శవాల మిత్రుడు | Sakshi
Sakshi News home page

శవాల మిత్రుడు

Published Sun, Oct 15 2017 12:23 AM

Friend of the corpse - Sakshi

ఊళ్ళో ‘మోర్త్యా’ని ఎరిగినవాళ్ళు వుండరు. అయితే ‘శవాల మోర్త్యా’ అని అంటే ‘ఎరగని’వాళ్ళూ వుండరు. ‘మోర్త్యా’ ఏ వూరివాడు? అతని తల్లిదండ్రులు ఎవరూ? అతని వయస్సెంతా? ఈ విషయాలు ఎవరికీ తెలియవు. అతనికి బంధువులెవరూ లేరు. మరి అతనికేంవుందనీ? ఒక పాత యినుప ట్రంకుపెట్టె, అందులో రెండు చిరిగిన లుంగీలూ, ఒక నల్లకుక్క వున్నాయి. ‘మోర్త్యా’ ఎక్కడికెళ్ళినా అతడి వెంట కుక్క ఉంటుంది. నెత్తిమీద పెట్టె, కాళ్ళ దగ్గర తచ్చాడుతూ కుక్క. అతడు నిద్రపోతున్నప్పుడు తలదగ్గర ట్రంకు పెట్టె, కాళ్ళ దగ్గర కుక్క. ఒక మహారాజు యుద్ధంలో విజయం సాధించి విశ్రమిస్తున్నట్లు నిద్రపోతాడు.
‘మోడే మోర్తే’ మా వూరికెప్పుడొచ్చాడూ?
∙∙
ఊరంతా ‘ప్లేగు’ వ్యాపించింది. జనం పురుగుల్లా మరణిస్తున్నారు. ‘రాంమావ’ ఆ అంటువ్యాధికి బలయ్యాడు. శవాన్ని ఎత్తి శ్మశానానికి తీసుకెళ్ళడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కాలం గడిచిపోతోంది. జనం బితుకుబితుకున వున్నారు. సాయంత్రం అవుతోంది. చీకటి పడుతోంది. ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తూ అతడి కొడుకు నిలుచున్నాడు. అప్పుడే ఒక యువకుడు వచ్చాడు. ‘‘ఏమిటీ శవాన్ని మోయాలా’’ అంటూ వొక తుండుగుడ్డ నడుంకి చుట్టుకొని అతడు ముందుకి వచ్చాడు. ‘‘నేను భుజంపడ్తాను. రండి. శవాన్ని అలా వుంచడం పాపం’’ అంటూ అతడు శవం దగ్గరకి వెళ్ళాడు. అతడెవరు, ఎక్కడివాడో ఎవ్వరికీ తెలియదు. వాళ్ళ అంగీకారం కోసం ఎదురుచూసి, జవాబు రాకపోతే అతడే అన్నాడు ‘‘నేనొక మనిషిని. నా పేరు ‘మోర్తే’. నేను ఈ శవం మోయడం మీకిష్టం లేకపోతే చెప్పండి. నేను వెళ్ళిపోతాను’’. ఎవరూ ఏమీ అననందువల్ల కొడుకుతో పాటు అతడు ఆ శవాన్ని మోసుకుని శ్మశాన భూమిలో దహనం చేసి, అంత్యక్రియల తరువాత తిన్నగా గుడి దగ్గరి తటాకంలో స్నానం చేశాడు. స్నానం తరువాత ఆ తటాకం కట్టమీదే నిద్రపోయాడు. మర్నాడు నిద్రలేచి మళ్ళీ స్నానం చేసి, దేవాలయంలోకి వెళ్ళాడు. మధ్యాహ్నం గుడిలోనే భోజనం చేశాడు. తిన్నగా తటాకం వొడ్డు దగ్గరకి వెళ్ళి, తనతో తెచ్చిన అన్నం అక్కడున్న ఒక కుక్కపిల్లకి పెట్టాడు. తరువాత, అతడూ, ఆ కుక్కపిల్లా పక్కపక్కనే ఆ తటాకం కట్టమీద నిద్రపోయారు. ఎవ్వరితోనూ అతను మాట్లాడలేదు. ఎవ్వరూ అతని జోలికి పోలేదు. ‘రాంమావ’ పదమూడవ రోజు అతడికి ఒక చాప, దిండు, ఒక లుంగీ దానం చేసాడు. రోజులు గడుస్తూ క్రమేణా జనానికి అతడు పరిచయం అయ్యాడు.

అంటువ్యాధి వలన జనం ఎందరో చనిపోతున్నారు. ఒకరి తరువాత ఒకరు మరణిస్తున్నారు. కనీసం ఒకటీ, రెండు మరణాలు లేని రోజులేదు. ‘మోర్తే’కి చేతినిండా పని. అతడు చకచకా రాత్రిపగళ్ళు శ్రమపడి శవాల్ని మోసి, దహన క్రియ చేయించాడు. ఎలాంటి శవాన్నైనా ఏమాత్రం, భీతీ, జుగుప్స లేకుండా కాల్చేసేవాడు. శవాన్ని మోస్తున్నప్పుడు అతడు మౌనంగా వుంటాడు. అప్పుడు ఎవరూ మాట్లాడకూడదు. శవాన్ని చితిపేర్చి పెట్టినప్పుడు – చితిమంటలు రగులుకోగానే అతడు గొంతుక విప్పేవాడు. చితి కాలుతున్నప్పుడు ఒక్కొక్క అంగం కాలుతోందని ఆ అంగాన్ని పేర్కొంటూ చెప్పేవాడు, వర్ణించేవాడు – ‘‘అదిగో అవి గుండె కాలే మంటలు, నిజమైన గుండె మంటలు’’ వగైరా. అతడు శవాలని భుజంమీద మోస్తున్నప్పుడూ, శవాలని దహనం చేస్తున్నప్పుడూ సాక్షాత్తు యమధర్మరాజే యితడని అనిపిస్తుంది జనానికి. శ్మశానభూమిలో శవదహనం అయినాక అతడు తటాకంలో స్నానం చేసి, అక్కడే కట్టమీద నిద్రపోవడం అతడి నిత్యకృత్యం అయిపోయింది – ఆ అంటురోగం ప్రబలిన రోజుల్లో. అప్పుడే అతడికి శవాల మిత్రడనీ ‘శవాల మోర్తే’ అని సార్థక నామం లభించింది. దహన సంస్కారం చేసినందుకు ఎవరైనా ‘మోర్తే’కి డబ్బులిస్తే తీసుకోడు సరికదా కోపంతో వాళ్ళ ముఖం కూడా చూడకుండా తిరస్కారంగా వెళ్ళిపోతాడు. ఇది అందరికీ క్రమేణా తెలిసింది. అతను డబ్బు తీసుకుని శవాన్ని మోసేవాడు కాదని జనం తెలుసుకున్నారు.

అతనికి డబ్బెందుకు? దేవుడు తిండి పెడ్తాడు దేవాలయంలో. నిద్రపోవడానికి ఆ తటాకం కట్ట వుంది. కట్టుకోవడానికి కావలసినన్ని బట్టలున్నాయి – వీళ్ళూ, వాళ్ళూ ఇచ్చింది. శవాల్ని కూలీ డబ్బులకోసం మోసేవాడని అతడి గురించి ఎవరూ అనుకోకూడదు. ‘‘ఎవ్వరికీ శవం అక్కరలేదు. అందరికీ డబ్బు కావాలి. నాకు శవం కావాలి. డబ్బు అక్కరలేదు’’ అంటాడు నవ్వుతూ. ఇదీ అతడి వేదాంతం. ఈనాటి మనిషే, రేపటి శవం. నేను యమరాజు దూతని. యమరాజుకి డబ్బెందుకూ? డబ్బు తీసుకున్నా ఎవరికోసం? డబ్బు వుంటే నిద్రపట్టదు – దొంగల భయంతో. ఇప్పుడు సుఖంగా నిద్రపోతున్నాడు. ఎవరింటికి వెళ్ళినా నిండైన గౌరవం లభిస్తుంది. ఇంతకంటే అతనికి కావలసిందేమిటి? అతడు కేవలం పడుకోడానికి సరిపోయే జాగా వున్న ఒక గుడిసె అంత కొంప దేవాలయం వాళ్ళు కట్టిచ్చారు. అతడూ, కుక్కా అందులో పడుకుంటారు. శ్మశానభూమిలో కట్టెల కొట్టూ, వసారా వగైరాలుండే యింటి తాళాలు అతడి దగ్గరే వుంచారు. ఒకరోజు అతడు లేని సమయంలో అతడి కుక్కని ఎవరో చావబాదారు కర్రలతో, రాళ్ళతో. అడిగితే దానికి పిచ్చిపట్టిందనీ, తమని కరిచేయడానికి యత్నించిందనీ సాకు చెప్పారు. ‘మోర్తే’కి దాని మూలుగులు, దాని దెబ్బలూ భరించలేని దుఃఖం కలిగించాయి. రెండురోజులు అతడి కొంపలో అతడి కన్నీటిసేవలో యమబాధ పడి కన్నుమూసింది. ఆ కుక్క కళేబరం చూసి ‘మోర్తే’ భయపడ్డాడు. ఎప్పుడూ ఏ శవం చూసి భయపడని, ఏడవని ‘మోర్తే’ ఆ కుక్క ‘శవం’ చూసి చలించిపోయాడు. పట్టరాని దుఃఖంతో దాని మృతదేహాన్ని తన గుడిసె వెనకనే గొయ్యి త్రవ్వి పూడ్చాడు. కొన్ని ఏళ్ళుగా ఆ కుక్కతో అతడు గడిపాడు. అతడికి తోడు నీడలా వుండేది. అతడికి ‘నా’ అన్న శబ్దం వర్తించే ఏకైక జీవి ఈ ప్రపంచంలో ఆ కుక్క ఒక్కటే. అది చచ్చిపోయాక, అతడి బ్రతుకు పూర్తిగా నిరర్థకమయింది. రాత్రి నిద్రపట్టడం లేదు. తన కొంపలోనే, భయమంటే ఎరగని మనిషికి భయం వేసేది. రెండు, మూడు రోజులు (ఆ కుక్క పోయాక) అతడు యింటి బయటకి రావడమే మానేశాడు. దుఃఖంతో మ్రగ్గుతున్న అతణ్ణి చూసి అతడి మిత్రులు వ్యాఖ్యానించారు ‘‘మోర్తేకి పెళ్ళిచేయాలి’’ అని.

