బంగారం లాంటి మోసం

8 May, 2016 19:04 IST|Sakshi
బంగారం లాంటి మోసం

అక్షయ తృతీయకు బంగారం కొంటే మంచి జరుగుతుంది.కానీ గుడ్డిగా కొంటే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది.మోసం మీసం మెలేస్తుంది. అలా అని కొనడం మానేయకండి.కొనే ముందు కొన్ని విషయాలు మాత్రం గుర్తుంచుకోండి.ఏమిటా విషయాలు?తెలుసుకుందాం పదండి...
 
 ఆభరణాలు కొంటున్నా... లేక తయారు చేయిస్తున్నా... కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. వర్తకుడు తెలిసినవాడే కదా అని ఏ కొంచెం ఏమరుపాటుగా ఉన్నా... మోసపోవడం ఖాయం. కూరగాయలో మరొకటో అయితే నష్టం రూపాయల్లోనే ఉంటుంది. బంగారమైతే నష్టం వేలు, లక్షల్లో ఉంటుంది.
 
 మీకు బాగా తెలిసిన వ్యక్తే కదా అని ఒకరి దగ్గరే తరచూ నగలు తయారు చేయిస్తూ ఉంటే... వాటిని మార్చాల్సి వచ్చినపుడు అతని దగ్గర కాకుండా ఏదైనా పెద్ద షాపులో ఇచ్చి చూడండి. అప్పుడు ఆ నగలో ఉన్న బంగారమెంతో తెలుస్తుంది. అలాగే అతని నిజాయతీ కూడా బయటపడుతుంది. నగలు మార్చినప్పుడల్లా 80-90 శాతం దాకా అతను  విలువ కడుతున్నాడు కదా అని ఏమాత్రం సంతోషపడటానికి వీల్లేదు. ఆభరణాల తయారీలో కొందరు వర్తకులు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. పసుపు వర్ణం అధికంగా వచ్చేలా రసాయనాలను వాడుతారు. బంగారం శాతం తక్కువగా ఉన్నా... 22 క్యారట్లు ఉందని చెప్పి డబ్బు వసూలు చేస్తుంటారు.
 
 ఆభరణాలను వేరే దుకాణంలో మార్చినప్పుడే వర్తకుల మోసాలు  బయట పడతాయి. వీటిన్నిటితో పాటు హాల్‌మార్క్ లేని నగలను కస్టమర్లకు అంటగట్టడం చేస్తారు. కొందరు వర్తకులైతే కస్టమర్ల డబ్బుతో ఉడాయించటం వంటివి కూడా జరుగుతున్నాయి.ఆభరణాన్నిబట్టి మజూరీ...
 
 బంగారు నగల తయారీ చాలా క్లిష్టమైంది. యంత్రాలతో కొన్ని తయారైతే, చేతితో  మరికొన్ని రూపొందుతాయి. వర్తకులు వీటికి తరుగు, తయారీ చార్జీలు వసూలు చేయడం సాధారణం. అయితే ఆభర ణాన్ని బట్టి వీటి చార్జీలు మారుతుంటాయి. ఆభరణాన్ని బట్టి తరుగు గ్రాముకు రూ.150 నుంచి రూ.500 వరకు ఉంటుంది. తయారీ చార్జీలు గ్రాముకు రూ.50-150 వరకు తీసుకుంటారు.
 
  కొన్ని ప్రత్యేక నగల విషయంలో ఈ చార్జీలు ఇంకాస్త ఎక్కువే. ఇక కొందరు వ్యాపారులు తరుగు పేరుతో పెద్ద మొత్తం వసూలు చేస్తుంటారు. తరుగు, తయారీ విషయంలోనే కస్టమర్లకు చార్జీల భారం ఎక్కువ. అందుకే వీటి విషయంలో వినియోగదార్లు కాస్త జాగ్రత్త వహించాలి. ఎంత తరుగు, తయారీ చార్జీలు వసూలు చేస్తున్నారో ఆరా తీయాలి. ట్యాగ్‌లపై తరుగు, బరువు, కోడ్ మాత్రమే ముద్రించి ఉంటుంది.
 
  కస్టమర్ కొనుగోలు చేస్తున్న రోజు ఉండే ధరనే వర్తకులు పరిగణలోకి తీసుకుని బిల్ చేస్తారు. నాణ్యతలో తేడాలొస్తే క్యాష్ మెమో/ఇన్వాయిస్ ఆధారంగా వినియోగదారుల ఫోరంలో, తూనికలు కొలతల శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వీలవుతుంది. అందుకే దుకాణం నుంచి ఒరిజినల్ బిల్ తీసుకోవడమేగాక దానిని జాగ్రత్తగా అట్టిపెట్టుకోవాలి.
 
 ఒరిజినల్ బిల్లుంటే..
 ఆభరణాలకు వ్యాట్ అదనం అన్న సంగతి మర్చిపోకూడదు. వ్యయం పెరుగుతోంది కదా అని కక్కుర్తి పడ్డారో... మోసపోయే చాన్స్ చాలా ఎక్కువ. వ్యాట్ భారం నుంచి తప్పించుకోవ డానికి ఒరిజినల్ బిల్లు తీసుకోవడం మానేస్తే మాత్రం కష్టాలను కొనితెచ్చుకున్నట్టే.
 
