మూడు నిమిషాల 24 సెకన్లు... ఆ మిగులును ఏం చేద్దాం?

12 Jul, 2015 01:03 IST|Sakshi
వాచస్పతి మధుర కృష్ణమూర్తి శాస్త్రి

వేద శాస్త్రానికి ఉన్న షడంగాల్లో జ్యోతిషం నయనస్థానానికి చెందినది. శాస్త్రవిహిత కర్మలు చేయవలసిన సమయాల్లో చేస్తే ఆశించిన ఫలితాలు చేకూరుతాయి, చేయకూడని సమయాల్లో చేస్తే విపరీత ఫలితాలు వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. ఇక్కడి వరకు పండితులందరూ ఏకీభవిస్తారు. అయితే, ఏదైనా ఒక కార్యక్రమం అనుకున్నప్పుడు సరైన సమయం అనే అంశంలో విభిన్నవాదనలు వినిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా పండుగల తేదీలు, సమయాలపై వివాదాలు పరిపాటి అయ్యాయి. తాజాగా గోదావరి పుష్కరాల ప్రారంభం గురించి ప్రస్తుతం మూడు తేదీలు తెరమీదకు వచ్చాయి.

ఒక లెక్క ప్రకారం జూన్ 28వ తేదీన పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మరో లెక్క ప్రకారం ఈ నెల 7వ తేదీన ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఆమోదించిన లెక్కల ప్రకారం ఈ నెల 14వ తేదీన ప్రారంభమవుతాయి. ఇవన్నీ సామాన్యుడిని అయోమయంలో పడవేస్తున్నాయి. మహామహోపాధ్యాయ, రాష్ట్రపతి సమ్మానిత, జ్యోతిష విజ్ఞాన భాస్కర, వాచస్పతి మధుర కృష్ణమూర్తి శాస్త్రి మరో రెండు సంవత్సరాలలో ‘నవతి’ అంటే 90 సంవత్సరాలకు చేరుకోనున్నారు. గత ఆరు దశాబ్దాలుగా ఆయన జ్యోతిషశాస్త్రంపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు.

విశ్వవిజ్ఞాన ప్రతిష్ఠానం, జ్యోతిష విజ్ఞాన కేంద్రం అనే రెండు సంస్థలను రాజమండ్రిలో స్థాపించి, ఏటా దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిష దిగ్గజాలను పిలిపించి సదస్సులు నిర్వహిస్తున్నారు. వృద్ధాప్యం శరీరానికే కాని, మనసుకు లేదని నిరూపిస్తున్న మధుర తమ పుష్కర తేదీలు ఎలా ప్రామాణికమైనవో, మిగతా పంచాంగకర్తలు అనుసరిస్తున్న పద్ధతులలో లోపాలు ఎలా ఉన్నాయో సాక్షికి వివరించారు... ఆయన మాటల్లోకి వెడితే...
 
సూర్యసిద్ధాంతమే ప్రమాణం!
‘‘దేశంలోని పంచాంగాలన్నిటికీ సూర్యసిద్ధాంతమే ప్రమాణం. ఇది అందరూ అంగీకరించిన విషయమే. సూర్యుడు అశ్వినీ నక్షత్రం ప్రారంభ బిందువు నుంచి బయలుదేరి తిరిగి అదే బిందువును చేరడానికి 365 రోజుల 15 ఘడియల 31 విఘడియల 31 పరల సమయం పడుతుందని సూర్యసిద్ధాంతం తెలియచేస్తున్నది. దీనిని ఒక సౌరవర్షం అంటారు. అయితే, వర్తమానంలో ‘వేధశాల’(అబ్జర్వేటరీ) ద్వారా పరిశీలిస్తే, పై సౌరప్రమాణంలో 8 విఘడియల 30 పరలు తేడా కనిపిస్తోంది. అంటే, ఒక సంవత్సరానికి 3 నిమిషాల 24 సెకన్లు తేడా వస్తోంది. ఈ తేడాలను లెక్కలోకి తీసుకోకుండా పంచాంగ గణనం చేయడం సరి కాదు. గ్రహగమనాలు మారుతుంటాయన్న విషయాన్ని పంచాంగకర్తలు పరిశీలనలోకి తీసుకోవాలి.
 
రిఫార్మ్స్ కమిటీ ఆధ్వర్యంలో...
ఇక్కడ మరో ముఖ్యవిషయాన్ని ప్రస్తావించక తప్పదు. పంచాంగాలలో ఏకీకరణను సాధించడానికి తొలి ప్రధాని నెహ్రూ 1952లో కేలండర్ రిఫార్మ్స్ కమిటీని ఏర్పాటు చేశారు. కార్యదర్శిగా నియమితులయిన ఎన్.సి.లాహిరి తప్ప ఆ కమిటీలో జ్యోతిష శాస్త్రంలో కృషి చేసిన వారు ఎవరూ లేరు. నక్షత్రగతుల గమనంలో మార్పు వలన గ్రహగతులలో మార్పు కలుగుతూంటుందని, దీని వలన అయనాంశాన్ని మార్చవలసి ఉంటుందని కమిటీ సమావేశాల్లో కొందరు సూచించడం జరిగింది.

స్థిరమైన అయనాంశ అన్నది శాస్త్రవిరుద్ధమని కొందరు తేల్చిచెప్పారు. అయితే, ఇంతటి గంభీరమైన పై విషయాన్ని కుంటిసాకుతో లాహిరి తిరస్కరించారు. కమిటీ నివేదిక 16వ పేజీలో ఆ విషయాన్ని చూడవచ్చును. ఆ సందర్భంగా ఎన్.సి.లాహిరి ‘ఈ దశలో ఆయనాంశలో మార్పులు కూర్పులు చేయాలంటే, గత నాలుగు సంవత్సరాల పంచాంగాలను మార్పు చేయవలసి ఉంటుంది. ఎంతో శ్రమతో కూడిన పని!’ అని పేర్కొన్నారు. తప్పు అన్నది తేలాక కూడా, కుంటి సాకుతో ఆయనాంశాన్ని స్థిరమైన అంశంగా తీసుకుని, ఈ కమిటీ జ్యోతిష శాస్త్రానికి తీరని అన్యాయం చేసింది. ఈ విషయంలో మేము లాహిరికి ఎన్నో ఉత్తరాలు రాసినా, సరైన సమాధానం రాలేదు. తొలి సిద్ధాంత కర్త వరాహమిహిరుడి గణనానికి చేరువలో ఉన్నది మా పంచాంగమే అన్నది జగమెరిగిన సత్యం.
 
గ్రహగతులలో మార్పులు సాధ్యమా!
ఈ ప్రాథమిక ప్రశ్నకు సూర్యసిద్ధాంతమే స్పష్టమైన సమాధానం చెప్పింది. సూర్యసిద్ధాంతంలోని త్రిప్రశ్నాధికారం, మధ్యమాధికారం, స్పష్టాధికారం మొదలయిన  అధ్యాయాలలో ఆయా కాలాలకు అనుగుణంగా మార్పులు చేసుకుని గ్రహగతులను నిర్ణయించాలని చెప్పడం జరిగింది. ఉదాహరణకు రైలు పయనించే వేగాన్ని బట్టి సమయ పట్టిక మారుతోంది. 60 కి.మీ.ల వేగంలో పయనించే రైలు వేగాన్ని బట్టి దూరం చేరుకోవడానికి, 100 కి.మీ.ల వేగంతో పయనించే రైలు వేగాన్ని బట్టి దూరం చేర డానికి చాలా మార్పు ఉంటుంది.

