వెన్నెల కొంచెమే కురిసింది

14 Dec, 2014 00:58 IST|Sakshi
వెన్నెల కొంచెమే కురిసింది

మీరు సంపాయించి సర్దిన ఆ పాత సామాన్లలో ఒక సామనులా చూస్తున్నారా మనిషిని. తప్పు చేశారు. నఫీసాకి ప్రేమ కావాలి. తీసుకెళ్లి అది ఇవ్వండి.
 
‘సాబ్, ఈ చోర్ బజార్లో ఈ అమ్మాయి అమ్మకానికుంది. మీక్కావాలంటే కొనుక్కోవచ్చు... పది లక్షలు’’ అన్నాడు అబూ.

 కథ
వెన్నెల కాంతికి అతని కుడిచేతి వేలికున్న ఉంగరం, ముంజేతికున్న కడియం మెరుస్తున్నాయి.
 షోడా కలిపిన స్కాచ్‌గ్లాసుని మృదువుగా సిప్ చేస్తా ఆ ఉంగరాన్నీ కడియాన్నీ చూసుకుంటున్నాడు జయపాల్.మహారాష్ట్రలో బీడు జిల్లాలో పర్లీ వైద్యనాథ్ అనే ఊరి జమీందార్ కొడుకైన జయపాల్‌రెడ్డి వయసు నలభై అయిదేళ్లు. పెళ్లి చేసుకోలేదు.జయపాల్‌కిష్టమైనవి స్కాచ్, షోడా, పైపుతో పాటు చేతికున్న ఉంగరం, కడియం కూడా.వాటిని తనకి ముందు తన తండ్రి వేసుకున్నాడు. అతనికి ముందు తాత, అలా వాళ్ల వంశీకులంతా వేసుకుంటా వస్తున్న ఈ రెండు వస్తువులూ తన శరీరంలో భాగాలైపోయాయి.
   
రోడ్ నంబర్ సిక్స్‌లో రాక్ కేజిల్ గేటులోకెళ్లడానికి ముందున్న కొండ మీదున్న ఆ బంగళా జయపాల్‌రెడ్డి పూర్వీకులది. బ్రిటిష్ దొరల దగ్గరకొన్నారంటప్పుడు. లోపలంతా రకరకాల ఏంటిక్స్‌తో ఒక మ్యూజియంలాగుంటుంది.స్త్రీ కళ్లని చాలా పెద్దగా వేసే జెమినీరాయ్‌తో పాటు రామ్‌కుమార్, సింగాల్ లాంటి పాతకాలం పెయింటర్స్ వేసిన ఒరిజినల్ పెయింటింగ్స్ చాలా ఉన్నాయి.

ఇంకా నూటయాభై ఏళ్లనాటి టేక్ వుడ్ రివాల్వింగ్ ఛెయిర్, రాగితో చేసిన గీజర్, మీర్ ఉస్మాన్ అలీ టాంగా చక్రాలు, ఇత్తడికేసున్న ట్యూబులైట్లూ, మార్లిన్ మన్రో బ్రా, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి ముక్కు బేసరి, చార్లీచాప్లిన్ చేతికర్ర, కణ్ణదాసన్ పెన్ను, డొక్కా సీతమ్మగారి చేతి గరిటె, నౌషాద్ హార్మోనియం, మీనాకుమారి చషకం, ద్వారం వెంకటస్వామినాయుడుగారి ఫిడేలు, సత్యజిత్‌రే పైపు, శ్రీశ్రీగారి కళ్లద్దాలు, సావిత్రి ఉంగరం... ఇలా చాలా రకాల వస్తువులు వాళ్ల బంగళా గోడల మీదా బల్లలపైనా ఆర్టిస్టిగ్గా అలంకరించి ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న వస్తువులు అద్దాల బీరువాల్లోనూ, మరీ చిన్నవి అద్దాల పెట్టెల్లోపల ముఖమల్ గుడ్డలకి గుచ్చీ ఉన్నాయి. ఆ వస్తువులన్నీ దేశంలో రకరకాల చోట్ల వేసిన ఆక్షన్లలో కొన్నవి. ఓల్డ్ సిటీలో శుక్రవారం తెల్లవారుఝాము పెట్టే జుమే రాత్ బజార్లో దొరికిన సామాన్లు కూడా చాలా ఉన్నాయిక్కడ.
   
ఆవేళ శుక్రవారం.
రాత్రి రెండు గంటలకి నిద్ర లేచిన జయపాల్ అరగంటలో తయారైపోయి కారెక్కి అఫ్జల్‌గంజ్ వచ్చేటప్పటికి మూడు దాటింది. ఎడంపక్కన నయాపూల్ బ్రిడ్జి, కుడిపక్కన కాళీమాత టెంపుల్ దానికెదురుగా జుమేరాత్ బజార్ జంక్షన్. కారు పార్క్ చేసి నడుస్తున్నాడా బజార్లో. అక్కడక్కడా నిజాం కాలం నాటి రంగు వెలిసిన భవనాలు.
 
