నా ముద్దుల శాలీ

28 Jul, 2019 09:30 IST|Sakshi

కథా ప్రపంచం

మేము ‘కోర్ఫూ’ దీవికి వచ్చిన్పటి నుంచి చూస్తున్నాను ఈ దీవి అంతా ఎక్కడబడితే అక్కడ గాడిదలే దర్శనమిస్తున్నాయి. మొదట్లో నేను వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ కాథరీనా పెళ్లికి వెళ్లినప్పుడు అతిథుల్లా వచ్చిన గాడిదలు ‘బంధుమిత్ర సపరివారంగా’... అంటే తమ రోజుల పిల్లలతో సహా గుంపులు గుంపులుగా విచ్చేశాయి. ఆ గాడిద పిల్లలు ముద్దు ముద్దుగా తిరుగుతుంటే భలే ముచ్చటేసింది. అవి నడిచే తీరూ నన్నెంతగా ఆకర్షించాయంటే ఎలాగైనా నాకంటూ ఒక గాడిదపిల్ల కావాలనింపించేంతగా, అందుకేనేమో ‘గాడిదపిల్ల కోమలం’ అని అంటారు. ఆ పెళ్లి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఏదేమైనా నేనొక గాడిదను పెంచుకోవాలనే నిర్ణయానికొచ్చేశాను.

మరి అమ్మను ఒప్పించడమెలా? అని ఆలోచించి, చిన్నగా అమ్మ దగ్గరకు వెళ్లి చెప్పడం మొదలుపెట్టాను. ‘‘అమ్మా! నేను ఈ దీవంతా తిరగడానికి, నా సామానులు మోసుకు రావడానికి, నా అవసరాలకు ఒక గాడిద ఎంతో అవసరం’’ అంటూ వివరించసాగాను. అయితే అమ్మ ఒక పట్టాన ఒప్పుకోకపోయేసరికి ‘‘పోనీ నువ్వు నాకిచ్చే క్రిస్మస్‌ కానుక అదే ఎందుకు కాకూడదూ’’ అంటూ దీర్ఘంతీశాను. దానికి అమ్మ సమాధానంగా తను ఎందుకు వద్దంటుందో దానికి కారణాలు చెప్పింది.

‘‘అబ్బో! అది చాలా ఖరీదు. పైగా ఇప్పటికిప్పుడు చిన్నపిల్లలు ఎక్కడ దొరుకుతారు చెప్పు!’’ అంటూ మాట దాటేసే ప్రయత్నం చేసింది. అయితే, నేను వదిలితేనా... ‘‘అమ్మా! మరి నా పుట్టినరోజుకు కూడా వేరే ఏమీ కొనక్కర్లేదు. క్రిస్మస్‌కి, పుట్టినరోజుకు కలిపి ఒక్క గాడిదపిల్ల చాలు’’ అంటూ బేరం పెట్టాను. పైగా పుట్టినరోజున నాకొచ్చే కానుకలన్నింటినీ ఓ గాడిదపిల్ల కోసం పణం పెట్టేశాను. మా అమ్మ చాలా గట్టిది. ఒక పట్టాన కరిగితేగా... నా వాదనలన్నీ విన్నాక ‘‘చూద్దాంలే!’’ అనేసింది. మా అమ్మ ఆ మాట అన్నదంటే కొంప మునిగిపోయినట్లే! ఇక దాన్ని మరచిపోవచ్చు. ఎందుకంటే గతంలో అలాంటి చేదు అనుభవాలు కోకొల్లలు. ఎందుకైనా మంచిదని నా పుట్టినరోజు దగ్గరపడుతుందనగా నా వాదనలు, అభ్యర్థనలు మళ్లీ మా అమ్మకు వెళ్లబోసుకున్నాను. అయినా మా అమ్మ అదే సమాధానమిచ్చింది ‘‘చూద్దాంలే!’’ అని. ఇక నా గాడిదపిల్ల వ్యవహారంపై ఆశలు వదిలేసుకున్నాను.

