తెలుగు హీరోయిన్కు మాలీవుడ్లో బంపర్ ఆఫర్!

8 Sep, 2014 20:44 IST|Sakshi
అర్చన

తెలుగు హీరోయిన్లకు టాలీవుడ్లో కంటే ఇతర భాషా చిత్రాలలో అవకాశాలు ఎక్కవగా వస్తుంటాయి. అవకాశం ఇద్దామన్నా తెలుగు హీరోయిన్లు లేరని చెబుతుంటారు. ఉన్న ఇద్దరు ముగ్గురికి కూడా అవకాశాలు ఇవ్వరు.  రచ్చ గెలిచిన తరువాత వారిని గుర్తిస్తారు.ఇక్కడ అంతగా గుర్తింపు పొందని ముద్దుగుమ్మలంతా మన పొరుగు ఇండస్ట్రీల్లో తెగ పాపులారిటీ పొందుతుంటారు. గతంలో అనేక మందికి ఇటువంటి అనుభవం ఎదురైంది. ఇటీవల కలర్స్ స్వాతి, అంజలి...వంటి వారికి కూడా ఇటువంటి పరిస్థితితే ఎదురైంది. ఇప్పుడు మరో తెలుగు హీరోయిన్కు మాలీవుడ్లో మంచి అవకాశం వచ్చింది.  

అల్లరి నరేష్ 'నేను' చిత్రం  ద్వారా అర్చన(వేద) టాలీవుడ్‌కి పరిచయమయ్యారు.   అందం, నటన ఉన్నా ఆమెకు అవకాశాలు సరిగా రావడం లేదు.  చూడ్డానికి కుందనపు బొమ్మలా ఉంటుంది అర్చన. నటన పరంగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఈ బార్బీ డాల్ కెరీర్‌ ప్రారంభం నుంచి అంతగా కలిసిరావడంలేదు.  సిద్ధార్ధ్ - త్రిష జంటగా నటించిన 'నువ్వస్తానంటే నేనొద్దంటానా'లో కీలక పాత్రలో కనిపించి అలరించింది. ఈ మధ్యే శివాజీతో 'కమలతో నా ప్రయాణం' చిత్రంలో నటించింది. మంచి పాత్ర చేసింది.  ఈ సినిమాలో నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అయినా అర్చనని టాలీవుడ్ ప్రేక్షకులు పెద్దగా ఆదరించడంలేదు. అవకాశాలు కూడా పెద్దగా రావడంలేదు.

తన పేరును ఇటీవల వేదగా మార్చుకున్న అర్చన టాలీవుడ్‌లో అడపాదడపా చిన్న చిన్న సినిమాల్లో కనిపిస్తూనే మధ్య మధ్యలో కన్నడం, తమిళ చిత్రాలలో కూడా నటిస్తోంది. కన్నడంలో మహిళా ప్రాధాన్యత గల 'మైత్రీ' అనే  చిత్రంలో నటించింది.  తమిళంలో 'నాడోడి వంశం' అనే సినిమాలో నటిస్తోంది.  ఈ బ్యూటీకి మలయాళంలో బంపర్ ఆఫర్ తగిలింది. ఓ క్రేజీ ప్రాజెక్టులో మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌కి జంటగా నటించబోతోంది.  క్లాసికల్‌ డాన్సర్‌ అయిన అర్చనకు మోహన్లాల్ పిలిచి మరీ ఈ అవకాశం ఇస్తున్నట్లు తెలిసింది.  దృశ్యంతో మీనాకి మోహన్‌లాల్ బ్రేక్‌ ఇచ్చారు. ఇప్పుడు మోహన్‌లాల్తో నటించడంతో  అర్చనకు కూడా దశ తిరిగే అవకాశం ఉంటుందేమో చూద్దాం.  మోహన్‌ లాల్‌ లాంటి స్టార్‌ హీరో సరసన నటించే అవకాశం రావడం  తన అదృష్టమని  అర్చన చెబుతోంది.
-శిసూర్య

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు