అతడు - ఆమె

13 Jul, 2014 00:44 IST|Sakshi
అతడు - ఆమె

కథ
 
 ఏంబా!
ఎట్టుండావు? పిలకాయలు ఎట్టుండారు? బాగా సదవతాండారా? పెతి ఆదివారమూ ఆస్టలు కాడికి పోయి పిలకాయల్ని చూసి, మాటాడి, వోల్లకేం గావాల్నో అడిగి తీసిచ్చేసి వొస్తాండావు గదా! ఇంటికాడ... మనిద్దరి దెగ్గిరా ముదిగారంగా పెరగాల్సిన బిడ్డలు... అట్టా... దిక్కు మొక్కు లేని అనాదలు మాద్రి ఆస్టల్లో పడి వుండారు. తల్సుకొంటే బాదగా ఉంటాది గానీ తప్పదు గదా!
వానదేముడు పగబట్టినట్టు వాన చినుకే ఇదల్చక పాయ! అప్పో సప్పో చేసి బూదేవమ్మ గుండికాయను ఎంత లోతుగా చీల్చినా సుక్క నీరు కనబడలా! కయ్యా, చేనూ బీడు పెట్టుకొని అంబోమని అల్లాడతాంటిమి. అదో! ఆ టైంలోనే ఆ దేముడే అంపించినట్టు సవుదీ నుండి మనూరి రెడ్డెప్ప కోడాలు రానెక్క వొచ్చింది. ఆ అక్క సానా మంచిది. పెగ్గి లేకుండా అందుర్నీ మాట్లాడిస్తాది. ఒగదినం మనింటికొచ్చి ‘ఏమ్మే! ఎట్టుండారు? బాగుండారా?’ అని అడిగే.
 ‘‘ఏం బాగులేకా! సావ లేక, బతక లేకా పీనుగుల మాదిరి పడుండాం. పిలకాయలకు మూడు పూట్లా బువ్వగ్గ్గడా కస్టమైపోతాండాది. బడికి సెలవంటే బయమేస్తాంది. బడుంటే మద్దేనం ఆడే తినేస్తారు గదా!’’ బోరోమని ఏడిస్తి.
 నా బాద, యింటి పరిస్తితులు, పిలకాయల్ని చూసి రానెక్క గడా చానా బాదపడింది. ‘‘పోనీ! నువు సవుదీ కొచ్చీగడదా?’’ అనింది.
 అక్క సీరలు, నగలు, వాళ్లింట్లో ఉండే బీరువాలు, మంచాలు, సోపాలు, కుర్చీలు, రకరకాల వొస్తువుల కన్వాగడా నాన్యంగా, సుఖంగా, ఆరోగ్గిరంగా, సంతోషంగా వుండే వాల్ల పిలకాయలు... అక్క అంపించే దుడ్లను భద్రంగా,  చిక్కనంగా కర్సుపెడ్తూ వడ్డీలకు తిప్పి దుడ్లు సంపాదిస్తాండే రానెక్క ఇంటాయన... ఇయ్యన్నీ చూస్తాంటే ముందు నుంచీ నాగ్గడా సవుదీకి పావల్లని చానా ఆసగా వున్యాగడా నువ్వొప్పుకోవని గమ్మునుంటి. కాని అక్క అడిగేయాలకు ‘సరేకా’ అనేస్తి గబక్కన. కానీ... పొయ్యేదానికి దుడ్లు ఎట్ల? నెర్రెలిచ్చి బీడు పడుండే మన చేనును అడుమానమో, కొనేదో ఎవురు? అసలకు ముందు నువ్వొప్పుకోవల్ల గదా.
 ‘‘రానెక్కా! నా బిడ్లకు కూరా కూడు వొద్దు. వేలకు కడుపుకింత బువ్వ... పస్తుల్లేకుండా పెట్టుకొంటే సాలు. సావకుండా సాకేస్తే... మల్లా వాల్ల తలరాతలు ఎట్టుంటే అట్టా బతకతారు...’’ అంటాంటే దుక్కం ఎగదన్నుకొచ్చింది.
 ‘‘నువ్వే ఎట్లన్నా నన్ను తొడ్కోపోకా! మీ ఇంటాయనకు చెప్పి దుడ్లిప్పీకా! ఆడ పన్లో చేరినంక... నెల నెలా జీతం దుడ్లతో ముందు నీ అప్పే కడతాము.’’