ఒకరోజు ఉదయాన్నే కోస్టాస్, అదే మా పనమ్మాయి తమ్ముడు భుజం మీద పెద్ద వెదురు బొంగులు మోసుకుంటూ మా తోట వెనకాల ఉన్న ఆలివ్‌చెట్ల తోపుల వైపు వెడుతూ కనిపించాడు. నేను కూడా పోయి చూస్తునుకదా! చక్కగా, హుషారుగా ఈల వేసుకుంటూ నేలలో గుంతలు తీసి వెదురు బొంగులను నిలువుగా ఒక చతురస్రాకారంలో పాతేస్తున్నాడు. నేను కంచె సందుల గుండా గమనిస్తూనే ఉన్నాను ఈ తతంగమంతా. అయితే వాడెందుకా పని చేస్తున్నాడన్న విషయం అంతుపట్టలేదు! అందుకని నా కుక్క రోజర్‌ని తీసుకొని అటువైపు వెళ్లాను.

‘‘ఎందుకు కడుతున్నావు దీన్ని?’’ అన్న నా ప్రశ్నకు, ‘‘మీ అమ్మగారి కోసం ఒక ఇల్లు కడుతున్నా!’’ అంటూ సమాధానం వచ్చింది. కోస్టాస్‌ నుంచి ఆ మాట వింటూనే నాకు ఆశ్చర్యం వేసింది ‘‘మా అమ్మకీ ఇల్లు ఎందుకబ్బా?’’ మా అమ్మేం చేసుకుంటుంది? కొంపదీసి ఇల్లు వదిలేసి ఇక్కడకొచ్చి పడుకుంటుందా?’’ అని. నాకెందుకో నమ్మశక్యంగా అనిపించడం లేదు. అదే మాట వాడినడిగాను ‘‘మా అమ్మకెందుకూ ఈ గుడిసె..’’ అంటూ, వాడు అనుమానంగా నాకేసి తేరిపార చూస్తూ ‘‘ఎవరికి తెలుసు! బహుశా మొక్కలు వేస్తారో, చలికాలంలో బంగాళదుంపలు దాస్తారేమో..?’’ అంటూ భుజాలెగరేశాడు. వాడి సమాధానం నాకు రుచించలేదు! కొద్దిసేపు వాడినే చూస్తూ కూర్చునేటప్పటికి విసుగనిపించి నా రోజర్‌ని తీసుకుని వెళ్లిపోయాను.

మర్నాటికల్లా ఆ వెదురింటికి ఒక ఆకారాన్ని తెచ్చాడు కోస్టాస్‌. ఆ రోజంతా ఆ వెదురుగడల మధ్య రెల్లుగడ్డితో పేనుతూ మంచి దిట్టమైన గోడలు, పైకప్పు పూర్తి చేశాడు. ఆ తర్వాతి రోజుకల్లా చక్కటి ‘రాబిన్‌ క్రూసో’ పొదరిల్లులా తయారయ్యిందా వెదురిల్లు. ఇక ఉండబట్టలేక మా అమ్మనే అడిగేస్తే పోలా అనుకుంటూ నేరుగా వెళ్లి అడిగేశా. ‘‘ముందుముందు దేనికైనా పనికొస్తుందని వేయిస్తున్నా’’ అంటూ ఇంకాస్త అనుమానం కలిగేట్లు గుంభనంగా సమాధానమిచ్చింది మా అమ్మ. 
రేపు నా పుట్టినరోజనగా ఇంట్లో అందరూ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. లారీ ఏ కారణం చేతనో ‘టాంటివీ’, ‘తాలిహో’ అంటూ వేటాడేటప్పుడు ఉపయోగించే పదాలను అరుస్తూ బయటకు వెళ్లాడు.

