కొత్త దారులు

15 Oct, 2017 00:17 IST|Sakshi

ఈవారం కథ

‘‘ఏవండీ! కాస్త  నా మాట వినండి. ఎవరైనా చూస్తే బావుండదు. ఇంత వయసూ వచ్చి ఇదేం మాయ రోగం అని నవ్వి పోతారు’’ అంది సరస్వతి.‘‘నవ్వితే నవ్వనీ. వాళ్ళ పళ్లే బయట పడతాయి’’ అన్నాడు ప్రసాదరావు.‘‘అది కాదండీ. ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడేవిటండీ మీకీ వెధవ బుద్ధులు?’’‘‘అదే నేనూ బాధ పడుతున్నాను. ఈ తెలివితేటలు ఓ పదేళ్ల  క్రిందట లేకపోయాయే అనుకుంటున్నాను.’’ ‘‘నామాట వినండి ఇక్కడొద్దు ఇంటికిపోదాం. కాదంటే ఏదైనా హోటల్కి పోదాం’’ బతిమాలింది ఆవిడ. ‘‘వీల్లేదు.. వీల్లేదన్నానా?  ఓ రెండు రోజులు మొహమాటంగా వున్నా ఆ తరవాత అలవాటు అయిపోతుంది.’’‘‘నలుగురిలోనూ పరువు తక్కువగా వుంటుందండీ. పోనీ ఇంకో చోటికి వెళదామండీ’’  ‘‘ఇంటెదురుగుండా వున్నది వదిలేసి  ఇంకెక్కడికో ఎందుకూ... మళ్ళీ ఆటో డబ్బులు  దండగ. ఈ సణుగుడు ఆపి పద. అక్కడికి వెళ్లి లైన్లో నిలబడదాం’’ఆవిడ  ఇంకా సణుగుతూ ఉండగానే చెయ్యి పట్టుకుని లాక్కుపోయాడు.ఓ అరగంట ఆవిడకు ముళ్ళమీద వున్నట్లుగా  వుంది పాపం.. ఎవరు చూస్తారో అని  కంగారు.  ఆయన మాత్రం బాగానే వున్నాడు.‘‘ఎలావుందీ?’’ చేతులు కడుక్కున్నాక అడిగాడు. ‘‘నా బొందలా వుంది.’’ అంది  సరస్వతి  చిరాగ్గా.

‘‘ఇవ్వాళే  మొదలు కదా.. నాల్రోజులు అలవాటైతే బాగుంటుంది’’ అని నచ్చ చెప్పాడు.ఇద్దరూ ఇంటికెళ్లి పోయారు .మర్నాడు పొద్దున్నే  ఫోను. గోపీ  చేశాడు.‘‘ఏవిటి రావుగారూ నేను విన్నది  నిజమేనా ?’’‘‘ఏం  విన్నారో చెప్తే  నిజమో కాదో చెప్తాను’’‘‘నిన్న మీరు భార్యా సమేతంగా వెళ్లి ఐదు రూపాయల భోజనం  చేశారట.’’‘‘అవునూ చేశాం.’’‘‘మీకేం ఖర్మ ?’’‘‘భోజనం చెయ్యటం ఖర్మా?’’‘‘కాదా .?  మీ లెవెల్‌  ఏమిటీ? మీరు వెళ్లి  క్యూలో నిలబడి ఐదు రూపాయల భోజనం చెయ్యటం ఏమిటీ? ఎవరో పొద్దున్నే  మీ ఫ్రెండ్‌  ప్రసాదరావు గారు  ఐదు  రూపాయల భోజనం  చేస్తున్నారు. మేము కళ్లారా చూసాం  అంటే  నమ్మలేకపోయాను.’’‘‘అలాగా? అయ్యోపాపం. మీకు ఇబ్బంది కలిగింది నా వల్ల. విషయం నూటికి నూరుపాళ్లు  నిజం. మీరు నిశ్చింతగా  నమ్మొచ్చు..’’ అన్నాడు ప్రసాదరావు. ఆవేళ  హీనపక్షం పదిమంది ఫోన్‌ చేశారు. అందరూ అదే గొడవ. అందరికీ ఓపిగ్గా సమాధానం చెప్పాడు ఆయన.సరస్వతి ముక్కు చీదుకోనూ కళ్ళు తుడుచుకోనూ, ‘‘ఏవిటది?   కొంపలు  అంటుకు   పోయినట్లూ ఆ ఏడుపేమిటి?’’  అని కోప్పడ్డాడు ప్రసాదరావు. వాళ్లింటి ఎదురుగా ఓ పార్కు వుంది. అందులో  పదవీ విరమణ చేసిన వాళ్ళు ఓ పది మంది సాయంత్రం కలుసుకుని వాకింగ్‌ చేస్తారు. వాకింగ్‌ అరగంట. బాతాఖానీ రెండు గంటలు.ఆవేళ  ప్రసాదరావు  ఐదు  రూపాయల  భోజనమే హాట్‌ టాపిక్‌. అందరూ ఆవేశంగా  తీవ్రంగా చర్చించారు. రాగానే ఆయన్నే అడిగెయ్యాలని  అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మామూలుకంటే ఓ అరగంట  ఆలస్యంగా వచ్చాడు ప్రసాదరావు.

