లేత పచ్చ ఆకు

18 Feb, 2018 01:16 IST|Sakshi

ఈవారం కథ

చచ్చిన వాళ్ళంతా బతికొచ్చి వరుసగా నిలబడ్డారు. కూడికలూ లెక్కలూ వేసి చిత్రగుప్తుడు చెప్పేస్తున్నాడు. యమధర్మరాజు అది విని తక్షణ తీర్పులు యిచ్చేస్తున్నాడు. స్వర్గానికి వెళ్ళిపోవాలో నరకంలో వుండిపోవాలో తేల్చేస్తున్నారు. ఎటువాళ్ళనటు చకచకా పంపించేస్తున్నారు. వివిధ వయసుల వాళ్ళు బారులు తీరి వున్నారు. అందులో బలవంతాన తెంపేసిన వో లేతాకు వుంది. చెంప కూడా పండ లేదు. పండుటాకుల మధ్య లేత పచ్చగా వుంది.‘‘నీ పేరు?’’‘‘సంతోషికుమారి..’’‘‘వయసు?’’‘‘పదకుండు..’’‘‘బడిలోకి వెళ్ళకుండా మా భటులతో వచ్చావేమమ్మా?’’‘‘నా దగ్గర ఆధార్‌ కార్డు లేదు..’’‘‘ఆధార్‌ లేకుండా మా యమలోక ప్రవేశానికి అనుమతి లేదు. యెలా వచ్చావ్‌? యెక్కడి నుండి వచ్చావ్‌?’’‘‘మా వూరు కరిమటి. సిమ్దెగా జిల్లా. జార్ఖండ్‌..’’‘‘ఊ..’’‘‘ఆధార్‌ కార్డు లేకపోతే చంపేస్తారా సార్‌?’’‘‘నీకు నువ్వే చనిపోయినట్టు మీ స్టేట్‌ యిచ్చిన స్టేట్మెంటులో వుంది..’’‘‘నాలుగైదు రోజులుగా అన్నం తినలేదు..’’‘‘ఏం.. యెందుకు తినలేదు?’’‘‘ఆధార్‌ కార్డు లింక్‌ చెయ్యలేదని మా రేషన్‌ రద్దు చేశారు. యింట్లో బియ్యం గింజలు లేవు..’’‘‘ఆధార్‌ కార్డ్‌ అవసరమని తెలీదూ? ఆధార్‌ కార్డ్‌ లేకుండా బతకడమూ తప్పే. చావడమూ తప్పే. ఇక్కడికి రావడమూ తప్పే..’’‘‘అన్నం తినడమూ?’’‘‘తప్పే!’’‘‘ఆధార్‌ కార్డు వుండాలని ఆకలికి తెలీదు కద్సార్‌?’’అవాక్కయి ఆగమన్నట్టు కను సైగగా చూశాడు యమధర్మరాజు. చిత్తం అన్నట్టు గ్రహించి యెత్తిన తలని తాబేల్లా కిందికి లాక్కున్నాడు చిత్రగుప్తుడు. యమలోకం నిండా నిశ్శబ్దం ఆవరించింది.

