సిగిరెట్‌ లెటర్‌

1 Apr, 2018 02:08 IST|Sakshi

క్రైమ్‌ స్టోరీ

జపాన్‌ దేశంలో తయారైన సిగరెట్‌ లైటర్‌కి ఇంత శక్తి ఉంటుందని నేను ఊహించలేకపోయాను. విదేశంలో తయారైన సిగరెట్‌ లైటర్‌ను రాజాజీ నాకు కానుకగా ఇచ్చాడు. బంగారపు పూత పెట్టిన లైటర్‌ అది. లైటర్‌మీద రెండు సింహాలు చిత్రించబడి ఉన్నాయి. చేతిలో గరుకుతనంగా ఉంటుంది ఆ లైటర్‌.అద్దె ఇంట్లో తన గదిలో చనిపోయి కనిపించాడు రాజాజీ. అతడి గుండెలోకి ఒక బుల్లెట్‌ దూరింది. వెనక నుంచి బుల్లెట్‌ బయటపడి అతడు కూర్చున్న కుర్చీలో ఇరుక్కుంది. బుల్లెట్‌ కారణంగానే అతడు మరణించాడు. ఒంటరిగా ఉంటున్న రాజాజీ భార్య ఐదారు నెలల క్రితం జపాన్‌లో మరణించింది. ఆయనకు కొడుకు మాత్రమే ఉన్నాడు. అతడి పేరు వాసు. ఢిల్లీలో ఒక ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్నాడు. తన తండ్రి హత్యకు గురయ్యాడు అని తెలుసుకున్నాడు వాసు. పోలీసులు అతడికి ఫోన్‌ చేశారు. ఢిల్లీ నుంచి దిగబడ్డాడు వాసు. తన తండ్రి ఒక పిస్టల్‌తో కాల్చి చంపబడడం జీర్ణించుకోలేకపోతున్నాడు. తండ్రి చనిపోయిన తర్వాత అతణ్ని నేను చేరదీశాను. రాజాజీని ఆ రాత్రివేళ చంపకుండా ఉండవలసింది. ఏమైనప్పటికీ రాజాజీ తక్కువవాడు కాదు.టోక్యో నగరంలో ఒక సివిల్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయం తెరిచాను. విశాఖపట్నంలో ఉన్న నా ప్రధాన కార్యాలయానికి అనుబంధంగా టోక్యోలో శాఖా కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాను. ఆ కార్యాలయాన్ని రాజాజీ చూసేవాడు.

తన భార్యతో కలసి టోక్యోలో రాజాజీ ఉండడానికి తగినంత ఆదాయం, ఇతర వసతులు ఏర్పాటు చేశాను. కొంత కాలం క్రితం కార్యాలయాన్ని చూసుకోవడానికి టోక్యో చేరుకున్నాను.జమా ఖర్చులలో చాలా తేడాలు వచ్చాయి. రాజాజీని నిలదీశాను. ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. నా కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులను రహస్యంగా విచారించాను.ఒక గెయిషా వలలో చిక్కుకున్నాడు రాజాజీ. ఆయన సంపాదనను పూర్తిగా పీల్చేస్తోంది గెయిషా. ఆమె విషయంలోనే రాజాజీ దంపతులకు మధ్య విభేదాలు చెలరేగాయి.కార్యాలయం నష్టాల్లో పడింది. ఎనిమిది, పది లక్షల రూపాయలు పెట్టుబడి పెడితేనేగానీ కార్యాలయం పైకి లేవదు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు పెట్టుబడి పెట్టాలంటే నా వల్ల అయ్యే పరిస్థితి లేదు. భారతదేశంలో మారిపోయిన ద్రవ్యచెలామణి పరిస్థితుల దృష్ట్యా ఒడిదుడుకుల్లో పడ్డాను.నన్ను పాతాళలోకానికి తొక్కేశాడు రాజాజీ.ఏం జరిగిందో ఏమోగానీ, రాజాజీ భార్య ఆకస్మికంగా మరణించింది. జపాన్‌ ప్రభుత్వం ఆమె మరణం గురించి విచారణ చేపట్టింది. రాజాజీ భార్యకు సంబంధించిన ఫోరెన్సిక్‌ నివేదికను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వ్యవహారం ముదిరిపోకముందే జపాన్‌ దేశం నుంచి తన ప్రియురాలితో ఉడాయించాడు రాజాజీ.ఆయన నన్ను విశాఖపట్నంలో కలుసు కోవడానికి వచ్చేవరకూ రాజాజీ వ్యవహారం గురించి నాకు తెలియదు. గెయిషాను హోటల్‌ గదిలో ఉంచి ఆయన నా వద్దకు వచ్చాడు. ‘నా వెంట నా ప్రియురాలు కూడా వచ్చింది. ఆమెకు మన దేశపు పౌరసత్వం ఇప్పించాలి’ అన్నాడు రాజాజీ.

‘నీ అద్దె ఇల్లు ఉంది కదా! నీ ప్రియురాలిని అక్కడికి ఎందుకు తీసుకురాలేదు?’‘కొంతకాలం పాటు గెయిషాను ఎక్కడో ఓ చోట నువ్వే దాచి ఉంచాలి’ బ్రతిమిలాడాడు. ‘అదే. ఎందువల్ల?’అప్పుడు వివరంగా చెప్పాడు రాజాజీ. జపాన్‌ దేశంలో తాను వెలగబెట్టిన నిర్వాకం గురించి! జపాన్‌ దేశం నుంచి గూఢచారులు ఇక్కడికి తన కోసం వస్తారట. వాళ్ల కంట్లో తమ దేశస్తురాలు గెయిషా పడకూడదట. రాజాజీ భార్య చేత నిద్రమాత్రలు మింగించిన నేరస్తురాలు అతడి ప్రియురాలు గెయిషాయేనట. రాజాజీతో నా సాన్నిహిత్యం ఇక్కడ నా సొంత దేశంలో కూడా నా ఉనికిని ప్రశ్నార్థకం చేయనుంది. పథకం వేశాను.పాయింట్‌ త్రీటూ కాలిబర్‌ పిస్టల్‌ను సిద్ధం చేసుకున్నాను. పిస్టల్‌లో ఆరు బుల్లెట్లు నింపాను. అతడి అద్దె ఇంట్లో మద్యం సేవించడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఆ రాత్రివేళ ఇద్దరం కూర్చున్నాం.‘గెయిషాను అనవసరంగా చేరదీసి నీ మెడకు తగిలించుకున్నావు. ఆమెను ఇక్కడివరకూ వెంటబెట్టుకు వచ్చావు. ఒక అనుమానితురాలికి ఆశ్రయం ఇచ్చినవారు కూడా నేరస్తులు అవుతారు. ఆ సంగతితెలియదా నీకు?’ నిలదీశాను.
రాజాజీ మాట్లాడలేదు. మద్యం సీసాలు తెరచి కాక్‌టైల్‌ కలిపాడు. తన కోసం బీర్‌ సీసా తెరిచాడు.‘అదేమిటి? నువ్వు ఇది తాగవా?’ అడిగాను. తన కోసం బీర్‌ సీసా ఏర్పాటు చేసుకున్నప్పుడు నా కోసం కూడా బీర్‌ మాత్రమే ఏర్పాటు చేయాలి కదా! కేవలం నాకు మాత్రమే కాక్‌టైల్‌ ఎందుకు కలుపుతున్నాడు? అదే ప్రశ్న అతణ్ని అడిగాను. తేలిగ్గా నవ్వేశాడు రాజాజీ. అతడివైపు మద్యం గ్లాసు జరిపి, బీర్‌ సీసా అందుకోవాలని చూశాను. అతడు నా చేయి పట్టుకుని కాక్‌టైల్‌ మాత్రమే సేవించ వలసిందిగా బలవంత పెట్టాడు.

‘నిజం చెప్పు! నా గ్లాసులో ఏం కలిపావ్‌?’ గద్దించాను.‘ఛ.. ఛ.. నా కోసం జపాన్‌ దేశంలో నువ్వు మంచి స్థితి ఏర్పాటు చేశావు. నేనే పాడుజేసుకున్నాను. నిన్ను ఎంత నాశనం చేయాలో అంతా చేశాను. ఇప్పుడు మద్యంలో కూడా ఏదో కలపాలా? ఎందుకు కలపాలి?’ ఆవేశంతో తడబడ్డాడువిశాఖపట్నంలో ఉన్న నా వ్యాపార కార్యాలయానికి నేను తప్ప వేరే యజమానులు లేరు. అందువల్ల ఇక్కడి కార్యాలయం తన గుప్పిట్లో పెట్టుకోవాలని రాజాజీ ఉద్దేశ్యమేమో! అందువల్లే కాబోలు, అప్పుడప్పుడు బహుమతులు ఇస్తూ ఉంటాడు. బంగారపు పూత పూసిన సిగరెట్‌ లైటర్‌ల వంటివి నాకు అంటగడుతూ ఉంటాడు.నాకు శరీరం జలదరించింది. అతణ్ని చంపాలని నేను పిస్టల్‌ తెచ్చాను. కానీ అంతకంటే ముందే నా మీద విష ప్రయోగం చేయడానికి సిద్ధమయ్యాడు రాజాజీ. నా కంటే వయసులో పెద్దవాడు ఆయన. అందుకే ఆయనకు కావలసిన దానికంటే ఎక్కువే విలువిచ్చాను.నా సంస్థ మీద ఆయన కన్ను వేశాడా? పిస్టల్‌ తీసి సేఫ్టీ కాచ్‌ తప్పించాను. పిస్టల్‌ గొట్టం రాజాజీ ఛాతీకి నొక్కిపెట్టాను. నాలో ఆగ్రహం, ఆవేశం కట్లు తెంచుకున్నాయి. గెయిషా వంటి అనుమానితురాలికి నేను ఆశ్రయం కల్పించాలా? అసలు రాజాజీ ఉద్దేశ్యం ఏమిటి? ఆమె లేకుండా బతకలేడా? మధ్యలో నేనెవరిని?‘ఢాం..!’ గర్జించింది పిస్టల్‌. నా ప్రయత్నం లేకుండానే ట్రిగ్గర్‌ని లాగింది వేలు. లక్ష్యానికి రెండంగుళాల దూరంలోనే ఉన్నదేమో, పిస్టల్‌ గొట్టం నుంచి బుల్లెట్‌ రాజాజీ గుండెల్లోకి దూసుకుపోయి తర్వాత కుర్చీలో సెటిల్‌ అయింది.

