మిస్టర్‌ డూప్లికేట్‌

11 Aug, 2019 09:50 IST|Sakshi

క్రైం స్టోరీ

ఎదురింట్లోకి కొత్తగా ఎవరో వచ్చారని తెలిసి వారితో పరిచయం చేసుకోవాలని వెళ్ళింది మృదుల, భర్త సలీమ్‌ ఆఫీసుకు వెళ్ళిపోయాక. తలుపు తెరిచిన వ్యక్తిని చూసి ఉలిక్కిపడింది. తన భర్త సలీమ్‌! ‘‘మీరు...ఇక్కడ...!?’’ అంది తెల్లబోతూ. 
నొసలు చిట్లించి, ‘‘మీరు...?’’ ప్రశ్నార్థకంగా చూశాడతను. అవాక్కయిందామె. అప్పుడే అక్కడకు వచ్చిన ఇంటి ఓనర్‌ తంగవేలు మృదులను పలుకరించాడు. ‘ఈ తమాషా చూస్తివా, మృదులమ్మా? ఇతనుదా అచ్చు నీ పురుషన్‌ మాదిరి ఉండాడుకదూ?‘ అన్నాడు నవ్వుతూ. ‘‘ఇతనుదా గణేష్‌. బేచ్లర్‌. కాల్‌ సెంటర్లో పనిచేస్తుండు. నమ్మ వీటికి పుదుసా బాడుగకు వచ్చిండు’’
గణేష్‌ వంక పరిశీలనగా చూసింది మృదుల... తన భర్త వయసే ఉంటుందతనికి. ఒడ్డూ, పొడవూ, రంగూ–సలీమ్‌కు ట్విన్‌ బ్రదర్‌లా ఉన్నాడు. కాకుంటే సలీమ్‌ ది గంభీర వదనమైతే, గణేష్‌ పెదవులు నవ్వుతూంటాయి. 

మృదుల ఇంటికి తిరిగివచ్చిందేకాని మనసంతా ఆలోచనలే... మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని ఆలకించింది. అంతగా అచ్చు గుద్దినట్లుంటారని ఊహించలేదు. ముస్లిమ్‌ అయిన సలీమ్‌కి, జంధ్యం వేసుకున్న గణేష్‌కీ పోలికలు ఎలా వచ్చాయా అని అబ్బురపడింది... మృదులకు ఇరవయ్యేళ్ళుంటాయి. అందం, ఆకర్షణ ఆమె సొత్తులు. డిగ్రీ చదువుతూండగా తనకంటె దాదాపు ఐదేళ్ళు పెద్దవాడైన సలీమ్‌తో పరిచయమైందామెకు. అది ప్రేమగా మారింది. హ్యాండ్సమ్‌గా ఉండే సలీమ్‌ అప్పటికే ఓ ఫార్మాస్యుటికల్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. మతాలు వేరు కావడంతో పెద్దలతో పెద్ద గొడవే అయింది. లేచిపోయి వచ్చి రిజిస్టర్డ్‌ మేరేజ్‌ చేసుకున్నారు. అది జరిగి ఏడాది అవుతుంది. సలీమ్‌ భార్యను అపురూపంగా చూసుకుంటాడు... అచ్చు తన పోలికలో ఉండే గణేష్‌ అనే వ్యక్తి ఎదురింట్లో దిగాడని ఆలకించిన సలీమ్‌ అమితాశ్చర్యం చెందాడు. అతన్ని చూడాలనిపించింది. కాని, నెల్లాళ్ళైనా వారు కలుసుకోవడం జరుగలేదు. అందుక్కారణం– కాల్‌ సెంటర్లో పనిచేసే గణేష్‌ది నైట్‌ డ్యూటీ కావడమే. సాయంత్రం ఐదు గంటలకు ఇల్లు విడిస్తే మర్నాటి ఉదయం పది తరువాత గాని తిరిగిరాడు. అప్పటికి సలీమ్‌ ఆఫీసుకు వెళ్ళిపోతాడు. ‘‘ఎందుౖMðనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు. నేననుకుని అతన్ని కౌగలించుకున్నావంటే నా కొంప కొల్లేరౌతుంది’’ అంటూ టీజ్‌ చేసిన సలీమ్‌ను, చిరుకోపంతో ‘యూ...నాటీ!’ అంటూ ఛాతీ మీద పిడికిళ్ళతో కొట్టి, ‘‘నాకు ఆమాత్రం ఆనవాలు తెలుసులెండి... మీది మధ్య పాపిడైతే, అతనిది పక్క పాపిడి. టిపికల్‌ అయ్యర్‌ అతను’’ అంది. 

పగలంతా ఇంటి వద్దనే ఉంటాడేమో, గణేష్‌కు మృదులతో పరిచయం పెరిగింది. ‘భాభీ’ అని పిలుస్తాడు ఆమెను. ఏ అవసరం వచ్చినా ఆమె ఇంటికే వెళ్తాడు. అది చూసిన ఇరుగు పొరుగులు ఒక్కోసారి అతన్ని సలీమ్‌గా పొరబడడం కద్దు... సలీమ్, గణేష్‌లు రూపంలో ఒకేలా ఉన్నా, మనస్తత్వాలు భిన్నంగా కనిపిస్తాయి. సలీమ్‌ ముభావంగా ఉంటే, గణేష్‌ కలుపుగోరు మనిషి. అంతే కాదు – సలీమ్‌ది పురచేయి వాటమైతే, గణేష్‌ అందుకు వ్యతిరేకం. 
గణేష్‌ పక్కింట్లో ఉంటున్న టీనేజ్డ్‌ పాప గజలక్ష్మికి అతని పట్ల ఆకర్షణ కలిగింది. ‘గజం’ పేరులోనే కాని దేహంలో లేనందున సన్నగా ఉంటుంది. ఇంటర్మీడియట్‌ చదువుతోంది. తెలియని పాఠాలు చెప్పించుకునే వంకతో తరచు గణేష్‌ దగ్గరకు వెళ్తుంది. 