అలాగే సూర్యుడు, గ్రహాల గమనం, అది పయనించే వేగాన్ని బట్టి ముహూర్తాలు పెట్టాల్సి ఉంది. ఈ ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి, పుష్కర తేదీలను నిర్ణయిస్తున్నారు. ఇది సైరైన పద్ధతి కాదు, ఈ పంచాంగాల కారణంగా మనం పితృకర్మలను చేయవలసిన సమయంలో చేయలేకపోతున్నాం. ఇంతకంటే దురదృష్టం ఏముంటుంది? ఇప్పటికయినా ప్రభుత్వమే చొరవ తీసుకుని పండితులందరినీ సమావేశపరచి ఏకీకరణకు మరింత లోతుగా కృషి చేయాలి. చివరిగా ఒక మాట... ప్రచారంలో ఉన్నదంతా సత్యం కానక్కర లేదు. ఇప్పటి వరకు నేను ఆరుసార్లు గోదావరి పుష్కరాల్లో స్నానం చేశాను, కృష్ణా పుష్కరాల్లో సైతం స్నానం చేశాను’’.
సంభాషణ: నిమ్మకాయల సతీష్ బాబు, వారణాసి సుబ్రహ్మణ్యం, రాజమండ్రి
ఫొటోలు: గరగ ప్రసాద్
 
మహామహోపాధ్యాయ ‘మధుర’!
మధుర కృష్ణమూర్తి శాస్త్రి 1928 ఫిబ్రవరి 28న పశ్చిమ గోదావరి జిల్లా ముక్కామలలో జన్మించారు. ఇంగ్లిష్ చదువులు 8వ తరగతి వరకు చదివారు. పీశుపాటి విశ్వేశ్వర శాస్త్రి వద్ద పంచకావ్యాలు, వ్యాకరణం నేర్చుకున్నారు. వాజపేయుల వేంకట సుబ్రహ్మణ్య సోమయాజుల వద్ద ఋగ్వేదస్మార్తము, సంస్కృత నాటకాలంకార శాస్త్రాలు, జ్యోతిష శాస్త్రంలో హోరా, సంహిత భాగాలు, జాతక-ముహూర్త, ప్రశ్న... అంశాలు అధ్యయనం చేశారు.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన శ్రీపాద వెంకట రమణ దైవజ్ఞ శర్మ వద్ద జ్యోతిషంలో సిద్ధాంత విభాగం, పంచాంగ రచన, ధర్మశాస్త్రాల అధ్యయనం చేశారు. 1956-57 మధ్య కాశీక్షేత్రంలో పంచాంగ గణితం, అయనాంశలపై పరిశోధనలు చేశారు. జ్యోతిష, వాస్తు శాస్త్రాలపై గ్రంథాలు రాశారు. 1985లో హైదరాబాద్‌లో నాటి బీహారు గవర్నర్ పెండేకంటి వెంకట సుబ్బయ్య చేతుల మీదుగా కనకాభిషేకాన్ని అందుకున్నారు.

1998లో మద్రాసు అకాడమీ తెలుగు ఉగాది పురస్కారం, 2004లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా సన్మానం,  తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం మహామహోపాధ్యాయతోపాటు అనేక బిరుదులు పొందారు. సనాతన ధర్మ వ్యాప్తికి, ఆర్ష సంప్రదాయానికి సంబంధించిన వేల గ్రంథాలను సేకరించారు.
 
అపర భగీరథుడు
బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో పుట్టిన సర్ అర్థర్ కాటన్‌ను గోదావరి జిల్లాల ప్రజలు అపర భగీరథుడిగా భావిస్తారు. ధవళేశ్వరం వద్ద గోదావరికి ఆనకట్ట నిర్మించడమే కాకుండా, కాలువలు ఏర్పాటు చేసి, వృథాగా సముద్రంలోకి పోతున్న గోదావరి జలాలను పొలాలకు మళ్లించిన మహనీయుడు ఆయన. తమ ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చిన  కాటన్ దొరను గోదావరి ప్రజలు సాక్షాత్తు దైవ సమానుడిగా ఆరాధిస్తారు. గోదావరిలో నిత్య స్నానాలు చేసేవారు కాటన్ దొరకు
 
‘నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః
స్మరామాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం’
అంటూ భక్తిగా తర్పణాలు విడుస్తారు. పుష్కర సమయంలో ఇప్పటికీ కొందరుతమ పితృదేవతలతో పాటు కాటన్ దొరకు కూడా భక్తి శ్రద్ధలతో పిండప్రదానాలు చేస్తారు.

మరిన్ని వార్తలు