వచ్చీ రాగానే అందరూ ప్రశ్నలతో  దాడిచేశారు. ఆయన చిద్విలాసంగా వింటూ కూర్చున్నాడు.‘‘ఏవయింది మీకు?’’ అని నిలదీసి అడిగారు. ‘‘జ్ఞానోదయం అయింది.’’ చెప్పాడు.  ‘‘మాకు అర్థం కావటం లేదు వివరంగా చెప్పండి’’ అన్నారు.‘‘మీరు అడగక పోయినా చెప్తాను.  చెప్పింది విని మీలో మరి కొంతమందికి జ్ఞానోదయం అవుతుందనే నా నమ్మకం.’’ ప్రసాదరావు చెప్పటం మొదలు పెట్టాడు.‘‘పెద్దవాడు నాన్నకు ముద్దు. ఆఖరివాడు  అమ్మకు ముద్దు.  మధ్యన వున్నవాడు  మట్టికొట్టుకు పోయాడు అని సామెత వుంది   తెలుసుకదా మీకు. అదుగో నేను  ఆ మధ్య  కొడుకు లాటివాడిని..  మధ్య తరగతికి  చెందిన వాడిని. నాకు వున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. నా సంపాదనలో ముప్ఫై శాతం పన్నులకి పోతుంది. అదీగాక, ఓ వస్తువు కొన్నా,  కాస్త టిఫెన్‌ తిన్నా, అదనంగా పన్ను కట్టాలి. ఓ వూరు వెళ్తే, రవాణాకి పన్ను, వసతికి పన్ను, ఈ పై  పన్నులన్నీ కూడా కలుపుకుంటే నా రాబడిలో సగం  పన్నులకే  పోతోంది..పోనీ సగం ఏలిన వారికి పన్ను రూపంలో ఇచ్చుకున్నాం.  దానికి బదులుగా నిశ్చింతగా వుంటున్నామా అంటే అదీలేదు. కనీసావసరమైన వైద్యంగానీ, ట్రాన్స్‌పోర్ట్‌గానీ, ఎక్కడ పడి  తలకాయ బద్దలు కొట్టుకుంటామో అని భయం లేకుండా  రోడ్డు పక్కన నడిచే అవకాశం గానీ, కనీస భద్రత గానీ లేవు.