చాలా రోజులు దొర్లాయి. క్రమంగా ‘మోర్తే’ దుఃఖం తగ్గిపోయింది. పెళ్ళి చేసుకుందామనే ఆలోచన అతడికి కూడా వచ్చింది. ఊళ్ళో పెళ్ళి కావల్సిన అమ్మాయిలు చాలామంది వున్నారు. కానీ, ఈ శవాలు మోసే ‘పరదేశీ’కి పిల్లనెవరు యిస్తారూ? పిల్లకోసం మిత్రులు వెతికారు. రెండు మూడు సంవత్సరాలు దాటిపోయాయి. ఫలితం లేకపోయింది. అయినా అతడికీ అంత ఆపేక్ష లేదు, పెళ్ళి చేసుకుందామని. అతడికి తెలుసు. చుట్టూ చూస్తూనే వున్నాడు సంసారుల బాదర బందీలు. ఒంటరి జీవితం, తంటాలు లేని ప్రయాణం! సాంబశివుడిలా సదా శ్మశానాలకి వెళ్తూ, వస్తూ ఐహిక సుఖాలకి దూరంగా ఆధ్యాత్మిక చింతనతో జీవించినంత కాలం బతుకుబండిని లాగడమే ఉత్తమమని నిర్ణయించాడు. నేను వొంటరిగా యీ ప్రపంచంలోకి వచ్చాను. ఒంటరిగానే వెళ్ళిపోతాను. ఒకరోజు ‘మోర్తే’ పెట్టెని నెత్తిమీద పెట్టుకుని ఆ దేవాలయపు ‘తటాకం’ కట్టె దగ్గరకి చేరాడు. ఆ కొంప వల్లనే, కుక్క చచ్చిపోయింది. ఆ కొంపవల్లనే తనకి పెళ్ళి అవలేదు. ‘‘తనకా ‘కొంప’ – ఆ గుడిసె లాంటి యిల్లు – ఆ దేవాలయం వాళ్ళు కట్టించి యిచ్చిన ఇల్లు తనకి అక్కరలేదు. ఇలా ఈ తటాకం వొడ్డునే గడుపుతాను. వర్షం వస్తే దేవాలయపు ప్రాంగణం వుండనే వుంది. పెళ్ళాం, పిల్లలూ, ఏ లంపటం లేని తనకా కొంప అనవసరం. ఆ గుడిసెలో గాలి వేయదు. ఇక్కడ కావలసినంత గాలి. పడుకుని ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ వుంటే వచ్చే ఆ ఆనందం వర్ణించలేనిది. ఆ గుడిసె తీసుకుని పెద్ద పొరబాటు చేశాను. ఈ కట్ట ఆ కొంప కంటే చాలా మేలు.’’
‘మోర్తే’ ఒక కుక్కని చేరదీశాడు. ఆ కుక్క మునుపటి కుక్కలాగే వుంది. అతడికి చాలా ఆనందమయింది. ‘మోర్తే’ తన పని– శవాల దహనం – ఉత్సాహంతో చేస్తున్నాడు. అతడు తీరిక సమయంలో ఆ తటాకం ప్రక్కన దేవాలయపు స్థలంలో అరటి తోట వేశాడు. అలాగే తులసి చెట్లు పెంచాడు. తులసిదళాలు దేవాలయానికి రోజూ తాజాగా కోసి సమర్పించేవాడు. అలాగే పూలచెట్లు పెంచాడు. అతడేం చేస్తున్నా. అతడి వెంట అతడి కుక్క నీడలా వస్తుంది.

ఎవరింట్లో ఏ శుభ, అశుభ కార్యం జరిగినా అతడు హాజరు. అతడికే కబురు పంపి ముందు పిలుస్తారు. తను చేయగలిగిన పనులు వొళ్ళు దాచుకోకుండా చకచకా చేస్తాడు. ‘మోర్తే’ వంటి మనిషిని ఎవ్వరూ చూడలేదు. ఏళ్ళు కాలగమనంలో జారిపోయాయి. ‘మోర్తే’లో ముసలితనం వచ్చింది. నడవడానికి కఱ< అవసరమయింది. ఇరుగు, పొరుగున వున్నవాళ్ళు అతడికి తిండి పెట్టేవారు. అందువల్ల కూటికోసం అతడికీ, అతడి కుక్కకీ బాధలేదు – ఉపవాసం లేదు. ఇప్పుడు శవాలు మోసే శక్తి అతనిలో లేదు. అదే అతడి బాధ. అలాగయినా దహనకాండలో అతనుండక తప్పదు. శ్మశానం దగ్గరి కట్టెల కొట్టు, వసారాలున్న యింటి తాళం చేతులు దశాబ్దాల తరువాత దేవాలయం అధికారులకి అప్పగించాడు, కళ్ళనీళ్ళతో. ‘‘నేనిప్పుడు యింక ఈ బాధ్యత తీసుకోలేను. కానీ నేను ఆఖరి క్షణం వరకూ, బ్రతికినంతకాలం శవాల దహనక్రియలో తోడ్పడతాను’’ అని అన్నాడు. మూడు వేలకి పైగా శవాల దహనం చేసిన ‘మోర్తే’ ఈరోజు ఒక్క శవాన్ని మోయడంలో కూడా పనికిరాడు. అదే అతడి విచారం. అయితే అతడికి ఒక విషయంలో తృప్తి. అదేమిటంటే యిప్పటి యువతరం శవాలు ముట్టుకోవడానికీ, మోయడానికీ, దహనం చేయడానికీ వెనకాడరు. తను ఈ పనికి ఎనలేని గౌరవాన్ని, ఒక పవిత్రతనీ యిచ్చి ఒక ఆదర్శవృత్తిగా మలచాడు. ‘‘ఇప్పుడు నేను సంతృప్తిగా మరణిస్తాను. నా మరణానంతరం నా శరీరాన్ని దహనం చేయడానికి ఎందరో ముందుకి వస్తారు. మోయడానికీ ముందుకి ఎందరో వస్తారు. నాకేం చితలేదు’’ అని ‘మోర్తే’ అనేవాడు. ఒకరోజు, ‘మోర్తే’ శ్మశానం నుంచి తిరిగి, ‘తటాకం’ కట్ట దగ్గరకి తిరిగి నీరసంగా, అలసటతో వచ్చాడు. అతని కుక్కతో అన్నాడు జాలిగా ‘‘కొడుకా, ఈవేళ తిండి తెచ్చే శక్తి నాకులేదు. మనం ఉపవాసం వుండాలి. అరవకుండా పడుకో.’’