 ‘‘సర్లేమ్మే! నువు ఏడవగాకు. ముందు మీ ఇంటాయన్ని అడుక్కో. సవుదీకి పొయ్యే ఆడోల్లంటే ఆయనకు మంట గదా! నోటికొచ్చినట్టల్లా మాటాడతాంటాడు. ఒగ విసియం నువు గడా గ్యాపకం పెట్టుకో. మన అవుసరానికి, మనం దుడ్లు సంపాయించేదానికి అంత దూరం పోతాండాం. ఆడ వాల్లు ఏ పని చెప్పినా చెయ్యల్ల. ఏం చేసినా గమ్మున పడుండల్ల. అట్టగాదు, ఇట్టగాదు అనేదాన్కి లేదు. ముందుగానే నేను చెప్పలేదనీ అనొద్దు మల్ల. అన్నింటికీ సరేననుకొంటేనే ఎలబారల్ల! మల్ల నువు గాని, మీ ఇంటాయన గాని నన్నేమన్నా అంటే ఒప్పుకోను. అయినా గడా తలపెట్టేదే రోట్లోనే ఐతే రోకలి దెబ్బ తప్పదని తెలీదా యేంది?’’ రానెక్క గూడంగానే అన్నీ ఇప్పరించి చెప్పింది.
 ఏమన్నా గానీ... సవుదీకి పోవల్ల! నా బిడ్లు బాగుండల్లని నేను తెగాయిస్తి. వారం దినాలు యింట్లో ఒగటే కొట్లాట. నెత్తురు కారేట్లు, ఒల్లు వాసేట్లు కొడ్తివి. ‘‘ఆడది ఎట్లన్నా సంపాయించల్లనుకొంటే అంత దూరం పోవల్నా? ఈడగడా సంపాయించొచ్చులే!’’ అని బండ బూతులు తిడ్తివి.
 దాంతో నాకు యింగా మొండితన వచ్చేస. ‘నువు చూస్కో పోతే బిడ్లను మా అమ్మోల్లింట్లో ఒదిలేసి నేను పొయ్యేది పొయ్యేదే’నని పట్టుబడ్తి.
 ‘‘ఇన్ని దినాలు సవుదీకి పోయిన ఆడోల్లను కన్న బూతులు తిట్టి... ఇబ్బుడు నా పెల్లాన్నే అంపిస్తే నాకెంత అగుమానమో ఆలోసిత్తివా? నన్నంతా గేలి చెయ్యరా? నేనే మొగం పెట్టుకొని మందిలో తిరుగుడు’’ అంటూ కాల్లబేరానికొస్తివి.
 తప్పో ఒప్పో, నిజమో అపద్దమో... తెలిసీ తెలీకుండా ఎవుర్నన్నా నీచంగా మాటాడి అగుమానం చేస్తే... ఆ బాద ఎట్టుంటాదో... తన దాకా వస్తేనే గదా తెల్సేది? అందుకే పెద్దోలు ‘కాలు జారినా తీసుకోవచ్చు. నోరు జారితే తిరిగి తీస్కోలేం’ అంటారు. నీ బాద నాకర్థమైనా ఏం చేసేది!
 ‘‘సూడుబా! మంది కోసరమని, మానం కోసరమని కడుపున పుట్టిన బిడ్లను సంపుకొంటామా యేంది? అంటే అంటార్లే! ఎన్ని దినాలంటారు? ఐనా గడా ఆ అనేటోల్లలో ఒగరన్నా... మనకో పొద్దన్నా... ఒగ ముద్ద బువ్వన్నా పెడ్తారా? మన అగసాట్లేవో మనం పడల్లగనీ!’’ అని నేను నచ్చ చెప్పేయాలనుకున్నా నువు గమ్మునుండి పోతివి. గమ్మునుండక ఏం చేస్తావు మల్ల! నయా పైసా వరుమానం లేదు. ఆడా ఈడా వడ్డీలకు పెరక్కొచ్చిన అప్పులు దప్ప ఏముండాది తిని బతికేదానికి? పాల దుడ్లతో పానాలు నిలుపుకొంటుండాం. మేపు లేకుండా ఆవు గొడ్లు మాత్రం లీటర్లకు లీటర్లు పాలు ఎట్లిస్తాయి? సరి! మొండి ధైర్నంతో రానెక్క వాల్ల దెగ్గిరే అప్పు దీసుకొని సవుదీకి పోతి.
