కిరాయి

23 Sep, 2018 00:52 IST|Sakshi

ఈవారం కథ

ఆ రోజు నా ఆటోతో దూరప్రాంతం కిరాయికి వెళ్ళాను. డ్రాపింగ్‌ మాత్రమే, వెయిటింగ్‌ లేదు. మనసంతా ప్రశాంతంగా ఉంది. లోకల్‌ ఆటోస్టాండ్‌లో ఉంటే పొద్దస్తమానం గడబిడే. సీరియల్‌ ఎప్పుడొస్తుందో తెలియదు. కడుపులో ఆకలి చచ్చిపోతుంది. అసలు ఆటోవాళ్ళ బతుకే ఓ విచిత్ర యుద్ధం. విపక్షమైన ఆర్టీసీ వాళ్ళతోనే కాక స్వపక్షమైన ఆటోవాళ్ళతోనూ పోరాడాలి. పొద్దస్తమానం పైచేయి సాధిస్తేనే చేతిలో చిల్లిగవ్వలుంటాయి. ఇక బ్రేక్‌ ఇన్స్‌పెక్టరొక పద్మవ్యూహం. చిక్కకపోతే సంతోషిస్తాం, చిక్కితే చితికిపోతాం. రోడ్‌ ట్యాక్స్‌లతో పాటు అనధికార ట్యాక్‌లు సైంధవుల్లాంటి ట్రాఫిక్‌ కానిస్టేబుళ్ళకు కట్టాలి. ఆటో విడి పరికరాల ధరలు విరుగుడులేని విషంలా మంటపెడుతుంటాయి. ఏ ఆటోవాడైనా అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడని టీవీలో కనబడితే చాలు అనుమానపు చూపులు, అవమానపు మాటలు ఎదుర్కోవాలి.
ఆ మధ్యాహ్నం పాసింజర్లను దింపేసి రోడ్డుపక్క తోపుడు బండి దగ్గర టీ తాగుతూ వెనక్కి వెళ్ళేటప్పుడు కూడా పాసింజర్లు ఫుల్‌గా తగలాలని కోరుకుంటుండగా నాకు వినబడిందా వాక్యం. ‘అయ్యా కిరాయికొస్తావా?’

తిరిగి చూస్తే ముసలావిడ. బలం కోల్పోయిన ఒంటితో బక్కగా బొమికల బొమ్మలా ఉంది.‘ఎంతమంది?’ ఉత్సాహంగా అడిగాన్నేను.శవాన్ని తీసుకెళ్ళాలి బలహీనమైన గొంతుతో చెప్పిందామె.శవం అనగానే జంకినా జవసత్త్వాలు తెచ్చుకున్నాను. కొన్నిసార్లు నిర్ణయానికి ఈ జన్మ కూడా చాలదు, కొన్నిసార్లు మాత్రం సెకను చాలు.‘పదండి’ అని ఆటోస్టార్ట్‌ చేసి ధర్మాసుపత్రికి పోనిచ్చాను. మామూలుగా వంద రూపాయలు తీసుకునేది, శవం అంటే వెయ్యవుతుంది. కిరాయి రెండువేలకి ఒప్పుకుంది.మా ఆవిడెప్పుడూ దెప్పి పొడుస్తుంది.‘ఆ అరవిందన్నయ్యను చూడండి. చేతికి బ్రాస్‌లెట్‌ చేయించుకున్నాడట! వాళ్ళావిడకు నెక్లెస్‌ చేయిస్తానన్నాడట! మీరూ ఉన్నారు.ఎందుకూ? ఎప్పుడూ ఆ ఐదొందలే తెస్తుంటారు’ అని ఎప్పుడూ దీర్ఘాలు తీస్తుంది.అరవింద్‌ గాడు నా ఫ్రెండ్‌ అండ్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌ .నెలరోజుల క్రితం నేను ఆటో కొన్నప్పుడే చెప్పాడు. ‘అసలే నువ్వు మెతక మనిషివి.పాసింజర్లు ఎంతిచ్చినా తీసుకుంటావు. డిమాండ్‌ చెయ్యాల్రా, దబాయింపు కావాల్రా. నా అనుభవాలే ఇప్పుడు నీ అనుభవాలుగా చేసుకో’ అని రోజంతా క్లాస్‌ పీకాడు.ధర్మాసుపత్రి దగ్గరకొచ్చాం. మాకు ముందే ఆసుపత్రికి అంబులెన్స్‌లో యాక్సిడెంట్‌  కేసొకటి వచ్చింది. చెయ్యి విరిగిన తను మిన్ను విరిగి మీద పడ్డట్టు అరుస్తున్నాడు. డాక్టర్‌ గారు లేరు. ఎప్పుడొస్తారో తెలియదని నర్సు ప్రథమ చికిత్స మొదలెట్టింది.

