స్వస్తిక్‌

10 Feb, 2019 00:48 IST|Sakshi

కిర్ర్‌..ర్‌..!

‘‘స్వస్తిక్‌.. పూజలప్పుడు, దసరాకి బండి పూజ చేసేప్పుడు తప్ప ఈ సింబల్‌ని, ఈ పేరుని నేను ఎక్కడా వినలేదు తెల్సా?’’ ఆశ్చర్యం. ‘‘హ్మ్‌... యు నో ముగ్ధా!  మా క్లాస్‌లో  అప్‌ టు పీజీ, ఈవెన్‌ ఎట్‌ ఆఫీస్‌.. నాదే యూనిక్‌ నేమ్‌’’ సేమ్‌ సర్‌ప్రయిజ్‌ అవతలి వైపు నుంచి కూడా!‘‘చిన్నప్పుడు రాత్రిళ్లు నైట్‌మేర్స్‌తో భయపడితే .. మా నాన్నమ్మ నా బెడ్‌ కింద పసుపు, కుంకుమతో స్వస్తిక్‌ ముగ్గు వేసేది...’’ నవ్వు ఎమోజీతో. ‘‘ఇప్పుడూ వస్తాయా.. నైట్‌ మేర్స్‌?’’మళ్లీ నవ్వు ఎమోజీ.. తర్వాత తనే ‘‘అవునూ నీకు దయ్యాలంటే భయమా?’’ ‘‘హేయ్‌.. ఆ క్వశ్చన్‌ నేను అడగాలి.. ’’ స్వస్తిక్‌. వరుసగా ఓ నాలుగు నవ్వు ఎమోజీలు ముగ్ధ నుంచి.‘‘ఇప్పుడా..? భయమా? నాకా?’’ మళ్లీ నవ్వు ఎమోజీ.థమ్స్‌ అప్‌  పెట్టాడు స్వస్తిక్‌‘‘అమ్మ  వస్తున్నట్టుంది. ఉంటా మరి బై..’’ ముగ్ధ. ‘‘మళ్లీ ఎప్పుడు ఆన్‌లైన్‌కి?’’ స్వస్తిక్‌.‘‘ఎప్పుడూ ఆన్‌లైనే..’’ముగ్ధ.ఈసారి స్వస్తిక్‌ నుంచి నవ్వు ఎమోజీ‘‘సరే.. బై ఫర్‌ నౌ’’ అని పెడ్తూ ఆఫ్‌ అయిపోయింది ముగ్ధ. ఆమె షట్‌డౌన్‌ చేసేకంటే కొన్ని నిమిషాల ముందు..  తలుపులు వేసున్న కూతురు గది దగ్గరికి  వచ్చి తలుపు తట్టబోయింది నందిత. ‘‘నందితా.. ఏమైంది’’ అంటూ భుజమ్మీద చేయి పడేసరికి వెనక్కి తిరిగింది. ‘‘అమ్మాయి గదిలో అలికిడి వినపడితే...’’ అంటూ  ఆగిపోయింది.  ఆమె భుజాలు పట్టుకొనితమ గది వైపు మరలిస్తూ  ‘‘అమ్మాయి పడుకుంది నందితా’’ అంటూ ఆమెను గదిలోకి తీసుకెళ్లాడు  భర్త.‘‘లేదు.. పడుకోలేదు’’ అంటూ మళ్లీ కూతురు గదివైపు తిరిగే ప్రయత్నం చేసింది. ఆమె బయటకు వెళ్లకుండా తలుపులేస్తూ ‘‘పడుకో నందితా...’’ అన్నాడు అనునయంగా. కానీ నందితలో ఆందోళన ఆమెను నిద్రపోనివ్వలేదు. 

