తిరస్కరణకు గురయ్యారు..!

7 Dec, 2014 01:09 IST|Sakshi
తిరస్కరణకు గురయ్యారు..!

‘కరేజ్ డజ్ నాట్ ఆల్వేస్ రోర్..’ అనేది ఇంగ్లిష్‌లోని ఒక నానుడి.  వ్యక్తిలోని ప్రతిభను ఒక్కోసారి అవతలి వారు అర్థం చేసుకోలేకపోవచ్చు. ఒక రంగంలో అద్భుతాలు సాధించగల వారు కూడా ఒక్కోసారి అదే రంగంలో అనామకులనిపించవచ్చు. అందుకు ఉదాహరణ వీళ్లు. అపారమైన ప్రతిభను కలిగి ఉండి.. ఒకే లక్ష్యంతో పాటుపడుతున్న సమయంలో వీరికి తిరస్కారాలుఎదురయ్యాయి. అయితేనేం.. అలాంటి తిరస్కారాలను వైఫల్యాలుగా భావించకుండా, తిరిగి కృషి చేసి అద్భుతాలు సాధించిన స్ఫూర్తిమంతులు వీళ్లు.
 
జేకే రౌలింగ్

ఒకరు కాదు ఇద్దరు కాదు... పన్నెండు మంది పబ్లిషర్స్ రౌలింగ్ రచనని తిరస్కరించారు. ఆమె అక్షరాల ద్వారా సృష్టించిన ‘హారీపొటర్’ ప్రపంచం వారిని ఆకట్టుకోలేకపోయింది. ప్రచురణకు ఎవరూ ముందుకు రాలేదు. అయితేనేం... రౌలింగ్ ప్రతిభకు ప్రచురణకర్తల తిరస్కరణ అడ్డు కాలేకపోయింది. ఆ తర్వాత దక్కిన చిన్న అవకాశంతో రౌలింగ్ తన సత్తాచాటారు.
 
ఎమినిమ్
ఈ పేరు వింటే పాప్ ప్రపంచం ఊగిపోతుంది. సంగీత ప్రపంచంలో అతడొక తరంగమని కీర్తిస్తుంది. ఈ ప్రశంసలూ, పేరు ప్రఖ్యాతులన్నీ ఎమినిమ్ గ్రామీ అవార్డులను అందుకోవడం మొదలైన తర్వాత మొదలైనవి. డజను సార్లకుపైగా ఆ అవార్డును అందుకున్నాక పతాక స్థాయికి చేరినవి. అయితే సంగీతకారుడిగా పేరు తెచ్చుకోకమునుపు ఎమినిమ్‌ను ఆదరించిన వారు లేరు. తన ప్రతిభను గుర్తించకపోగా తన పేదరికాన్ని చూసి అనేకమంది అసహ్యించుకొన్నారని ఈ పాప్‌స్టార్ అనేక సార్లు తన గతం గురించి ప్రస్తావించాడు.
 
మైఖేల్ జోర్డాన్

‘గ్రేటెస్ట్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ ఆఫ్ ఆల్‌టైమ్’ ఆట నుంచి రిటైర్ అయిన సమయానికి ఈ అమెరికన్ ప్లేయర్ పేరు ముందు చేరిన బిరుదు ఇది. ‘నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్’ లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శన ద్వారా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సాధించిన మైఖేల్ జోర్డాన్ ఆట విషయంలో అనేక సార్లు నిరాదరణకు గురయ్యాడు. స్కూల్ టీమ్, టీనేజ్‌లలో సెలెక్టర్లు జోర్డాన్‌ను పట్టించుకునే వారు కాదట. అలాంటి సందర్భాల్లో ఒక్కడే రూమ్‌లో కూర్చొని ఏడ్చేసేవాడినని జోర్డాన్ చెబుతారు. అయితే నిరాదరణకు గురైన జోర్డాన్ ప్రతిభ అసలైన సమయంలో మాత్రం వికసించింది.
 
స్టీవెన్ స్పీల్‌బర్గ్

యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ఫిల్మ్ స్కూల్‌లో చేరాలని తీవ్రంగా ప్రయత్నించాడు స్పీల్‌బర్గ్. అయితే వర్సిటీ వాళ్లు స్టీవెన్‌కు అంత టాలెంట్ లేదని తేల్చేశారు. సినిమాల్లోకి రాకముందు రెండు సార్లు స్పీల్‌బర్గ్ దరఖాస్తును వారు తిరస్కరించారట. అలా ఫిల్మ్‌స్కూల్ లో స్థానం సంపాదించలేకపోయినా స్పీల్‌బర్గ్ హాలీవుడ్ ఆవిష్కరించిన అద్భుతాల గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు!
 
లియోనల్ మెస్సీ
ఇప్పుడంటే మెస్సీకి ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సాకర్ ప్లేయర్ ఆట తీరుకు ముగ్ధులవుతున్నారు. అయితే టీనేజ్‌లో మెస్సీని ఫుట్‌బాల్ ప్లేయర్‌గా గుర్తించిన వారెవరూ లేరు. ఆటపై అమితమైన ప్రేమ, ప్రావీణ్యత కలిగి ఉన్నా.. మెస్సీ టీమ్‌లలో చోటు సంపాదించలేకపోయాడు. అప్పటికి బక్కగా, రివటలా ఉన్న మెస్సీని గేలి చేస్తూ అతడిది సాకర్‌కు పనికొచ్చే పర్సనాలిటీ కాదని అందరూ తేల్చేశారట. అయితేనేం ఆ తర్వాత మెస్సీ అంతర్జాతీయ స్థాయిలో అద్భుత మైన ప్లేయర్ అనే పేరే తెచ్చుకున్నాడు.

మరిన్ని వార్తలు