డాక్టరుకో ప్రైవేటు హాస్పిటల్‌ ఉందని తరువాత తెలిసింది నాకు. హాస్పిటల్‌ కి మూలన మార్చురీ రూమ్, పక్కన పోస్ట్‌ మార్టమ్‌ రూమ్‌ దగ్గర బయట పడుకోబెట్టి ఉందో కుర్రాడి శవం. కొంచెం దూరంగా కానిస్టేబుల్‌ కూర్చున్నాడు. ఆటో దిగి ముసలావిడ గబగబా నడుస్తూ ఆ శవం దగ్గరికెళ్ళి తన కొంగుతో కుర్రాడి శవం మీద ఈగల్ని తోలూతూ కుర్చుంది. నేను కానిస్టేబుల్‌ దగ్గరికెళ్ళి నమస్తే చెప్పి ఈ దారుణం ఎలా జరిగిందో ఎంక్వైరీ మొదలెట్టాను.ఈ కుర్రాడు కరంటు లైన్‌ మేన్‌ దగ్గర హెల్పర్‌. విద్యుత్‌ స్టేషన్‌లో లైన్‌ కటింగ్‌  తీసుకుని  స్తంభం మీద కరంటు ఆపించి ఈ కుర్రాణ్ణి రిపేర్‌ నిమిత్తం స్తంభం పైకి ఎక్కించారు. ఆపరేటర్‌లు డ్యూటీలు మారి ఆ వచ్చిన ఆపరేటర్‌ కరెంటు లైన్‌ ఆన్‌ చేసాడు. ఈ కుర్రాడు స్తంభం మీదే గిలగిలలాడి చచ్చిపోయాడు. కేసు ఫైలయ్యింది. పోస్ట్‌ మార్టమ్‌ చెయ్యాలి అని ఏదో సర్వసాధారణ విషయంలా చెప్పాడు కానిస్టేబుల్‌. సాయంత్రమవుతోంది. చెయ్యి విరిగిన యాక్సిడెంట్‌ కేసు అప్పటిదాకా అరిచి నొప్పి అలవాటయ్యి ఊరుకున్నాడు. వ్యవస్థ మీద విరక్తితో కూడిన నవ్వొకటొచ్చింది. ఇక్కడ ఈవిడ్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, పలకరించిన వాళ్ళు లేరు.

