స్త్రీలోక సంచారం

9 Nov, 2018 00:22 IST|Sakshi
లీనా డోలీ,అరుణిమ సిన్హా

‘మీటూ’ ఉద్యమం ఎక్కడెక్కడి మగ పురుగుల్ని బయటికి ఈడ్చుకొచ్చి పడేస్తోంది. మర్యాదస్తుల ముఖాలను తలకిందులుగా వేలాడదీసి, అసలు స్వరూపం బయటపెడుతోంది. మూవీస్‌ అయిపోయాయి. మీడియా అయిపోయింది. ఇప్పుడు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌! ముఖేష్‌ అగర్వాల్‌ అనే సీనియర్‌ ఐ.పి.ఎస్‌. ఆఫీసర్‌ తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ లీనా డోలీ అనే అస్సాం మహిళా పోలీసు అధికారి ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వర్క్‌ప్లేస్‌ హెరాస్‌మెంట్‌ నుంచి బతికి బట్టకట్టిన స్త్రీగా తనని తను పరిచయం చేసుకుంటూ.. ఆమె బహిర్గత పరిచిన విషయాలు దిగ్భ్రాంతి కలిగించేవిగా ఉన్నాయి. ‘‘అగర్వాల్‌ ఒక రోజు నాకు కాల్‌ చేసి, బయటికి ఎక్కడికైనా వెళ్దాం రమ్మని అన్నాడు. అతడు ఏమంటున్నాడో అర్థమైంది! ‘నో’ చెప్పేశాను. వేధించడం మొదలుపెట్టాడు. పై అధికారులకు ఫిర్యాదు చేశాను. అది జరిగిన ఆర్నెల్లకు నా భర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఘటనపై విచారణ జరిపేందుకు మా ఇంటికి వచ్చిన ఎంక్వయిరీ ఆఫీసర్‌ .. ‘మీరిచ్చిన ఫిర్యాదు వల్ల తనపై వచ్చిన ఒత్తిళ్ల కారణంగా మీ భర్త ఆత్మహత్య చేసుకోలేదని కచ్చితంగా చెప్పగలను’ అన్నారు.

నేనేం మాట్లాడలేదు. మళ్లీ ఇంతవరకు దానిపై విచారణే జరగలేదు. చిత్రం ఏంటంటే.. అగర్వాల్‌ తన తప్పును ఒప్పుకున్నప్పటికీ ‘ఇదొక మిస్‌అండర్‌స్టాండింగ్‌ కంప్లయింట్‌’ అంటూ.. నా కేసును పై అధికారులు కొట్టేయడం! పైగా అగర్వాల్‌ భార్య నాపై పరువునష్టం కేసు వేశారు. దీనిపై నేను రివిజన్‌ పిటిషన్‌ వేశాను. ఎంత విషాదమో చూడండి. నా భర్తను పోగొట్టుకున్నాను. నా కేసును కోల్పోయాను. ఈ స్ట్రెస్‌లో పడి నా పిల్లలకు అందించవలసిన ఆదరణను, ప్రేమను ఇవ్వలేకపోయాను.  ‘ఓటమికి నేనొక ఉదాహరణ. ఇలాగైతే ప్రభుత్వ ఆఫీసులలో పని చేసే ఏ బాధితురాలైన మహిళ మాత్రం ధైర్యంగా బయటికి వచ్చి ఫిర్యాదు చేస్తుంది’’ అని లీనా డోలీ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన తొలి వికలాంగ యువతిగా ప్రపంచ రికార్డు నెలకొల్పిన అరుణిమ సిన్హా (30) మరో ఘనతను సాధించారు.   స్కాట్లాండ్‌లోని స్ట్రాత్‌క్లైడ్‌ విశ్వవిద్యాలయం నుంచి మంగళవారం ఆమె డాక్టరేట్‌ అందుకున్నారు! ఎవరెస్టు ఒక్కటే కాదు, ప్రపంచంలోని ఇంకా అనేక ఎల్తైన శిఖరాలను చేరుకోవడం లక్ష్యంగా అరుణిమ సాగిస్తున్న జైత్రయాత్రకు గుర్తింపుగా ఆమెకు ఈ గౌరవం లభించింది. అరుణిమ 2013లో ఎవరెస్టుపై భారత పతాకాన్ని రెపరెపలాడించారు. 2011లో లక్నో నుంచి ఢిల్లీ వెళుతుండగా రైల్లో దోపిడీ దొంగల్ని ప్రతిఘటిస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో ఆమె తన ఎడమ కాలిని మోకాలి వరకు కోల్పోయారు.   

మరిన్ని వార్తలు