ఆ రోజు సాయంత్రం బ్రీఫ్‌ కేసుతో ఆటో దిగిన సలీమ్, ఇంటి ముందు జనాన్ని చూసి కంగారుగా లోపలికి వెళ్ళాడు... మృదుల చచ్చిపోయింది. కాదు, ఎవరో చంపేశారు! బెడ్‌ రూమ్‌లో డబుల్‌ కాట్‌ మీద వెల్లకిలా పడుంది శవం. కడుపులో కత్తి దిగబడి ఉంది. బెడ్‌ మీద పరచిన లైట్‌ బ్లూ బెడ్‌ షీట్‌ రక్తసిక్తమైంది... వెడల్పుగా తెరచుకుని ఉన్న ఆమె కన్నులలో విభ్రాంతి ద్యోతకమవుతోంది. సలీమ్‌ షాక్‌తో బిగుసుకుపోయాడు. అతని ముఖం మీద నీళ్ళు చల్లారెవరో. భోరున ఏడుస్తూ భార్య శవం మీద వాలిపోయాడు... మెల్లగా అతన్ని లేవదీశాడు క్రైమ్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ శివరామ్‌. దుఃఖిస్తూ ఉన్న సలీమ్‌ను పక్క గదిలోకి తీసుకువెళ్ళి ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు ఇరుగు పొరుగులు. ఆ దంపతుల అన్యోన్యత గురించి ఎరిగిన వారందరికీ దుఃఖం ఆగడం లేదు.
ఇన్‌స్పెక్టర్‌ తన విధులను చకచకా నిర్వర్తించుకుపోతున్నాడు. గదిలో సెంటు వాసన గుప్పుమంటోంది. శవం దుస్తులనూ, బెడ్‌ నీ వాసన చూశాడు. సువాసన వాటి నుంచి రావడం లేదు. నేల మీద పరీక్షించాడు. అక్కడక్కడ ఫెయింట్‌గా నీటి మరకలవంటివి కనిపించాయి. అవి సెంటు మరకలు కావచ్చనిపించింది. గదిలో ఎవరో సెంటు చల్లినట్టు అర్థమైపోయింది... శవాన్నీ, గదినీ వివిధ కోణాల నుంచి ఫొటోలు తీయించాడు. హత్యా ప్రదేశం వీడియో తీయబడింది. శవం కడుపులోంచి చేతిరుమాలుతో కత్తిని బైటకు తీసాడు ఇన్‌స్పెక్టర్‌. శవ పంచాయతీ జరిపించి, శవాన్ని ఆంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించాడు పోస్ట్‌ మార్టెమ్‌ కోసమని. నిపుణులు వేలిముద్రలు సేకరిస్తూంటే, తాను క్లూస్‌ కోసం వెదకనారంభించాడు. బెడ్‌ కింద ‘పాన్‌ పరాగ్‌’ ఖాళీ పొట్లం కనిపిస్తే, దాన్ని తీసుకుని జేబులో వేసుకున్నాడు. సలీమ్, పెంటమ్మల వేలిముద్రలు తీసుకునేసరికి పోలీస్‌ డాగ్‌ వచ్చింది... గదంతా కలయదిరిగి వాసన చూసింది స్నిఫ్ఫర్‌ డాగ్‌. సెంట్‌ స్మెల్‌ వల్ల కాబోలు ఇతర వాసనలను పసిగట్టలేకపోతోంది అది. నిస్సహాయంగా నిలుచుండిపోయింది. 

సలీమ్‌ ఉన్న గదిలోకి వెళ్ళాడు ఇన్‌స్పెక్టర్‌. కన్నీళ్ళు ఆగకుండా సలీమ్‌ చెక్కిళ్ళను తడిపేస్తున్నాయి... ఇన్‌స్పెక్టర్‌ చెబుతున్న వివరాలను నిస్తేజంగా వింటూ ఉండిపోయాడు... ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో మృదుల ఎండలో ఆరవేసిన బట్టల్ని తీసుకుంటూంటే పక్కింటావిడ చూసి పలుకరించింది. మృదులను ఎవరైనా చూడడం అదే ఆఖరుసారి. సాయంత్రం ఐదు గంటలకు ఆ కాలనీలో పనిచేసే పెంటమ్మ మృదుల ఇంటికి వెళ్ళింది. తన కొడుక్కు ఒంట్లో బావుండనందున, మందులు కొనడానికి మృదులను డబ్బులు ఆడగాలనుకుంది. వీధి తలుపు దగ్గరగా మూసి ఉంది. పిలిస్తే జవాబు లేకపోవడంతో, చనువుగా లోపలకు వెళ్ళింది. మృదుల వంటింట్లో కనిపించకపోతే, పడగ్గదిలోకి తొంగిచూసింది. బెడ్‌ మీద రక్తపుమడుగులో పడి ఉన్న మృదులను చూసి, భయంతో కేకలు పెడుతూ బైటకు పరుగెత్తింది. ఇరుగు పొరుగులు పరుగెత్తుకు వచ్చి, మృదుల పరిస్థితి చూసి పోలీసులకు ఫోన్‌ చేసారు. పోలీసులతో వచ్చిన డాక్టర్, ఆమె చనిపోయినట్టు నిర్ధారించాడు. రిగర్‌ మార్టిస్‌ను బట్టి ఆమె మరణించి మూడు గంటలు కావచ్చునన్నాడు. 