రోడ్డుకి రెండు పక్కలా సంతల్లో ఉల్లిపాయలూ, పచ్చిమిరపకాయలూ పోగులెట్టినట్టు రకరకాల చోట్ల దొంగతనాలు చేసుకొచ్చిన సామాన్ల పోగులు. ఒకచోట రకరకాల సెల్‌ఫోన్ల పోగు, పెద్ద మిక్సీల కుప్ప, కంప్యూటర్ల వరస, ఇంకోచోట రకరకాల సైజుల్లో రకరకాల బ్రాండ్స్ పాత బూట్లు, మరోచోట చిన్న పిల్లల్నుంచి పెద్దోళ్ల దాకా తొక్కుకునే సైకిళ్లు అన్నీ దొంగ సామాన్లే.
 
పచ్చరంగేసిన మసీదు, పోచమ్మతల్లి గుడి, మున్నాసింగ్ నివాస్ దాటుతుంటే పెళ్లిళ్లప్పుడు ఊరేగింపులో కొత్త దంపతుల్ని తిప్పే టాంగా బళ్లు, పక్క దొడ్లో మేస్తున్న వాటికి కట్టే గుర్రాలు. నడుస్తున్న జయపాల్‌కి ఎదురొచ్చిన బ్రోకర్ అబూ ఒంగి సలాం చేశాడు. ఆ చోర్ బజార్లోకి కొత్తదేమొచ్చినా తనకి ఇన్ఫర్మేషనిచ్చేది ఇతనే. అతనితో పాటు నడుస్తున్న జయపాల్‌రెడ్డి, ‘‘నగరమంతా నిద్రపోతుంటే చీకట్లో ఈ బజారొక్కటే ఇక్కడ వెలిగిపోవడం... బాగుంది కదూ?’’ అన్నాడు.
 
‘‘ఇన్నాళ్ల నుంచీ బజార్‌కి వస్తున్నా మీకు ఎప్పటికప్పుడు కొత్తే సాబ్,’’ అన్నాడు అబూ.
 ఓ నిజాం కాలం నాటి ఇంట్లోంచి అప్పుడే నిద్రలేచి బయటికొచ్చిన ముసలి ఖాన్‌గారు బడే గులాం అలీ గజల్ పాడుకుంటున్నాడు బేస్ గొంతులో. ఎడం పక్కనున్న భజరంగ్ కిరాణాషాపు దాటిన వెంటనే హినాయత్ గంజ్ పోలీస్‌స్టేషనొచ్చింది. అది కూడా దాటాక కుడిపక్కనున్న ఝాన్సీలక్ష్మీబాయి విగ్రహానికెదురుగా పెద్ద పెద్ద పోగులు పెట్టి అమ్మేస్తున్నారు దొంగ బట్టలు, రకరకాల బ్రాండ్స్ ప్యాంట్లు, షర్టులూ. వాటి చుట్టూ మూగి ఏరుకుంటున్నారు కుర్రాళ్లు.
 
ఇంకో పక్క చీరలూ, జాకెట్లు, ఆఖరికి బ్రాలు కూడా పరమ చౌకగా అమ్మేసుకుంటున్నారాడాళ్లు. ఆ దుకాణాల మధ్యలోంచెళ్తున్న అబూ, జయపాల్ ఇరుగ్గా ఉన్న సందులు, గొందులు దాటుకుంటూ ఒక వీధిలోకొచ్చేటప్పటికి మళ్లీ దుకాణాలు. పందొమ్మిది వందల ఇరవైల నాటి ఇత్తడి సీలింగ్ ఫ్యాన్, దొరల కాలం నాటి రోజ్‌వుడ్ రాకింగ్ ఛెయిర్, ఒక టేకు డెస్క్ పెట్టి, ఇత్తడి హరికేన్ లాంతర్లు, మనిషంత ఎత్తున్న గడియారం, గ్రిండిగ్ స్పూల్ టేప్ రికార్డర్. ఒంగుని ఒకో వస్తువునీ చూసే పన్లో పడ్డాడు జయపాల్.
 
అంతలో వచ్చిన అక్తర్ అనే మనిషి అబూ చెవిలో ఏదో చెప్పెళ్లిపోయాడు.
 పెద్ద పెద్ద అంగలేసుకుంటూ జయపాల్ దగ్గరకొచ్చిన అబూ, ‘‘కొంచెం పక్కకొస్తారా సాబ్,’’ అనేసరికి వాడ్ని ఫాలో అయ్యాడు జయపాల్.ఒక చీకటి గల్లీ దాటుకుని ముందుకెళ్లాక అక్కడింకో నాలుగు దుకాణాలున్నాయి. అందులో ఒక దుకాణంలో కావ్యనాయికలా నిలబడుందో అమ్మాయి.
 ఎత్తుగా ఉంది. గులాబీరంగు శరీరం,  పెద్ద కళ్లు, ఎర్రటి పెదాలు, నల్లటి జుట్టు, బొట్టులేని నుదురు... పేరు నఫీసా అంట.
 