‘‘ముందీపిల్ల సంగతి చూడండి ప్రభూ..’’సంతోషినిని చూస్తూ యమధర్మరాజు మీట నొక్కడంతో భూలోకదర్శిని తెరచుకుంది.అందులోని దర్పణం వర్తమానానికి దర్పణం పడుతోంది.‘‘అమ్మా..’’‘‘అరవకు. వినపడదు..’’‘‘అదిగో మా అమ్మ. నిజంగా మా అమ్మే.. కోయ్లీ.. కోయ్లీదేవి..’’‘‘ష్‌....’’చిత్రగుప్తుని కళ్ళు పెద్దవై హెచ్చరిస్తున్నట్టు చూశాయి. తెరచుకున్న నోటిని అరచేత్తో మూసుకుంది సంతోషికుమారి. ముక్కున వేలేసుకున్నాడు యమధర్మరాజు. అతణ్ణి చూస్తూ అదే పని చేసింది సంతోషికుమారి.అంతా నిశ్శబ్దం.అదే నిశ్శబ్దం. కమ్మిన చీకటి. కారు చీకటి. నేల రాలనివ్వకుండా అడవిలోని ఆకులన్నీ వెన్నెల నిండుగా వడ్డించుకున్న విస్తరాకులై అడ్డం పడుతున్నాయి. మృగాలు తరుముతున్నట్టు దారికాని దారుల్లో పరుగులు తీస్తోంది కోయ్లీదేవి. అడవి గుండా. అడ్డుతోవల గుండా.కొన్ని చోట్ల ఆకుల సందుల్లోంచి వాన కారినట్టు కారుతోంది వెన్నెల. వెలుతురులో అవి మృగాలు కాదు తోటి మనుషులేనని తెలుస్తోంది. నీడలు. కావు, నిజాలే. జాలే లేని నిజాలు.నిజమో భ్రమో యేమో.. యేదీ తెలీనట్టుంది కోయ్లీదేవికి. పరుగులు తీస్తూనే వేగంగా కొట్టుకుంటున్న గుండెను అరచేతుల్లో గట్టిగా పట్టుకొంది. కొండా కోనా అనకుండా యెక్కి దిగి నదిలా ప్రవహిస్తోంది. పురుగూ పుట్రా వుంటుందన్న భయం లేకుండా పరుగులు తీస్తూనేవుంది. జనారణ్యంలోంచి అరణ్యంలోకి.

రొప్పుతూ ఆగింది. రొస్టుతూ ఆగింది. ఆగి వెనక్కి చూసింది. భయం భయంగా చూసింది. ఎవ్వరూ లేరు. తానొక్కతే. ఒంటరిగా.ఒంటిగా వున్నా భయం వెయ్యలేదు. మనుష్య సంచారం లేని నిర్మానుష్యం. ఊపిరాడింది. సర్రున సర్పమేదో పాదాల మధ్యలోంచి పరుగులు తీసింది. గుడ్లగూబ గుడ్లురిమి చూసింది. ఎక్కడో నక్క వూళ వేసింది. కీచురాళ్ళ రొద పెరిగింది. కోయ్లీదేవి నడుస్తూనే వుంది. ఆగకుండా ఆపకుండా నడుస్తూనే వుంది. అలుపూ సొలుపూ యెగశ్వాస దిగశ్వాసగా మారింది. ఆ నిశ్శబ్దంలో వూపిరి శబ్దమే వురుమై వినిపిస్తోంది. వేలూ లక్షల అడుగులు వేసింది. చందమామ దీపం చూపించింది. గుచ్చుకున్న ఆమె కాలి ముళ్లు కాలసూచిక గడియారపు ముళ్ళై కలుక్కున విరిగి తిరిగింది.చీకటి కరిగింది. పొద్దు తిరిగింది.మసక వెలుగులో పాటియాంబ వూరి పేరు యినుపరేకు మీద చెదలు పట్టి కనిపిస్తోంది.సూరీడు లేపకముందే తనే ఆ యింటి తలుపు దబదబా తట్టి లేపింది. తెరచుకున్న తలుపు. దృఢంగా యువతి.ఆసక్తిని ఆపుకోలేనట్టు యెవరన్నట్టు యమధర్మరాజు చూశాడు.‘‘తారామణి సాహూ.. సామాజిక కార్యకర్త..’’చిత్రగుప్తుని మాటలు విని అర్థం కానట్టు చూసింది సంతోషికుమారి. అంతలోనే తలతిప్పి దర్పణంలోకి తొంగి చూసింది.కోయ్లీదేవి తూలిపడబోయి గోడను ఆనుకు కట్టెలా వాలింది. నోట్లోంచి గాలి వొస్తూ ఆమె మాట అస్పష్టంగా వుంది. తారామణి చెయ్యి పట్టుకుని కోయ్లీని యింట్లోకి నడిపించింది. కూర్చోమంది. కోయ్లీ కుప్పకూలింది. టీ యిస్తే గోడకు చేరగిలబడి చప్పరించుకు తాగింది.