అన్నింటికీ ప్రైవేటు సంస్థల మీద ఆధార పడాల్సిందే. గవర్నమెంటు వారు పేదలకోసం   బోలెడన్ని పథకాలు, రాయితీలు కల్పించారు. మరి  మాబోటివాళ్లం వాళ్ళకంటికి ఆనం.నాకు ఇద్దరు కొడుకులు. ఇద్దరూ సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లే. ఇద్దరివీ ఆరంకెల జీతాలే. టాక్స్‌ పోను  చేతికి వచ్చినదాంట్లో  బతకాలంటే.. వాళ్ళ జీవితంలో అన్నీ సమస్యలే. ఇంటికీ ఆఫీసుకి పాతిక కిలో మీటర్ల దూరం. లోకల్‌ రైలు సదుపాయం లేదు. బస్సు సదుపాయం లేదు. కార్లో వెళ్తే హీనపక్షం గంటన్నర. రోజుకి మూడు గంటలు రానూ పోనూ. ఆఫీసుకి దగ్గర ఇల్లు తీసుకుని  వుందామంటే అక్కడ అద్దెలు ఎక్కువ. జీతంలో  ఐదో వంతు అద్దెకి కట్టాలి. పైగా నీటి ఎద్దడి. అద్దెకి ఎంతో నీళ్ళకి అంత పెట్టాలి. పోనీ  కాస్త చిన్న ఇంట్లోనే సర్దుకుందాం అనుకున్నా, అక్కడి స్కూల్లో మామూలు వాళ్ల పిల్లలకి సీట్లు దొరకవు. దొరికినా లక్షల్లో డొనేషన్లు. ఫీజులు.  అక్కడ మా పిల్లలు తమపిల్లలని అతికష్టం  మీద అయిదోతరగతి దాకా చదివిస్తే గొప్ప. ఆ చదువుతో ఆ పిల్ల సన్నాసులు ఏం చెయ్యగలరు?  అందుకే  మరో దారిలేక, మధ్య తరగతి వాళ్ళు వుండే ప్రాంతంలోనే ఇల్లు. అక్కడికి దగ్గర్లోనే ఏడాదికి ఓ లక్ష కట్టి ఓ మోస్తరు స్కూల్లో పిల్లల   విద్య. లక్ష కట్టినా సదుపాయాలేం వుండవు.. చంటిపిల్లలు చచ్చినట్లూ మంచినీళ్ల సీసా  మోసుకెళ్లాల్సిందే.ఇక నా విషయం మీకు తెలుసుగా. రెండేళ్ల కిందట రిటైర్‌ అయినప్పుడు వచ్చిన సొమ్మంతా బ్యాంకులో వేసుకున్నాను. దానిమీద వచ్చే వడ్డీతో  జీవించాలి. అటు వడ్డీ తరుగుతోంది. ఇటు ఖర్చులు పెరుగుతున్నాయి. ఎలా బతకటం?   

పేదవారి కోసం చేసినంత కాకపోయినా   అందులో పాతిక వంతు మాలాటి మధ్య తరగతి వాళ్ళ కోసం కూడా సాయం చెయ్యచ్చుగా ప్రభుత్వం? నిజం చెప్పాలంటే చిన్న చిన్న వ్యాపారస్తులు మాకంటే ఎక్కువే సంపాదిస్తారు. కాకపోతే  వాళ్ళ   రాబడికి లెక్క ఉండదు. కాబట్టి పన్నుల వడ్డింపు   వుండదు. మాకూ ఓ నల్ల కార్డు  ఏర్పాటు చేసి  దానిమీద ఇంత నూనె. ఇన్ని బియ్యం ఇవ్వచ్చుగా?వాళ్లకి బంగారుతల్లి, ఆరోగ్య లక్ష్మి,  కల్యాణమస్తు లాగా అంత కాకపోయినా మాకు కూడా వెండితల్లి, ఆరోగ్య గౌరీ, మంగళ కళ్యాణం  అని ప«థకాలు పెట్టి సాయం చేస్తే మేమూ   సంతోషిస్తాం కదా. ఆహా. అలాంటప్పుడు మనం గుర్తుకు రాము. మానవ హారాలు చేసి ఎండలో నిలబడటానికి,  పచ్చని నగరం కోసం  పది కిలో మీటర్లు పరిగెత్తండి, అన్నప్పుడు  మాత్రం  మనం అందరం  కావాలి. ఇవ్వకపోతే పోయే, ఎదురు  మనల్ని డబ్బులడగటం. మీరు గ్యాస్‌ మీద సబ్సిడీ వదిలేస్తే  ఇంకో ఇంట్లో పొయ్యి వెలుగుతుంది, మీరు ఫలానా వస్తువులు కొంటే ఓ పిల్లాడు చదువుకుంటాడు. నెలకో అయిదువందల దానం చేస్తే  ఓ పిల్లాడు  బతుకుతాడు అని తెల్లారిలేస్తే ప్రకటనల ద్వారా ఊదర పెట్టడం. మాదగ్గర తీసుకున్న పన్నులతో  వాళ్ళు చెయ్యచ్చుగా ఆ పనులన్నీ. మనమే ఈసురో మంటూ బండి లాగుతుంటే దానాలు కూడానూ!ఇవన్నీ చూసి నా మనసు అల్లా కల్లోలం అయిపోతోంది.  ఏంచెయ్యాలి సంపాదన పెంచుకునే  మార్గం లేదు కాబట్టి వున్నదానిలోనే  గడుపుకోవాలి. అందుకే ఆలోచించి ఒక మార్గం  కనిపెట్టాను. ఎక్కడ వీలైతే  అక్కడ ఖర్చు తగ్గించుకోవాలి. పెద్దమొత్తమే అక్కర్లేదు. ఓ రూపాయి మిగిలినా చాలు. అందుకు మంచి రోజున అంటే  పండుగనాడే మొదలుపెట్టాను. అయిదు రూపాయలకి  నాబోటివాడికి  పచ్చిమిరప కాయలు కూడారావు. మరి భోజనం పెడుతుంటే తినడానికి మొహమాటం ఎందుకు?  ఆ సదుపాయం  నిరుపేదలకేం కాదు. జనాలు టీ  షర్ట్‌ వేసుకుని, వాచీ పెట్టుకుని, సెల్‌ ఫోన్‌ పట్టుకుని, అన్నం తింటూ ‘ఫుడ్‌  క్వాలిటీ  ఈజ్‌  నాట్‌  దట్‌ గుడ్‌’ అని టి.విలో మాట్లాడ్డం నేను కళ్లారా చూశాను. కాబట్టి నేనూ మొదలు పెట్టాను.

