పాక్‌లో బరేల్వీ వర్గంపై దాడులు ఎందుకు పెరిగాయి?

9 Oct, 2023 10:42 IST|Sakshi

సున్నీ దేశమైన పాకిస్తాన్‌లో అదే ముస్లిం మతానికి చెందిన అహ్మదీయ, షియాల తర్వాత తాజాగా బరేల్వీ ముస్లిం వర్గంపై దాడులు పెరిగిపోయాయి. పాకిస్తానీ వార్తాపత్రిక ‘డాన్‌’లోని ఒక నివేదిక ప్రకారం గత నెలలో బలూచిస్తాన్‌లోని మస్తుంగ్ జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత బరేల్వి కమ్యూనిటీపై తరచూ దాడులు చోటుచేసుకుంటున్నాయి. 

పాకిస్తాన్‌లో అహ్మదీయ ముస్లింలను హింసించడం అనేది ఎప్పటి నుంచో జరుగుతోంది. పలుమార్లు వారి మసీదులు, ఆస్తులపై దాడులు జరిగాయి. అహ్మదీయ ముస్లింల సంఖ్య పాకిస్తాన్‌లో దాదాపు 40 లక్షలు. గత నెలలో బలూచిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 55 మంది చనిపోయారు. బలూచిస్థాన్‌లోని మిలిటెంట్ గ్రూపులు షియా కమ్యూనిటీని, వారి ముహర్రం ఊరేగింపులను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడి వెనుక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐ) హస్తం ఉందని భద్రతా అధికారులు భావిస్తున్నారు. తాలిబాన్ చేతిలో ఓడిపోయిన ఐఎస్ఐ ఇప్పుడు బలూచిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తోంది.

ఇస్లామాబాద్‌కు చెందిన భద్రతా విశ్లేషకుడు ముహమ్మద్ అమీర్ రానా తెలిపిన వివరాల ప్రకారం ఐఎస్‌కు చెందిన స్థానిక అనుబంధ సంస్థల ఉగ్రవాదులు షియా వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఆమధ్య ఐఎస్‌ఐ అనుబంధ సంస్థ ఐఎస్‌కేపీ అధిపతి షహబ్ అల్-ముహాజిర్ బరేల్వి కమ్యూనిటీపై పలు విమర్శలు గుప్పించాడు. అందుకే ఇప్పడు బరేల్వీ కమ్యూనిటీ అనేది ఉగ్రవాదుల టార్గెట్‌గా మారింది. 

బరేల్వీతో పాటు ముస్లిమేతర మైనారిటీలు, ఇతర మైనారిటీ ముస్లిం వర్గాలు, క్రైస్తవులు, సిక్కులపై దాడి చేయడం ద్వారా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాలని ఐఎస్‌ఐ ప్రయత్నిస్తోందని ముహమ్మద్ అమీర్ రానా తెలిపారు. పాకిస్తాన్‌లో ముఖ్యంగా బలూచిస్థాన్‌లో ఐఎస్ఐ దాడులు పెరగడానికి, పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో ఐఎస్‌ఐపై ఆఫ్ఘన్ తాలిబాన్ల దాడులకు ప్రత్యక్ష సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు. రెండేళ్లలో తాలిబాన్‌.. ఐఎస్‌ఐపై పలుమార్లు దాడిచేసి వారి వెన్ను విరిచింది. ఇది పాకిస్తాన్‌కు చేటు తెస్తుందనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో ఇక్కడ మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
ఇది కూడా చదవండి: ఈ నేతల స్నేహం ఎందుకు గట్టిపడింది?

మరిన్ని వార్తలు