ఫిరంగుల అడ్డా

9 Nov, 2014 22:30 IST|Sakshi
ఫిరంగుల అడ్డా

గన్‌ఫౌండ్రీ అంటే ఫిరంగుల తయారీ కేంద్రం. నేడు సిటీలో నిజాం కాలేజీ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాన్ని ‘గన్‌ఫౌండ్రీ’గా పిలుస్తున్నారు. రెండు శతాబ్దాల కిందట ఈ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండేది. నిజాం నవాబుల కాలంలో సైనికులకు అవసరమయ్యే ఫిరంగులను ఇక్కడ తయారు చేసేవారు. తుపాకీలు ప్రాచుర్యంలో లేని ఆ రోజుల్లో నిజాం సైన్యం ఫిరంగులను రక్షణాయుధంగా ఉపయోగించేవారు.

ఫిరంగి అనేది ‘ఫర్షియన్’ పదం. తెలుగు, హిందీలలో కూడా ఈ పదం ‘ఫిరంగి’గానే వాడుకలో ఉంది. ఫిరంగికి ఇంగ్లిష్‌లో గన్ అని అర్థం చెప్పుకునేవారు. అలా గన్స్ తయారీ కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం.. ‘గన్‌ఫౌండ్రీ’గా హైదరాబాద్‌లో నిలిచిపోయింది. ఈ ‘గన్’ల తయారీకి, వీలుగా పెద్ద సైజు కొలిములు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఒక్కో ఫిరంగి 12 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు ఉంటుంది. వీటిని ఇనుముతో పాటు, పంచ లోహాలతో కూడా తయారు చేసేవారు.
 
నిజాం ప్రభువులకు అవసరమైనన్ని ఫిరంగుల తయారీ కేంద్రంగా గన్‌ఫౌండ్రీ ప్రసిద్ధి. ఇక్కడ తయారైన ఫిరంగులు గోల్కొండ కోట బురుజులలో హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రానికిఎదురుగా గల గన్‌పార్క్‌లో, పబ్లిక్ గార్డెన్స్‌లో, సికింద్రాబాద్‌లోని మిలిటరీ క్యాంపు ఏరియాలో, ట్యాంక్‌బండ్, తదితర ప్రదేశాల్లో అనేక చోట్ల నేడు కనిపిస్తాయి. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో పాడుబడ్డ కోట గోడలపై కనిపించే ఫిరంగులు గన్‌ఫౌండ్రీలో తయారైనవే.  
 
అదే అసలు బలం..
ఆ రోజుల్లో ఫిరంగుల బలం ఉంటే యుద్ధంలో సగం విజయం సాధించినట్టే అని భావించేవారు. ఫిరంగి ముందు భాగంలో మందుగుండు గోళాలు చొప్పించేవారు. ఫిరంగి పైభాగాన ఉన్న చిన్న రంధ్రం ద్వారా మందుగుండు సామగ్రిని అంటించగానే అది ఫిరంగి నుంచి దూసుకెళ్లి విధ్వంసం సృష్టిస్తుంది. కాలక్రమంలో సరికొత్త ఆయుధాలు రావడంతో ఫిరంగుల వాడకం పూర్తిగా కనుమరుగైంది. దీంతో, గన్‌ఫౌండ్రీలో ఫిరంగుల తయారీకి వాడిన పెద్ద పెద్ద ఫర్నెస్‌లు, కొలిములు నిరుపయోగంగా మారిపోయాయి. గన్‌ఫౌండ్రీలోని పలు ఫిరంగుల తయారీ కేంద్రాల పరిసరాలు చాలా భాగం నగరవాసులకు ఆవాసాలుగా మారాయి.

కొంతభాగం అన్యాక్రాంతమైంది. అయితే, పురాతన వారసత్వ పరిరక్షణలో భాగంగా పురావస్తు శాఖ గన్‌ఫౌండ్రీ ప్రాంతంలో మహబూబియా గర్ల్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఫిరంగుల కొలిమికి మాత్రం గట్టి భద్రత ఏర్పాటు చేసింది. ‘ఫిరంగుల చరిత్ర’ తెలియజేస్తూ సైన్‌బోర్డు ఏర్పాటు చేసి, తగిన సమాచారం పొందుపరచింది.

మనసుంటే..
స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ గన్‌ఫౌండ్రీ ప్రాంత అభివృద్ధికి తగిన ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చినట్లు సంబంధిత అధికారులు చెప్పారు. భావి యువతకు ఈ చిన్ని ఏర్పాటే గొప్ప వరమని చెప్పొచ్చు. నిజాం కాలేజి దాటి వచ్చాక, ‘లేపాక్షి’ షోరూం ప్రక్కనే గల చిన్నదారి గుండా ముందుకెళ్లి వాకబు చేస్తే అక్కడున్న ఏకైక అవశేషంగా మిగిలిన ‘గన్‌ఫౌండ్రీ’ని స్థానికులు ప్రస్తుతానికి చూపిస్తున్నారు.

శత్రువులను దరి రానీయకుండా రక్షణ కల్పించిన, శతాబ్దాల చరిత్రగల గన్‌ఫౌండ్రీని, ఇక్కడ తయారై నిరాదరణకు గురైన ఫిరంగులను పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దవచ్చు. గోల్కొండ కోట ప్రాంతంలో అక్కడక్కడ పడి ఉన్న ఫిరంగులను ఒక దగ్గరకు చేర్చి పర్యాటకులకు అవగతమయ్యేలా తగిన చర్యలు తీసుకుంటే అర్థవంతమైన పనే అవుతుంది.
 
మల్లాది కృష్ణానంద్
malladisukku@gmail.com

మరిన్ని వార్తలు