తారామణి సాహూ రెప్పకదపకుండా కోయ్లీ కళ్ళలోకి చూసింది. ఏ క్షణమైనా ప్రాణం పోయే మార్గాల్లా వున్నాయి కోయ్లీ కళ్ళు. కాంతి కోల్పోయిన ఆమె గాజుకళ్ళ మీద యేవో చిత్రాలు చిత్రంగా కదలాడుతున్నాయి. తారామణి సాహూ చూపు అలాగే నిలబడిపోయింది.కోయ్లీదేవి కళ్ళు మసకబారడంతో రెప్పలు పులుముకుని గుడ్డి దీపపు వెలుగులో చూసింది. ఆమె కళ్ళలో కర్రలు పట్టుకు వూరంతా నిలబడి వుంది. ఊరంతా యింట్లోనే వుంది. అది యిల్లు కాదు. గుడిసె. వెదురు బద్దలతో అల్లిన తడికకు మట్టిని పేమిన గోడలు. ద్వారం దాటి లోపలకు వెళితే గోడల్లేని ఆరుబయలు గది. గాలిలో తేలికగా తేలిపోయే పెంకుల పైకప్పు. చెల్లా చెదురుగా పడివున్న గిన్నెలు, తపేలాలు. వెలగని పొయ్యి. పొయ్యిలో పిల్లి కూడా లేవలేదు. ఇల్లు పీకి పందిరేయడానికే అంతా వొచ్చినట్టున్నారు. తలోమాట అంటున్నారు. కోయ్లీదేవి చుట్టూ చూసింది. గాఢాంధకారపు చీకటి.‘‘కోయ్లీ.. నువ్వు నీ యింటి పరువును తీసుకోవడం లేదు. వూరి పరువు తీస్తున్నావు!’’‘‘నువ్వు నీ గుండార యిప్పుకోవడం లేదు.. వూరందరి గుండార్లూ యిప్పి యీదిలో నిల్చోబెట్టేసినావు!’’‘‘ఈదిల అయితే పరవాలేదు, దేశంలో మనవూరిని.. కాదు కాదు ప్రపంచకంలో మన దేశాన్ని గుడ్డలిప్పదీసి నిలబెట్టీసినావు. మనల్ని యేలే లీడర్లనీ బోడిమొలలతో నిలబెట్టీసినావు.’’‘‘మన వూరి పరువు పోయింది. ప్రతిష్ట పోయింది. రేపు మన కరిమటిని యెవడన్నా కన్నెత్తి చూస్తాడా? పెళ్ళిళ్ళు అవుతాయా? మన పిల్లలకి పుస్తెలు పడతాయా? సర్కారును యెదిరించి సావకుండా బతగ్గలమా?’’

కుక్కలు మీద పడ్డట్టు పడ్డారు. భౌభౌమని చెండుకుంటున్నారు. చెడుగుడు ఆడుకుంటున్నారు.కోయ్లీదేవి బిక్కచచ్చిపోయి చూస్తోంది.దర్పణంలో యిదంతా చూస్తున్న సంతోషికుమారి ముఖంలో ప్రమాదాన్ని పసిగట్టిన భయం. ఊపిరి వుగ్గపట్టి చూస్తోంది. యముడూ చిత్రగుప్తుడూ చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారు.కోయ్లీ చూస్తుండగానే యింట్లోని సామాను తీసి బయటపడేస్తున్నారు. గిన్నే ముంతా దాకా డోకీ  చేటా చీపురూ  బుట్టా తట్టా  బట్టా పాతా.. చేతికి దొరికింది దొరికినట్టు విసురేస్తున్నారు.చెప్తేగాని యిరవై యేళ్ళని తెలియని కోయ్లీ చెల్లెలు ఆపమన్నట్టు అందరి కాళ్ళమీదా పడి మొక్కుతోంది. కిందామీదా పడుతోంది.కోయ్లీ అలాగే బొంతికూర్చొని వుంది.‘‘నువ్వు మర్యాదగా వూరోదిలి పో..’’‘‘దీనివల్లే నా రేషను షాపు లైసెన్సు కేన్సిలయిపోయింది.. యిక మీ అందరికీ రేషను బందు.. అందరూ పస్తులతో వుండండి..’’కాట్లకుక్కల్ని చూసి జడుసుకున్నట్టు సంతోషికుమారి యమలోకంలో యేడవడం మొదలుపెట్టింది. భటులు గబుక్కున వచ్చి అరచేత్తో పిల్లనోరు మూసి పట్టుకున్నారు.యమధర్మరాజు కన్నార్పకుండా దర్పణంలోంచి భూమ్మీదకి చూస్తున్నాడు. డీలరు కోయ్లీ మీదకొచ్చాడు. మీద మీద కొచ్చాడు. పైకొచ్చిన ఆ రెండు పల్లూ పీకేస్తానన్నాడు. ఎవరో అతణ్ణి పట్టుకు ఆపుతున్నారు. మరెవరో వురుకుతున్నారు. ఇంకెవరో కోయ్లీ చెవిలో యేదో చెపుతున్నారు.

