-

కిడ్స్‌@సూపర్ 6

6 Apr, 2015 22:46 IST|Sakshi
కిడ్స్‌@సూపర్ 6

సూపర్ థర్టీ... మెరికల్లాంటి 30 మంది పేద, గ్రామీణ విద్యార్థులను ఐఐటీ ర్యాంకర్లుగా తీర్చిదిద్దేందుకు  ‘రామానుజం స్కూల్ ఆఫ్
 మేథమెటిక్స్’ రూపొందించిన ఫార్ములా. ఆ ఫార్ములా ఆవిష్కర్త ఆనంద్‌కుమార్. ఆ స్ఫూర్తితో రూపొందించిందే మన రాష్ట్రంలోని సూపర్‌సిక్స్.  దీని రూపకర్త విజ్ఞాన్ సంస్థ. ప్రతిభావంతులైన ఆరుగురు  పల్లెటూరి పిల్లలకు ఉచిత విద్యనందించి, వారి కలల్ని నిజం చేసేందుకు చేపట్టిన బృహత్తర కార్యక్రమం!  ఆ వివరాలు...
 
‘సూపర్ సిక్స్ ఎందుకంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి నైన్త్‌వరకూ ఒక్కో క్లాస్‌కు ఆరుగురు చొప్పున ఎంపిక చేస్తున్నాం. తరగతిలో మొదటి ఆరుగురి పేర్లు సూపర్ సిక్స్ వారివే ఉండాలన్నది మా సంస్థ ఆలోచన’ అని చెబుతున్నారు విజ్ఞాన్ వైస్ ఛైర్‌పర్సన్ రాణి రుద్రమదేవి. ఐదు తరగతులకు 24 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో ఒకరు శశాంక్. మెదక్ జిల్లా పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన ఓ సామాన్య రైతు కొమరయ్య కొడుకు. ‘మేం పేదవాళ్లమే కావొచ్చు. అలాగని మా పిల్లాడికి ఉచితంగా విద్యను ఇవ్వమని చెప్పను. నా బిడ్డ ప్రతిభను చూసే చదువు చెప్పమని కోరుకుంటున్నాను.

తెలివితేటలను గుర్తించి ఉచిత విద్యనందించబోతున్న సూపర్ సిక్స్‌లో మా అబ్బాయికి చోటు దక్కినందుకు చాలా గర్వంగా ఉంది’ అని అంటున్నాడు కొమరయ్య. ‘ప్రస్తుతం మేం మా ఊళ్లకి సెలబ్రెటీలుగా మారిపోయాం. మేం చదువుతున్న ప్రభుత్వ పాఠశాల టీచర్లుసైతం మమ్మల్ని పొగుడుతున్నారు. బాగా చదివి మా ఊరు, తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలనేదే లక్ష్యం’ అని ధీమాగా చెబుతున్నాడు శశాంక్.
 
అందరి బాధ్యత...

అయితే ఒక్క విజ్ఞాన్‌కే కాదు... ప్రతిభ గల పేదవిద్యార్థులకు ఆదుకునే బాధ్యత అన్ని కార్పొరేట్ పాఠశాలలకూ ఉందంటారు మరో సూపర్‌సిక్స్ కిడ్ మనోజ్ తండ్రి శంకర్. ‘పట్టణాలకు దూరంగా, పేదరికానికి దగ్గరగా ఉండే మాలాంటి వారికి ఈ కార్యక్రమం చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలని కలలు కంటున్న నా బిడ్డ కల నెరవేరాలి’ అని చెబుతున్నాడు ఆయన.
 
అద్భుతమైన స్పందన...


ప్రస్తుతం ఈ ‘సూపర్ సిక్స్’ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తున్నారు. గత నెల 22న ఆరు జిల్లాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో మూడు వేలకుపైగా విద్యార్థులు పాల్గొన్నారు. తుది దశలో 24 మంది విద్యార్థుల్ని సూపర్‌సిక్స్‌కి ఎంపిక చేశారు. ‘ఈ కార్యక్రమం ఏటా ఉంటుంది. జిల్లాల్లో నిర్వహించిన సూపర్‌సిక్స్ పోటీ పరీక్షలకు తల్లిదండ్రుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ సందర్భంగా ఒక విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి ‘సూపర్ సిక్స్‌లో అవకాశం వచ్చినా, రాకపోయినా... మా పిల్లల తెలివితేటలను అంచనా వేసే అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉంది’ అని నాతో  చెప్పారు. ఆనందించాలో, బాధపడాలో తెలియని పరిస్థితి. కార్పొరేట్ విద్యంతా నగరాలకే పరిమితమైపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. పల్లెల్లో ఉన్న ప్రతిభంతా అక్కడికే పరిమితమైపోతుంది. మా ‘సూపర్ సిక్స్’ ఆ లోటుని కొంతైనా భర్తీ చేస్తుందని ఆశిస్తున్నాం’ అని
 అంటున్నారామె.
 
ఒకరినిమించి ఒకరు...


ధృతిమ అనే నల్గొండ జిల్లా విద్యార్థిని లక్ష్యం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయితే, అదే జిల్లాకి చెందిన మధుకర్‌రెడ్డి ఐఎఎస్ అవ్వాలనుకుంటున్నాడు. నిఖిల్‌సాయి ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నాడు. రిషిత డాక్టర్ చదవాలనుకుంటోంది. వరంగల్ జిల్లాకి చెందిన రాకేష్ సైంటిస్ట్ అవ్వాలని కలలు కంటున్నాడు. సూపర్ సిక్స్‌లోని 24 మందిలో ఎవర్ని పలకరించినా... భవిష్యత్‌పై కోటి ఆశలతో, తమపై కొండంత విశ్వాసంతో ఉన్నారు. ‘ఒకే ఒక్క చాన్స్ ఇది. దీన్ని మేం మిస్ చేసుకోం. ఏటా టాప్ సిక్స్‌లో ఉంటూ మా కలల్ని నెరవేర్చుకోడానికి పట్టుదలతో కష్టపడతాం’ అని చెబుతున్నాడు నిఖిల్‌సాయి. సంస్థ కృషి ఫలించాలని, విద్యార్థుల కలలు సాకారం కావాలని ఆశిద్దాం!
 ..:: భువనేశ్వరి

మరిన్ని వార్తలు