ఇక మార్గో సంగతికొస్తే తన చంకల కింద ఏవో కట్టలు పట్టుకొస్తూ హాల్లో నాకెదురు పడింది. బహుశ క్రిస్మస్‌కి మిగిలిపోయిన రంగు కాయితాలనుకుంటా. నేనామోను ఆశ్చర్యంగా చూస్తేంటే... నన్ను చూడగానే ఆమె కీచుమంటూ అరిచి తను దాస్తున్నదేదో నేను చూసేశానన్నట్లు తన పడకగదిలోకి పరుగెత్తింది. 
ఇంకా లెస్లీ, స్పైరోలకూ ఏదో అయ్యింది. తోటలో వాళ్లిద్దరూ ఏదో విషయం మీద తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ‘వెనక సీట్లో’... అంటూ స్పైరో కోపంగా, 
‘‘దేవుడిమీదొట్టు! నేనంతకు ముందే చేసేశాను మాస్టర్‌ లెస్లీ!’’ అంటూ సమాధానమిస్తున్నాడు. అయినా ఇంకా అనుమానంతోనే లెస్లీ వాడిని మెచ్చుకుంటూ ‘‘సరే! నువ్వా భరోసా ఇస్తే మంచిదే స్పైరో మనకేం మెప్పుదలలూ, మెచ్చుకోళ్లూ అవసరం లేదు’’ అంటూ.. నన్నక్కడ చూడగానే లెస్లీ పెద్దగా ‘‘మేమిక్కడ మాట్లాడుకుంటుంటే నీకిక్కడేం పనిరా?’’ అంటూ కేకలేశాడు. నాకైతే వాడలా అంటుంటే అవమానంగా అనిపించి దగ్గర్లో ఉన్న కొండ మీదకు పోయి దూకుదామనిపించింది. చూడబోతే ఇంట్లో వాళ్లెవ్వరికీ నేనంటే ఇష్టం లేదు లాగుంది.

నాతో ఒక్కరూ సరిగా ఉండట్లేదు. ఇక నేనిక్కడ ఉండకూడదు... అనుకుంటూ రోజర్‌ని తీసుకుని ఆలివ్‌ తోపులోకి పోయి ఆకుపచ్చని తొండలను వేటాడుతూ గడిపేశాను ఆ రోజంతా.
మరి ఇక ఆ రాత్రేమైందంటే!.. నేను నా గదిలో లైటార్పేసి వెచ్చగా పక్కమీదికి చేరానో లేదో.. ఆలివ్‌తోపు నుంచి బొంగురు గొంతులతో పాటలూ.. పెద్దపెద్దగా నవ్వులూ వినిపించసాగాయి. అప్పుడు లెస్లీ, లారీ గొంతులతో కలిసి స్పైరో కూడా పాడుతున్నాడని అర్థమైంది. అప్పుడే వరండాలో అమ్మ, మార్గోల గుసగుసలు వినిపించాయి.
లారీ వేసిన జోక్‌కి మిగిలిన వాళ్లిద్దరూ పగలబడి నవ్వుతూ అమ్మను, మార్గోనూ చూడగానే భయంతో టక్కున ఆపేసినట్లున్నారు. ‘‘నిశ్శబ్దంగా ఉండండి’’ అంటూ అమ్మ ‘‘గేరీని నిద్ర లేపుతారేంట్రా!.. ఏం తాగొచ్చారు?’’ అంటూ అడిగింది.

‘‘వైన్, ద్రాక్షరసం...’’ అన్నాడు లారీ హుందాగా. ‘‘అవును వ్వై.. న్నే!’’ అంటూ లెస్లీ తర్వాత మేము డాన్స్‌ చేస్తుంటే స్పైరో చేశాడు. ఆ తర్వాత నేను... మళ్లీ లారీ.. డాన్స్‌ చేస్తుంటే ఆ తర్వాత స్పైరో చేస్తుంటే.. లారీ చేశాడు... మళ్లీ నేనూ డాన్స్‌ చేశాను... అంటూ తాగినవాడు మాట్లాడినట్లు ముద్దముద్దగా మాట్లాడుతూ పేలడం మొదలుపెట్టాడు.
‘‘మీరు వెళ్లి నిద్రపోవడం మంచిది’’ అని అమ్మ అంటున్నా సరే ‘‘ఇంకా తర్వాత స్పైరో డాన్స్‌ చేశాడు.. మళ్లీ లారీ డాన్స్‌ చేశాడు...’’ అంటూ లెస్లీ వదరుతూనే ఉన్నాడు. ‘‘సరే నాన్నా! వెళ్లి పడుకోరా బాబూ..!’’ అంటూ అమ్మ లెస్లీని బతిమాలుతూనే స్పైరోతో అంటోంది.. స్పైరో! నువ్వు వాళ్లను ఎక్కువగా తాగన్వికుండా చూడాల్సింది’’ అంటూ..
‘‘స్పైరో... డాన్స్‌ చేశాడూ..’’ అంటూ తన రూమ్‌కి వెళుతున్నాడు కాబోలు... లెస్లీ మాట అస్పష్టంగా వినబడుతోంది. ‘‘అమ్మా! నేను వాడిని పడుకోబెడతాను... నువ్వు కంగారుపడకు. ఆ పార్టీలో నేనేమీ తాగలేదు’’ అంటూ లారీ సంజాయిషీ ఇస్తున్నా తాగినట్లు తెలుస్తోంది. కాకపోతే.. లెస్లీలా కాకుండా హుందాగా ఉండటం లారీ లక్షణం.

బయట లారీ, లెస్లీ తూలుతూ, ఒకళ్ల భుజాల మీద ఒకళ్లు చేతులేసుకుని తడబడుతూ నడుస్తున్న శబ్దం నాకు వినబడుతోంది.
‘‘నేన్నీతో.. డాన్స్‌.. చేస్తున్నాను’’ అంటూ లెస్లీ రాగం తీస్తుంటే, వాడ్ని లారీ ఈడ్చుకెళ్లి అతని పడగ్గదిలో పడుకోబెట్టినట్లున్నాడు. కాసేపటికి ఏమీ వినబడలేదు.
‘‘సారీ మిసెస్‌ డ్యూరెల్‌!’’ అంటూ స్పైరో గొంతు ముద్దగా వినబడుతోంది. ‘‘వాళ్లని నేనాపలేకపోయాను.’’ 
‘‘ఇంతకూ అది దొరికిందా?’’ అంటూ మార్గో అడుగుతోంది. ‘‘ఆ! మిస్సె మార్గో! మీరేం విచారించకండి. అది కోస్టాస్‌తో ఉంది’’ అంటూ జవాబిచ్చాడు స్పైరో. అలా చెప్తూ స్పైరో వెళ్లినట్లున్నాడు. అమ్మా మార్గో కూడా పడుకోవడానికి వెళ్లడం నాకు వినబడుతోంది. నాకైతే ఆ రోజంతా గందరగోళంగా గడిచినట్లనిపించింది. మా వాళ్లందరికీ ఏమైందీ రోజు.. రేపు నా పుట్టినరోజు కానుకలేమిస్తారో అనుకుంటూ.. వాళ్లు తిక్కతిక్కగా ప్రవర్తించడాన్ని తలుచుకుంటూ.. అది మరచిపోవాలనుకుంటూ.. నిద్రలోకి జారుకున్నా.

మర్నాడు నిద్రలేచినా అలానే పక్క మీదనే పడుకొని ‘‘ఈరోజు ప్రత్యేకతేంటా?’’ అని ఆలోచిస్తుంటే.. అప్పుడు గుర్తొచ్చింది... ఆ రోజే నా పుట్టినరోజని. ఇక ఆ రోజంతా మా వాళ్లు ఇచ్చే బహుమతుల గురించి, నాకేమేం కావాలో అని అడుగుతారని జ్ఞాపకం వచ్చేసరికి ఒక్కసారిగా ఉత్సాహం వచ్చేసింది. ఇక పడక మీద నుంచి లేచి కిందకుపోయి నాకేమైనా బహుమతులు వచ్చాయేమోనని చూద్దామనుకుంటుండే సరికి హాల్లో ఏదో హడావుడిగా, గోలగోలగా ఉన్నట్లుంది.
‘‘దాని తలను పట్టుకోండీ! దాని తలను పట్టుకోండీ!’’ అంటూ లెస్లీ హుషారుగా అనడం వినిపించింది.
‘‘ఏయ్‌! చూడు దాన్ని ఎంత బాగా అలంకరించానో! దాన్నంతా పాడు చేస్తున్నావ్‌’’ అంటూ మార్గో బాధగా అరుస్తోంది.
‘‘దాని అలంకరణ సంగతి మర్చిపో’’ అంటూ లెస్లీ మళ్లీ ‘‘దాని తలను పట్టుకో’’ అన్నాడు. ‘‘రేయ్‌ పిల్లలూ! పోట్లాడుకోకండిరా’’ అని సర్ది చెప్తోంది అమ్మ.
ఇంతలో ‘‘దేవుడా!’’ అంటూ లారీ గావుకేక పెడుతూ ‘‘నేల మీదంతా దీని పేడ పడుతోంది..’’ అంటూ చీదరింపుగా అంటున్నాడు.

ఈ గందరగోళంగా వినబడుతున్న అర్థంపర్థంలేని సంభాషణల మధ్య ప్రత్యేకంగా, వింతగా ‘పిట్‌–పాట్‌‘ అంటూ ఎవరో పింగ్‌పాంగ్‌ బాల్‌ను నేల మీద కొడుతున్నట్లు శబ్దం వినవస్తోంది. వీళ్ల గందరగోళం, ఆ ప్రత్యేకమైన శబ్దం దగ్గరవుతున్నట్లున్నాయి. అప్పుడు నాకనిపించింది. ‘‘ఏమైందిరా నాయనా! మా కుటుంబానికీ రోజు..’’ ఈపాటికి నిద్రజోగుతూ ఉంటూ... ఉదయాన్నే టీ కోసం ఎదురు చూస్తుంటారైతే..’’ అంటూ నేను ఆశ్చర్యపడుతూ లేచి కూర్చున్నానో లేదో ఒక్కసారి ధడేల్న నా గది తలుపులు తెరుచుకున్నాయి. లోపలికి ఓ గాడిదపిల్ల చక్కగా క్రిస్మస్‌ అలంకరణలతో, రంగుకాగితాలతో దాని రెండు పెద్దపెద్ద చెవుల మధ్య లాఘవంగా అమర్చబడిన మూడు పెద్దపెద్ద ఈకలతో అందంగా అలంకరించబడి చూడముచ్చటగా గెంతుతూ.. దుముకుతూ వచ్చి నా మంచం దగ్గర ఆగిపోయింది. ‘‘ఆగవే గాడిదా..! ఆగూ!’’ అంటూ లెస్లీ దాని తోకకు వేలాడుతూ అరుస్తున్నాడు.
‘‘నువ్వు నేను కష్టపడి గంటల తరబడి అలంకరించినదంతా చెడిపేసుకుంటున్నావ్‌!’’ అంటూ మార్గో కీచుగా అరుస్తోంది. ‘‘దీన్ని ఎంత తొందరగా బయటకు తీసుకెళితే అంత మంచిది..’’ అంటూ లారీ ‘‘ఇప్పటికే హాలంతా దీని పేడతో నిండిపోయింది..’’ ఏవగింపుగా అంటున్నాడు.

‘‘మీరు దీన్ని భయపెడుతున్నారు’’ అని మార్గో అంటుంటే లారీ.. ‘‘లేదులేదు నేనేం చెయ్యలేదీన్ని.. కాకపోతే కొంచెం ముందుకు తోశాను’’ అంటూ దీర్ఘంతీశాడు.
అలా దూకుతూ వచ్చిన ఆ గాడిదపిల్ల నా మంచం దగ్గరకొచ్చి ఆగి నా ముఖంలోకి తన పెద్దపెద్ద గోధుమరంగు కళ్లను మరింత విప్పార్చుకొని చూస్తూ ఉండిపోయింది. దాన్ని అలా చూస్తుంటే అది నన్ను చూసి ఆశ్చర్యపోతుందేమో అనిపించింది. దానికి తనకు చేసిన అలంకరణ చికాకు తెప్పించింది కాబోలు... గట్టిగా తన శరీరమంతా విదిలించింది అవన్నీ కింద పడిపోయేంతగా.. అంతేనా! తన తోక పట్టుకుని వేలాడుతూ విసిగిస్తున్నాడే లెస్లీ.. వాణ్ణీ వదిలించుకోవాలనుకుందేమో.. గట్టిగా వాడి మోకాలి మీద తన వెనుక కాలితో ఒక్కతాపు తన్నింది. అంతే! ‘‘దేవుడా! ఇది నాకాలు విరగ్గొట్టింది’’ అంటూ పొలికేక పెట్టి ఒక్క కాలి మీద కుంటడం మొదలుపెట్టాడు వాడు. దానికి అమ్మ ‘‘నాన్నా లెస్లీ! దానికంత అరవక్కర్లేదనుకుంటానే!’’ అంటూ వాణ్ణి సముదాయించింది.

ఏమనుకున్నాడో ఏమో లారీ నాకేసి తిరిగి ‘‘రేయ్‌! ఇక నువ్వు ఆ మంచం దిగిరారా బాబూ! నువ్వెంత త్వరగా దీన్ని బయటకు తీసుకెళ్తే అంత మంచిది. ఇప్పటికే ఇది ఇల్లంతా కంపు చేసింది. ఆ హాలంతా పశువుల పాకలా కంపుతో నిండిపోయిందిరా!’’ అంటూ నన్ను పక్కమీద నుంచి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మార్గో గగ్గోలు పెడుతోంది తను గంటల కొద్దీ శ్రమపడి చేసినదంతా పాడు చేసుకుందంటూ.. నా గదంతా గలభా గలభాగా ఉన్నా.. మా వాళ్లంతా గోలగోలగా ఎవరిపాటికి వారే మాట్లాడుతున్నా నాకు వాళ్ల ధ్యాసే పట్టలేదు. నా దృష్టంతా నా మంచం దగ్గర నిలబడి నన్నే చూస్తూ, చిన్నగా సకిలిస్తున్న నా గాడిదపిల్లపైనే ఉండిపోయింది. నేను చేతులు చాచి బూడిదరంగులో ముద్దొస్తున్న దాని ముఖాన్ని చుట్టేశాను.

దాని స్పర్శకి నా ఒళ్లు పులకరించింది. అదెంత మెత్తగా ఉందంటే పట్టుకాయలంత మృదువుగా, అప్పుడే పుట్టిన కుక్కపిల్లంత మెత్తగా, సముద్రతీరాన ఏరుకొనే గులకరాళ్లంత నున్నగా.. ఇవే కాకుండా పట్టుకుంటే జారిపోయే చెట్లమీది కప్పలూ గుర్తొచ్చాయి. నేనలా దాని స్పర్శానందాన్ని అనుభవిస్తూ పక్కకు చూసేసరికి పాపం! లెస్లీ తన ప్యాంట్‌ పైకి లాక్కొని తన మోకాలిపై లేచిన బొబ్బను చూసుకుంటున్నాడు. అప్పుడు అమ్మ మా దగ్గరగా వచ్చి ‘‘నాన్నా గేరీ! నీకు ఇది నచ్చిందా?’’ అని అడిగింది. నా కళ్లు పైకెత్తి మా అమ్మ మొహంలోకి ఏం మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయాను. బహుశా నా మౌనమే మా అమ్మకు నాకదెంతో నచ్చిందన్న విషయం తెలిపిందనుకుంటా.

ఆ గాడిదపిల్ల మంచి ముదురు గోధుమవర్ణంలో ‘చాక్లెట్‌’, ‘ప్లమ్‌’ రంగులో మంచి ఆకర్షణీయంగా ఉంది. దాని పెద్దపెద్ద చెవులు చూస్తుంటే బాగా విచ్చిన లిల్లీపూలు గుర్తొస్తున్నాయి. మరి దాని బుల్లిబుల్లి గిట్టలేమో డాన్సర్స్‌ బూట్లలా మెరిసిపోతున్నాయి. ఆ గిట్టపై నుంచి మోకాళ్లదాకా తెల్లని సాక్సులు తొడిగినట్లు దాని బొచ్చు, ఇక దాని వీపుపైన చూశారూ.. వెడల్పాటి నల్లని శిలువ ఆకారంలో ఉన్న మచ్చను చూస్తుంటే అది క్రీస్తును మోసుకుంటూ జెరూసెలం వెళ్లిందా అని అనిపించక మానదు. ఇంకా మిలమిలలాడే దాని కళ్ల చుట్టూ తెల్లని వలయాలు అదెక్కడి నుంచి వచ్చిందో ఇట్టే చెప్పేస్తున్నాయి... అదే... ‘గస్టోరి’ గ్రామం నుంచే అని. నేను దాన్నలాగే అపురూపంగా చూస్తుంటే, మార్గో నాకు చెబుతోంది. ‘‘నీకు కాథరీనా గాడిద గుర్తుంది కదరా! ఇది దానిపిల్లే!’’ అంటూ.

ఈ పరిచయం నా గాడిదపిల్లను ఇంకాస్త ప్రత్యేకంగా మార్చేసింది. దాన్నక్కడ చూస్తుంటే అది సర్కస్‌లో నుంచి పారిపోయి వచ్చినట్లు కనబడుతోంది.
దానికి ఆకలేసింది కాబోలు, అది దాని మొహం మీదికి వేలాడుతున్న రంగు కాగితాలను నోట్లో పెట్టుకుని అమాయకంగా నములుతోంది. ఇక నేను ఉండబట్టలేక పక్క మీద నుంచి కిందకు ఒక్క దుముకు దుమికాను. ఇక హడావుడిగా అమ్మనడిగాను దాన్నెక్కడుంచాలని. కచ్చితంగా ఇంట్లో అయితే కుదరదు కాబట్టి. 
దానికి అమ్మ ‘‘అందుకోసమే కదరా కోస్టాస్‌ ఇల్లు కట్టిందీ!’’ అంటూ తేల్చి చెప్పింది నవ్వుకుంటూ. నా ఆనందాన్ని అదుపులో పెట్టుకుంటూ అనుకున్నాను ‘‘మా అమ్మ నాకోసం ఎంత జాగ్రత్త తీసుకుందో! నన్ను సంతోషపెట్టడానికి నా కుటుంబమంతా ఎంత కష్టపడ్డారో కదా! ఎంత మంచి కుటుంబం ఉందో కదా నాకు... పాపం ఈ విషయాన్ని నా దగ్గర దాచి నన్ను ఆశ్చర్యపరచడానికి ఎంత కష్టపడ్డారో కదా! పాపం మార్గో ఎంతో ఇష్టంగా దాన్ని అలంకరించినట్లుంది’’ అనుకుంటుంటే... వాళ్లకి నా మీద ఉన్న ప్రేమకు నాకెంతో సంతోషం కలిగింది. అలా అనుకుంటూ నా గాడిదపిల్ల వంక చూస్తే ఎంతో సున్నితమైన, నాజూకైన చైనా పింగాణీ వస్తువులా తోచింది.

ఇక దాన్ని చాలా నెమ్మదిగా, సుకుమారంగా తీసుకుని ఆలివ్‌తోట వైపు దారితీశాను. నెమ్మదిగా దాన్ని ముచ్చటగా ఉన్న ఆ చిన్ని వెదురింట్లోకి తీసుకెళ్లాను. ఆ వెదురింట్లో నా ముద్దుల గాడిదపిల్ల చాలా అద్భుతంగా అనిపించింది. ఆ కుటీరం దానికంటే కొంచెం పెద్దదిగా ఉంది.
మళ్లీ దాన్ని ఆ కుటీరం నుంచి బయటకు తీసుకొచ్చి కొంచెం పెద్ద తాడుతో స్వేచ్ఛగా తిరగడానికి వీలుగా దాని మెడకు ఏమాత్రం ఒరుసుకోకుండా జాగ్రత్తగా కట్టేశాను. అది నడకరాని దానిలా ఊగుతూ, అటూ ఇటూ తిరుగుతూ, చిన్నగా గడ్డిపరకలు కొరుకుతూ.. నోరాడిస్తుంటే... దాన్నే చూస్తూ ‘‘ఇది కలా! నిజమా!’’ అన్న మీమాంసతో ఉండిపోయాను. దాన్ని తృప్తిగా చూస్తున్న సమయాన మా అమ్మ టిఫిన్‌ తినడానికి రమ్మంటూ కేకేసింది. నా కళ్లకది ఈ కోర్ఫూదీవి మొత్తానికీ అందగత్తెలా కనిపించింది. దాన్ని ‘శాలీ’ అని పిలుచుకుందామనుకున్నా. అయితే, దానికేమీ ప్రత్యేకమైన కారణమేం లేదు. టిఫిన్‌ చెయ్యడానికి ఇంట్లోకి వెళుతూ దాని ముఖాన్ని దగ్గరగా తీసుకుని పట్టులా మెత్తగా ఉన్న దాన్ని ముద్దాడాను.
ఇంగ్లిష్‌ మూలం : గెరాల్డ్‌ డ్యూరెల్‌
అనువాదం: చిలకమర్తి పద్మజ

మరిన్ని వార్తలు