బెదురుగొడ్డులా చూస్తోంది కోయ్లీ.‘‘కళ్ళు పొడిచేయండి..’’భయంతో పిల్లలు చీకట్లో నక్కారు. చేతి పిల్లాడు చేవదప్పి పక్కనే పడున్నాడు. ఇంత గొడవ జరుగుతున్నా కళ్ళు తెరవడం లేదు. చచ్చిన శవమై పడున్నాడు. కోయ్లీ చెల్లెలు ఆ పిల్లాన్ని తీసుకొని బయటకు వెళ్ళింది. వీటి వేటితోనూ సంబంధం లేనట్టు యిల్లొదిలి బయట చీకట్లో కూర్చొని శూన్యంలోకి చూస్తున్నాడు కోయ్లీ పెనిమిటి.‘‘వీడి పనే బాగుంది. చక్కగ చుక్కలు లెక్కపెట్టుకుంటున్నాడు..’’‘‘బుర్ర సెడిపోయినోడికున్న సుకము బూమ్మీద మరెవడికీ వుండదనుకో..’’నవ్వులు.చూస్తున్న సంతోషికుమారికి కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. దృశ్యం మసకబారింది. రెప్పలతో కళ్ళు గట్టిగా నొక్కి కన్నీళ్ళను బయటకు తోడి పిండింది. దృశ్యం తేటయ్యింది. బుగ్గల మీదుగా జారిన ధార నోటిని మూసిన భటుల చేతుల్ని తడిపాయి. భటులు చేతులు తీసి దులుపుకున్నారు. పన్నీరనుకున్నాడు పరధ్యానంగా వున్న యమధర్మరాజు.‘‘అమ్మా పారిపో.. పారిపో..’’‘‘వినపడదని చెప్పానా?’’ ప్రమాదాన్ని పసిగట్టినట్టు సంతోషికుమారి పెద్దగా అరవడం మొదలుపెట్టింది. కసురుకున్నాడు చిత్రగుప్తుడు. భటులు తమ విధిని గుర్తించి మళ్ళీ ఆపిల్ల నోరు మూసి పట్టుకున్నారు.గుండెలోని దుఃఖం కళ్ళలో నీళ్లై వూరుతూ వురుకుతూ రెప్పల్ని వొరుసుకుంటూ వలవలా జలజలా జారుతూ కారుతూ జావగారుతూ తల్లడిల్లిపోతూ తల్లిని చూస్తోందా పిల్ల.