ధర్మాసుపత్రుల్లో ధర్మం లేదు. డబ్బు అనే ధనాత్మక శక్తి మనదగ్గరుంటే కార్పొరేట్‌ హాస్పిటళ్ళు కార్పెట్లు తెరచి మరీ వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తారు. చీకటి చిక్కగా మారుతుంది. ఆలస్యమవుతున్న కొద్దీ నాకు ఆనందంగా ఉంది. వెయిటింగ్‌తో నా కిరాయి మరింత పెరుగుతుంది. ఆవిడ వైపు నడిచాను. కిరాయి మూడు వేలని చెప్పాను. తనలో తానే కుమిలిపోతూ కన్నీరు పెట్టుకుందావిడ. నేను కరిగిపోతున్నా లేని కాఠిన్యాన్ని తెచ్చుకున్నాను. ఆటోవాళ్ళ కాలగమనంలో ఇలాంటివి కోకొల్లలు.అర్ధరాత్రప్పుడు పోలీస్‌ జీపొచ్చింది. కానిస్టేబుల్‌ జీప్‌ దగ్గరకు పరిగెత్తాడు. ఏవో కాగితాలు తెచ్చి ఆవిడతో వేలిముద్రలు వేయించుకున్నాడు. డాక్టర్‌ పోస్ట్‌మార్టమ్‌ చేసిన తరువాత శవాన్ని తీసుకెళ్ళాలన్నాడు. బతికే ఉన్న కొడుకుని కత్తులతో కోస్తారేమోనన్న భ్రాంతిలాంటి భయంతో ఆమె పోస్ట్‌మార్టమ్‌ వద్దని వేడుకుంది. చట్టం తమ చుట్టమే కాబట్టి పోస్ట్‌మార్టమ్‌ చెయ్యకుండానే చేశారన్న డాక్టర్‌ రిపోర్టుకు తాము ఒప్పుకోడానికి పదివేలిమ్మన్నాడు. అంత ఇచ్చుకోలేమని వ్యధాభరిత çహృదయంతో చెప్పిందావిడ. బేరసారాలు సాగించి కానిస్టేబుల్‌ ఐదువేలకి తేల్చి, డబ్బు తీసుకుని జీపు దగ్గరికెళ్ళాడు. ఇప్పుడు నేను కూడా కిరాయి తేల్చుకోవాలి. అరవింద్‌ పాఠాలు నా చెవుల్లో మార్మోగుతూనే నేనే అరవిందయ్యాను. ఆటో కిరాయి నాలుగు వేలు ఇమ్మని, ఇష్టం లేకపోతే వెయిటింగ్‌ ఛార్జీ మూడువేలివ్వండి వెళ్ళిపోతానన్నాను. ఆమె విలవిలలాడినట్టు కనిపించింది. జీవనోపాధి కోసం జంతువులా ప్రవర్తించాననిపించింది. మాటల మంత్రాలతో మమేకమై మానవత్వాన్ని మరిచిపోయానా! ఆవిడేదో అనబోయింది. అరవింద్‌ నాలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేశాడు. మళ్ళీ  నాలో పశుత్వం  పైకొచ్చింది. ససేమిరా కుదరదన్నాను. ఆవిడ మౌనంగా తల దించుకుంది.

రాత్రి పరిగెడుతోంది. ఆవిడ కళ్ళకు కునుకు రావట్లేదు, కన్నీళ్ళొస్తున్నాయి. అరవింద్‌ గాడింట్లో కొన్న ఎల్‌ఈడీ టీవీని చూసి మా కాలనీ మొత్తం ఎంత గొప్పగా చెప్పుకుందో! డబ్బుని మాత్రమే మనిషికి ప్రామాణికంగా చూస్తుందీ లోకం. ఆకలి కంటే గొప్ప శత్రువు, డబ్బుకంటే గొప్ప మిత్రుడు లేరు. డబ్బువల్ల వచ్చే సుఖాలు తలుచుకుంటుంటేనే ఎంత సుఖంగా ఉందో! ఆ సుఖాలే అందమైన జ్ఞాపకాలుగా మారతాయి. లేకపోతే బతుకంతా ఓ పీడకలే. సుషుప్తిలో నిద్రపోతున్న కోరికలు ఒళ్ళు విరుచుకుని లేచి నిలబడ్డాయి. కోరికల కొలిమిలో కాలిపోతున్నాను. రోజుకు ఐదొందలు సంపాదించే నేను ఇప్పుడు నాలుగు వేలు సంపాదించబోతున్నాను. ఆ డబ్బు మా ఆవిడకిస్తే ఎంత సంబరపడుతుందో! ఇది విని అరవింద్‌ గాడు నన్నెంతలా అభినందిస్తాడో! అన్న ఆలోచనలతో, ఆనందంతో ఆ రాత్రి ఆవిడతో పాటు నేనూ నిద్రపోలేదు.తెల్లవారుఝూమున ఇద్దరు వ్యక్తులొచ్చారు. డాక్టర్లకి పోస్ట్‌మార్టమ్‌ హెల్పర్లమని చెప్పారు. చెరో ఐదొందలివ్వండి. మందు వెయ్యకపోతే ఈ శవాన్ని పోస్ట్‌మార్టమ్‌ రూమ్‌ కి తీసుకెళ్ళలేం అని అదో ఆనవాయితీగా చెప్పారు. నేనామె వైపు వకాల్తా పుచ్చుకుని పోస్ట్‌మార్టమ్‌ వద్దని పోలీసులకు డబ్బులిచ్చాంగా అని నిద్రపోతున్న కానిస్టేబుల్‌ వైపు చూశాను. ‘పోలీసుల వాటా వేరు, డాక్టర్ల వాటా వేరు. ఇంతకు మించి మీకు చెప్పక్కర్లేదనుకుంటా’ అని తల్లిదండ్రుల ఆస్తిని పిల్లలు పంచుకోవడం సహజం అన్నట్టు చెప్పాడు అందులో ఒకాయన. ఆవిడను మభ్యపెట్టి వాళ్ళు మద్యానికి డబ్బులు పట్టుకుపోయారు.

