టెలికం పీఎల్‌ఐ స్కీముతో కోట్లాది పెట్టుబడులు

11 Oct, 2023 09:49 IST|Sakshi

  రూ. 2,419 కోట్ల పెట్టుబడులు: కేంద్ర మంత్రి వైష్ణవ్‌ వెల్లడి 

న్యూఢిల్లీ: ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద టెల్కోలు రూ. 2,419 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. తద్వారా 17,753 మందికి ఉపాధి కల్పించినట్లు వివరించారు. ఇది దేశీ టెలికం పరిశ్రమ చరిత్రలో కీలక మైలురాయని తెలిపారు. అమెరికాకు చెందిన టెలిట్‌ సింటెరియోన్‌ కోసం దేశీ సంస్థ వీవీడీఎన్‌ .. 4జీ, 5జీ కనెక్టివిటీ మాడ్యూల్స్, డేటా కార్డుల తయారు చేయడానికి సంబంధించిన ప్రొడక్షన్‌ లైన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. సంక్లిష్టమైన మెషిన్లను నిర్వహించడంలో అమ్మాయిలకు కూడా శిక్షణ లభిస్తుండటమనేది మేకిన్‌ ఇండియా లక్ష్య విజయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పీఎల్‌ఐ స్కీము కింద ఎంపికైన కంపెనీల్లో వీవీడీఎన్‌ కూడా ఒకటి. 2022 అక్టోబర్‌లో ఈ పథకం కోసం కేంద్రం 42 కంపెనీలను షార్ట్‌లిస్ట్‌ చేసింది. ఆయా సంస్థలు రూ. 4,115 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు, 44,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చాయి.   

రాజన్‌కు కౌంటర్‌..   
మేకిన్‌ ఇండియా నినాదాన్ని విమర్శిస్తున్నవారు టెలికం, ఎల్రక్టానిక్స్‌ తయారీలో భారత్‌ సాధిస్తున్న సామరŠాధ్యల గురించి తెలుసుకునేందుకు వీవీడీఎన్‌ ప్లాంట్లను సందర్శించాలంటూ ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌కు వైష్ణవ్‌ పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చారు. నేడు భారత్‌లో తయారు చేస్తున్న టెలికం పరికరాలు అమెరికా, యూరప్, జపాన్‌ మొదలైన ప్రాంతాలకు ఎగుమతవుతున్నాయన్నారు. అత్యంత నాణ్యమైనవిగా భారతీయ ఉత్పత్తులు ఆయా దేశాల ఆమోదయోగ్యత పొందడం గర్వకారణమని పేర్కొన్నారు. ఎల్రక్టానిక్స్‌ తయారీ విషయంలో భారత్‌లో అదనంగా ఎంత విలువ జతవుతున్నది ప్రశ్నార్ధకమేనంటూ రాజన్‌ కొన్నాళ్ల క్రితం సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో వైష్ణవ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

మరిన్ని వార్తలు