  ఇక్కడేకాక  చాలా దేవాలయాలలోనూ అన్న ప్రసాదాలు పెడుతున్నారట. అలా తలోచోట  కొన్నాళ్ళు తింటే బోలెడంత డబ్బు ఆదా. విసుగేస్తే ఇంట్లో వండుకోవచ్చు. ఇక  కాలక్షేపం. మనం పేపరు కొనుక్కోకుండా కాస్త ఎండెక్కేదాకా ఏ రామకోటో రాసుకుని అప్పుడు పక్కింటివాళ్ల పేపరు అరువడిగి చదువుకోవచ్చు.     మాఇంటి పక్కనే రైల్వే  స్టేషనుంది. అక్కడ టి.వి వుంది. పగలంతా అక్కడ కూచుంటే సరి.  అక్కడ ఇలా ప్రోగ్రాములురావు. ప్రకటనలే  అనుకున్నా, ఇంట్లో మాత్రం ఏం గొప్పగా ఏడ్చాయిటా?  పదినిముషాలు ప్రోగ్రాము పావుగంట ప్రకటనలేగా. అక్కడైతే  వచ్చే రైలూ పోయే రైలూ. మంచి కాలక్షేపం. ఎండాకాలం ఇంట్లో ఏసీ వాడకుండా ఇంటి దగ్గర మాల్‌కి వెళ్లి  అక్కడ ఎండ తగ్గేదాకా ఏ మూలో కూచుని  రావచ్చు.    ప్రాణాల మీదికి వస్తే తప్ప స్వంత వాహనం  బయటికి తియ్యకూడదు. రోడ్డు మీద నుంచుంటే  ఎవరో ఒకరు కనిపించకపోరు. చేయెత్తి ఆపి  బావున్నారా? పిల్లలు బావున్నారా? అని కుశలం  అడిగి కాస్త అందాకా దిగబెట్టండి అనొచ్చు. ఎవరైనా పెళ్ళికో పేరంటానికో పిలిస్తే డబ్బు కవర్లో పెట్టి ఇచ్చే సంప్రదాయానికి  స్వస్తి  చెప్పాలి.