‘‘శ్లోకా.. ముగ్ధ ఎఫ్‌బీలో ఫోటోస్‌ అప్‌డేట్‌ అవుతున్నాయే’’ షాకింగ్‌గా ఉంది నూర్‌కి.‘‘వ్వాట్‌?’’ అదిరిపడింది శ్లోక. ‘‘యెస్‌. స్వస్తిక్‌ లైక్స్‌ కొడ్తున్నాడు, కామెంట్స్‌ కూడా పెడ్తున్నాడే’’ అదే షాక్‌ కంటిన్యూ అవుతూ నూర్‌. ‘‘ఏదీ.. చూద్దాం’’ అంటూ గబగబా తన సెల్‌ఫోన్‌లో ఎఫ్‌బీ ఓపెన్‌ చేసి చూసింది. నిజమే. కూర్గ్‌కి వెళ్తూ దిగిన ఫోటోస్‌. ఈ పొద్దునే  పోస్ట్‌ చేసినట్టుంది. దిమ్మ తిరిగింది శ్లోకకి. సన్నగా కాళ్లలో వణుకు. స్వస్తిక్‌కి ఫోన్‌ ట్రై చేసింది. స్విచ్డ్‌ ఆఫ్‌. అంతా అనుకున్నట్టే జరిగి ఉంటే కూర్గ్‌లో స్వస్తిక్‌ని కలిసేవాళ్లు. ముగ్ధ అతనితో ఫోన్‌లో మాట్లాడ్తున్నప్పుడు  పక్కనుంచి వీళ్లూ ‘‘హాయ్, హలో’’ అంటూఆటపట్టించడమే తప్ప అతణ్ణి చూడలేదు, మాట్లాడలేదు ఇంతవరకు.తర్వాత రోజూ పనిగట్టుకొని మరీ ఎఫ్‌బీ చెక్‌ చేశారు నూర్, శ్లోక. ఇంకొన్ని ఫోటోస్‌ అప్‌డేట్‌ అయ్యున్నాయి. ఇద్దరి మొహంలో నెత్తురు చుక్కలేదు. ‘‘ఆంటీ వాళ్లు అబ్జర్వ్‌చేసి ఉంటారా? చెబ్దామా?’’ అంది నూర్‌. తలూపింది శ్లోక ఏదో లోకంలో ఉన్నట్టు. అదే రోజు రాత్రి..‘‘ఏమండీ... ఏమండీ’’ కలవరం నందిత స్వరంలో. ‘‘ఊ.. ’’ అంటూ బద్ధకంగా అటు తిరిగి పడుకున్నాడు ఆమె భర్త. ‘  మళ్లీ చప్పుడండీ..లేవండీ’’ భర్తను తట్టి లేపుతోంది. ‘‘ఏంలేదు .. పడుకో’’ కళ్లు మూసుకునే జవాబు చెప్పాడు భర్త. ‘‘కాదండీ.. ల్యాప్‌టాప్‌ కీబోర్డ్‌ శబ్దం వినిపిస్తోంది’’ అంటూ ఆయన వీపు తడుతోంది. ‘‘అబ్బబ్బ..నీ అనుమానంతో చంపుతున్నావ్‌! నిద్రపోనివ్వవా?’’ విసుక్కుంటూనే లేచి కూర్చున్నాడు. అదేమీ పట్టించుకోకుండా ‘‘వినండీ’’ అంటూ తలను కాస్త వంచి చెవులు రిక్కించింది నందిత. నిర్లక్ష్యంగా  కుడిచేతి  చిటికెన వేలును కుడి చేవిలో పెట్టుకొని తిప్పుకుంటూ ముసుగుదన్నబోతూ ఆగాడు. ఆమె ఏదో చెప్పబోతుంటే ‘‘ష్‌...’’ అని నోటి మీదవేలువేసుకుంటూ నెమ్మదిగా మంచం దిగాడు. గది తలుపులు తెరిచాడు. ‘‘స్లక్‌.. స్లక్‌.. స్లక్‌.. స్లక్‌.. ’’ల్యాప్‌టాప్‌ కీబోర్డ్‌ టైప్‌ చేస్తున్న శబ్దం చాలా స్పష్టంగా వినపడుతోంది. ఆ నిశ్శబ్ద రాత్రిలో. 
అడుగులోఅడుగు వేసుకుంటూ  కూతురి గది దగ్గరకు వెళ్లాడు. వెనకాలే భార్య కూడా. 