తూర్పుకి తొలి వెలుగు తగిలింది. సూర్యుడు కూడా ఈమెను బాధ పెట్టడానికే వస్తున్నట్టు నాకనిపించింది. చాలాసేపటి తరువాత ఇందాకటి జంటలో ఒకాయన మళ్ళీ వచ్చాడు. డాక్టర్‌ తరపున వాదానికి దిగాడు. పోస్ట్‌ మార్టమ్‌ చెయ్యకుండానే రిపోర్ట్‌ ఇచ్చేయడానికి పెద్ద మొత్తం అడిగాడు. ఆవిడ భయపడిపోయింది. అంత ఇచ్చుకోలేనని బతిమాలింది. కొంత ఇచ్చుకుంటానని బేరమాడింది. చివరికి పోలీసులకిచ్చినంత ఫైనలయ్యింది. డబ్బు తీసుకెళ్ళి కాగితాలు తీసుకొచ్చి ఈవిడ వేలిముద్రలు వేయించుకుని శవాన్ని తీసుకెళ్ళొచ్చన్నాడు. తను వెళ్ళిపోయాడు. తన పని కూడా అయిపోయినట్టు పోలీసూ వెళ్ళిపోయాడు. నేను,ఆమె,శవం మిగిలాం.

శవాన్ని ఆటోలో పెట్టడానికి సాయం పట్టడానికి కూడా ఆమెకి ఎవరూ లేరు. సహాయం లేని బాధామయ జీవితం. ఒంటరితనం, నిస్సహాయత బాధను అనేక రెట్లు పెంచుతాయి. సానుభూతి చూపించడానికి దేశంలో 130 కోట్లమంది ప్రజలున్నారు, సాయం చెయ్యడానికి మాత్రం ఒక్కడూ లేడు. శవం చుట్టూ దుప్పటి చుట్టి ఆటోలో పెట్టడానికి సహాయం చేశాను. ఆమె కళ్ళతో కృతజ్ఞతా భావం చూపింది.నాలుగ్గంటల్లో గమ్యం చేరతాం. ఉదయం తొమ్మిదయ్యింది. త్వరగా టీ తాగి త్వరత్వరగా ఇంటి ఆదుర్దాతో ఆటోస్టార్ట్‌ చేశాను. శవమైన కుర్రాడి తలను ఆమె ఒడిలో పడుకోబెట్టుకుని కూర్చుంది. రెండు గంటల ప్రయాణం తరువాత బైపాస్‌ లో పెద్ద ధర్నాతో ట్రాఫిక్‌ జామ్‌ లో ఇరుక్కున్నాం. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పైన ఎండ మాడ్చేస్తుంది, లోపల ఆకలి దంచేస్తుంది. అదే అదనుగా హోటల్‌ కెళ్ళి భోంచేసి వచ్చాను. ఆటోలో మాత్రం ఒళ్ళో నిద్రపోతున్న పిల్లాడికి నిద్రాభంగం అవుతుందేమోనని కాళ్ళు కదల్చకుండా ఉన్న ఆమెని చూశాను. ఒళ్ళు గగుర్పొడిచింది. ఎండ వేడిమికి ఆమె ఒళ్ళంతా వర్షధారల్లా చెమట. నా ఊహ నిజమే, సూర్యుడు కూడా ఆమెను హింసిస్తున్నాడు. నాకు తెలిసి ఆమె నిన్న మధ్యాహ్నం అన్నం మెతుకు ముట్టినట్టు నేనెరుగను. అన్నం తినమని అడిగాన్నేను. తల అడ్డంగా ఊపింది. అసలు ఆమె మనలో లేదు. నా అజ్ఞానానికి నవ్వొచ్చింది. నిజానికి అమ్మ కడుపు తృప్తిగా నిండేది బిడ్డ భోంచేశాకే గదా! ఉద్యమకారుల వైపు చూశాను. అంతలోనే మట్టిపిడతలో బంధించిన భూతం బయటపడ్డట్టు నాలో అంతర్లీనంగా ఉన్న రాక్షసుడు బయటకొచ్చాడు. సాయంత్రం దాకా ధర్నా పూర్తయ్యేలా లేదు. ఆటో వెయిటింగ్‌ ఛార్జి ఇంకో వెయ్యి పెరుగుతుందని ఆమెతో అన్నాను. మారు మాట్లాడలేదామె. ఎవరో తప్పు చేస్తే ఆ శిక్ష ఇలాంటోళ్ళు అనుభవించాలి. సాయంత్రం మూడు గంటలకు ట్రాఫిక్‌ క్లియరయ్యింది. ఆమె వంక చూసాను. ఆ గుండెల్లో ధైర్యం లేదు,దిగులు మాత్రమే ఉంది.ఈ జన్మకు ఆ దిగులు పుట్టిన శరీరంలో ఆనందం ఉండదు. ఆటో అద్దంలో నుండి ఆమెని చూశాను.