 నిజానికి మీరు చేయించుకున్న ఆభరణంలో బంగారం శాతం ఎంత ఉందో నిక్కచ్చిగా చెప్పే సాంకేతిక పరిజ్ఞానమూ ఇప్పుడు అందుబాటు లోకి వచ్చింది. అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్లతోపాటు ప్రముఖ ఆభరణాల సంస్థలు కూడా ఈ సేవలను అందిస్తున్నాయి. అలాగే వజ్రాల నాణ్యతనూ తెలుసుకోవచ్చు. కొద్దిపాటి రుసుముతో ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.
 
 స్వచ్ఛత కొలిచేదిలా..
 బంగారం స్వచ్ఛతను క్యారట్లలో కొలుస్తారు. 24 క్యారట్ల బంగారంలో 24 భాగాల స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 22 క్యారట్ల బంగారంలో 22 భాగాల బంగారం, 2 భాగాల ఇతర ఖనిజాలు ఉంటాయి. ఆభరణం, డిజైన్‌ను బట్టి బంగారం క్యారట్లు మారుతుంటుంది. అంటే ఆభరణం తయారీ సమయంలో గట్టిదనం కోసం ఇతర మెటల్స్‌ను కలుపుతారు. పూర్తిగా బంగారమే ఉంటే అది గట్టిగా ఉండదు. ఆభరణం విరిగిపోతుంది.
 
 అధిక శాతం నగలు 22 క్యారట్లతో తయారు చేస్తారు. ఇందులో బంగారం స్వచ్ఛత 91.6 శాతం ఉంటుంది. వజ్రాభరణాలను 18 క్యారట్ల బంగారంతో చేస్తారు. ఇటీవల 18 క్యారట్ల బంగారు ఆభరణాలకూ డిమాండ్ పెరుగుతోంది. వీటిలో 75 శాతం బంగారం ఉంటుంది. ఆభరణంలో ఎన్ని క్యారట్ల బంగారం ఉందో కస్టమర్లు అడిగి తెలుసుకోవాలి. నగ 20, 21 క్యారట్లు ఉన్నప్పటికీ కొందరు వర్తకులు 22 క్యారట్లకు చార్జీ చేస్తున్నారు. హాల్‌మార్క్ ఉంటే ఇటువంటి సమస్యలు ఉండవు. ఎందుకంటే హాల్‌మార్క్ అనేది ఎన్ని క్యారట్లో ఖచ్చితంగా చెబుతుంది. ఆభరణంపైన హాల్‌మార్క్, ఎన్ని క్యారట్లు ఉంది, దుకాణం కోడ్, తయారైన సంవత్సరం ముద్రించి ఉంటాయి. ఏ దుకాణంలో కొన్నారో సులభంగా ట్రాక్ చేయవచ్చు.
 
హాల్‌మార్క్ ఎవరిస్తారు?
 భారతదేశంలో నాణ్యతా ప్రమాణాలను నిర్దేశిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ గుర్తింపును ఇస్తోంది. ఈ హాల్‌మార్క్‌ను ఆభరణాల తయారీదారులు ఇవ్వరు. ఆభరణాలను పరీక్షించిన తర్వాత ప్రత్యేక ల్యాబొరేటరీలైన అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్లు ఈ హాల్‌మార్క్‌ను ఇస్తాయి. హాల్‌మార్క్‌తో ఆభరణాల ఖరీదు పెద్దగా పెరగదు. ఒక్కో నగకు రూ.100 మించకుండా చార్జీ ఉంటుంది. చిన్న వర్తకుడైనా సరే, ఆభరణానికి హాల్‌మార్క్ కావాలని కస్టమర్లు కోరవచ్చు.     
 
 నాణ్యతా ప్రమాణాల పట్ల దేశవ్యాప్తంగా ఉన్న వర్తకులకు బీఐఎస్ అవగాహన కల్పిస్తోంది. నిజానికి హాల్‌మార్క్ ఉన్నంత మాత్రాన అన్ని నగల్లోనూ 22 క్యారట్ల స్వచ్ఛత ఉన్నట్టు కాదు. గోల్డ్ ప్యూరిటీని బట్టి ఇవి మారతాయి. 958 స్వచ్ఛతకు 23 క్యారట్లు, 916 స్వచ్ఛతకు 22 క్యారట్లు, 875 స్వచ్ఛతకు 21 క్యారట్లు, 750 స్వచ్ఛతకు 18 క్యారట్ల గ్రేడ్‌ను బీఐఎస్ ఇస్తుంది. ఇక్కడ 958 స్వచ్ఛత అంటే... 95.8 శాతం బంగారం అని అర్థం చేసుకోవాలి.
 
 సేకరణ: మహేందర్ నూగూరి
 ఇన్‌పుట్స్: జి.నాగకిరణ్, మేనేజర్, ఆభరణాల విభాగం, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ (కొత్తపేట)

మరిన్ని వార్తలు