నిజం చెప్పొద్దూ..! చాలా గాభరా పుట్టింది. ఒక మనిషిని చంపేటంత కర్కశత్వం నాలో ఉన్నదని నాకు అంతవరకూ తెలియనే తెలియదు. ఆ ఇంట్లోంచి బయట పడ్డాను. నన్ను ఎవ్వరూ గమనించడం లేదు. పిస్టల్‌ పేలుడు శబ్దం కూడా ఎవర్నీ ఆకర్షించలేదు.రాజాజీ మరణం పోలీసులకు ఒక సవాలుగా మారింది. ఢిల్లీ నుంచి దిగబడిన అతడి కొడుకు వాసుకు ఏం చెప్పి అతణ్ని సముదాయించాలో కూడా వారికి అర్థం కావడంలేదు.నేనూ ఒంటరివాడినే కావడం వల్ల వాసును నేను చేరదీశాను. తన తండ్రిని ఎవరు చంపారో కంటే ఎందువల్ల చంపారో అనే ఆలోచనే వాసును ఆందోళనకు గురిచేస్తోంది.‘రాజాజీ హత్య తర్వాత గెయిషా వ్యవహారం మరుగున పడిపోయింది’ అన్నది నా అభిప్రాయం. కానీ అలా కాలేదు. గెయిషా విషయం వాసుకు పూర్తిగా తెలుసు. తండ్రే అతనికి ఆమె గురించి వివరంగా రాశాడు. రెండోనాటి సాయంకాలానికి కానీ ఈ విషయం నాకు అర్థమైంది కాదు.

బీచ్‌ రోడ్‌లో కారు నడుపుతున్నాను. కురుసుర సబ్‌మెరైన్‌ వద్ద ఒక సైకిల్‌వాలా నా కారుకు అడ్డుగా వచ్చాడు. బ్రేక్‌ మీద కాలు తొక్కిపెట్టాను. కారు చక్రాలు కీచుమంటూ చప్పుడు చేసి కారు ఆగుతుందని ఆశించాను. కారు ఆగలేదు. బ్రేకులు వదులుగా కదులుతున్నాయి. ఉదయం అంతా కారును వాసు వాడాడు. ఆ సమయంలో కారును పాడుచేసి ఉంటాడు. ఏమీ తెలియనట్టు కారుని షెడ్‌లో పెట్టి ఉంటాడు. ఎందువల్ల?సైకిల్‌వాలాను ఢీకొట్టింది కారు. వాడు ఎగిరి గోడ అవతలికి పోయి ఇసుకలో పడ్డాడు. నా కారు ఆగడం లేదు. సైకిల్‌వాలాకు దెబ్బలు బలంగా తగిలాయా? అని ఆలోచించే వ్యవధి నాకు లేదు. ఆర్‌కే బీచ్‌వైపు దూసుకుపోతోంది కారు. పేవ్‌మెంట్‌ను రాసుకుంటూ పోయింది. జనంలో హాహాకారాలు చెలరేగుతున్నాయి. ఆ సమయంలో నా మొబైల్‌ ఫోన్‌ మోగింది. అవతలివైపు వాసు.ఫోన్‌ ఆన్‌ చేశాను. లౌడ్‌ స్పీకర్‌లోంచి మాటలు వినిపిస్తున్నాయి.‘మా నాన్నను చంపిన బుల్లెట్‌ పాయింట్‌ త్రీటూ కాలిబర్‌ది. అటువంటి పిస్టల్‌ నీ పేరున రిజిస్టరై ఉంది. నీ పిస్టల్‌ని పరిశోధించాను. టీపాయ్‌ మీద బంగారు పూత పూసిన సిగరెట్‌ లైటర్‌ ఉంది. అది మాత్రం నీదే. దాని మీద వేలిముద్రలు కూడా నీవే. ఆయనను చంపవలసిన అవసరం, అవకాశం నీకు మాత్రమే ఉన్నాయి...’ అతడి మాటలు కొనసాగుతూనే ఉన్నాయి.నా కారు అప్పటికే పోలీస్‌బీట్‌ను బలంగా ఢీకొట్టింది. కారు పల్టీలు కొడుతోంది. నాకు అంతే తెలుసు.
- ఎం.వి.వి. సత్యనారాయణ 

మరిన్ని వార్తలు