‘‘ఈ స్థితిలో మిమ్మల్ని ఇబ్బందిపెట్టక తప్పడంలేదు. విధి నిర్వహణ!’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌ శివరామ్‌. ‘‘మీకు గాని, మీ భార్యకు గాని శత్రువు లెవరైనా ఉన్నారేమో చెప్పగలరా?’’
లేరన్నాడు సలీమ్‌. అంతలోనే ఏదో జ్ఞప్తికి వచ్చినట్టు, ‘‘ఇది ఆ కాఫిర్‌ పనే అయిఉంటుందనిపిస్తోందిప్పుడు’’ అన్నాడు పళ్ళు కొరుకుతూ. అలా అంటూంటే అతని ముఖంలో కండరాలు బిగుసుకున్నాయి. ‘‘అదే నిజమైతే... ఐ విల్‌ కిల్‌ దట్‌ బాస్టర్డ్‌!’’ ... ఇన్‌స్పెక్టర్‌ భృకుటి ముడివడింది– ‘ఎవరతను?‘   

‘‘మా బాబాయి కరీముద్దిన్‌’’ జవాబిచ్చాడు సలీమ్‌. పెద్దల్ని కాదని తాను మృదులను పెళ్ళాడినందుకు జరిగిన గొడవలో, ‘‘మావాణ్ణి మాకు కాకుండా చేశావ్‌. నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను!’’ అంటూ అతను మృదులను బెదిరించినట్లు చెప్పాడు... కరీమ్‌ అడ్రెస్సూ, వివరాలూ నోట్‌ చేసుకున్నాడు ఇన్‌స్పెక్టర్‌... సలీమ్‌ దాంపత్య జీవితం గురించి ప్రశ్నించాడు. తమకు ఒకరంటే మరొకరికి ప్రాణమని చెప్పాడు సలీమ్‌. పర్సనల్‌ వర్క్‌ మీద రెండు రోజుల క్రితం తాను విశాఖపట్నం వెళ్ళినట్టూ, ఆ రోజు సాయంత్రం ఈస్ట్‌ కోస్ట్‌లో తిరిగివచ్చినట్టూ చెప్పాడు. అంతలోనే ఆ ఘోరం జరిగిపోయిందంటూ ముఖం చేతుల్లో కప్పుకుని భోరుమన్నాడు. జాలి వేసింది ఇన్‌స్పెక్టర్‌కు. హత్యకు ఉపయోగించిన కత్తి, తాము పళ్ళు కోసుకునేందుకు ఉపయోగించేదేనని చెప్పాడు సలీమ్‌. పాన్‌ పరాగ్‌ నమలడం తామిద్దరికీ అలవాటు లేదన్నాడు. 
‘‘బెడ్‌ రూమ్‌లో సెంట్‌ వాసన ఘుమఘుమలాడిపోతోంది. మీరు ఏ సెంట్‌ వాడతారేమిటీ?’’ అనడిగాడు ఇన్సె్పక్టర్‌. ‘‘నాకు సెంటంటేనే ఎలర్జీ. నేను కాని, నా భార్య కాని సెంటు వాడం’’ అన్నాడు సలీమ్‌. 

అతని స్టేట్మెంట్‌ రికార్డ్‌ చేసుకున్నాక, పెంటమ్మను ప్రశ్నించాడు ఇన్‌స్పెక్టర్‌. భయపడుతూనే తన వంతు కథనం చెప్పిందామె. ‘‘మృదులను ఎందుకు చంపావ్‌?’’ అంటూ దబాయించాడు ఆమెను. ‘‘నేను ఏ పాపమూ ఎరగను. మృదులమ్మ శానా మంచి మనిషి. ఆయమ్మను చంపినోడు పురుగులు పట్టి పోతాడు. పిల్లలున్నదాన్ని, నన్ను అన్నేయంగా ఇందులో ఇరికించొద్దు దొరా!’’ అంటూ ఏడుస్తూ అతని కాళ్ళ మీద పడిపోయిందామె. ‘‘నిజంగానే నువ్వు నిర్దోషివైతే నీకేమీ భయం లేదు, పైకి లే’’ అన్నాడు. ఆమె దగ్గర స్టేట్మెంట్‌ తీసుకుని పంపేశాడు. 

ఇరుగు పొరుగులను ప్రశ్నిస్తే మృదుల మంచితనం గురించీ, ఆ దంపతుల అన్యోన్య దాంపత్యం గురించే చెప్పారంతా. అడపాదడపా ఒకరిద్దరు స్నేహితులు తప్పించి బంధువులెవరూ ఆ ఇంటికి వచ్చేవారు కాదని చెప్పారు... సలీమ్‌ పోలికలో ఉండే గణేష్‌ గురించి ఆలకించి విస్తుపోయాడు ఇన్‌స్పెక్టర్‌. అతను మృదులతో స్నేహంగా ఉండేవాడనీ, ఆ ఇంటికి వస్తూండేవాడనీ తెలుసుకున్నాడు... అతని గురించి సలీమ్‌ను ప్రశ్నిస్తే, గణేష్‌ గురించి భార్య ద్వారా ఆలకించడమే కాని అతన్ని ఎప్పుడూ చూడడం జరగలేదని చెప్పాడు. 
గణేష్‌ ఇంటికి తాళం వేసి ఉండడంతో అతన్ని కలుసుకోవాలన్న ఇన్‌స్పెక్టర్‌ ప్రయత్నం ఫలించలేదు. మర్నాడు అతను డ్యూటీ నుంచి రాగానే క్రై మ్‌ బ్రాంచ్‌ కి వచ్చి తనను కలుసుకోవలసిందిగా తంగవేలు దగ్గర మెసేజ్‌ వదిలాడు. 

