రైతు కష్టం ఊరికే పోదిక

5 Mar, 2019 04:49 IST|Sakshi
∙ గుంటూరులో మిర్చి రైతుల సమస్యపై దీక్ష సందర్భంగా రైతుతో ముచ్చటిస్తున్న వైఎస్‌ జగన్‌ (ఫైల్‌)

ధరల స్థిరీకరణ నిధి

అది 2017.. ఏప్రిల్‌.. మండు వేసవి.. కళ్లాల్లో మిర్చి కళకళలాడుతోంది. ఎర్రటి ఎండకు మిలమిలా మెరిసిపోతోంది. సరిగ్గా అప్పుడే మార్కెట్‌ క్రాష్‌ అయింది. మే నెల మొదటి వారానికి క్వింటాల్‌ మిర్చి ధర రూ.14, 12 వేల నుంచి అమాంతం రూ.5 వేలకు పడిపోయింది. రైతులు పోరు బాట పట్టారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మిర్చి రైతులకు అండగా శాసనసభలో అధికార పక్షాన్ని నిలేశారు. ధరల స్థిరీకరణ నిధి కోసం గుంటూరు మార్కెట్‌ యార్డుకు సమీపంలో రెండు రోజుల నిరాహార దీక్ష చేశారు.

మాట ఇచ్చి మరచిన బాబు..
2014 ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ప్రతిపాదిస్తే చంద్రబాబు ఏకంగా రూ.5 వేల కోట్లతో ఏర్పాటు చేస్తానన్నాడు. అధికారంలోకి వచ్చాక ఆ మాటే మర్చిపోయాడు. లక్షలాది మంది రైతులు కంది, పెసర, మినుము, పసుపు, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న, వరి, టమాటా, ఉల్లి.. ఇలా ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయింది. ఉల్లికి ధర లేక రైతులు పొలాల్లోనే విడిచిపెట్టే దుస్థితి. టమాటాలను రోడ్ల మీద పారబోసి ఎడ్లతో తొక్కించిన దృశ్యాలనూ మర్చిపోలేం.

సరిగ్గా ఈ దశలో జగన్‌మోహన్‌రెడ్డి 2017లో జరిగిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో 3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి, 2 వేల కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. రైతుల్ని ఆదుకుంటామని, ప్రతి పంటకూ ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడంతో పాటు పంట వేయడానికి ముందే రైతులకు గిట్టుబాటు ధరనూ ప్రకటిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. ఇదే జరిగితే రైతులకు తమ ఉత్పత్తులను ప్రభుత్వం ప్రకటించిన ధర కన్నా తక్కువకు అమ్ముకునే దుస్థితి ఉండదు.

ప్రకృతి వైపరీత్యాల నిధి..
ఈ నిధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లను కేటాయిస్తే కేంద్రం మరో రూ.2వేల కోట్లను ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రూ.4వేల కోట్లతో నిధి ఏర్పాటవుతుంది. రాష్ట్రంలో కరవులు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ నిధి ఉపయోగపడుతుంది. తిత్లీ వంటి తుపాన్లు, అకాల వర్షాలు, వడగళ్ల వానలు, వరదలు వచ్చినప్పుడు కేంద్రం సాయం కోసం చకోర పక్షిలా ఎదురు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వమే రైతుల్ని ఆదుకోవచ్చు. అన్నదాతల ముఖంలో చిరునవ్వు చూసేందుకు ఈ స్కీములు తోడ్పడతాయని – కనీస మద్దతు ధరల నిర్ణాయక కమిటీ– మాజీ సభ్యుడు అతుల్‌ కుమార్‌ అంజన్‌ వంటి వారు సైతం ప్రశంసించారు.

 ధరల స్థిరీకరణ నిధి పథకం అంటే..
పంటలకు మార్కెట్‌లో కనీస మద్దతు ధర రానప్పుడు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. వచ్చిన పంటను దళారీల చేతుల్లో పోసి దక్కిందే చాలనుకుని కన్నీళ్లు పెట్టుకునే దయనీయమైన స్థితి రైతుకు ఇక ఉండదు. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల ప్రకారం వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల కొనుగోలులో ఏదైనా నష్టం వాటిల్లితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఇదే జరిగితే... రైతు చిందించిన చెమట చుక్కలు వృథాగా పోవిక, రూపాయలుగా మారి బ్యాంకులో జమ అయి తీరుతాయి.

– ఎ.అమరయ్య, చీఫ్‌ రిపోర్టర్, సాక్షి

మరిన్ని వార్తలు