నామాల స్వామి నడయాడిన దివ్యమార్గం

7 Oct, 2018 01:08 IST|Sakshi

శ్రీవారి మెట్టు మార్గం... శ్రీపద్మావతీ దేవి, వేంకటేశ్వరస్వామి నడయాడిన దివ్యమార్గంగా ప్రసిద్ధి చెందింది. తిరుమల క్షేత్రానికి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చని చెట్లతో, పక్షుల కిలకిలారవాలతో ప్రతిధ్వనిస్తూ వింత సోయగాలతో మైమరపించే ప్రకృతి రమణీయత ఉట్టిపడే దివ్యధామంగా విరాజిల్లుతుంది ఈ మార్గం. జగత్కల్యాణ మూర్తులైన శ్రీపద్మావతీ, శ్రీనివాసులు చెట్ట్టపట్టాలేసుకుని నడిచిన ఈ శ్రీవారిమెట్టు మార్గం గుండా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ అడుగడుగు దండాలసామిని స్మరిస్తూ గోవింద నామ స్మరణతో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వెళ్తుంటారు. అయితే ఈ ప్రాంతం కొన్ని దశాబ్దాల క్రితం స్వర్ణముఖి, కల్యాణి నదుల ఉద్ధృతమైన వరదల తాకిడికి గురైంది. ఈ వరదల వల్ల ఇతర గ్రామాలతోపాటు శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరాలయం కూడా శిథిలమైంది. అప్పటి నుంచి భక్తుల రాకపోకలు సన్నగిల్లాయి. కానీ చంద్రగిరి, మంగాపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మాత్రం శ్రీవారి మెట్టు మార్గం ద్వారానే తిరుమలకు వెళ్లి భక్తులకు అవసరమైన కూరగాయలు, పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటిని అమ్ముకునేవారు. 

రమణాచారి సంకల్పంతో...
సాక్షాత్తు తిరుమలేశుడు నడయాడిన ఈ దివ్యమార్గాన్ని పునరుద్ధరించేందుకు నాటి టీటీడీ ఈవో కేవీ రమణాచారి సంకల్పించారు. ఆయన పట్టుదలతో సడలని దీక్షతో శ్రీవారి మెట్టు మార్గం పునరుద్ధరింపబడింది. రాళ్లురప్పలతో కూడి దుర్గమంగా తయారైన ఈ మార్గాన్ని రూ.6 కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దారు. గ్రానైటు రాళ్లతో 2,388 మెట్లను ఎండ తగలకుండా, వానకు తడవకుండా ఆ మెట్లపై చక్కని షెడ్లను నిర్మించారు. దారి వెంబడి నడిచే భక్తుల కోసం మంచినీరు, విద్యుత్తు, పారిశుద్ధ్యం, భద్రత వంటి విస్తృత సౌకర్యాలతో శ్రీవారి మెట్టు మార్గాన్ని పునర్నిర్మించారు. రూ.38 లక్షలతో మొదటి మెట్టు వద్ద శ్రీవారి పాదాల మండపం ఆలయాన్ని ప్రతిష్ఠించారు. సౌకర్యాలు పెరగడంతో శ్రీవారి మెట్టు నుంచి స్వామి దర్శనానికి వెళ్లే వారి సంఖ్య పెరిగింది. మామూలు రోజుల్లో రోజుకు 5 నుంచి 10 వేల మంది భక్తులు వెళితే, పండుగలు, సెలవులు, ఉత్సవాల సమయాల్లో 20 వేల వరకు వెళ్తుంటారు. తిరుపతి ‘శ్రీనివాసం’ నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సు సౌకర్యం కూడా టీటీడీ ఏర్పాటు చేసింది.  

మరిన్ని వార్తలు