పాలనే అసలు గెలుపు

19 Jul, 2013 10:22 IST|Sakshi
పాలనే అసలు గెలుపు
బస్సుల్లో చూస్తుంటాం.
 స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయమని, వాళ్లకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దామని!
 నిజాంగా అలా ఎంతమంది ‘కూర్చోనిస్తున్నారో’... 
 రోజంతా రిజర్వేషన్ సీటు పక్కనే నిలబడి  ప్రయాణిస్తుండే స్త్రీలకు తెలుసు. 
 రేపు సర్పంచి సీట్లలో కూడా ఈ మగమహారాజులు ఇలాగే... దర్జాగా సర్దుకుంటారా?
 చెప్పలేం, సీట్ల సంప్రదాయాన్నే గౌరవించనివారుఓట్లకు మాత్రం ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు?
 ఇవ్వరా?!
 మరి మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమయింది?  
 మనం గెలిచి... వారినెందుకు కూర్చోనివ్వాలి?
 మనకు మనమే న్యాయం చేసుకోలేకపోతే సాటి మహిళలకు ఇంకేం చేస్తాం? 
 పంచాయతీలకు పోటీపడుతున్న మహిళల్లో ఆలోచన రేకెత్తిస్తున్న ప్రశ్నలివి.
 మహిళా సంఘాల కార్యకర్తలు గ్రామగ్రామాన తిరిగి నింపుతున్న ఫైటింగ్ స్పిరిట్ ఇది.
 
 వీరంతా లింగవివక్షపై పోరాడుతున్న మహిళలు. ‘ఆడ, మగ సమానం’ అంటూ తొమ్మిదేళ్లుగా గ్రామాల్లో గొంతెత్తి చాటుతున్న మహిళా సంఘాల కార్యకర్తలు. అలాగని వీరేమీ ఊళ్లను ఉద్ధరించడానికి వచ్చిన నాయకులు కాదు. గ్రామ సంఘాల్లో సభ్యులుగా ఉంటూ... స్వచ్ఛందంగా జెండర్ సమస్యపై పోరాడుతున్న సామాన్య మహిళలు. ‘‘భ్రూణహత్యలు, వరకట్నాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు... అన్ని సమస్యలూ ఆడవాళ్లవే. కొన్ని గ్రామాల్లో  న్యాయం కోసం సర్పంచ్ దగ్గరికి వెళితే... ‘ఆడోళ్లే సర్దుకోవాలే, ఆడోళ్లే అర్థం చేసుకోవాలే, ఆడోళ్లే నచ్చజెప్పుకోవాలే...’ అంటున్నారు. ‘మగోనికేమర్థమవుతుంది ఆడదాని బాధ’ అంటూ వెనుదిరుగుతున్న మహిళలకు ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు శుభవార్తనిచ్చాయి’’ అంటున్నారు ఈ సామాజిక కార్యకర్తలు. కొన్ని గ్రామాల్లో వందశాతం మహిళా అభ్యర్థులే ఉండడం మరింత సంతోషపడా ల్సిన విషయమంటున్నారు. అలా అంటూనే... డమ్మీ మహిళాసర్పంచ్ అనే మచ్చను తొలగించుకోవాలంటూ పిలుపునిస్తున్నారు. ఈ సందర్భంగా వీరు తమ అభిప్రాయాల్ని, ఆలోచనల్ని ‘సాక్షి’కి వెల్లడించారు. 
 
 మహిళ మంచిగుంటే...
 