పోస్ట్‌ మార్టమ్‌ పూర్తికాగానే మృదుల శవం భర్తకు అప్పగించబడింది. ఆమె మరణ వార్త అందిందో లేదో కాని – అటు మృదుల తరపువారు కాని, ఇటు సలీమ్‌ వైపు వారు కాని ఎవరూ రాలేదు. కాలనీ వాసులు, స్నేహితుల సాయంతో భార్య కర్మకాండ జరిపించేశాడు సలీమ్‌. సలీమ్‌ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాడు ఇన్‌స్పెక్టర్‌. సలీమ్‌కు తండ్రి లేడు. బాబాయి కరీముద్దీనే అతని తల్లినీ, చెల్లినీ చూసుకుంటున్నాడు. నెల క్రితం స్కూటర్‌ యాక్సిడెంట్లో కాలు విరగ్గొట్టుకుని పుత్తూరు కట్టుతో మంచం ఎక్కాడతను. ఇన్‌స్పెక్టర్‌ చెప్పేంతవరకు మృదుల హత్యావార్త వారికి తెలిసినట్లు లేదు. తెలిసి మిక్కిలి బాధపడ్డారు. కరీముద్దీన్‌ను ప్రశ్నించిన ఇన్‌స్పెక్టర్‌కు సలీమ్‌ అనుమానంలో అర్థం లేదనిపించింది. ఏడాది క్రితం తాను కోపంలో మృదులను చంపుతానన్నమాట నిజమే అయినా, తాను అంతటి దుర్మార్గుణ్ణి కానన్న అతని పలుకుల పైన విశ్వాసం కలిగింది. అతని వేలిముద్రలు తీసుకుని అక్కణ్ణించి మృదుల పుట్టింటికి వెళ్ళాడు. న్యూస్‌ పేపర్‌ ద్వారా కూతురి హత్యావార్త అప్పటికే తెలుసుకున్నారు వాళ్ళు. ఆమె మరణం వారిని బాధించినట్లు లేదు. ‘‘మా పరువు గంగలో కలిపింది. ఆనాడే దానికి తిలోదకాలు వదిలేశాం మేము’’ అన్నాడు మృదుల తండ్రి కోపంగా. ఆమె పోయాక కూడా అతనలా మాట్లాడం శివరామ్‌కి బాధనిపించింది... కొన్ని ప్రశ్నలు వేసి, అతని వేలిముద్రలు తీసుకుని వచ్చేశాడు. 

రెండు రోజులైనా గణేష్‌ తన దగ్గరకు రాలేదన్న సంగతి గుర్తుకొచ్చింది ఇన్‌స్పెక్టర్‌కి. ఆ కాలనీకి వెళ్ళాడు... తంగవేలు ఎదురొచ్చి, ‘‘గణేష్‌ పయ్యన్‌ దా రెండు నాళ్ళుగా ఇంటికే వర్లే, సామీ!’’ అన్నాడు. ‘‘పక్కవీటి పొణ్ణు సెబుతూండును, వాండుదా మొన్ననే ట్రావెల్‌ బ్యాగ్‌తో ఆటోలో పూడ్చిండట’’...
గజలక్ష్మి గణేష్‌తో చనువుగా ఉండేదని తెలుసుకుని, ఆమెను కలుసుకున్నాడు ఇన్‌స్పెక్టర్‌. ఆమె కథనం ప్రకారం – గణేష్‌ మృదులతో చనువుగా ఉండేవాడు. సలీమ్‌ ఇంట్లో లేనప్పుడు ఆ ఇంటికి వెళ్ళి వస్తూండేవాడు. మృదుల హత్య జరిగిన రోజు మధ్యాహ్నం అతను సలీమ్‌ ఇంటినుంచి రావడం చూసింది తాను. కొంతసేపటికి అతను డ్రెస్‌ మార్చుకుని ట్రావెల్‌ బ్యాగ్‌తో ఆటోలో వెళ్ళిపోవడం కనిపించింది. 

‘‘ఆ రోజు మృదుల ఇంట్లోంచి బైటకు వచ్చినప్పుడు గణేష్‌ ఎలా ఉన్నాడు? అతని ముఖంలో కంగారు కాని, భయం కాని కనిపించిందా?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌. లేదందామె. 
గణేష్‌ గురించి ఆ పిల్ల చెప్పిన మరిన్ని విషయాలు ఇన్‌స్పెక్టర్‌ అనుమానానికి దారితీశాయి... గణేష్‌కు పాన్‌పరాగ్‌ తినే అలవాటుంది. కాని, అతను సెంటు వాడగా ఎప్పుడూ చూళ్ళేదామె. ఓ సారి ఆమె వెళ్ళేసరికి నిక్కర్‌తో ఉన్నాడతను. అప్పుడు చూసిందాపిల్ల, అతని ఎడమ మోకాలి వెనుక భాగంలో ఉన్న బఠాణీ గింజంత నల్లటి పుట్టుమచ్చ. అతనిది కుడిచేతి వాటం. అక్షరాలు పట్టి పట్టి రాస్తాడనీ, చిన్న పిల్లల దస్తూరీలా ఉంటుందనీ చెప్పి నవ్వింది. అతను తనకు పాఠాలు చెబుతూ తన నోట్‌ బుక్‌లో రాసిన మేటర్‌ కూడా చూపించింది... ఆ నోట్‌ బుక్‌ను ఇన్‌స్పెక్టర్‌ స్వాధీనం చేసుకున్నాడు. గజలక్ష్మి సహకారానికి ఆమెను అభినందించి, వంద రూపాయల నోటొకటి ఆమె చేతిలో పెట్టాడు ఇన్‌స్పెక్టర్‌ గాజులు కొనుక్కోమని చెప్పి... అక్కడ నుండి సలీమ్‌ ఇంటికి వెళ్ళాడు. సలీమ్‌ ఇంట్లోనే ఉన్నాడు. 