టక్కున కీబోర్డ్‌ శబ్దం ఆగిపోయింది. భార్య వంక చూశాడు. ‘‘నేను చెప్పలేదా?’’ అన్నట్టు చూసింది భర్తను. ‘‘ఉదయం నూర్‌ వాళ్లూ ఫోన్‌చేశారు.. ముగ్ధ ఎఫ్‌బీలో యాక్టివ్‌గా ఉందని’’ యాడ్‌ చేసింది నందిత.కూతురి గది తలుపు తెరిచాడు. స్టడీ టేబుల్‌ మీదున్న ల్యాప్‌టాప్‌ ఆన్‌లో ఉంది. ఆమె ఫేస్‌బుక్‌లో చాట్‌ విండో ఓపెన్‌ చేసి ఉంది. కుర్చీలో కూర్చున్నాడు విష్ణు. పక్కనే నందిత నిలబడింది.వణుకుతున్న చేతులతో కర్సర్‌ను కదిలిస్తూ చాట్‌ చదవడం ఆరంభించాడు. దాదాపు రెండు మూడు నెలల నుంచి ఆ కిందటి క్షణం దాకా చాటింగ్‌ సాగుతూనే ఉంది. ఎముకలు కొరికే చలిలోకూడా చెమటలను పుట్టిస్తోంది భయం.  సెకన్లలోనే  తేరుకుని మంచం కింద, కప్‌బోర్డ్‌ పైన, బాత్రూమ్‌లో.. ఇల్లంతా.. ఇంటి ముందు వాకిలి,  వెనక పెరడు.. అంతా వెదికాడు భర్త. ఎక్కడా ఏ అనవాలూ లేదు. మరి ఈ చాటింగ్‌ ఏంటీ? నందిత అయితే స్థాణువైంది.ఇన్నాళ్లూ తన భార్యది భ్రమ, భ్రాంతి అనుకున్నాడు.కానీ కాదు. గబగబా స్వస్తిక్‌ ఎఫ్‌బీ ఎకౌంట్‌ చూశాడు. ఫోన్‌ నంబర్‌ ఉంది. 

తలుపులు తెరిచాడు సుభాష్‌. ఎదురుగా ఉన్న జంటను చూసి త్వరగానే  పోల్చుకున్నాడు ఆ ఉదయం ఫోన్‌ చేసిన వారే అయ్యుంటారని. అయినా ‘‘నేను విష్ణు.. తను నా మిసెస్‌ నందిత’’ అంటూ పరిచయం చేసుకున్నాడు విష్ణు.‘‘అనుకున్నానండీ మీరే అని.. రండి.. రండి’’ అంటూ సాదరంగా లోపలకి ఆహ్వానించాడు సుభాష్‌. ‘‘కూర్చోండి’’ అని సోఫా చూపిస్తూ వాళ్లావిడను కేకేశాడు. నందిత వయసున్న స్త్రీయే వచ్చింది లోపలి నుంచి. పరిచయం చేశాడు సుభాష్‌. ఆ జంట కూడా నందితా వాళ్లకు ఎదురుగా ఉన్న సోఫాలో కుర్చున్నారు. గొంతు సవరించుకున్నాడు విష్ణు ఏదో గంభీరమైన విషయం చెప్పడానికి నాందిగా. ‘‘సర్‌.. మా అమ్మాయి ముగ్ధ. టీసీఎస్‌లో పనిచేసేది’’ చెప్తూన్నాడు. ఆసక్తిగా వింటున్నారు సుభాష్, అతని భార్య.  ‘‘మా అమ్మాయికి మీ అబ్బాయి ఎప్పుడు పరిచయమయ్యాడో తెలీదు కానీ రెండుమూడు నెలల నుంచి చాటింగ్‌ చేసుకుంటున్నట్టున్నారు. మాకు నిన్ననే తెలిసిందండీ.. నిన్న కూడా  మా అమ్మాయి మీ అబ్బాయితో చాట్‌ చేసింది’’ అంటూ ఆపాడు చిన్న నిట్టూర్పుతో విష్ణు. ఇప్పుడు సుభాష్‌ తన భార్య వంక చూశాడు. ఆమె.. నందిత, విష్ణుల వైపు విస్మయంగా చూసింది.‘‘ఒక్కసారి లోపలికి వస్తారా?’’ ఆ ఇద్దరినీ అడిగింది సోఫాలోంచి లేస్తూ. ఆ ఇద్దరికీ అయోమయం.సుభాష్‌ను చూశారు. ‘‘రండి’’అంటూ తనూ సోఫాలోంచి లేస్తూ ముందుకు సాగాడు. ఆ జంటను అనుసరిస్తూ నందిత, విష్ణూ ఓ గదిలోకి వెళ్లారు. అశనిపాతం తగిలినట్టు చేష్టలుడిగిపోయారు. ఎదురుగా గోడ మీద లైఫ్‌ సైజ్‌ ఫోటోకి దండ వేసి ఉంది. ‘‘ఈ అబ్బాయి..’’ అంటూ ఆగింది నందిత. ‘‘మా అబ్బాయే!  స్వస్తిక్‌. యేడాది అవుతోంది...’’ గొంతు పెగల్లేదు ఆమెకు బాధతో.‘‘మా అమ్మాయి కూడా. ఇరవై రోజులకిందట కూర్గ్‌కి వెళుతూ యాక్సిడెంట్‌లో’’ పూర్తిచేయలేకపోయింది నందిత  ఈసారి ఆ ఇద్దరూ అప్రతిభులయ్యారు.
 - సరస్వతి రమ 

మరిన్ని వార్తలు