ఆమె చూపులు ముందుకు చూస్తున్నా లోచూపు మాత్రం ఎటో ఉంది. దేవుడ్ని క్షమించమని వేడుకున్నాను. అయినా దేవుడి గురించో, దేశం గురించో ఆలోచిస్తే మనం బతకలేం, సుఖంగా ఉండలేం అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. అణాకాసు లేనోళ్ళదెప్పుడూ అరణ్యరోదనే. వినే వాడుండడు. విన్నా ఆలోచించే వాడుండడు. ఆలోచించినా ఆదరించే వాడుండడు.అడవి గుండా ప్రయాణం.సాయంత్రం నీరెండ, నిశ్శబ్దం. మట్టి రోడ్డులో ఆటో పాకుతోంది. చాలా దూరం ప్రయాణించాక ఐదారు పాకలున్న గూడెం దగ్గర ఆటో ఆపమంది. తురాయి చెట్టున్న పాక నీడలో చిన్న అరుగు పక్కన ఒక మంచం వాల్చి వచ్చింది. ఈలోగా చుట్టుపక్కల పాకలోళ్ళు పోగయ్యి శవాన్ని మంచం మీద పడుకోబెట్టారు. శోకాలు మిన్నంటాయి. శవం చెడిపోతుండడంతో కాసేపటికే శవాన్ని దహనానికి తీసుకెళ్ళిపోయారు. ముసలావిడ్ని ఓదార్చి ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు.ఇంకో మంచం మీద కూర్చున్న నాకు నవ్వారు ముడులు గుచ్చుతున్నాయి.పేడతో అలికిన అరుగు వాసన కొడుతోంది. ఎర్రబడ్డ కళ్ళతో ముసలావిడ డబ్బులు తీసి నా చేతికిచ్చింది. లెక్కబెడితే మూడువేలొచ్చాయి. సహజత్వం గొంతును నొక్కిపడుతున్నా కృత్రిమ కోపం కట్టలు తెచ్చుకుంది. ‘ముష్టి ఏమైనా వేస్తున్నావా?’ అని గట్టిగా అరిచాను. మూడువేలు మంచం మూలకి విసిరి కొట్టాను. ఆవిడ వణికింది.