 రానెక్కే నన్నో సావుకారింట్లో పనికి పెట్టే! రాత్రింబవుళ్లు రెక్కలు ముక్కలయ్యే పనులు! ఎంత కస్టపడ్తినో... ఎంత బాదపడ్తినో... ఎంత ఏడిస్తినో... ఎంతగా మనుసు సంపుకొంటినో... నాకు... ఆ బగుమంతునికే దెల్సు. అన్నీ దెల్సి అద్దానంలో పడ్తినా అని అల్లాడి పోతి. బిడ్డల్ని, వాల్ల బవిస్యత్తును గ్యాపకం పెట్టుకొని మెలిమెల్లిగా అన్నిటికీ అలవాటు పడిపోతి.
 ‘కస్టపడల్ల! దుడ్లు సంపాయించి యింటికి అంపించల్ల! అంతే! ఇంగో ఆలోసనే వుండగూడద’ని గుండె రాయి చేస్కొంటి. అందుకే అప్పులన్నీ దీరిపోయి మన కుటుంబరం ఒక గాట్లో పడేదాంకా వ్రుదాగా దుడ్లు కర్సు పెట్టగూడదని... బిడ్ల పైన ఎంత కలవరమైనా, ఒగపారి వొచ్చి సూడల్లని మనుసు గింజకపోతున్నా... ఈ అయిదేండ్లు ఇంటికి రానేలేదు. నేనొచ్చేసిన తొలి దినాల్లో ‘పక్కన నువు లేకండా నిద్దరే రానంటాంది మే!’ అని నువు గుసగుసలాడ్తాంటే నా కండ్లు నీటి కడవలయ్యేటివి. పచ్చి మాదిరి ఎగిరొచ్చి నిన్ను వాటేసుకొని బొరోమని ఏడవాలన్పించేది. ‘నా మొగుడు సీరామచెందురుడ’ని మనుసు సంతోసపడేది. రాన్రాను నువు గడా నేను లేని బాదకు అలవాటు పడిపోతివేమో మల్ల ఎబ్బుడూ అంత ప్రీతిగా మాటాడలా!
 ఈ బాదలన్నీ ఇంగో ఐదేండ్లు కస్టపడ్తే తీరిపోతాయిలే! పిలకాయల సదువులు, పాప పెండ్లికి సంపాయించుకొంటే చాలు. ఇబ్బుడు నువు గడా పొట్లేండ్ల యాపారం చేస్తాండావుగదా. పిలకాయల బాద్దెతలు తీరిపోతే... మనకెంత గావల్ల! తిని ఆయిగా వుండొచ్చులే, అనుకొంటి! అంతా మనమనుక్నొట్లే జరిగిపోతే ఇంగేముంది? బగమంతున్ని ఎట్టా తలస్తాము?
 అవునుబా! అనుకోకండా... నడినెత్తిన పిడుగు పడినట్లు ఈ పెబుత్వం ‘నితాఖత్’ చట్టం చేసింది. నువ్వూ యినే వుంటావు ఈ పాటికి. టీవి వార్తల్లో గడా చూసింటావు. విజిట్ వీసాలో ఈ దేసానికొచ్చినవాల్లు ఏ పనన్నా చేస్కొనే అక్కు వుండేదంట. అదిబ్బుడు చెల్లదంట. కాబట్టి ఆ వీసాతో ఈడికొచ్చినోల్లంతా తిరిగెల్లి పావల్లని చెప్పినారు. దాంతో ఎంతోమంది గగ్గోలు పడిపోతాండారు. కొంతమందైతే పాపం... ఉన్న చెలకా, చేనూ అమ్ముకొచ్చినోల్లు, లచ్చలకు లచ్చలు అప్పులు చేసి వొచ్చినోల్లు... యింగా పనులకు కుదురుకోనేలేదు. ఒగ దీనారు గడా సంపాయించనే లేదు. తిరిగెల్లమంటే విమానం టికెట్ల కన్నా దుడ్లెట్లని దొల్లి దొల్లి ఏడస్తాండారు. మన పెబుత్వం గడా కొంచెం గడువిమ్మంటే ఒగ మూడు నెల్లు గడువిచ్చిందీ పెబుత్వం. ఆ వరకు అంతా తట్టా బుట్టా సద్దుకోవాల్సిందే! లేపోతే జైల్లో పెడ్తారంట. బయటే యిన్ని బాదలుండె. ఇంగా జైల్లో ఎన్ని నరక బాదలుంటాయో! తల్సుకొంటేనే బయమేస్తాంది.