కోయ్లీని కొందరు అటు లాగారు. కొందరు యిటు లాగారు. తోపులాట. తిట్లూ. పోట్లూ.ఒక్కసారిగా కోయ్లీ చీకట్లోకి దూకింది. పొదల మాటున దాక్కుంది. పట్టుకు దొరక్కుండా పరిగెత్తింది. ఊరి జనం కొంతమంది వెతికారు. వెంటపడ్డారు. చీకట్ల కలిసింది కోయ్లీ.తారామణి సాహూ భరించలేనట్టు యింక చూడలేనట్టు వొక్క క్షణం కళ్ళు మూసుకుంది.చీకటి. కళ్ళు పొడుసుకుంటే కలిగే చీకటి.చీకటి క్రమేణా పలుచనైంది. వెలుగు చొరబడింది. కంటిపాపలు దీపాల్లా వున్నాయి.అప్పటికే ముఖాన చల్లిన నీళ్ళ వల్ల తడిసిన చంద్రబింబంలా వుండి సొమ్మసిల్లి పడివుందా పిల్ల. ‘‘సంతోషి..’’‘‘పరవాలేదు ప్రభూ.. కాస్త కళ్ళు తిరిగినవి.. చిన్న పిల్ల.. చీకటి కమ్మినది..’’యమధర్మరాజు రెప్ప కదపకుండా సంతోషి కళ్ళలోకి చూశాడు. ఏ క్షణమైనా ప్రాణం పోయే మార్గాల్లా వున్నాయి సంతోషి కళ్ళు. కాంతి కోల్పోయిన ఆపిల్ల గాజుకళ్ళ మీద యేవో చిత్రాలు చిత్రంగా కదలాడుతున్నాయి. యమధర్మరాజు చూపు అలాగే నిలబడిపోయింది.సంతోషి కళ్ళ కాన్వాసు మీద సంతోషి?!సంతోషి కళ్ళు మసకబారడంతో రెప్పలు పులుముకుని గుడ్డి దీపపు వెలుగులో చూసింది. నేలన పడివున్న ఆపిల్ల కళ్ళకి అది పగలో రాత్రో అర్థం కాలేదు. అది గుడ్డి దీపమో మబ్బుకమ్మిన సూర్యుడో మబ్బిడిసిన చంద్రుడో స్పష్టం కాలేదు. కళ్ళు మూసుకుంది. నీరసంగా మూలిగింది. వీధికుక్క వొకటి వొచ్చి సంతోషి ముఖం దగ్గర ముఖం పెట్టి వాసన చూసింది. ఇంకా గాలి ఆడుతోందని గ్రహించినట్టే వుంది. కూ కూ మంది. నెమ్మదిగా అక్కడినుండి వెళ్తూ ఖాళీ గిన్నెల్ని వదలకుండా అవస్థ తీరనట్టు లేనిది నాకింది. నాలుక చప్పరించింది. జొల్లు కార్చింది. 

కుక్కని అదరలేకపోయింది సంతోషి. నోట మాట రాలేదు. గొంతు పిడచగట్టుకు పోతోంది. బలిమిన లేచి కష్టంగానైనా కూర్చోబోయింది. వల్లకాలేదు. దేకుతూ. దేనికోసమో దేవులాడుతూ.వారం పొద్దయి సంతోషి కూర్చున్నచోట కూర్చోలేకపోతోంది. నిల్చున్న చోట నిల్చోలేకపోతోంది. ఉన్నచోట వుండలేకపోతోంది.వారం పొద్దయి ఆట లేదు. పాట లేదు. తోటి పిల్లలతో చెలిమి లేదు. స్నేహం లేదు.వారం పొద్దయి యింట్లో అగ్గి లేదు. పొయ్యి వెలగలేదు. కట్టె కాలలేదు. కుండ కుతకుత మనలేదు. దాక దడ దడమనలేదు. పేగులు సుర్‌ సుర్‌ మని కాలడమూ మానలేదు. కుండలోని మంచినీళ్ళు కూడు కాలేదు. దప్పిక తీర్చే గంజి కాలేదు. చిన్ని డొక్క నిండలేదు. పేగులు గుర్‌ గుర్‌ మని చప్పుడు చెయ్యడమూ మానలేదు.‘‘బడి తెరిస్తే బాగుణ్ణు. దుర్గామాత మండిపోయిన దుర్గామాత. చాలవా పూజలు? ఇంకెన్ని రోజులు చేస్తార్రా పూజలు? పూజలన్నాళ్ళూ పస్తులే. మధ్యాహ్న భోజనానికి మరి దారిలేదు.’’సంతోషి గొణుక్కుంటూ చేతివేళ్ళని లెక్కపెట్టుకుంది. ఎన్నిసార్లు లెక్కపెట్టినా అంతే వస్తోంది. అలికీ వస్తోంది. ఆకలీ వేస్తోంది.