సలీమ్‌ చెప్పిన సమాచారం ఇన్‌స్పెక్టర్ని చకితుణ్ణి చేసింది... ఆ కాలనీ వాచ్‌మేన్‌ నర్సిమ్ములు రెండు బంగారు గాజులు మార్వాడీ కొట్లో అమ్మబోతే పోలీసులు పట్టుకున్నారు. రెండు తగిలించేసరికి, తాను వాటిని మృదుల శవం నుంచి దొంగిలించినట్లు ఒప్పుకున్నాడట. పోలీసులు వచ్చి ఆ విషయం చెప్పేవరకు భార్య చేతి గాజుల్లో రెండు మిస్సయినట్టు దుఃఖంలో ఉన్న సలీమ్‌ గమనించలేదు. ఆ కొత్త మలుపు ఇన్‌స్పెక్టర్‌ ఆలోచనలకు ఇంధనం అయింది. వెంటనే లోకల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళి లాకప్‌లో ఉన్న నర్సిమ్ముల్ని కలుసుకున్నాడు. నలభై ఏళ్ళుంటాయి వాడికి. నల్లగా, సన్నగా, పొడుగ్గా ఉంటాడు. ఆ కాలనీలో ఐదేళ్ళుగా నైట్‌ వాచ్‌ మేన్‌గా పనిచేస్తున్నాడు. తాగుబోతన్న విషయం వాడి కళ్ళూ, ముఖమే చెబుతున్నాయి... మృదుల హత్య జరిగిన రోజున తాగుడుకు డబ్బులు దొరక్కపోవడంతో ఎవరినైనా అడగాలని కాలనీకి వచ్చాడు నర్సిమ్ములు. ఒకరిద్దరిని అడిగితే తిట్టి పొమ్మన్నారు. అప్పుడప్పుడు అతని చేత చిన్నా చితకా పనులు చేయించుకుని డబ్బులు ఇస్తూండేది మృదుల. ఆమెను అడగాలని వెళ్ళాడు. ఆ సమయంలో ఇంట్లోంచి బయటకు వచ్చిన వ్యక్తిని చూసి సలీమ్‌ అనుకుని దాక్కున్నాడు. కాని, అతను తిన్నగా ఎదురింట్లోకి వెళ్ళడంతో గణేష్‌ అని గ్రహించాడు... పిలుపుకు లోపలి నుంచి జవాబు రాకపోవడంతో చొరవగా తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు నర్సిమ్ములు. బెడ్‌ రూమ్‌లో చచ్చిపడున్న మృదులను చూడగానే గుండె ఝల్లుమంది. అంతలోనే వాడి దృష్టి ఆమె చేతి గాజుల పైన పడింది. హడావిడిగా వాటిని తీసుకోబోతే రెండే వచ్చాయి. ఎక్కువసేపు అక్కడ ఉండడానికి భయం వేసి వాటితో పారిపోయాడు. వాటిని వెంటనే అమ్మడానికి ధైర్యం చాల్లేదు. రెండు రోజులపాటు ఊరుకుని మూడో రోజున అమ్మబోయి పోలీసులకు పట్టుబడ్డాడు... అంతకు మించి తాను ఏ పాపమూ ఎరుగననీ, మృదులను తాను చంపలేదనీ అంటూ, ఇన్‌స్పెక్టర్‌ పాదాల మీద పడి ఏడుస్తూ...పెళ్ళాం పిల్లల మీద ఒట్లు కూడా వేశాడు నర్సిమ్ములు.  

గణేష్‌ జాడ లేదు. మృదుల హత్యకు సంబంధించిన రిపోర్ట్స్‌ అన్నీ వచ్చాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించాడు ఇన్‌స్పెక్టర్‌ శివరామ్‌... పోస్ట్‌ మార్టమ్‌ రిపోర్ట్‌ ప్రకారం మృదుల హత్య మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. గజలక్ష్మి, నర్సిమ్ములూ మృదుల ఇంటి నుంచి గణేష్‌ బైటకు రావడం చూసినట్లు చెబుతూన్న టైమ్‌కు అది దాదాపు సరిపోతోంది. టైమింగూ, వేలిముద్రల రిపోర్టులూ, గణేష్‌ అదృశ్యమూ వంటి సర్కమ్‌స్టన్షియల్‌ ఎవిడెన్సూ ఆ హత్య చేసింది గణేషేనని తెలుపుతున్నాయి. కాని మోటివ్‌ మాత్రం ఊహకు అందకుండా ఉంది. 
మృదులతో గణేష్‌కు మంచి పరిచయం ఉంది. తరచు ఆమె ఇంటికి వెళ్ళివస్తూంటాడు. సలీమ్‌ పోలికను కలిగి ఉండటం మరో ఎడ్వాంటేజ్‌. మృదుల అందగత్తె. ఆమె పైన కన్నేసి ఉంటాడు. అతని ఓవర్‌ చ్యూర్స్‌ని ఆమె ప్రతిఘటించి ఉంటుంది. భర్తకు ఫిర్యాదు చేస్తానని బెదిరించి వుంటుంది. తనకు చిక్కలేదన్న కోపంతోనో, తన విషయం బైటపెడుతుందన్న భయంతోనో ఆమెను చంపడానికి నిశ్చయించుకుని ఉంటాడు... ఆ రోజు మధ్యాహ్నం ఆమె రెస్ట్‌ తీసుకుంటూన్న సమయంలో లోపల ప్రవేశించి ఉంటాడు. సరాసరి బెడ్‌ రూమ్‌ లోకి రావడంతో భర్త అనుకుని ఉండొచ్చునామె. హఠాత్తుగా అక్కడే ఉన్న పళ్ళు కోసుకునే కత్తిని తీసి అతడు తనను పొడవబోవడం ఆమెకు విభ్రాంతి కలిగించి ఉంటుంది.