యూట్యూబ్‌లో చూస్తే పనికి రాని వస్తువులతో అవీ ఇవీ తయారుచేయటం అని వందలకొద్దీ ఉపాయాలు చూపిస్తారు కదా. ఏదో ఒకటి తయారుచేసి బహుమతిగా ఇస్తే చాలు.ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎంత వీలయితే  అంత ఆదా చేస్తూ పోవాలి. ఇప్పటికి ఎలాగో  గడిచిపోతున్నాయి రోజులు అనుకుని ఊరుకుంటే  రేపు ఎలా వుంటుందో ఎవరు చూడొచ్చారు? పన్నులు ఇంకొంచెం పెంచి, వడ్డీరేటు  ఇంకాస్త తగ్గిస్తే అప్పుడేవిటి మన గతి? దాహం వేశాక బావి తవ్వుకోటం కంటే,  దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం మంచిది.’’ అంటూ తన మనసులోని మాట  చెప్పేశాడు ప్రసాదరావు. అతను ప్రారంభించినప్పుడు నలుగురే వున్నారు. ముగించేసరికి చుట్టూ జనం. చచ్చేంత మొహమాటం వేసింది.అంతలోనే చప్పట్లు. నీరసంగా కాదు  హోరెత్తిపోయేలా. ఆశ్చర్యం వేసింది అతనికి. ఎందుకంటేæ ఇటీవల  చప్పట్లకు కరువొచ్చి పడింది. పెద్ద పెద్ద సభలలోనే ‘చప్పట్లు కొట్టండో, వేదిక మీదనున్నవారికి ఉత్సాహం కలిగించండో’ అని మైకులో  మొత్తుకున్నా టప్పూ టప్పూ అని ఒకరో ఇద్దరో కొడతారు చప్పట్లు. అలాంటిది అడక్కుండానే  చప్పట్లు కొట్టేస్తున్నారు అంటే   తాను మాట్లాడిన విషయం నలుగురికీ నచ్చిందని అర్థం.

 మర్నాడు కూడా కొన్ని ఫోన్లొచ్చాయి. ఎలా ఉందండీ అయిదు రూపాయల భోజనం? ఇవ్వాళ కూడా వెళ్తున్నారా? నన్నూ కేకేయ్యండి చూద్దాం  అదేవిటో అన్నారు. ఆవేళ మరో నలుగురు వచ్చారు. క్రమంగా పెరిగింది ఆ సంఖ్య. అయిదు రూపాయల భోజనం దగ్గర పెద్ద లైన్లు. ఆ మనకేం పనా పాటా / ఇక్కడే నిలబడి కబుర్లు చెప్పుకుందాం   అనుకున్నారు.విసుగేస్తే ఏ గుడికో వెళ్లి భోజనం చేసి రావటం. ఖర్చు గణనీయంగా తగ్గింది. ఆడవాళ్ళూ  వంట పని తప్పిందని సంతోషించారు. మిగిలిన  పద్ధతులన్నీ  కూడా పాటిస్తూ ఎక్కడికక్కడ ఖర్చు తగ్గిస్తున్నారు. ఏ చిన్న శుభకార్యం అయినా మొక్కుబడిగా హోటలుకి వెళ్ళటం మానేసి ఇంట్లోనే ఇంత పులిహోర, రవ్వకేసరి చేసుకుని  వేడుక చేసుకుంటున్నారు.    ఇదంతా మీ పుణ్యమే మొత్తానికి భలే ఉపాయం చెప్పారు అని ప్రసాదరావుని మెచ్చుకుంటున్నారు.‘‘ఏం చేస్తాం? శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు’’ అన్నాడు ప్రసాదరావు.  వాళ్లకి బంగారుతల్లి, ఆరోగ్య లక్ష్మి,  కల్యాణమస్తు లాగా అంత కాకపోయినా మాకు కూడా వెండితల్లి, ఆరోగ్య గౌరీ, మంగళ కళ్యాణం  అని ప«థకాలు పెట్టి సాయం చేస్తే మేమూసంతోషిస్తాం కదా.ఆహా. అలాంటప్పుడు మనం గుర్తుకు రాము. మానవ హారాలు చేసి ఎండలో నిలబడటానికి,  పచ్చని నగరం కోసం  పది కిలో మీటర్లు పరిగెత్తండి, అన్నప్పుడు  మాత్రం  మనం అందరం  కావాలి. ఇవ్వకపోతే పోయే, ఎదురు  మనల్ని డబ్బులడగటం. 

మరిన్ని వార్తలు