ఏపి అంటే కాంగ్రెస్కు ఎంత అలుసు?

26 Oct, 2013 21:35 IST|Sakshi
ఏపి అంటే కాంగ్రెస్కు ఎంత అలుసు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గానికి లెక్కేలేదు. ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉన్నన్ని రోజులు మన రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉండేది. అత్యధిక ఎంపి స్థానాలు ఇచ్చిన రాష్ట్రంగా గుర్తింపు ఉండేది. ఆయన మరణించిన తరువాత రాష్ట్రం పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. కేంద్ర ప్రభుత్వం గానీ, కాంగ్రెస్ అధిష్టానం గానీ పట్టించుకోవడంలేదు. ఇక్కడి నేతల అభిప్రాయాలకు, ప్రజల మనోభావాలకు విలువలేదు. మన రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తోంది. ఓట్లు - సీట్లు - రాజకీయం..... ఇవే కాంగ్రెస్కు కావలసింది. రాష్ట్రం ఏమైపోయినా, రాష్ట్రం ఎంత అల్లకల్లోలం అవుతున్నాదానికి పట్టదు.

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున చెలరేగిన తరుణంలో కాంగ్రెస్ పట్టించుకోలేదు. వందల మంది ప్రాణాలు అర్పించినా చలించలేదు. రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఇప్పుడు సీమాంధ్రలో తీవ్రస్థాయిలో జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడంలేదు. కనీసం రాష్ట్ర నేతల, ప్రజల అభిప్రాయలను తెలుసుకోవడానకి కూడా ప్రయత్నించడంలేదు. అధికారం చేతిలో ఉందికదా అని ఇష్టానుసారం ప్రవర్తిస్తోంది. అత్యధిక మంది రాష్ట్ర ప్రజల కోరికకు భిన్నంగా, వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర విభజనకు సిద్ధపడింది. రాష్ట్రాల విభజనకు గతంలో అనుసరించిన విధానాలను కూడా తుంగలో తొక్కుతోంది.  ఉద్యమం ఉధృత స్థాయిలో జరుగుతున్న నేపధ్యంలో వారితో సంప్రదించాన్న విజ్ఞతను కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రదర్శించడంలేదు. ఇరు ప్రాంతాల వారితో మాట్లాడి, వారికి నచ్చజెప్పాలన్న ఆలోచన లేకుండా పూర్తి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉత్తరప్రదేశ్తోపాటు  పలు రాష్ట్రాలలో డిమాండ్లు ఉండగా, ఒక్క ఆంధ్రప్రదేశ్ను మాత్రమే చీల్చడానికి కాంగ్రెస్ తొందరపడుతోంది.  ఇంత ఆదరాబాదరాగా రాష్ట్ర విభజనకు పూనుకోవడంతో రాష్ట్రంపై కాంగ్రెస్కు ఎంత చులకన భావన ఉందో అర్ధమవుతోంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించే విధానాలను, ఎత్తుగడలను దేశ ప్రజలు హర్షించడంలేదు. జాతీయ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ స్వార్ధ రాజకీయం కోసం, సీట్ల కోసం, ఓట్ల కోసం రాష్ట్రాన్ని విభజించడానికి సిద్ధమైనట్లు అందరికీ అర్ధమైపోయింది. ఇది అన్యాయంగా అందరూ భావిస్తున్నారు.  అయినా కాంగ్రెస్ తన విధానాన్ని మార్చుకునే స్థితిలో లేదు.

మరిన్ని వార్తలు