రంగస్థలంపై టెలికం రారాజు

18 Dec, 2014 00:30 IST|Sakshi
రంగస్థలంపై టెలికం రారాజు

రసరమ్య నటనతో జనరంజక నటుడిగా ఎదిగిన అశోక్‌కుమార్ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ హైస్కూల్‌లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. 1974లో బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగిగా చేరారు. హైదరాబాద్‌లో తర్వాత తిరుపతిలో కొన్నాళ్లు పని చేశారు. సికింద్రాబాద్‌లోని రీజినల్ టెలికం ట్రైనింగ్ సెంటర్‌లో పనిచేశారు. చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తి ఉన్న అశోక్‌కుమార్ తరచూ రంగస్థలంపై తన ప్రతిభ చాటుకుంటూ వచ్చారు. అసుర సంధ్య, వరుడు కావాలి, ఫర్‌సేల్, గుండెలు మార్చబడును వంటి నాటకాల్లో నటించారు. పలు పాఠశాలల వార్షికోత్సవాలకు నృత్యాలను కంపోజ్ చేసేవారు.
 
 సాంఘికం.. పౌరాణికం..
 చింతామణి వంటి సాంఘిక నాటకాలే కాదు పౌరాణిక నాటకాల్లో కూడా అశోక్‌కుమార్ అద్భుతః అనిపించుకున్నారు.
 
 కృష్ణతులాభారం, పాండవోద్యోగ విజయం వంటి పౌరాణిక పద్యనాటకాల్లో కూడా ఆయన మెప్పించారు. ఏటా నాచారంలోని లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాల్లో మోహినీభస్మాసుర, మహిషాసుర వంటి నాటకాలు క్రమం తప్పకుండా ప్రదర్శిస్తుంటారు. లష్కర్ బోనాల సందర్భంగా పోతురాజు వేషం కట్టి అందరినీ అలరించారు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ప్రదర్శనలిచ్చారు. 2006 జనవరి 24న తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన నంది నాటకోత్సవంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతల మీదుగా ప్రశంసాపత్రాన్ని కూడా అందుకున్నారు.
 
 జీవితమే నాటక రంగం..
 ‘జీవితమే ఒక నాటక రంగం. చిన్నతనం నుంచి ఉన్న ఇష్టంతోనే నాటకాల వైపు వచ్చాను. ఏ పాత్ర అయినా ఇట్టే డైలాగులు చెప్పే వాడిని. అప్పట్లో ఉన్నంత ఆదరణ నేడు నాటకాలకు లేదు. అయినా ఎందరో కళాకారులు ఈ రంగాన్ని బతికించుకునేందుకు తాపత్రయపడుతున్నారు. ఈ కళ అంతరించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ తరంపై ఉంది’ అని చెబుతారు అశోక్‌కుమార్.
 -  అబ్దుల్ రెహమాన్

మరిన్ని వార్తలు