ఆ సంగతి ఆమె కన్నుల్లో, వదనంలో వ్యక్తమవుతోంది.. పాన్‌ పరాగ్‌ తినే అలవాటు సలీమ్‌ దంపతులకు లేదు. గణేష్‌కు ఉంది. హత్య చేశాక టెన్షన్‌ రిలీజ్‌ చేసుకోవడానికి పాన్‌ పరాగ్‌ తిని ఖాళీ పొట్లం గదిలో పడేసుంటాడు. గదిలో సెంట్‌ చిలకరించి ఖాళీ బాటిల్‌ను తనతో తీసుకుపోయాడు. అది అతని గదిలో దొరికింది. పోలీసులను తప్పుదారి పట్టించడానికే దాన్ని ఉపయోగించాడని తెలుస్తోంది. హత్యా ప్రదేశంలో తీసిన ఫోటోలను, వీడియోనీ మళ్ళీ పరిశీలించాడు మాధవ్‌. మృదుల అందగత్తె అనడంలో సందేహం లేదు. ఆమె కోసం సలీమ్‌ తన కుటుంబాన్ని వదులుకోవడంలో వింత లేదనిపించింది... వెడల్పైన శవం కన్నులు విభ్రాంతిని ద్యోతకం చేస్తున్నాయి. ఆమె ప్రతిఘటించిన సూచనలు కూడా లేవు. అంటే హంతకుడు ఆమెకు తెలిసినవాడేననీ, అతని చర్య ఆమెకు విభ్రాంతి కలిగించిందనీ స్పష్టమవుతోంది. హత్యకు ముందు గణేష్‌ ఆమెను అనుభవించి ఉంటాడనుకుంటే, అటువంటిదేమీ లేదని అటాప్సీ రిపోర్ట్‌లో తేలింది... ఆ హత్యకు మోటివ్‌ ఏమిటి? లస్టా? జెలసీయా? లేక, పగా??... ఒకవేళ గణేష్‌ను పట్టుకుని హత్యానేరం పైన అతన్ని న్యాయస్థానంలో నిలబెట్టినా, ‘మోటివ్‌’ను రుజువు చేయలేకపోతే కేసు నిలవదు. 

హఠాత్తుగా గుర్తుకొచ్చింది ఇన్సె్పక్టర్‌కి – హత్య జరిగినప్పుడు హంతకుడి దుస్తుల పైన రక్తం చింది ఉండాలనీ, ఆ గుడ్డలు గణేష్‌ ఇంట్లో కూడా దొరకలేదనీను!... ఆ రోజు మధ్యాహ్నం మృదుల ఇంటికి వెళ్ళొచ్చాక గణేష్‌ దుస్తులు మార్చుకున్నాడని గజలక్ష్మి చెప్పింది. అంతకుముందు ధరించిన దుస్తుల పైన రక్తపు మరకలేవీ చూసిన గుర్తు లేదంది... గణేష్‌ను పట్టుకుంటే కాని ఆ కేసు ఓ కొలిక్కి రాదనిపించింది. తన మనుషులు ఆ పనిమీదే ఉన్నారు... ఫింగర్‌ ప్రింట్స్‌ రిపోర్ట్స్‌ను స్టడీ చేస్తూంటే హఠాత్తుగా ఇన్‌స్సెక్టర్‌ మెదడులో మెరుపు మెరిసింది. నివ్వెరపాటుతో దాని వంకే చూస్తూ ఉండిపోయాడు. అదే సమయంలో ఎస్సై వచ్చి శాల్యూట్‌ చేసాడు. గణేష్‌ ఆచూకీ ఇంకా దొరకలేదు. కాని, అతను తెలుసుకున్న కొత్త సమాచారాన్ని కుతూహలంతో వింటూండిపోయాడు శివరామ్‌. ఎస్సై వెళ్ళిపోయాక ఏవేవో ఫోన్‌ కాల్స్‌ చేశాడు. ఆ తరువాత మరోసారి రిపోర్ట్స్‌ను తిరగేస్తూ చాలాసేపు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు... క్రమంగా ఆ మర్డర్‌ మిస్టరీ సూర్యకాంతి సోకిన పొగమంచులా విడిపోనారంభించింది... 