‘అడివి మీద కడుపునింపుకొనే వోళ్ళం. దయ సూపయ్యా..’ అని దీనంగా అంది.అసలేమీ లేదు అనే వాళ్ళ దగ్గరే అంతా ఉంటుందని నా అనుమానం. పిల్లల్ని పెంచే స్థోమత లేనప్పుడు కనకూడదు అన్నాను కర్కశంగా.కనిపించని కత్తేదో ఆవిడ మెడనరాలు తెంపేసినట్టు తల దించుకుంది. నెత్తిమీద నుండి స్నానం చేసినట్టు ఆవిడకు చెమటలు కారిపోతున్నాయి.కత్తికంటే కంఠ ధ్వని ఎంత దారుణంగా గాయపరుస్తుందో నాకప్పుడే తెలిసింది. అయినా నాలో అరవింద్‌ ఆనందపడ్డాడు. వాడి ఆనందమే కానీ ఈవిడ విషాదం నాకక్కర్లేదనిపించింది. నేను అరిస్తే ఆమె నిస్సహాయంగా ఉండడం తప్ప మారు మాట్లాడదని నాకు తెలుసు. ఆలోచించే అవకాశం ఇవ్వకూడదని అరిచినట్టు మాట్లాడడం మొదలు పెట్టాను. నాకు తెలిసి నాకంటే ముందు విధి ఈమెకు పుట్టుక నుండి మాట్లాడే అవకాశం ఇవ్వలేదనుకుంటున్నాను.కాసేపటి తరువాత ఆవిడ తలెత్తి ‘రెక్కాడితే గానీ,డొక్కాడని బతుకులు మాయి.. కనికరించయ్యా’ అని పాదాలు పట్టుకోబోయింది.నా ఆశల చెట్టు ఎవరో నరికేసినట్టు నేను దూరంగా జరిగి ‘నువ్వెన్ని  నాటకాలు ఆడినా ఐదువేలకి రూపాయి తక్కువైనా తీసుకోను’ అని కుత్తుక మీద కత్తి పెట్టినట్టు చెప్పాను. ఇంకిపోయిన ఆవిడ కళ్ళ నుండి సెల ఉబుకుతోంది. పైట కొంగుతో ముఖమంతా తుడుచుకుని ఇప్పుడే వస్తానని పక్కనున్న గుడిసెల వైపుకెళ్ళింది.నాలో రాజీకి తెచ్చాననే రాక్షసత్వం చల్లబడింది. ఎక్కడో అప్పు పుట్టిందనుకుంటా... నేను విసిరేసిన మూడువేలు ఏరుకొచ్చి రెండు వేలు కలిపి వణుకుతున్న చేతులతో నా చేతిలో పెట్టింది. ఆ డబ్బును నా చేతుల్లోకి తీసుకోగానే పెద్ద సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న ఆనందంతో ఆటో ఎక్కాను. చెమటకు చల్లగాలి తగిలి హాయిగా ఉంది.నెమ్మదిగా కోపంతో పాటు గుండెవేగం తగ్గింది.

‘అయ్యా పొద్దుబోయింది. అడివి మా సెడ్డది. ఈ రాతిరికి ఈడే పొడుకుని పొద్దెక్కాక పోదువు’ అంది ముసలావిడ. అదేమీ పట్టించుకోకుండా ఆటో స్టార్ట్‌ చేశాను. స్టార్టవలేదు. చీకటిని చూసి ఆటో  భయపడ్డట్టుంది.అడవి మధ్యలో దారిలో ఎక్కడన్నా ఇలానే మొరాయిస్తే... నా పరిస్థితి తలుచుకుని నాకే భయమేసింది. ఆటో దిగి అడవిని చూశాను. చీకటిని మింగి ఆకలి తీరక నోరు తెరుచుక్కూచ్చున్నట్టుంది. ఉండిపోతానన్నాను.అరుగు మీద కూర్చున్నాను.ముసలమ్మ పక్క గుడిసెలకెళ్ళి పుట్టగొడుగులు, పచ్చి జీడి గింజలు పట్టుకొచ్చింది. ఇంట్లోంచి వెదురు బియ్యం తీసుకొచ్చి తురాయి చెట్టు కింద పొయ్యి వెలిగించింది. మంట వెలుగులో తురాయి పూలు కళ్ళెర్రజేసి నన్ను చూస్తున్నాయి.చూస్తుండగానే చలి నాలో ఆకలిలా పెరిగిపోయింది. ఒంటిమీద రెండు చెంబుల నీళ్ళు పోసుకొచ్చేసరికి దాదాపు సగం ప్రాణం పోయింది. విప్పిన బట్టలే కట్టుకుని గుడిసెలో కెళ్ళాను. పాక చూరుకు లాంతరు వేలాడుతోంది. విందులో వెలుగుకి కూడా వాటా కావాలని లాంతర్లో జ్వాల నాలుక ఆడిస్తుంది. ఆకలి మీద ఎంత తిన్నా ఆహారపు రుచికి ఆకలి చావట్లేదు. ముసలమ్మ దగ్గర కూర్చుని అన్నం మెతుకంత కోపం కూడా లేకుండా కొడుక్కి పెట్టినట్టు వద్దన్నా వడ్డిస్తోంది.మంచం మీద దుప్పటి దులిపి రగ్గూ ఇచ్చింది. నేను తినగా మిగిలిన అన్నం తిని ముసలమ్మ చీరకొంగు కప్పుకుని పడుకుంది. భుక్తాయాసం తీరాక చలి చుట్టుముట్టింది. రగ్గులో దూరి భుజాలెగరేశాక మంచానికి కొంచెం దూరంగా పడుకున్న ఆమె కనబడింది. దీపపు వెలుగులో ముడతలు పడిన ముఖంలో జీవం లేదు. ఆ దేహంలో ప్రాణముందంటే దేవుడి ముందైనా లేదనగలం. ఆ దేహంలో మానవత్వం లేదంటే దేవుడిని ఎదిరించైనా కాదనగలం.

