ఉద్యోగాలు సాఫ్ట్... మనుషులు హార్డ్!

28 Aug, 2013 20:37 IST|Sakshi



ఒకప్పుడు చేతినిండా సంపాదన.. విలాసవంతమైన కార్లలో తిరగడం, వారానికి ఐదు రోజులే పనిచేయడం, ఆ పైన హాయిగా రెండు రోజుల పాటు ఫుల్లు జోష్!! విలాసాలు ఎక్కువయ్యేకొద్దీ సంపాదన సరిపోదు. దాంతో ఏదోలా అదనపు సంపాదన కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు. ముందుగా గుర్తుకొచ్చేది చిన్న చిన్న ఆన్లైన్ మోసాలు లేదా మరీ అవసరాలు ఎక్కువైన పక్షంలో దొంగతనాలకు పాల్పడటం. ఇదీ కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల తీరు. పబ్బుల్లో తిరగడంతో పాటు కొంతమందయితే డ్రగ్స్కు కూడా అలవాటు పడుతున్న వైనాలు ఇటీవలి కాలంలో బాగా బయటపడుతున్నాయి. సెల్ఫోన్ల చోరీ నుంచి మోటారు సైకిళ్ల దొంగతనాలు, చివరకు ఇళ్లల్లో దోపిడీలకూ పాల్పడుతున్నారు. చదువుకున్నారన్న మాటే గానీ, ఆ పెద్ద పెద్ద చదువులు వాళ్ల వ్యక్తిత్వ వికాసానికి ఏమాత్రం ఉపయోగపడకపోగా.. అవసరాలను రోజురోజుకూ పెంచేసి, వక్రమార్గాలు పట్టిస్తోంది.

ఇలాంటి సంఘటనలు హైదరాబాద్లో గతంలో కొన్ని వెలుగుచూశాయి. ఓ యువకుడైతే వరుసగా కేవలం స్మార్ట్ఫోన్లను మాత్రమే దొంగిలిస్తూ.. వాటిని మళ్లీ నల్లబజారులో అమ్మేసి ఆ డబ్బుతో తమ్ముడిని ఎంబీఏ చదివించి, చెల్లెలికి పెళ్లి చేసి, భర్త చనిపోయిన అక్కతో ఓ చిన్న వ్యాపారం పెట్టించి, ఆమెకు స్కూటర్ కొనిచ్చి, తాను మొత్తం కుటుంబంతో కలిసి తిరగడానికి ఓ స్కోడా కారు కూడా కొనుక్కున్నాడు. ఆబిడ్స్ - కోఠి - సుల్తాన్ బజార్.. ఇలా కేవలం రద్దీ ప్రాంతాలు మాత్రమే అతడి కార్యక్షేత్రాలు. బస్సుల్లో గానీ, రోడ్ల మీదగానీ ప్రమత్తంగా ఉండే వాళ్ల నుంచి చాకచక్యంగా స్మార్ట్ఫోన్లు కొట్టేయడం, వెంటనే సిమ్కార్డు తీసేసి జాగ్రత్తగా వాటిని ఎవరికీ దొరక్కుండా నల్లబజారులో అమ్మేసి సొమ్ము చేసుకునేవాడు. మొదట్లో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసినా.. తర్వాత అందులో సంపాదన ఏమాత్రం సరిపోకపోవడంతో ఇలాంటి దొంగతనాలకు పాల్పడ్డాడు.

తాజాగా దేశ రాజధానిలో కూడా ఇలాంటి తతంగం ఒకటి బయటపడింది. ఓ కంప్యూటర్ ఇంజనీరు, ఇద్దరు రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో సహా ఆరుగురు కలిసి ఓ వ్యాపారిని దోచుకోగా, వాళ్లను పోలీసులు పట్టుకున్నారు. రషీద్ (29), పునీత్ (31), మహ్మద్ షఫీక్ (26), దనీష్ (28), మహేందర్ యాదవ్ (22),  అశుతోష్ (28) అనే ఈ ఆరుగురూ రాజధాని ఢిల్లీ వదిలిపెట్టి పారిపోడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు పసిగట్టి, వాళ్లు దాగున్న చోటు గాలించి పట్టుకుని మరీ అరెస్టుచేశారు.

ఈనెల 22వ తేదీన వీళ్లంతా కలిసి దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ -౩ ప్రాంతంలో గల అశోక్ కుమార్ రకియాన్ అనే వ్యాపారి ఇంటికి వెళ్లారు. తుపాకి చూపించి ఆయన్ను బెదిరించి, లక్షలాది రూపాయల విలువైన నగలు, 10 లక్షల రూపాయల నగదు దోచుకున్నారు. పోలీసులకు పట్టుబడిన తర్వాత మొదట మొరాయించినా, తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి మొత్తం కక్కేశారు. తమ కుటుంబ అవసరాలకు సరిపడ సంపాదన లేకపోవడంతో తామందరికీ దొంగతనాలు అలవాటైపోయాయని, అందుకే ఈసారి కూడా అలాగే చేశామని చెప్పేశారు.

తమ దగ్గర కత్తులు, నాటు తుపాకులు ఉన్నాయని, వాటిని ఎప్పుడూ తీసుకెళ్తుంటామని.. దొంగతనాల సమయంలో ఎవరైనా మరీ మొండికేస్తే వాటిని ఉపయోగించడానికి కూడా వెనకాడబోమని చెప్పారు. వీళ్లలో అశుతోష్ కంప్యూటర్ ఇంజనీర్ కాగా, రషీద్, పునీత్ అనేవాళ్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు. వీళ్ల దగ్గర ఆయుధాలతో పాటు వారు దోచుకున్న నగలు, నగదు మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

>
మరిన్ని వార్తలు