పోలీస్‌ జీప్‌ చూసి పరుగెత్తుకొచ్చాడు తంగవేలు. ‘‘వణక్కం, సారూ!’’ అంటూ ఇన్‌స్పెక్టర్‌ శివరామ్‌ని విష్‌ చేశాడు. ‘‘ఆ గణేష్‌ వాండు దొరికిండా? పొరికి పయ్యన్‌ నా ఇంట్లో చేరి నా టెనెంట్‌నే కొల్ల పణ్ణిటు పూడ్చిండు. నాకుదా దొరకాలి వాండు, ఏం చేస్తునో చూడు’’ అన్నాడు కోపంగా పళ్ళు కొరుకుతూ. ఇరుగు పొరుగులు కూడా అక్కడకు వచ్చి చేరారు కుతూహలంతో. జీప్‌ శబ్దం ఆలకించి కాబోలు సలీమ్‌ తలుపు తెరచుకుని బైటకు వచ్చాడు. లుంగీలో ఉన్నాడు. 
సలీమ్‌ వెనుకే లోపలికి నడుస్తూన్న ఇన్‌స్పెక్టర్‌ ట్రిప్పయి ముందుకు తూలి అతని మీద పడ్డాడు. చేతికందిన లుంగీ పట్టుకుని క్రింద పడకుండా ఆపుకున్నాడు. ఆ ప్రాసెస్‌ లో లుంగీ ఊడిపోయి అండర్‌ వేర్‌ తో నిలిచాడు సలీమ్‌. ఇన్‌స్పెక్టర్‌ చూపులు క్షణంలో సగంలో సలీమ్‌ కాళ్ళ పైన పడ్డాయి. ‘బలిష్ఠమైన తొడలు!’ అనుకోకుండా ఉండలేకపోయాడు. ‘సారీ’ చెప్పి లుంగీ అందించాడు. సలీమ్‌ కూడా ఎంబరాసింగ్‌ గా ‘సారీ!’ అంటూ గబగబా లుంగీ చుట్టబెట్టుకున్నాడు. ఇన్‌స్పెక్టర్‌కు ఆసనం చూపించి, ‘గణేష్‌ దొరికాడా, సార్‌?’ అనడిగాడు. ‘ఎస్‌’ అన్నాడు కూర్చుంటూ. ‘ఎక్కడా?’ ఆత్రుతగా అడిగాడు సలీమ్‌.   ‘ఇక్కడే!’
అతను జనంలో వెదుకుతూంటే, ‘యు ఆర్‌ అండర్‌ అరెస్ట్, మిస్టర్‌ సలీమ్‌ ఉరఫ్‌ గణేష్‌!’ అన్నాడు ఇన్సె్పక్టర్‌. 
సలీమ్‌ ఉలిక్కిపడితే... తంగవేలు తదితరులు తెల్లబోయి చూశారు. 
‘ఏమిటి మీరంటున్నది?’ కోపంగా అడిగాడు సలీమ్‌. ‘‘నీ భార్య మృదులను హత్య చేసినందుకు నిన్ను అరెస్ట్‌ చేస్తున్నాను’’ జవాబిచ్చాడు ఇన్‌స్పెక్టర్‌.
‘‘నాన్సెన్స్‌! ప్రేమించి పెళ్ళాడిన భార్యను నేను చంపుకోవడమేమిటి?’’ తీక్షణంగా అన్నాడు సలీమ్‌. ‘‘అందుకు మీ దగ్గరున్న సాక్ష్యాలేమిటి?’’
‘‘ప్లెంటీ’’.. అన్నాడు ఇన్స్‌పెక్టర్‌. 
పాలిపోయిన వదనంతో సలీమూ... ఆశ్చర్యమూ, అయోమయమూ కమ్ముకున్న ముఖాలతో తంగవేలు తదితరులూ చెవులు రిక్కించి ఆలకిస్తూంటే ఆ కేసు యొక్క పూర్వాపరాలను వివరించాడు ఇన్‌స్పెక్టర్‌.

మృదుల అందం చూసి సలీమ్‌ ఆమెను ప్రేమించి పెళ్ళాడిన మాట వాస్తవమే అయినా, ఫాస్ట్‌ మనీ మీద మోజు కలగడంతో అతని బుద్ధి వక్రమార్గం పట్టింది. ఆర్నెల్ల క్రితం మృదుల పేరిట కోటి రూపాయలకు జీవిత బీమా చేశాడు అతను. కొన్నాళ్ళ తరువాత ఆమెను చంపి ఇన్సూరెన్సు సొమ్ముతో చేసుకుని దుబాయ్‌ వెళ్ళిపోవాలనుకున్నాడు. భార్య హత్యను గూర్చి అనుమానం తనపైకి రాకుండా తెలివిగా ప్లాన్‌ చేసాడు. గణేష్‌ అన్న పేరుతో తన డూప్లికేట్‌లా ఓ నకిలీ మనిషిని సృష్టించి ఎదురింట్లో దిగాడు. ఆకారంలో, స్వభావంలో, చివరకు మతంలో కూడా మార్పులు చేసుకుని తామిద్దరూ నిజంగానే వేర్వేరు వ్యక్తులన్న నమ్మకం కలిగించాడు... సలీమ్‌లా పగలు ఆఫీసుకని బయలుదేరి వెళ్ళి, నైట్‌ డ్యూటీ గణేష్‌ తిరిగి వచ్చినట్టు ఎదురింటికి వెళ్ళేవాడు. పగలు ఆఫీసుకు వెళ్ళొచ్చి రాత్రికి ఇంటికి చేరుకునే సలీమ్‌నూ, నైట్‌ డ్యూటీ చేసి వచ్చి పగలంతా ఇంట్లోనే ఉండే గణేష్‌నూ చూసి ఇద్దరూ వేర్వేరు వ్యక్తులేనని నమ్మారంతా. సలీమ్, గణేష్‌లిద్దరూ ముఖాముఖీ కలుసుకోకపోవడానికి కారణం కూడా అదే. అయితే సలీమ్‌ ఆ నెల్లాళ్ళూ ఆఫీసుకు సెలవు పెట్టాడన్న విషయం ఎవరికీ తెలియదు. రొటీన్‌గా అతని కాండక్ట్‌ గురించి ఎంక్వయిరీ చేయడానికి అతని ఆఫీసుకు వెళ్తే ఈ సంగతులు తెలిసివచ్చాయి. దాంతో అనుమానం వచ్చి లోతుగా ఆరా తీసేసరికి ఇన్సూ్యరెన్స్‌ విషయమూ, ఆ సొమ్ము కోసం మృదుల నామినీగా అతను

అప్పుడే క్లెయిమ్‌ సబ్మిట్‌ చేయడమూ, దుబాయ్‌ వెళ్ళడానికి వీసా కోసం అప్లయ్‌ చేసిన సంగతీ బైటపడ్డాయి...
‘‘అంతా అబద్ధం! హంతకుణ్ణి పట్టుకోలేక నన్నిందులో ఇరికించాలని చూస్తున్నారు మీరు...’’ అరిచాడు సలీమ్‌. 
‘‘షటప్‌!’’ గర్జించాడు ఇన్సె్పక్టర్‌. ‘‘ఆ రోజు మధ్యాహ్నం నువ్వు గణేష్‌లా వచ్చి నీ భార్యను కత్తితో పొడిచి చంపేశావు. తనతో స్నేహంగా ఉండే గణేష్‌ అకారణంగా తనను పొడుస్తూంటే షాక్‌కు గురయిందామె. ఆ సంగతి ఆమె కన్నులూ, వదనమూ స్పష్టం చేస్తున్నాయి. పోలీసుల్ని తప్పుదారి పట్టించడానికి గణేష్‌ గా వాడే పాన్‌ పరాగ్‌ పొట్లాన్ని హత్యా ప్రదేశంలో పడేశావు. ఆ తరువాత గణేష్‌ను మాయం చేశావు. అనుమానం గణేష్‌పైకి నెట్టడమే నీ ఉద్దేశం. లేని గణేష్‌ కోసం వెదుకుతూ పోలీసులు నిన్ను అనుమానించరనుకున్నావు... గణేషూ, నువ్వూ ఒకరే ననడానికి నిదర్శనం– గణేష్‌ ఇంట్లో దొరికిన వేలిముద్రలు నీ వేలిముద్రలతో టాలీ కావడమే...’’