 
 అయినాగడా... మనం ఎంత ఆసపడ్నా గానీ మనకు ఏది, ఎక్కడ, ఎంత రుణమో అంతే దక్కతాదని మనుసు నిమ్మలం చేస్కొంటి. ఏడ్చి... ఏడ్చి అల్సిపోతిమల్ల! నీకు ఎన్ని తూర్లు పోన్ చేస్తాన్నా... ఆ నెంబరే లేదని తిరుగు జవాబొస్తాంది. ఏమైంది నీ పోనుకు? రిపేరైతే... పోన్ బూతునుండన్నా చెయ్యల్ల గదా! ఎట్లా... ఇంటికొచ్చేస్తాండా గదా... నేనిన్ని దినాలు చెప్పల్లని... చెప్పలేకపోయిన విసయాలన్నీ జాబు రాద్దామనుకొంటి. ఇబ్బుడు నా మనుసు కొంచెం తేటపడింది. కొత్త ఇంటిలో, పిలకాయల్తో, నీతో కలిసి మల్లీ ‘కొత్త బతుకు’ ఆరంబించల్లని నా మనుసిప్పుడు ఆత్రపడ్తాంది.
 నీకు దెల్సు కదా... పెతి నెలా నాకొచ్చిన జీతమంతా... అట్లే నీకంపించేస్తాంటి గదా! నా దెగ్గిర ఒక్క రూపాయ గడా లేదు. నువ్వు బిన్నే దుడ్లు సరిచేసి అంపించు. విమానం టికెట్టు ముందుగానే తీసుకోవల్ల గదా! జనాలెక్కువ. మల్ల దొరకతాదో లేదో! కాబట్టి నువు ఈ జాబు అందిన వెంటనే పోనుచెయ్యి. దుడ్లంపించు. లేపోతే పోతే జైలుకు, వల్లకాకపోతే వల్లకాటికే పోవల్లంతే!
 ఇట్లు సుసీల
     
 సుసీలా!
 నన్ను చమించుమే! నేను నీకు ఒగ రూపాయి గడా అంపించలేను. నిజింగా నా దెగ్గిర లేదు. అవును సుసీలా! నువు దుడ్లే లోకమని ఆ దేసంలో వుండిపోతివి. నువు అంపించే దుడ్లు నాకీ లోకాన్ని, సుకాలను సూపించింది. అడిగే వోల్లు లేరు. అడ్డం చెప్పేవాల్లూ లేరు. చేతి నిండా దుడ్లు బుద్దిని గడ్డి తిన్పించి అన్ని అలవాట్లూ... అనుబోగంలోకి తెచ్చినాయి. అనుబగించిన సుకాలు... ఒంట్లో నోరిడిసి చెప్పుకోలేని రోగాల్ని దెచ్చినాయి.
 రానీ మల్లా నీకు చెప్తాదని వాల్ల అప్పు మాత్రమే తీర్చిన. మిగతా అప్పులట్లే వుండాయి. కొత్త బోరు ఎయ్యలా! పక్క మడి కొన్లా! ఇల్లు కట్లా! పిలకాయల పేర్లతో బేంకులో దుడ్లు ఎయ్యలా! ఏ చీటీలు కట్లా! ఆకిరికి పిలకాయల్ని ఆస్టల్లో గడా చేర్చలా! మనూరి బళ్లోనో సదవతాండారు. నీతో సెప్పద్దని వాల్లని బయపెట్టింటి.
 సుసీలా! నీ దుడ్లంతా తినేస్తారని మాయమ్మ, అయ్యల్ని తనీ కాపరం పెట్టమంటివి గాని... ఇబ్బుడు మాయమ్మే నా బిడ్లకింత బువ్వ పెడ్తాంది. సుసీలా! దుడ్లతో దునియాలో దేన్నన్నా కొనచ్చనుకొంటివి గానీ... కొనలేనివి వుంటాయి. ముక్యంగా ప్రేమల్ని, ఆరోగ్గిరాల్ని, ఆయుసును, గడ్సిపోయిన కాలాన్ని కొనలేమని తెలుసుకో!
 ఇయ్యన్నీ నీకు ఎట్టా చెప్పాలనుకొంటుండగనే గోరు సుట్టు మీద రోకటి పోటు మాదిరి ఈ ‘నితాఖత్’ చట్టం గురించి తెల్సి, నేను చాలా కుంగిపోయినాను. నువు పోను చేస్తే ఏమని చెప్పల్లో దిక్కు తోచక కార్డు తీసేస్తి. ఆ బగుమంతుడు నా ఒంట్లో ప్రానాన్ని తొరలోనే తీసేస్తాడని తెల్సుగానీ... నేను నీకు చేసిన అన్నీయానికి బదులుగా నా ప్రానాలు ఇబ్బుడే తీసేసుకొంటాండా! నన్ను చమించు సుసీలా!
 ఇట్లు, జగన్నాదం
 

మరిన్ని వార్తలు