అరవింద్‌ , నా ఇల్లాలు నన్ను హీరో వర్షిప్‌ ముంచేస్తున్న దృశ్యాలు కరిగిపోతున్నాయి. నా అంతర్లీన ప్రపంచంలో ఎవరో నాటిన విత్తనాలు ఇంత బలంగా వేళ్ళూనుకున్నాయేమిటి? మాటల కాఠిన్యానికి మెరుగులు దిద్దుకుంటూ ముచ్చట పడిపోయానేమిటి?! పదిరోజుల్లో సంపాదించే డబ్బు అన్యాయంగా రెండ్రోజుల్లో జలగలా ఆమె రక్తం పీల్చి సంపాదించాను.వేడికి వెన్న తగిలినట్టు కరగడం మొదలయ్యాను.ఆమె ముఖం నేను రోజూ మొక్కే దేవత దగ్గర నా పాపపు భారం పెంచేసింది. తప్పు చేసేశాను. దిద్దుకోవాలి.నా ఆత్మ నా మీదే తిరగబడుతోంది. ప్రపంచంలో ఇంతకన్నా మనిషి మీద గొప్ప తిరుగుబాటు ఇంకొకటి ఉండదు. నా మనసు నుండి అరవిందుని తోసేశా... మేకపోతు గాంభీర్యాన్ని కూడా.ఎక్కడో మర్యాదస్తులకు దూరంగా...రాత్రిని కప్పుకున్న పాకలో... గొడ్డుచలి నుండి దూరంగా జరగడానికి కప్పుకోవడానికి ఏమీ లేని జీవిలో అమ్మను చూసినప్పుడు నాలోంచి నేను విడిపోయాను. బతికుండగానే నేను పునర్జన్మెత్తాలనిపించింది. ఓ నిర్ణయానికొచ్చాను.జీవితంలో ఇంత గొప్ప భోజనం చేసిన రోజు లేనట్టే, ఇంత గొప్పగా నిద్రపోయిన రోజు కూడా లేదు.ముసలావిడ లేచేసరికి  మంచం మీద మనిషి లేడు. ఆమె ఇచ్చిన డబ్బులన్నీ మంచం మీదే ఉన్నాయి. మర్చిపోయాడేమోననుకుని వాటిని పట్టుకుని గుడిసె బయటకొచ్చింది. ఆటో కనబడలేదు.అతడు తిరిగొస్తాడనుకుని ఆమె కళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నాయి. గుడిసె తడిక తెరిచే ఉంది.
హంతకుల్ని కూడా అమాయకులనుకునే అమ్మతనానికి కిరాయి కట్టడానికి అతడు రాడని ఆమెకు తెలియదు.
జుజ్జూరి వేణుగోపాల్‌  

>
మరిన్ని వార్తలు