 ‘‘మహిళలు చైతన్యంగా ఉన్న గ్రామాలకు, పొద్దుమొహం చూడని మహిళలున్న గ్రామాలకు అభివృద్ధి విషయంలో వ్యత్యాసం ఉంటుంది. ఇప్పటికే మహిళా సంఘాలు, గ్రామ సంఘాల వల్ల మహిళల్లో చైతన్యం వచ్చింది. పాలనలో మంచిచెడులు తెలుస్తున్నాయి. తొంభైల్లోని మహిళా సర్పంచ్‌లకి, కాబోయే మహిళా సర్పంచ్‌లకి కచ్చితంగా తేడా ఉంటుంది. కారణం... యాభైశాతం రిజర్వేషన్. పూర్వం మండలస్థాయి సర్పంచ్‌ల సమావేశానికి తొమ్మిది మంది మగవాళ్లొస్తే ముగ్గురు మాత్రమే మహిళలు వెళ్లేవాళ్లు. ఒకోచోట ఆ ఇద్దరి బదులు వారి భర్తలే వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.  ఈ సందర్భంగా మహిళగా తన పాలన ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకోవచ్చు. సాటి మహిళలకు మరింత తోడ్పడొచ్చు’’ అని జెండర్ సమస్యపై పోరాడుతున్న సామాజిక కార్యకర్త స్వరూప చెప్పిన మాటల్లో బహిరంగ రహస్యం ఉంది. సంగారెడ్డి మండలంలోని పసల్‌వాది గ్రామానికి చెందిన ఈ కార్యకర్త తొమ్మిదేళ్లుగా జెండర్ సమస్యపై స్వచ్ఛందగా పోరాడుతోంది. 
 
 నాయకురాళ్లే బాధితులు...
 
 సర్పంచ్‌లైనా, మండలస్థాయి నాయకులై నా మహిళలకు ఉండే సమస్యలు మహిళలకు ఉంటాయి. ‘‘జెండర్ సమస్యపై ఊరూరా తిరుగుతున్న మాకు రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న మహిళలు ఎదురొచ్చారు. అందులో ఒక మండలానికి ఎంపీటీసిగా పనిచేసిన మహిళ కేసు మా నోరు వెళ్లబెట్టించింది. ఎంపీటీసిగా పనిచేస్తున్న సమయంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం, సమావేశాల కు ఒంటరిగా హాజరవుతుండాన్ని సహించని ఆమె భర్త  నానా హింసలూ పెట్టి ఆమెను ఇంట్లో నుంచి గొంటేశాడు. ప్రస్తుతం ఆమెకు న్యాయం జరిపించే పనిలో ఉన్నాం. పదవి ఉన్న మహిళ తనకు తాను న్యాయం చేసుకోలేని పరిస్థితిలో ఉంది. అలాంటప్పుడు తోటివారికి ఏం చేయగలదు? ఇది చాలామందిలో ఉన్న సందేహం. అందుకే డమ్మీ సర్పంచ్ అన్నమాట వచ్చింది. అలాగని నాయకులైన మహిళలంతా నిస్సహాయులు కాదు. తమకొచ్చిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగపరుచుకుని గ్రామాలను అభివృద్ధి చేసినవారూ ఉన్నారు. కాకపోతే వారిశాతం చాలా తక్కువ’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు స్వరూప. 
 
 జెండాలు ఎగరేయడానికే...
 
 ఇల్లయినా, ఊరైనా... తీసుకునే నిర్ణయాలు, పాటించే నియమాలపైనే అభివృద్ధి ఆధారపడి ఉంటుం దనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక గ్రామీణ మహిళల దగ్గరికి వచ్చేసరికి రకరకాల సంశయాలు, సందేహాలు రావడానికి అక్కడి పరిస్థితులే కారణం. ‘‘ఎన్నికల్లో నువ్వు గెలవడానికి నేను ఖర్చు పెట్టినకాబట్టి నేను చెప్పినట్టే ఇను. నాకున్న పేరునిబట్టే నువ్వు గెలిచినవ్. అసలు పంచాయతాపిసంటే ఏందో నీకెరకనేనా? అంటడు. ఎన్నింటికని సమాధానం చెబుతుంది. ఆయన చెప్పినట్లు చేస్తే తలకాయనొప్పి ఉండదనుకుంటుంది. ఊరంతా ఓట్లేసి గెలిపించినా... ఇంటికివోయేసరికి ఒంటరామె’’ అన్నారు అనూష.  
 
 మంచిరోజులొచ్చాయి...
 
 ఏ వ్యవస్థలోలైనా లోపాలు సహజం. కాని వాటిలో ఉన్న విజయాల్ని ఎత్తిచూపడం వల్ల వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉందంటారు పఠాన్‌చెరువులోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి అనే కార్యకర్త. ‘‘మహిళా సర్పంచ్‌లపై ఉన్న విమర్శల సంగతి పక్కన పెడితే భర్త సహకారంతో, ఊరి ప్రజల అండదండలతో గ్రామ స్వరూపాల్ని మార్చిన మహిళా సర్పంచ్‌లు కూడా ఉన్నారు. ఈసారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇలాంటి మహిళా సర్పంచ్‌ల సంఖ్య మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ మహిళా సంఘాలున్నాయి. ఉన్నంతలో వారికి కూడా పంచాయితీ కార్యాలయాలపై కొంత పట్టు ఉంది. ఊరికి ఎంత బడ్జెట్ వస్తోంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత అవినీతి జరిగింది అనే విషయాలపై వారికి కనీస అవగాహన ఉంటోంది.
 
