పొన్నం కన్నేశారు..

21 Jul, 2014 10:44 IST|Sakshi
పొన్నం కన్నేశారు..

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి మళ్లీ రేస్ మొదలైంది. పొన్నాల లక్ష్మయ్యను త్వరలో ఆ పదవి నుంచి తొలగిస్తారనే కథనాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు మళ్లీ కర్చీఫ్ లు వేసేందుకు రెడీ అయిపోతున్నారు. ఆ జాబితాలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ముందున్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే ఏ పదవి చేపట్టేందుకైనా సిద్ధంగా ఉన్నానంటూ ఫీలర్లు వదిలారు. అయితే పీపీసీ అధ్యక్ష పదవి తాను కోరుకోలేదని, కానీ హైకమాండ్ చెబితే ఆ పీఠాన్ని అలకరించేందుకు తనకు అభ్యంతరం లేదని మనసులోని మాట సెలవిచ్చారు. ఇప్పటికే ఈ పదవిని చేపట్టేందుకు పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్, మాజీమంత్రి, సీఎల్పీ నేత జానారెడ్డి ఎవరికి వారు తమదైన స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి పొన్నాలను తప్పించి  ఆ పదవిని తాము దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇక ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఎంపిక చేసిన పొన్నాల లక్ష్మయ్య ఆ పదవికి పూర్తి స్థాయి న్యాయం చేయలేకపోవటంతోపాటు, సీనియర్ల నుంచి సహకారం లభించకపోవటం కూడా  తెలంగాణలో కాంగ్రెస్పార్టీ ఓటమికి కారణమని ఆ పార్టీ నేతలే అవకాశం దొరికినప్పుడల్లా దుమ్మెత్తి పోస్తున్నారు. తెలంగాణ ఇచ్చినా ఆ మేరకు ప్రజల్లోకి వెళ్లటంలో విఫలం కావటంతో పాటు, పదవుల కోసం సీనియర్ నేతల కుమ్ములాటల కారణంగానే పార్టీ పరాజయం పొందిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నేతల కుమ్ములాట, సమన్వయ లేమితో  రాబోయే ఐదేళ్లలో పార్టీని ముందుకు నడిపించే పరిస్థితి లేకపోవటంతో తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని మార్చేందుకు ఢిల్లీ పెద్దలు  సిద్ధమైనట్లు సమాచారం. టీఆర్ఎస్ను సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే సత్తా ఉన్నవాళ్ళకు ఆ పదవిని అప్పగించాలని అధిష్ఠానం యోచిస్తోంది.

మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవి రేసులో మాజీ మంత్రి శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ వివేక్ ఉన్నారు. అయితే.. ఒకవేళ పీసీసీ అధ్యక్షుడి మార్పు జరిగేనా ఎవరొచ్చి మాత్రం ఏం ఒరగబెడతారన్నట్లు పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని పెద్దగా ఆదరించలేదు. ఐదేళ్ల తర్వాత కూడా పరిస్థితులు బాగుపడతాయన్న ఆశలు పెద్దగా లేవు. ఇలాంటి నేపథ్యంలో.. ఈ పదవి ముళ్లకిరీటమే అవుతుంది. అయినా.. ఆ పదవి ఎవరికి దక్కుతుందనేది మాత్రం  చివరి వరకూ సస్పెన్సే.
 

మరిన్ని వార్తలు