ఊర్లోకి వెళ్తే?‘‘పిడికెడు అన్నం పెట్టమ్మా తల్లీ..’’సంతోషి అడుక్కుంది. ఇల్లిళ్ళూ తిరిగింది.‘‘అన్నం అమృతమయిపోయింది. యెవరు పెడతారు?! ఎవరి కుండ.. వారి గుండె!’’    కూతురు మాటకు కోయ్లీ గుండె గుభిల్లుమంది. భీతిల్లింది. తల్లడిల్లింది. కోయ్లీ కూడా అడుక్కుంది. రేషను షాపు చుట్టూ తిరిగింది. ఒకటికి మూడుసార్లు. అవస్త తీరలేదు. అతీ లేదు. గతీ లేదు. డీలర్‌ అధార్‌ లింక్‌ కాలేదన్నాడు. ఇవ్వలేనన్నాడు. చస్తే చావండన్నాడు. ‘‘నేటికి ఆరు దాటి యేడు మాసాలవుతోంది. కాళ్ళరిగిపోయేలా తిరుగుతున్నాను. రేషనివ్వు. చచ్చి నీ కడుపున పుడతాను..’’‘‘ఛీ.. నా కడుపున పుడతావా పందీ..’’దండమెట్టింది. చేవజచ్చింది. చేతకాని తనమొచ్చింది. వొట్టి చేతులతో వెనుదిరిగింది.ఎప్పట్లాగే కోయ్లీ గడ్డి కోసింది. వారమంతా వొళ్ళు ముళ్ళు చేసుకు కోస్తే వొచ్చేది యెనభై రూపాయలు. ముందు తీసుకున్న డబ్బులకు విరిపేసి చెల్లు చేశారు. పల్చటి టీ డికాషను నీళ్ళే ప్రాణాధారమయింది. పిల్లల ప్రాణం యెలా నిలపాలో అర్థం కాలేదు.‘‘పెద్దమ్మ కూడా అన్నం లేదందమ్మా..’’‘‘ఒకరోజు చస్తే యెవరన్నా యేడుస్తారు.. రోజూ చస్తే యెవరేడుస్తారు?’’పొద్దుబోయే వేళయింది. ఇయ్యాల లక్షి వారం. ఇంటి ఆడపిల్ల లచ్చిందేవి. పొర్లి పొర్లి దొర్లి దొర్లి యేడుస్తోంది.‘‘ఏమయ్యిందమ్మా..?’’‘‘కడుపు నొప్పి..’’మెలితిరిగిపోతోంది సంతోషి. కడుపులోవి అవి పేగులు కావు. పాములు. ఆకలి బుసలు కొడుతున్నాయి. అగ్నిని విరజిమ్ముతున్నాయి. ఆకలి. పిడికెడు మెతుకులు పడలేదని పిడిగుద్దులు గుద్దుతున్నాయి. తట్టుకోవడం కష్టంగా వుంది.గింజుకుంటున్న కూతురు గొంతులో నీళ్ళు పోసింది కోయ్లీ. గుక్కెడు మింగి గుక్కెడు వొదిలేసింది. కళ్ళంట కూడా. గుడ్లు నిలేసింది.‘‘అమ్మా..’’మాట రాలేదు. గాలి వచ్చింది. బెక్కుతోంది. శరీరంలోంచి ప్రాణం పోవడానికి తెంపుకోవడానికి నానా యాతన పడుతోంది.‘‘నరక యాతన..’’చిత్రగుప్తుడు చూడలేనట్టు దర్పణంలోంచి తలతిప్పుకున్నాడు. యమధర్మరాజుతో పాటు సంతోషి తన్ని తాను చూస్తోంది.

‘‘అన్నం.. అన్నం.. అన్న.. అ..’’నోరు తెరచుకు వుండిపోయింది. తెరచిన రెప్పలు తెరచినట్టే వుండిపోయాయి. కంటిలోని నల్లగుడ్డు కదల్లేదు. కంటిలోని ఆఖరి నీటి చుక్క నేల మీద పడాలా వద్దన్నట్టు ఆగిపోయింది. గడ్డకట్టుకుపోయింది. శ్వాస ఆగిపోయింది.సంతోషి తన చావుని తాను చూసి కొయ్యబారిపోయింది. ఆనక తేరుకొని వెక్కి వెక్కి యేడ్చింది. ‘‘నేను చచ్చిపోయానా?’’ ‘‘ఊ..!’’‘‘ఎందుకూ..?’’యమధర్మరాజు సమాధానం యివ్వలేదు. సమాధానం కోసం దర్పణంలోకి తొంగి చూశాడు. సంతోషి కూడా.కోయ్లీ ఇంటి చుట్టూ జనం. పోలీసులూ.. అధికారులూ.. మీడియా.‘‘ఆమె కోరుకుంటే గ్రామస్తుల నుండి పోలీసు ప్రొటెక్షన్‌ కల్పిస్తాం..’’‘‘ఇప్పుడు కావలసింది పోలీసు ప్రొటెక్షన్‌ కాదు, ఫుడ్‌ ప్రొటెక్షన్‌..’’‘‘ప్లీజ్‌ రాజకీయం చేయొద్దు. ఆధార్‌ లింక్‌ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు యిచ్చింది. అందుకే డీలర్‌ లైసెన్సు రద్దు చేశాం..’’‘‘సంతోషి ఆకలి చావుకు యెవరు బాధ్యులు?’’‘‘నో.. ఇట్స్‌ నాట్‌ కరెక్ట్‌. ఆకలి చావు కాదు.. మలేరియా ఎటాకయి చనిపోయింది..’’సంతోషి వెర్రి ముఖం వేసుకొని యమధర్మరాజు వంక చూసింది. యమధర్మరాజు చూపులు మాత్రం దర్పణం మీదే వున్నాయి. ‘‘మలేరియా కాదు, నా కూతురు ఆకలితో చనిపోయింది. రొండుగంటలు నా కళ్ళముందే కొట్టుకుంది. ‘అన్నం..’ అని ఆఖరిగా అడిగింది. పిడికెడు మెతుకులు పెట్టలేకపోయాను..’’కోయ్లీ కంటికీ మంటికీ యేకధారగా యేడుస్తోంది. తారామణి సాహూ ఆమె భుజమ్మీద చెయ్యి వేసి నొక్కి పట్టుకుంది.‘‘సంతోషికుమారి మలేరియాతో చనిపోయింది..’’అధికారులు మరోసారి మీడియా ముఖంగా ప్రపంచానికి ప్రకటించారు.తమ జాతి మీద నింద వెయ్యడం భరించలేని వో యువ ఎనాఫిలిస్‌ దోమ రయ్‌ మంటూ అక్కడికి వొచ్చింది. ఎర్రగించి చూసింది. ఆవేశంతో ఊగింది. తామే కారణం అన్నవాళ్ళని అక్కడున్న వాళ్ళని కుట్టాలన్నంత కసీ కోపం వచ్చింది. తన సూది తొండాన్ని పైకెత్తి ఘీంకరించింది.‘‘మలేరియా కాదని చెప్పిన హెల్త్‌ వర్కర్ని వుద్యోగంలోంచి సస్పెండు చేశారు..’’‘‘లేదు.. మలేరియానే’’వింటున్న ఎనాఫిలిస్‌ దోమకు యెన్నడూ లేని రక్తదాహం కలిగింది. కుట్టబోయింది. అయితే, అనుభవమున్న తోటి దోమ ఆపింది. ‘‘వొద్దు.. నువ్వు కుడితే.. యే వొక్కరికి మలేరియా వొచ్చినా నిందను నిజం చేసేస్తారు. ఇప్పటికే మనల్ని పురుగులకంటే హీనంగా చేసి మాట్లాడుతున్నారీ మనుషులు..’’

యువ ఎనాఫిలిస్‌ దోమ ఆలోచనలో పడింది. నిగ్రహించుకోవడం దానికి చాలా చాలా కష్టమైంది.‘‘కావాలంటే కక్ష తర్వాత తీర్చుకుందాం. వీళ్ళ పాపాన్ని పుణ్యంగా మార్చొద్దు. వీళ్ళకు మరొక్క అవకాశం యివ్వొద్దు..’’బతిమలాడిన మీదట యువ ఎనాఫిలిస్‌ దోమ ఆగనయితే ఆగింది గాని దానికి యేదో వొకటి చెయ్యాలని మాత్రం అనిపించింది. ఏమీ చెయ్యలేకపోతే కనీసం చావనన్నా చావాలనిపించింది.‘‘నేను మహా అయితే యిరవై రోజులే బతుకుతాను..’’‘‘ఆ యిరవై రోజుల్లో నువ్వు పదివేలుగా మన జాతిని వృద్ధి చేస్తావు. ఆ పదివేలు యిరవై రోజుల్లో యెన్నెన్ని లక్షలుగా వృద్ధి చెందుతుందో వొక్కసారి ఆలోచించు. నువ్వు మనిషివి కాదు, నీకు నీ జాతిపట్ల బాధ్యత వుంది..’’‘‘లేదు. నేనీ అవమానభారం భరించలేను. నాకు నా ప్రాణంకన్నా నా జాతి ఆత్మగౌరవం ముఖ్యం..’’‘‘ఆగు.. నామాట విను. అఘాయిత్యానికి వొడిగట్టకు..’’ఆ యువ ఎనాఫిలిస్‌ వినలేదు. ఉద్రేకంతోనూ వుద్వేగంతోనూ ఝామని గాలిలా లేచింది. స్వేచ్ఛా చక్కెర్లు కొట్టింది. అనివార్యంగానైనా కుట్టే ప్రా«థమిక హక్కును కోల్పోయినానే అని వగచింది.‘‘నేను నా జాతి చావుని సమర్థించను. నా జాతి అవమానం నాదని చస్తున్నాను.’’తోటి దోమకి యువ ఎనాఫిలిస్‌ ఆఖరి మాటలు లీలగా వినిపించాయి.అప్పుడే వో అధికారి సిగరెట్టు ముట్టించాడు.గుండెలనిండా గట్టిగా పీల్చాడు. సిగరెట్టు యెర్రగా రాజుకుంది. యువ ఎనాఫిలిస్‌ యెగిరి వెళ్ళింది. అగ్గిలోకి దూకింది. రాజుకున్న సిగరెట్టులోకి దూరింది. మలమల మాడింది. కాలిన సిగరెట్టు బూడిదతో నేల రాలింది. నింగికెగసింది.యమలోకంలో యు వ ఎనాఫిలిస్‌ దోమ ప్రత్యక్షమయ్యింది.ఇదంతా చూస్తున్న యమధర్మరాజు దిగ్భా్రంతికి లోనయి దోమని మెచ్చుకోలుగా తన చేతుల్లోకి తీసుకున్నాడు.‘‘నీకు ఆధార్‌ కార్డ్‌ వుందా..?’’అలవాటులో పొరపాటన్నట్టు నాలుక్కరుచుకున్నాడు చిత్రగుప్తుడు.ఎనాఫిలిస్‌ దోమ కొండితో యమధర్మరాజు చేతిమీద వొక్క పోటు పొడిచింది.అంతే. యమధర్మరాజు చలిజ్వరమొచ్చినట్టు గజగజా వాజవజా వణకడం మొదలుపెట్టాడు. 
- బమ్మిడి జగదీశ్వరరావు 

మరిన్ని వార్తలు