్లకు అవకాశం కల్పించారు. అనితా శెట్యే అనే మహిళ గెలవడమే కాక ట్రస్టీ అధ్యక్షురాలు కూడా అయ్యింది. అయితే ఆ పాయింట్‌నే పట్టుకొని తమ నిరసనను తీవ్రం చేసింది తృప్తి దేశాయ్ బృందం. మహిళా అధ్యక్షురాలు ఉన్న ఆలయంలో మహిళలకు పూజార్హత లేకపోవడమేంటి? అంటూ ప్రశ్నలపరంపరను సంధించింది. శని దేవుని పూజలు చేసేందుకు మహిళలను అనుమతించేంత వర కు ఆందోళన విరమించేది లేదు అంటూ హెచ్చరిక కూడా చేసింది ఈ బృందం.
 
హాజీ అలీ...
శని శింగణాపూర్‌లో మహిళల ప్రవేశానికి పోరాటం జరుగుతుండగానే ఇంకోవైపు ముంబైలో హజీ అలీ దర్గాలోకీ మహిళలకు ప్రవేశం కల్పించాలని ఆ వర్గపు స్త్రీల పోరాటం ప్రారంభమైంది. దానికీ తృప్తి దేశాయ్ బృందం మద్దతు పలికింది. అయితే ఇటీవలే ముంబై హైకోర్ట్ హజీ అలీ దర్గాలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని చెప్పింది. మరోవైపు రాజస్థాన్‌లోని దేవ్‌బంద్‌లో దారుల్ ఉలూమ్ ఇద్దరు మహిళలను ఖాజీలుగా నియమించింది. ఇంతకాలం కేవలం పురుషుల గుత్తాధిపత్యంలో ఉన్న ఖాజీ హోదా ఇప్పుడు మహిళలకు కూడా దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నవారు ఉన్నారు. ఈ సందర్భంగా దారుల్ ఉలూమ్ అధికార ప్రతినిధి మౌలానా అష్రాఫ్ ఉస్మానీ మాట్లాడుతూ ‘ఖాజీలు, పండితులు అవడానికి జ్ఞానం, అనుభవం, శిక్షణ ముఖ్యం కానీ జెండర్ ప్రధానం కాదు. ఈ లెక్కన ముస్లిం మహిళలకూ అన్ని హక్కులూ ఉన్నాయి’ అని స్పష్టం చేశారు.
 - గుండారపు శ్రీనివాస్ / చక్రవర్తి  సాక్షి ముంబై
 
దైవం దైవమే.. అక్కడ ఆడ, మగ తేడా ఏంటి? ఏ సంప్రదాయాలైనా మనం సృష్టించుకున్నవే. మగవాళ్లు తమ ప్రయోజనాలకు అనుగుణంగా పెట్టుకున్నవే. సతి ఆచారంగా సాగిన భూమి మీదే అది దురాచారంగా మారిన సందర్భం లేదా? మారుతున్న కాలానికి అనుగుణంగా సంప్రదాయాలూ మారాలి.. మార్చుకోవాలి. ఆ మాటకొస్తే రాజ్యాంగమే స్త్రీ, పురుషులకు సమాన హక్కులు కల్పించింది.
 - తృప్తి దేశాయ్, భూమాతా రణరాగిణి బ్రిగేడ్ అధ్యక్షురాలు
 
శని దేవుడిని శుభంగా ఎవరూ భావించరు. నిరాశనిస్పృహలు, రోగాలురొష్టులు, వినాశకాలకు అధిపతిగా ఉంటాడు. శని వెలసిన  చోటు చాలా ప్రమాదకర శక్తులకు ఆలవాలం. స్త్రీ, పురుషులు సమానమైనప్పటికీ శరీరనిర్మాణరీత్యా పురుషులకు ఉన్న దృఢత్వం స్త్రీలకు ఉండదు. శని ఆలయంలోని ఆ ప్రమాదకర శక్తులను పురుషుడు తట్టుకోగలడు.. కానీ స్త్రీ తట్టుకోలేదు. అందుకే అలాంటి చోట్లకు ఆడవాళ్లు వెళ్లకపోవడం మంచిది అనే ఆచారం వచ్చింది.
 - జగ్గీవాసుదేవ్, ఆధ్యాత్మిక గురువు
 
నిషిద్ధ ప్రదేశాలు
 
శని శింగణాపూర్‌తోపాటు మన దేశంలో పదేళ్ల నుంచి యాభై ఏళ్ల మహిళలదాకా ప్రవేశంలేని మరో ఆలయం కేరళలోని శబరిమలై అయ్యప్పస్వామి దేవాలయం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ వివక్ష మందిరాల్లో కనిపించకపోయినా మరికొన్ని చోట్ల కనిపిస్తుంది. అమెరికాలోని బెతెస్డా అనే ప్రాంతంలో ఉన్న బర్నింగ్‌ట్రీ క్లబ్ అనే గోల్ఫ్‌కోర్స్‌కి స్త్రీలు వెళ్లడం నిషిద్ధం.సౌది అరేబియాలో మహిళలకు పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదు. అలాగే వాటికన్‌లో కూడా మహిళలను పోలింగ్ కేంద్రాలకు అనుమతించరు. టూర్ దె ఫ్రాన్స్ అనేది ప్రతి యేడు ఫ్రాన్స్‌లో జరిగే ఓ సైకిల్ పందెం. ఈ పందెంలో పాల్గొనడానికి మహిళలకు అనుమతి లేదు. ఇరాన్‌లోని ‘ఆజాద్ సాకర్ స్టేడియం’ లోకి మహిళలను నిషేధించి ఫుట్‌బాల్ ఆటను చూడాలనే వాళ్ల ఇచ్ఛను, స్వేచ్ఛను హరించారు.  జపాన్‌లోని అతిపెద్ద కొండ ప్రాంతం మౌంట్ ఒమైన్. 1300 ఏళ్ల కిందటి ఈ బౌద్ధక్షేత్రంలో మహిళలకు ప్రవేశం లేదు.  {Xస్‌లోని మౌంట్ అథోస్ తీర ప్రాంతం ఎంతోమంది సన్యాసుల తపోకేంద్రం. అయితే ఇప్పటికీ ఇక్కడికి మహిళలు వెళ్లకూడదనే నిబంధన అమల్లో ఉంది.
 
 

మరిన్ని వార్తలు