పంచభూతాలకు సప్తస్వర నీరాజనం | Sakshi
Sakshi News home page

పంచభూతాలకు సప్తస్వర నీరాజనం

Published Sat, Jan 3 2015 12:21 AM

పంచభూతాలకు సప్తస్వర నీరాజనం

ప్రకృతిలోని పంచభూతాల తత్వాన్ని సంగీతం ద్వారా శ్రోతలకు అందించే ఉద్దేశంతో రూపొందించిన ‘పంచతత్వ’ కార్యక్రమం శనివారం నగరంలో ఏర్పాటు కానుంది. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, ఉస్తాద్ రషీద్‌ఖాన్, పండిట్ విశ్వమోహన్ భట్, సెల్వ గణేశ్, తౌఫిక్ ఖురేషీ, రతన్‌మోహన్ శర్మ, శుభంకర్ బెనర్జీ, శ్రీధర్ పార్థసారథి వంటి ఉద్దండులు ఈ కార్యక్రమంలో తమ సంగీతంతో నగరవాసులను ఓలలాడించనున్నారు. ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు పండిట్ జస్రాజ్ కుమార్తె దుర్గా జస్రాజ్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ముంబై, అహ్మదాబాద్‌లలో నిర్వహించారు. హైదరాబాద్ తర్వాత బెంగళూరు, ఢిల్లీలలో నిర్వహించనున్నారు. ‘పంచతత్వ’ నిర్వహణ కోసం ఇక్కడకు వచ్చిన దుర్గా జస్రాజ్ ఈ కార్యక్రమం గురించి కొద్దిసేపు
 ‘సిటీప్లస్’తో ముచ్చటించారు...
 
 స్వచ్ఛభారత్‌కు సంగీతపరమైన కొనసాగింపు..
 యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్‌స్కేప్, శ్లోకాలతో ప్రకృతిలోని పంచభూతాలను ప్రతిబింబించే ప్రదర్శన ఇది. సంగీతంలో మహామహులైన విద్వాంసులతో పాటు పలువురు సమకాలీన సంగీత విద్వాంసులు ఇందులో పాల్గొంటున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన ‘స్వచ్ఛ భారత్’ అభియాన్‌కు సంగీతపరంగా ఇది మా కొనసాగింపు. దీని ద్వారా మానసిక పరిశుద్ధత కలుగుతుందని నేను, నా సహచరుడు నీరజ్ జైట్లీ విశ్వసిస్తున్నాం. దేశంలోని ఐదు నగరాల్లో ‘పంచతత్వ’ కార్యక్రమాన్ని తలపెట్టాం. ముంబైలో నిర్వహించిన తొలి కచేరీని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌జవదేకర్ ప్రారంభించారు. తర్వాత అహ్మదాబాద్‌లో నిర్వహించాం. అంతకు ముందు ఒమన్‌లోని మస్కట్‌లో నిర్వహించాం. మస్కట్‌లోని రాయల్ ఒపేరా హౌస్‌లో నిర్వహించిన తొలి భారతీయ ప్రదర్శన ఇదే కావడం విశేషం. మొత్తం నలభై మంది కళాకారులం దాదాపు రెండు నెలల పాటు దీని రూపకల్పనలో శ్రమించాం. సంగీతంతో మానవుల మనసులను శుభ్రపరచడంతో పాటు ప్రకృతి ప్రాధాన్యాన్ని కూడా నేటి తరానికి తెలియజేస్తున్నాం.
 
 నగరంతో అనుబంధం
 మా నాన్న జస్రాజ్ ద్వారా హైదరాబాద్ నగరంతో నాకు అనుబంధం ఏర్పడింది. ఇది గొప్ప నగరం. తెలంగాణ సంస్కృతి అద్భుతమైనది. ఇక్కడి సంస్కృతిలో మనిషిని క్షణాల్లోనే ఆనందపరచే శక్తి ఉంది. నా లక్ష్యం కూడా సంస్కృతికి ప్రాచుర్యం కల్పించడమే. నా క్రతువులో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు
 - కోన సుధాకర్‌రెడ్డి
 
 నేడు పంచతత్వ
 వేదిక: శిల్ప కళావేదిక, మాదాపూర్
 సమయం: సాయంత్రం 6.30 గంటలకు
 ప్రత్యేకత: ప్రకృతి-పంచభూతాల తత్వాన్ని ఉద్దండులైన పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, ఉస్తాద్ రషీద్‌ఖాన్, విశ్వమోహన్‌భట్, తౌఫిక్ ఖురేషి, సెల్వ గణేష్, రతన్‌మోహన్‌శర్మ, శ్రీధర్ పార్థసారథి, శుభంకర్ బెనర్జీ, అంకితా జోషి, దుర్గా జస్రాజ్ తదితరులు సంగీతరూపంలో ప్రదర్శిస్తారు.

Advertisement
Advertisement