బహిరంగంగా మాట్లాడకపోవచ్చు కాని మేం చూసిన గ్రామాల్లో ప్రతి మహిళ... సర్పంచ్ చేసే పనుల గురించి చక్కగా చెబుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మహిళ సర్పంచ్‌గా పనిచేసే అవకాశం వచ్చినపుడు తనదైన పాలన ఉండాలని కోరుకోవడం పెద్ద విషయం కాదు. కాని దాన్ని అమలుచేయడం మాత్రం అంత సులువు కాదు. ఈసారి వార్డు సభ్యులుగా పోటీ చేసే మహిళల సంఖ్య బాగా పెరిగింది కాబట్టి మహిళా సర్పంచ్‌లకు పాలనపై కొంత పట్టు దొరికే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఊరివాళ్ల దృష్టిలో ఓ మంచి సర్పంచ్‌గా మిగిలిపోవచ్చు. మా జిల్లాలో ఒక గ్రామంలో సర్పంచ్ తమ్ముడు ఒకమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. ఇప్పుడు అతని అన్న సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాడు. ఎన్నికలయ్యేలోపు ఆ అమ్మాయికి న్యాయం చేయాలని పట్టుబట్టారు ఆ ఊరి మహిళలు. ప్రస్తుతం మేం అదే పనిలో ఉన్నాం. ఇదీ గ్రామీణ మహిళల చైతన్యం. న్యాయం కోసం వారు చేస్తున్న పోరాటం పాలనలో చూపిస్తే గ్రామాభివృద్ధికి తిరుగేలేదు’’ అని చెప్పిన భాగ్యలక్ష్మి మాటలు అక్షరసత్యాలు. 
 
 యాభైశాతం రిజర్వేషన్ మహిళలకు అవకాశాన్నే కాదు బలాన్నీ ఇచ్చింది. పంచాయితీ కార్యాలయంలో పురుషులతో సమానంగా మహిళలు కూర్చుని గ్రామ సమస్యలు పరిష్కరించే రోజులు వచ్చేస్తున్నాయి. ఈ శుభపరిణామం గ్రామాల రూపురేఖలతో పాటు కట్టుబాట్ల పేరుతో మహిళల్ని వెనక్కినెట్టే దురాచారాలను కూడా మారుస్తాయని ఆశిద్దాం.
 
 - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 ఫొటోలు: ఠాగూర్
 
 ఎన్నికైన వారిలో చైతన్యం తెస్తాం
 
 ఊర్లల్ల మహిళ నాయకురాండ్ల పరిస్థితుల్ని చాన దగ్గరగా చూసినం కాబట్టి మేం చెప్పేదేందంటే... సర్పంచ్ అయినంక ముందు చేయాల్సింది... ఊళ్లో మహిళలందరితో సమావేశాలు పెట్టుకోవాలి. ఊరికి ఏం చేస్తే బాగుంటది, ఎట్ల చేస్తే బాగుంటదో... వారినడిగి సలహాలు తీసుకోవాలి. దీనివల్ల ఆమెకు ధైర్యం, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. సమస్యలు నేరుగా తన దృష్టికి వస్తాయి. ‘మహిళా సర్పంచ్ భర్త ఒప్పుకోలేదంటే ఆమె కూడా ఒప్పుకోదు’ అనే అభిప్రాయం ఉన్న పరిస్థితుల్లో గ్రామాల్లో మహిళా నాయకుల ఆలోచనలకు ప్రాముఖ్యం రావడం కష్టమే. ఈ ఆలోచనా ధోరణిని మారుస్తాం. ఈసారి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన రిజర్వేషన్ మహిళా సర్పంచుల్లో కొత్త చైతన్యం తీసుకురావాలనుకుంటున్నాం.
 
 - అచ్చమ్మ, కార్యకర్త
 
 
Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు