వివేకం: మీరు ఎలా భోంచేస్తున్నారు?

9 Mar, 2014 00:49 IST|Sakshi
వివేకం: మీరు ఎలా భోంచేస్తున్నారు?

 యోగాలో ఏమంటామంటే, మీరొక ముద్ద ఆహారాన్ని తీసుకుంటే, దాన్ని 24 సార్లు నమలాలని. మీ ఆహారం మీ నోటిలో ముందే జీర్ణమైపోతే, అది మీ వ్యవస్థలో ఎలాంటి మందకొడితనాన్ని సృష్టించదు. మీరు తిన్నదాన్ని ఇరవై నాలుగు సార్లు నమిలితే, ఆ ఆహారం గురించిన సమాచారంమీ శారీరక వ్యవస్థలో స్థాపితమవుతుంది. మనం ఎలా తింటున్నామన్నది కూడా మనం ఏం తింటున్నామన్నంత ముఖ్యమైన విషయమే.
 
 ఎంత తినాలి?
 
 కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మెదడు అత్యుత్తమంగా పని చేస్తుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు, ఘ్రెలిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుందనీ, అది కడుపునకు ఆకలిగా ఉందన్న సంగతిని మెదడుకు చేరవేస్తుందనీ పరిశోధకులు చెబుతున్నారు. మనం నేర్చుకోవడానికి, జ్ఞాపకశక్తికి, మనమున్న ప్రదేశ విశ్లేషణకి చెందిన పనులను, మన మెదడులో చక్కబెట్టే హిప్పోక్యాంపస్ అనే ప్రాంతాన్ని ఘ్రెలిన్ ఉత్తేజితం చేసి, దాని సామర్ధ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల మనం చురుగ్గా, ఏకాగ్రతతో ఉంటాం. అయితే మనం తినడం మానేయాలని కాదు. మనమెంత తింటున్నామన్న విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలన్న సంగతి ఇది చెబుతుంది.
 
 మీరు ముప్ఫై ఏళ్లలోపు వారైతే, రోజుకు మూడు పూటలా తినడం సరిపోతుంది.  ముప్ఫై పైబడి ఉంటే, రెండు పూటలే ఉత్తమం. తిన్నది రెండున్నర గంటల్లో ఉదర కోశం నుంచి వెళ్లిపోయేలా, 12-18 గంటల్లో మీ శరీరాన్నే వదిలిపోయేలా ఉండే ఆహారం ఎరుకతో తీసుకోండి.
 
 ఎలా నమలాలి?
 
 భోజనంలో నమలడానికి చాలా ప్రాధాన్యత ఉంది. పిండి పదార్థం ఎక్కువగా ఉండే ఆహారాలు, లాలాజలం ద్వారానే 30 శాతం జీర్ణం అవుతాయి.
 భోజనం చేసేటప్పుడు నీరు తాగడం మంచిది కాదు. కావాలంటే భోజనానికి కొద్ది నిమిషాల ముందు కొద్దిగా నీరు తాగండి లేదా భోంచేసిన 30, 40 నిమిషాల తర్వాత తీసుకోవడం మంచిది. రాత్రివేళ రాగి పాత్రలో నీటిని ఉంచితే, అది క్రిములను నాశనం చేయడమే కాకుండా, ఆ నీటిని శక్తిమంతం చేస్తుంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లలో జరిపిన పరీక్షల్లో రాగి పాత్రలు ఆసుపత్రుల్లో ఇన్‌ఫెక్షన్లను వ్యాపింపజేసే బ్యాక్టీరియాని 97 శాతం నాశనం చేస్తాయని తేలింది.
 
 ఏ ఋతువులో ఏ ఆహారం తీసుకోవాలి?
 
 భారతదేశంలో, మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, వేసవి కాలంలో ఒకలా, వానాకాలంలో మరోలా, చలికాలంలో ఇంకోలా, ఆయా కాలాల్లో దొరికే, శరీరానికి సరిపడే కూరగాయలతో వండుతారు.
 
 ఉదాహరణకి చలికాలంలో, గోధుమ, నువ్వుల్లాంటి కొన్ని రకాల ఆహారాలు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. ఈ కాలంలో, వాతావరణం చల్లబడటం వల్ల చర్మం పగులుతుంది. అయితే పూర్వం ప్రజలు క్రీములు మొదలైనవాటిని వాడేవాళ్లు కాదు. అందరూ రోజూ నువ్వులని తీసుకునేవారు. అవి ఒంటిని వేడిగా, చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి. మీ శరీరంలో ఉష్ణం ఎక్కువగా ఉండటం వల్ల, మీ చర్మం పగలదు. అదే, ఎండాకాలంలో శరీరం వేడెక్కుతుంది. కాబట్టి శరీరాన్ని చల్లబరిచేవి (చల్లనివి కాదు) తీసుకునేవాళ్లు. ఉదాహరణకి జొన్నలు.
 
 సమతుల ఆహారం అంటే ఏమిటి?
 
 ఈ రోజున, డాక్టర్లు దాదాపు 8 కోట్ల మంది భారతీయులు మధుమేహ వ్యాధి వైపుగా వెళుతున్నారని చెబుతున్నారు. దీనికి గల ఒకానొక కారణం, చాలామంది భారతీయులు ఒక రకం ధాన్యంతోనే చేసిన ఆహారాన్ని తీసుకోవడం.
 
 సాంప్రదాయికంగా, ప్రజలు చాలా రకాల పప్పు దినుసులనీ, ధాన్యాలనీ తినేవారు. ఈ కాలంలో దక్షిణ భారతంలో ఆహారాన్ని చూస్తే,  అన్నం, కొద్దిగా కూరగాయలతో చేసినదేదైనా ఉంటుంది. పూర్తిగా కార్బొహైడ్రేట్లు ఉండే ఇలాంటి ఆహారానికి మారడం గత 25, 30 ఏళ్లలో జరిగింది. దీన్నిప్పుడు వెనక్కి తిప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా కార్బొహైడ్రేట్లు ఉండి మిగతావి తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే, ఒక వ్యక్తి దీర్ఘ కాలిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఆహారంలో ఎక్కువ భాగం కేవలం అన్నమే ఉండకూడదు, మిగతావి కూడా ఉండాలి. అన్నమనేది మీ ఎంపిక మాత్రమే - అది తినాలా వద్దా అనే విషయాన్ని మీరు మీ ఆకలి స్థాయిని బట్టి నిర్ణయించుకోండి. ఇది ప్రజల మనస్సులో ఏర్పరచవలసిన ఒక మౌలికమైన భావన.
 
 

మరిన్ని వార్తలు