రాత్రి ‘మోర్తే’ కుక్క అదేపనిగా అరుస్తోంది. విచిత్రంగా శబ్దం చేస్తోంది. ఎవరికీ అర్థమవలేదు ఎందువల్ల అలా అరుస్తుందో! మర్నాడు ప్రొద్దున్నే ఆ తటాకం దగ్గరకి వచ్చిన జనం, స్నానం చేయడానికి నీళ్ళల్లో దిగుతూ, ‘మోర్తే’ యింకా పడుకునే వుండడం చూశారు. అతడి కుక్క కాళ్ళదగ్గర పడుంది ఏ కదలికా లేక. దగ్గరకెళ్ళి చూస్తే తెలిసింది ‘మోర్తే’ మరణించాడు! అతని కుక్క కూడా చనిపోయింది! ‘మోర్తే’ మరణవార్త గుప్పుమని వూరంతా ప్రసరించింది. జనం తండోపతండాలుగా ఆ తటాకం కట్టమీదికి వచ్చారు. అతడి అంతిమ దర్శనం కోసం! ఏ ఆప్తులూ లేని, ఏ బంధువులూ లేని ‘శవాల మోర్తే’ చనిపోయాడు. ఊరంతా ఒక్క మనిషిలా అతడి దహనకాండకి వచ్చింది. అతడు ఎవరికీ ఆప్తుడు కాదు. అందరికీ ఆప్తుడు! అతడు ఎవరికీ బంధువు కాదు. అందరికీ బంధువు! ‘మోర్తే’ అంతిమ దర్శనం కోసం శ్మశానంలో కూడిన జనం, యిసుక వేస్తే రాలని జనం! అతడి సమాధి దగ్గరే, కుక్క కళేబరం భూస్థాపితం చేశారు. అతడిని భూస్థాపితం చేసిన సమాధి మీద ఈ విధంగా వ్రాశారు. ‘‘సమాజ సేవకుడు ‘మోర్తే’మావ – శవాల మోర్తే – ఇక్కడ విశ్రాంతిగా నిద్రపోతున్నాడు’’ అని వ్రాసిన శిలాఫలకం వుంచి జనులు అతనికి నివాళులర్పించారు. ధన్యజీవి ‘శవాల మోర్తే’ యిలా అమరుడయ్యాడు.(సమకాలీన కొంకణీ కథానికలు సౌజన్యంతో) ఏ ఆప్తులూ లేని, ఏ బంధువులూ లేని ‘శవాల మోర్తే’ చనిపోయాడు. ఊరంతా ఒక్క మనిషిలా అతడి దహనకాండకి వచ్చింది. అతడు ఎవరికీ ఆప్తుడు కాదు. అందరికీ ఆప్తుడు!
అతడు ఎవరికీ బంధువు కాదు. అందరికీ బంధువు!
కొంకణీ మూలం: కె.ఆర్‌.వశంతమణి
తెలుగు: శిష్టా జగన్నాధరావు

Advertisement

తప్పక చదవండి

Advertisement