అంతరంగం

2 Jan, 2015 22:37 IST|Sakshi
అంతరంగం

జీవిత పరమార్థం తెలియాలంటే చుట్టూ ఉన్న ప్రకృతిని ఆరాధించాలి.. కళలను ఆస్వాదించాలి.. సాహిత్యాన్ని అభిమానించాలి.. బాధను అనుభవించాలి.. అర్థం చేసుకోవాలి అంటారు జిడ్డు కృష్ణమూర్తి. ఈ తత్వాన్ని ఒంటబట్టించుకున్నదే ‘అంతరం’. ఈ పేరుతో నగరంలో నేడు ఓ నృత్యనాటక ప్రదర్శన నిర్వహిస్తున్నారు.  మహిళల్లో దాగి ఉన్న అపార శక్తిని ఆవిష్కరించే ఈ దృశ్యరూపకం గురించి క్లుప్తంగా...
 - సాక్షి, సిటీప్లస్
 
 థీమ్..
 భారతీయ పురాణాల్లోని శక్తిమంతమైన రంభ, వాసవి, కణ్ణగి, ఆండాళ్ అనే నాలుగు స్త్రీ పాత్రలే ఈ అంతరం పోషించే ముఖ్య భూమికలు. ఈ వనితల ఔన్నత్యాన్ని తమ అభినయ కౌశలంతో అంతే అద్భుతంగా మెప్పించనున్నారు సుహాసినీ మణిరత్నం, యామినీరెడ్డి, గోపికావర్మ, కృతికా సుబ్రహ్మణ్యన్. రంభ, వాసవి, కణ్ణగి, ఆండాళ్‌ల పౌరాణిక నేపథ్యానికి విశ్లేషణను జోడించి ఆ పాత్రలకు మరింత వన్నెతేనుందీ ప్రదర్శన. వీటికి తోడు శాండ్ ఆర్ట్, తోలుబొమ్మలాట, మైమ్, శిల్పకళా ఇందులో చోటు సంపాదించుకున్నాయి.
 
 అంతరం అంటే..
 పురాణాల్లోని నాలుగు స్త్రీ పాత్రల ఆంతర్యం, స్వభావాన్ని వివరించడమే ఈ ‘అంతరం’ ఆంతర్యం. ఇది శరీరానికి, మనసుకి ఉన్న దూరాన్ని అన్వేషించేది. శోధించేది. ఈ పురాణ స్త్రీల శక్తిని ‘అంతరం’గా ప్రదర్శించాలన్న ఆలోచన గోపిక వర్మది. కార్యరూపమిచ్చింది కృతిక సుబ్రహ్మణ్యన్.
 
 ఎవరు.. ఏమిటి..
 నాటకరూపంలో ‘రంభ’గా సుహాసినీ మణిరత్నం అభినయిస్తుంటే.. ‘వాసవి’గా కూచిపూడి నృత్యరూపకాన్ని యామినీరెడ్డి, మోహినీఆట్టంలో గోపికవర్మ ‘కణ్ణగి’గా, భరతనాట్యంలో కృతికసుబ్రహ్మణ్యన్ ‘ఆండాళ్’గా అలరించనున్నారు. కళాభిమానుల అపూర్వ కలయిక ఈ ప్రదర్శన. ఇటు శాస్త్రీయ నృత్యం, అటు సంగీతం, రంగస్థలం, ఆధునిక సాంకేతిక విజ్ఞానం.. ఒకే వేదికపై వీటన్నిటి సమ్మేళనమే ‘అంతరం’ అంటారు ఇందులో భాగస్వామి అయిన యామినీరెడ్డి.  
 
 నేడు నృత్యనాటక ప్రదర్శన
 వేదిక: హెచ్‌ఐసీసీ, హైటెక్‌సిటీ, మాదాపూర్
 సమయం: రాత్రి 7 గంటలు
 నిర్వహణ: హైడొరైట్ ఫౌండేషన్

>
మరిన్ని వార్తలు