తంగవేలు తదితరులు అవాక్కై వింటూ ఉండిపోయారు. ‘‘అడె పావీ! తంగమాన పొణ్ణు – మృదులమ్మను చంపడానికి నీకుదా చేతులెలా వచ్చినయ్‌ డా!?’’ అన్నాడు తంగవేలు ఆవేశంగా. 
‘‘అంతా కుట్ర! నాకేం తెలియదు...’’ బుకాయిస్తూ లేవబోయాడు సలీమ్‌. ఇన్‌స్పెక్టర్‌ చేత్తో వెనక్కి తోయడంతో మళ్ళీ కుర్చీలో కూలబడ్డాడు. ‘‘నేరస్థుడు ఎంత తెలివిగా నేరం చేసినా ఏదో ఒక పొరపాటు చేయకమానడు, సలీమ్‌! అందుక్కారణం – నేరం చేసేప్పుడు అతని మనసు స్థిమితంగా ఉండకపోవడమే!’’ ఇన్సె్పక్టర్‌ అన్నాడు. ‘‘నీది పురచేతి వాటమైనా, గణేష్‌ గా కుడిచేతి వాటంలా చలామణీ అయ్యావు. ఆ సంగతి మరచిపోయి అలవాటు ప్రకారం మృదులను ఎడం చేత్తో పొడిచావు. అందుకే హత్యాయుధం పైన ఎడం చేతి వేలిముద్రలున్నాయి. అవి నీ వేలిముద్రలతో సరిపోయాయి...’’ 

సలీమ్‌ ఉలికిపడ్డాడు.  ‘‘నువ్వు చేసిన మరో పొరపాటు ఏమిటో తెలుసా?’’ మళ్ళీ అన్నాడు ఇన్సె్పక్టర్‌. ‘‘ఆ రోజు విశాఖపట్టణం నుంచి సాయంత్రం ఈస్ట్‌ కోస్ట్‌లో వచ్చానన్నావు. ఆ ట్రెయిన్‌ ఆ రోజు రైట్‌ టైమ్‌కు వచ్చిందో లేదో చెక్‌ చేసుకోకపోవడమే నీ పొరపాటు. ఆ రోజున పొలిటికల్‌ పార్టీ ఒకటి ఏలూరులో రైల్‌ రోకో నిర్వహించింది. అప్పటికే రెండు గంటలు లేట్‌ రన్నింగ్‌ లో ఉన్న ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ ప్రెస్, ఆ నిరసన కార్యక్రమం మూలంగా మరో రెండు గంటలు ఆలస్యమైంది. సికిందరాబాద్‌ కు రాత్రి పది గంటలకు చేరుకుంది. కాని నువ్వు ఏడు గంటలకే ఇంటికి చేరుకున్నావు... సో, నువ్వసలు విశాఖపట్టణమే వెళ్ళలేదనీ, సిటీలోనే ఉన్నావనీ తేలిపోయింది’’...
సలీమ్‌ ముఖం పాలిపోయింది. ఇన్‌స్పెక్టర్‌ మందహాసం చేసాడు. ‘‘అంతే కాదు, మేన్‌! ఇంతకుముందు తూలిపడినట్టు నటించి నీ లుంగీ లాగేశాను, ఎందుకో తెలుసా? నీ ఎడమ మోకాలి వెనుకనున్న పుట్టుమచ్చను చూడ్డానికి! గణేష్‌కు అదే చోటులో గజలక్ష్మి చూసిన పుట్టుమచ్చా, ఆమె నోట్‌ బుక్‌లో వున్న నీ కుడిచేతి దస్తూరీ కూడా గణేష్‌ ఎవరూ లేరనీ, ఆ నకిలీ మనిషి నువ్వేననీ రుజువు చేస్తాయి...’’ 

‘‘ఓరి దుర్మార్గుడా! నీలాంటివాడే మరొకడున్నాడంటూ ఇన్నాళ్ళూ మమ్మల్నందర్నీ ఫూల్‌ చేసిందే కాక, నిక్షేపంలాంటి పిల్లను అన్యాయంగా పొట్టను పెట్టుకున్నావు కదరా!’’ అంటూ ఆవేశంతో అతన్ని కొట్టడానికి వచ్చారు అక్కడ చేరినవారంతా. ఇన్‌స్పెక్టర్‌ వారిని వారించి సలీమ్‌ చేతులకు సంకెళ్ళు తగిలించాడు. 
‘‘కొసమెరుపేమిటంటే... ఇన్సూ్యరెన్స్‌ పాలిసి రిస్క్‌ కవరేజ్‌ నుంచి మర్డర్‌ ఎలిమెంట్‌ను తొలగించిన విషయం నీకు తెలియకపోవడమే!’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌. ‘‘తెలిసుంటే.. బహుశా మృదుల ప్రాణాలతో ఉండేదేమో!’’ కుర్చీలో కుప్పలా కూలిపోయాడు సలీమ్‌...
- తిరుమలశ్రీ 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా