కథ: పల్లె విహారం

22 Jun, 2014 02:50 IST|Sakshi
కథ: పల్లె విహారం

అతణ్ని ఆఫీసులో అందరూ వెస్టీ అని పిలుస్తారు. ఒక చిత్రమైన వ్యక్తిగానూ పరిగణిస్తారు. అతడొక సాధారణమైన ఉద్యోగి. వయసులో పెద్దవాడు. స్వభావంలో మంచివాడు. కాని ఇన్నేళ్ల తన జీవితంలో అతగాడు ఒక్కసారంటే ఒక్కసారి మాత్రమే పారిస్ నగరాన్ని విడిచి బయటికెళ్లాడు. అది జూలై నెల చివరి వారం. ఉద్యోగులంతా ప్రతి ఆదివారం అలవాటుగా పారిస్‌కు దూరంగా ఉన్న పల్లెలవైపు విహారయాత్ర చేస్తారు. పచ్చని పచ్చికలో పొర్లటం, నీట మునిగి తేలి కేరింతలు కొట్టటం చేస్తారు. ఎవరికి వారు ఎంపిక చేసుకున్న పల్లెవైపు మాత్రమే పోతారు. అంటే ప్రతీ పల్లెకూ ఆనవాయితీగా వెళ్లే సందర్శకులంటారు.
 
 పారిస్ ఉద్యోగులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆ దర్శనీయ స్థలాల అందాలూ ఆకర్షణలూ వారి దైనందిన సంభాషణల్లో, వాగ్వివాదాల్లో చోటుచేసుకుంటాయి. పెద్దాయన వెస్టీ మాత్రం ఎప్పుడూ ఇలా అనేవాడు: ‘‘మూర్ఖుల్లారా! మీరంతా గొర్రెల మందల్లాగా పల్లెలవైపు పోతారు గానీ, ఆ పల్లెలు అందరాని అద్భుతమైనవని నాకనిపించదు. మీదంతా ఒక వెర్రి...’’బొయ్‌విన్ నాతోనే ఒకే గదిలో పనిచేసేవాడు. కొలంబస్ అనే పల్లెలో ఆ వెధవకొక కొంప ఉండేది. ఒక్క ఆదివారమైనా నన్ను అక్కడికి రమ్మని
 తెగ పోరుతూ ఉండేవాడు.
 
 ‘‘అయితే వెస్టీ నువ్వెప్పుడన్నా అసలు పారిస్ విడిచి బయటకు వెళ్లావా? లేదా?’’ అని మేం అడిగాం.
 ‘‘నేను బస్సుల్లో మాత్రమే బయటికెళ్తాను. గ్రౌండ్ ఫ్లోర్లోని సారా వ్యాపారి దుకాణంలో సుష్టుగా భోంచేసి బస్సు రూట్లూ వేళలతో సైతం పారిస్ మ్యాప్‌ని ఒకదాన్ని తయారుచేసుకుంటాను. అప్పుడు నేను బస్సు పెట్టెలో పైకి ఎక్కి గొడుగు వేసుకొని కూర్చుంటాను. ఎన్నో దృశ్యాల్ని చూస్తాను. మీ అందరూ చూసినవాటి కన్నా నేనెక్కువ భిన్నమైన స్థలాల్ని సందర్శిస్తాను.
 
  నా ప్రయాణం ప్రపంచాన్నే చుట్టివచ్చినంత ఆహ్లాదంగా ఉంటుంది. ఒక వీధిలో నివసించే జనాలు వేరొక వీధివాసుల్లాగా ఉండరు. పారిస్ నగరం నాకు తెలిసినంతగా వేరెవరికీ తెలీదు. అలా అలా సాగుతుండగా మొదటి అంతస్తు కిటికీ దృశ్యాలు ఎంతో వినోదాన్ని కలిగిస్తాయి. ఓ చోట బిగ్గరగా అరుస్తున్న వ్యక్తి ముఖాన్ని చూసి అతని ఇంటి పరిస్థితుల్ని చిత్రించుకోవచ్చు. మరోచోట ఒక కస్టమర్ ముక్కుకు సబ్బు నురగతో ప్లాస్టర్ చేసి వీధివైపు దృష్టి సారిస్తున్న బార్బల్ని చూసి మీరూ నవ్వుకోవచ్చు. ఇంకోచోట బట్టల దుకాణంలోని అందమైన అమ్మాయిల కొంటెచూపుల్ని సరదాగా తిప్పికొట్టవచ్చు. ఇలాంటి ఆనంద దాయకమైన సంఘటనల్ని కోకొల్లలుగా చూడగలరు. అంతేకాదు, వాస్తవ జీవితాన్ని చిత్రించే నిజమైన నాటకం లాగా నా ప్రయాణం కొనసాగుతుంది. నా బస్సు ప్రయాణపు అందాల్నీ ఆనందాల్నీ సుదూరపు పల్లెటూర్లలో మీ తెలివితక్కువ తిరుగుళ్లతో పోగొట్టుకోలేను’’ అనేవాడు వెస్టీ.
 ‘‘అయినా సరే వెస్టీ! ఒక్కసారి ప్రయత్నించకూడదూ. ఒకే ఒక్కసారి పల్లెల వైపు వచ్చి చూడు. ఎంత ఆహ్లాదంగా ఉంటుందో నీకే తెలుస్తుంది’’ అని మేం అనేవాళ్లం.
 ‘‘ఇరవై సంవత్సరాల క్రితం ఒకే ఒక్కసారి వెళ్లాను. మళ్లీ వెళ్లి బలైపోవడం నాకు ఇష్టం లేదు’’ అన్నాడు.
 ‘‘ఒక్కసారి వెళ్లావా? చెప్పవేం మరి. అయితే పెద్దోడా! ఆ అనుభవాల్ని మాకు చెప్పు చెప్పు’’ అని మేమంతా అతణ్ని ఒత్తిడి చేశాం.
 ‘‘చెప్తాను. ఆగండి మరి. మీకు బొయ్‌విన్ తెలుసు కదా. అక్షరాల్ని చెమటతో తడిపేసేవాడు. అతగాడు... మనం అతణ్ని రకరకాల పేర్లతో పిలిచేవాళ్లం.’’
 ‘‘అవును. గుర్తున్నారు.’’
 ‘‘బొయ్‌విన్ నాతోనే ఒకే గదిలో పనిచేసేవాడు. కొలంబస్ అనే పల్లెలో ఆ వెధవకొక కొంప ఉండేది. ఒక్క ఆదివారమైనా నన్ను అక్కడికి రమ్మని తెగ పోరుతూ ఉండేవాడు.
 అతడనేవాడు, ‘‘పాంటలూన్ (నన్నతడు సరదాగా పిలిచే మారు పేరు)! నాతో రావయ్యా. ఎంతో ఆహ్లాదకరమైన విహారాన్ని చవి చూపిస్తాను.’’
 ‘‘అంతే. ఒక ఫూల్‌లాగా అతగాడి వలలో పడి ఒక ఆదివారం ఉదయం ఎనిమిది గంటల రైల్లో బయల్దేరాను. దారి కనుక్కోవడం కూడా సాధ్యం కాని ఒక చిన్న పల్లెని చేరుకున్నాను. చిట్టచివరికి ఒక సందు చివర రెండు గోడల మధ్య ఒక పాత కట్టె ద్వారాన్ని కనుగొన్నాను. దానికొక ఇనుప కాలింగ్ బెల్ ఉన్నది.
 ‘‘నేనా బెల్‌ని కొట్టాను. కొంతసేపు వేచివున్న తర్వాత తలుపు తెరుచుకున్నది.
 ‘‘మొదటి చూపులో ఆ తెరిచింది మనిషో మర్కటమో నేను పోల్చుకోలేకపోయాను.
 ‘‘ఆమె ఒక అనాకారి ముసల్ది. వేసుకున్న గుడ్డలు పీలికలుగా ఉన్నాయి. మనిషంతా మురికి పట్టి ఉన్నది. కోపిష్టిలాగానూ ఉన్నది. జుత్తులో పక్షి ఈకలున్నాయి. ఆమె నా కంటికి నన్ను మింగడానికి సిద్ధంగా ఉన్న ముసలి రాక్షసిలా కనపడింది.
 ‘‘ఆమె అడిగింది: ‘నీకేం కావాలి?’
 ‘‘బొయ్‌విన్ కావాలి.
 ‘‘అతడితో నీకేం పని?’’ చిరాకుతో కూడిన ఈ ఎదురుప్రశ్న నన్ను తికమక పెట్టింది.
 ‘‘అప్పుడు నేను మెల్లగా గొణిగాను, ‘బొయ్‌విన్ నాకోసం చూస్తుంటాడు.’
 ‘‘ఓహో లంచ్‌కి వచ్చేవాడివి నువ్వేనా?’’
 జంకుతూ అంగీకరించాను.
 అప్పుడామె ఇంటి లోపలికి తిరిగి అసహనమైన గొంతుతో అన్నది: ‘‘బొయ్‌విన్ నీ అతిథి వచ్చాడు’’ ఈమె నా మిత్రుడి భార్య!
 బొయ్‌విన్ తలుపు దగ్గరకొచ్చాడు. మరకలు పడిన గుడ్డల్తో ఉన్నాడు. తలపైన పాడుబడిన పనామా టోపీ ఉన్నది.
 కరచాలనం చేసి తోట అని పిలవబడే ఆవరణలోనికి తీసుకెళ్లాడు. అది మరీ ఇరుకు దారి చివర్న ఉన్నది. చేతి రుమాలంత చిన్న స్థలంలో ఉంది. దాని చుట్టూ ఎత్తయిన భవనాలు ఉన్నాయి. సూర్యుడు ఒకటి రెండు గంటలు మాత్రమే ఆ తోటలోనికి తొంగి చూడగలడు. పాన్సీలూ, వాల్ పుష్పాలూ, కొద్దిపాటి గులాబీ మొక్కలూ ఉన్నాయి. అవి కూడా చుట్టూ ఉన్న ఇళ్ల పైకప్పులు ప్రతిబింబించే వేడికి వాడిపోయే స్థితిలో ఉన్నాయి.
 ‘మాకు పెద్ద చెట్లయితే లేవు’ బొయ్‌విన్ స్వగతంలాగా అన్నాడు. ‘కాని ఇరుగు పొరుగు ఇళ్లే నీడనిస్తుంటాయి. దాంతో మాకు అడవిలో ఉన్నంత నీడ దొరుకుతుంది.’
 బొయ్‌విన్ నా కోటు చివర పట్టుకుని నా చెవిలో అన్నాడు: ‘నా భార్యని చూశావు కదా. అదో పాచిపళ్ల రాక్షసి. ఇవ్వాళ నువ్వొచ్చావు కదా! నాకు మంచి బట్టలిచ్చింది. అవి మట్టి పడితే తిడుతుంది. కాబట్టి ఈ పూటకి నువ్వే మా పూల మొక్కలకి కాస్త నీరు పోసి పెట్టాలి. ప్లీజ్!’
 అందుకు నేనూ అంగీకరించాను. కోటు తీసి షర్టు చేతుల్ని వెనక్కి మడిచాను. పంపు మాత్రం చాలా చిన్నది. ఎన్నో పురిటి నొప్పుల తర్వాత ఒక చుక్క నీరు కారుస్తున్నది. చిన్న క్యాన్‌ని నింపటానికి పది నిమిషాలు పట్టింది. నేనొక పందిలాగా చెమట పట్టాను. బొయ్‌విన్ నేనే పనులు చెయ్యాలో పురమాయించడం మొదలుపెట్టాడు.
 
 ‘ఇక్కడ... ఈ మొక్క... దీనికి మరికొంచెం... చాలు... ఇప్పుడు దీనికి...’
 నీరు పోసే క్యాన్‌కి ఒక రంధ్రం ఉన్నది. నీరు అదేపనిగా చిమ్మడం మొదలుపెట్టింది. దాంతో పూలమొక్కల కన్నా నా పాదాలు బాగా తడిసిపోయాయి. నా ప్యాంటు పాదాల దగ్గర బాగా తడిచి ముద్దయ్యింది. బురద పట్టుకుపోయింది. నేను పంపు పట్టుకోవడం, ప్యాంటు తడవడం, చెమట పట్టడం ఈ విధానమంతా సుమారు ఒక ఇరవైసార్లు జరిగింది. నేను అలసిపోయి ఆగిపోదామనుకునేసరికి బొయ్‌విన్ నా చెయ్యి పట్టుకొని బతిమాలడం మొదలుపెట్టాడు. ‘మరొక్క క్యాన్... మరొక్కటి మాత్రమే.. చాలు... పూర్తవుతుంది.’
 తన కృతజ్ఞతను తెలుపడానికి నాకొక విచ్చిన గులాబీ ఇచ్చాడు. నేను దాన్ని కోటు గుండీ వద్ద పెట్టుకునేసరికి రెక్కలన్నీ రాలిపోయి ఆకుపచ్చని రాతి వంటి తొడిమ మాత్రమే మిగిలింది. నాకు నోట మాట రాలేదు. నేనేమీ అననూ లేదు.
 దూరం నుండి మేడమ్ బొవిన్ కేక వినపడింది.
 ‘‘ఓయ్! లోపలికి రండి. లంచ్ రెడీ అయింది.’’
 మేం తోట వదిలి ఇంటికి తిరిగి వచ్చాం.
 తోట నీడలో ఉన్నది. అందుకు భిన్నంగా ఇల్లు ఎండలో మండిపోతున్నది. నా మిత్రుడి హాలూ భోజనాల గదీ అగ్ని గోళాల్లాగా ఉన్నాయి. డైనింగ్ టేబులు మీద మూడు ప్లేట్లున్నాయి. వాటిపక్కన సగం శుభ్రం చేసిన తెల్ల మెటల్ ఫోర్కులున్నాయి. టేబుల్ మధ్యలో ఉడికించిన మాంసం, బంగాళా దుంపలూ గల ఒక మట్టిపాత్ర ఉన్నది.
 మేం తినటానికి కూర్చున్నాం.
 ఒక్క చుక్క మాత్రమే వైన్ కలిపిన పెద్ద గాజు పాత్ర నిండా నీరూ నా కంట పడింది.
 బొయ్‌విన్ తికమక పడి భార్యను బతిమాలాడు: ‘మై డియర్! ఈ ఒక్కసారి మాత్రం నీరు కలపని వైన్ తీసుకోనివ్వవా?’
 ఆమె అతని వైపు కోపంగా చూసింది.
 ‘‘అయితే మీరిద్దరూ తాగి తందనాలాడి ఇల్లు న్యూసెన్స్ చేస్తారా? కుదరదు.’’
 బొయ్‌విన్ వెనక్కి తగ్గాడు. ఈసారి మాంసంతో పాటు బంగాళా దుంపల్ని వడ్డించింది.
 భోజనాల రెండో విడత నిశ్శబ్దంగా పూర్తయింది.
 అప్పుడామె ప్రకటించింది. ‘భోజనం ఇంతే ఇక లేవండి.’
 బొయ్‌విన్ భార్య వైపు దిగ్భ్రాంతితో చూశాడు.
 ‘మరి ఆ పావురం... ఈ రోజు ఉదయం నువ్వు పట్టుకున్న పావురం...’
 ఆమె చేతులు జాడిస్తూ నిల్చుంది.
 ‘మీకింకా చాల్లేదా. ఇళ్లు ఖాళీ చెయ్యడానికి జనాల్ని పిల్చుకొస్తుంటావు. అంతా మీకే మేపితే ఈ సాయంత్రం నేనేం తినాలి?’
 మేం లేచాం. బొయ్‌విన్ మెల్లగా నా చెవిలో ఊదాడు: ‘ఒక్క నిమిషంలో నేనూ నీతో వస్తాను. ఇద్దరమూ కలిసి బయటికెళ్దాం.’
 బొయ్‌విన్ తన భార్య వెళ్లిన వంటగది వైపు వెళ్లాడు. ఆ తరువాత ఈ సంభాషణ నా చెవిన పడింది.
 ‘‘డార్లింగ్! నాకో ఇరవై నాణేలు ఇవ్వవూ!’’
 ‘‘వాటితో ఏం చేస్తావు?’’
 ‘‘ఏం అవసరం పడుతుందో చెప్పలేం కదా! డబ్బు చేతిలో లేకపోతే అసహ్యంగా ఉంటుంది.’’
 నాకు వినపడేట్టు ఆమె గొంతు పెంచింది.
 ‘‘మరేం ఫరవాలేదు. నీ దగ్గర డబ్బుండటానికి వీల్లేదు. ఆ వచ్చినవాడికి లంచ్ మేపావు కదా! దానికి మారుగా మిగిలిన నీ రోజు ఖర్చులన్నీ వాడే భరించాలి. అంతే!’’
 బొయ్‌విన్ నా వద్దకు తిరిగి వచ్చాడు.
 ఇక బయల్దేరేటప్పుడు నా సభ్యత తెలపటానికి నా అతిథేయి భార్యకు తలవంచి ఇలా గొణిగాను.
 ‘మీ దయ గల ఆతిథ్యానికి థాంక్స్ మేడమ్.’
 అందుకామె ఇలా జవాబు చెప్పింది. ‘సరే. సరే. వీడికి మాత్రం సారా పట్టించి ఇంటికి తేవద్దు. తెస్తే నేనొప్పుకోను సుమా!’
 మేం బయల్దేరాం.
 అక్కణ్నించి నీడే లేని విశాలమైన బయలు ప్రాంతాన్ని దాటాం. నేను దారి పక్కనున్న కొమ్మనొకదాన్ని పీకడానికి ప్రయత్నించి కెవ్వుమన్నాను. నా చేతికేదో గుచ్చుకుని దురద పుట్టింది. ఆ మొక్కని దురద గొండి అంటారట. ఎటు చూసినా భరించలేని పేడ దుర్గంధం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది.
 బొయ్‌విన్ అంటున్నాడు. ‘కొంచెం భరించు. కొద్దిసేపట్లో మనం నదిని చేరుకుంటాం.’
 నిజానికి నదినైతే చేరుకున్నాం. కాని అక్కడ కూడా బురద, మురికి, కంపు నిండి ఉంది. సూర్యుడి వేడి కిరణాలు నీటిమీద పడుతున్నాయి. నా కళ్లు నొప్పి పెట్టాయి.
 అక్కణ్నించి మరెక్కడికైనా పోదామని బొయ్‌విన్‌ని కోరాను. అతడు నన్నొక కొంప లాంటి చోటుకి తీసుకెళ్లాడు. అక్కడ జనం కిక్కిరిసి ఉన్నారు. అదొక చిన్న పాకలో నడుస్తున్న పానశాల. నది పక్క నివసించే జాలరులు అక్కడికి వస్తుంటారు.
 
 బొయ్‌విన్ అన్నాడు: ‘ఇది చూడ్డానికి బావుండదు గానీ తినే పదార్థాలు బావుంటాయి. నేనూ ఆకలిగా ఉన్నాను. ఒక ఆమ్లెట్ ఆర్డరిచ్చాను’. ఆసరికి బొయ్‌విన్ రెండో రౌండ్ మద్యానికే తలవాల్చేశాడు.
 ఫూల్! అతడి భార్య అతికొద్దిపాటి సారాయితో కడివెడు నీటిని ఎందుకు కలిపిందో నాకిప్పుడు అర్థమైంది.
 బొయ్‌విన్ లేచి బిగ్గరగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అక్కడ ఇద్దరు తాగుబోతులు పోట్లాడుకొంటున్నారు. వారి మధ్యగా తలదూర్చి తన వీరత్వాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించాడు. కొట్టు యజమాని కల్పించుకోకపోతే మమ్మల్నిద్దర్నీ చంపేసేవారు.
 
 తాగి తూలుతూ పేలుతున్నవాడికి చేసినట్లుగా నేనతణ్ని బలవంతంగా పట్టుకుని దూరంగా లాక్కొచ్చాను. ఒక చెట్టు నీడలోకి తెచ్చి పరుండబెట్టాను. అతడి పక్కనే నేను కూడా చతికిలబడిపోయాను.
 మేమిద్దరమూ చాలాసేపే నిద్రపోయినట్టున్నాం. ఎందుకంటే నేను లేచేసరికే చీకటైపోయింది. బొయ్‌విన్ ఇంకా నా పక్కన గురక పెడుతూనే ఉన్నాడు. గట్టిగా తట్టి లేపితేనే మేల్కొన్నాడు. ఇంకా మైకంలోనే ఉన్నాడు గానీ ఇందాకటికన్నా నయంగా ఉన్నాడు.
 
 మేం చీకట్లోనే ఆ బయలు ప్రాంతాన్ని దాటడానికి బయల్దేరాం. తనకు దార్లన్నీ బాగా తెలుసునని బొయ్‌విన్ నిబ్బరంగా చెప్పుకొచ్చాడు. ముందు ఎడమకూ ఆ తరువాత కుడివైపూ మళ్లీ ఎడమవైపూ అటూ ఇటూ తిరిగాం. పైన ఆకాశం గానీ కింద నేలగానీ కనపడలేదు. మా కంటే ఎత్తయిన డొంకలు గల కీకారణ్యంలో మేం దారి తప్పిపోయాం. కచ్చితంగా అది తీగలు పాకిన స్తంభాలు గల ద్రాక్ష తోట అయి ఉంటుంది. మాకొక్క వీధి దీపం కూడా కనపడలేదు. బహుశా ఒక రెండు గంటల పాటు మేం అదే పనిగా గుండ్రంగా తిరిగాం. తడబడుతూ బయటికొచ్చే దారి దొరికినట్టే దొరికి మళ్లీ తప్పిపోయేవాళ్లం. పోనీ మా అడుగు జాడలు మాకు కనపడే పరిస్థితి కూడా లేదు. అంతా చీకటి.
 
 చివరికి బొయ్‌విన్ నేలలో పాతివున్న ఒక కొయ్య పైన పడిపోయాడు. అతడి చెక్కిలి తెగిపోయింది. నేలమీద కూలబడిపోయాడు. బిగ్గరగా ఊపిరితిత్తుల శక్తి మేరకు అరవడం మొదలుపెట్టాడు. నేను కూడా హెల్ప్ హెల్ప్ అని గొంతు చించుకున్నాను. మమ్మల్ని రక్షించేవారికి మా ఉనికిని తెలపడానికి, మేం కూడా ధైర్యం తెచ్చుకోవడానికి కొవ్వత్తుల్ని వెలిగించాం.
 
 చివరికి తన పనిలో ఆలస్యమైన ఒక రైతు మా గోడు విని, వచ్చి సరైన దారి చూపించాడు.
 బొయ్‌విన్‌ని, నేను ఇంటి వరకూ తీసుకెళ్లాను. కానీ గేటు ముందే అతణ్ని విడిచి రావాలనుకున్నాను. అయితే ఒక్కసారిగా గేటు తలుపు తెరుచుకున్నది. ఎదురుగుండా బొయ్‌విన్ భార్య నిల్చుని ఉన్నది. ఆమె చేతిలో కొవ్వత్తి వెలుగుతున్నది. ఆ ఉగ్రరూపం చూసి నేను భయపడిపోయాను.
 బహుశా చీకటి పడినప్పటినుండీ ఆమె మగడి కోసం కాచుకొని ఉండొచ్చు. అతణ్ని చూడగానే నావైపు తిరిగి పెద్దగా అరవడం మొదలుపెట్టింది: ‘‘ఓరీ! స్కౌండ్రల్. వీణ్ని నువ్వు తప్ప తాగించి ఇలాగే తెస్తావని నాకు తెలుసు.’’ మీరు నమ్మండి... నేను పరుగు లంకించుకున్నాను. ఆ మహోగ్ర మూర్తి నా వెంట పడుతుందని భయంగానే ఉంది. దగ్గరి రైల్వేస్టేషన్‌కు చేరుకునే వరకూ పరిగెడుతూనే ఉన్నాను. అక్కడ మరో అరగంట వరకూ రైలు ఏదీ లేదని తెలిసింది. ‘ఎందుకైనా మంచిదని అక్కడి శౌచాలయంలోకి దూరి లోపల గడియ పెట్టుకున్నాను.‘అంచేత నేను పెళ్లి జోలికీ పోలేదు. ఆ తరువాత ప్యారిస్ నగరం విడిచి వెళ్లనూ లేదు.
 .ఫ్రెంచ్ మూలం: గై డి మొపాసా
 .తెలుగు: టి.షణ్ముఖరావు

మరిన్ని వార్తలు