రెప్పార్పకుండా ఆ మనిషినే చూస్తున్న జయపాల్ ‘ప్రపంచంలో అందం ఇంత గొప్పగా ఉంటుందని ఇప్పుడే తెల్సింది’ అనుకున్నాడు.
 ‘‘సాబ్, ఈ అమ్మాయి అమ్మకానికుంది. మీక్కావాలంటే కొనుక్కోవచ్చు... పది లక్షలు’’ అన్నాడు అబూ.
 ‘‘ఏంటి?’’
 ‘‘పదిలక్షలకి అమ్మాయి.’’
 ‘‘ఏంటి?’’
 చెప్పింది మళ్లీ మళ్లీ చెప్పిన అబూ, ‘‘టైమ్ లేదు డెిసిషన్ క్షణాల మీద తీసుకోవాలి మీరు. చాలా పోటీ ఉంది బయట.’’
 ఏం మాటాడకుండా... నఫీసాని చూశాడు జయపాల్.
 పల్చగా నవ్వింది.
 జయపాల్ ఆలోచనల్లో పెద్ద సంచలనమే వచ్చింది.
 
మరో ముగ్గురొచ్చి ఎగాదిగా ఆమెని చూస్తుంటే అబూని పిల్చిన జయపాల్, ‘‘డబ్బెవరికివ్వాలి?’’ అన్నాడు.
 అక్కడున్న దుకాణం యజమాన్ని దగ్గరికి పిల్చి, ‘‘ఇతని పేరు జాకీర్. నఫీసా యజమాని’’ అన్నాడు అబూ.
 ‘‘ఇంటి దగ్గరిస్తాను, నాతో రండి. అబూ నువ్వూ రా’’ అన్నాడు జయపాల్.
 మొత్తం నలుగురూ కారు దగ్గరికొచ్చేసరికి ఆ కొత్త కారు టైర్లు, డిజిటల్ సౌండ్ ప్లేయరూ, హారనూ కొట్టేశాడెవడో.
 
అది చూసి పెద్దగా నవ్విన జయపాల్ క్యాబ్ తెప్పించి వాళ్లనెక్కించుకుని ఇంటి అడ్రస్ చెప్పాడు డ్రైవర్‌కి.
 జాకీర్‌కి పది లక్షలూ, మీడియేటర్‌గా పనిచేసిన అబూకి లక్షా ఇచ్చి పంపించేక, కుడిచెయ్యి చాపి నఫీసాని లోపలికి ఆహ్వానించాడు.
 నవ్వుతూ జయపాల్ చెయ్యి అందుకున్న నఫీసా అతని వేలి ఉంగరం, రిస్ట్‌కున్న కడియం లాక్కుని తన చేతికి తొడిగేసుకుంటుంటే, ‘వద్దు ఇవి నా ప్రాణం’ అని అరవడం మానేసి, ‘ఇవి నీవే తీసుకో’ అన్నట్టు నవ్వుతూ ఇచ్చేశాడు.
   
వాళ్ల బంగళాలో ఉన్న గదుల్లోకెల్లా గొప్ప గదిని నఫీసా కోసం డెకరేట్ చేయించాడు. ఒకనాడు రాజులు నిద్రలు చేసిన పెద్ద పందిరి మంచం, పైన చెయ్యేస్తే అడుక్కి దిగబడిపోయేంత మెత్తటి పరుపు, సుతిమెత్తటి దిళ్లు, నల్లటి అంచున్న నీలం రంగు ఉలెన్ బ్లాంకెట్లు. పరుపు మెత్తదనానికి తనకి తెలీకుండానే నిద్ర పట్టేసింది నఫీసాకి. మెలకువొచ్చి కళ్లు విప్పేటప్పటికి ఒకానొక తన్మయత్వంతో తననే చూస్తున్నాడా జయపాల్‌రెడ్డి.
   
మర్నాడు పొద్దుట వాళ్ల బంగళాలో ఈశాన్యం మూలగదిలో ఉన్న ఒ.పి.నయ్యర్ పియానోని చాలాసేపు చూసి, ఉత్తరం వేపు గది గోడలకున్న శోభాసింగ్, ఎస్సెమ్ పండిట్‌ల ఒరిజినల్ పెయింటింగ్స్‌ని పైప్ తాగుతూ ఇంకాస్సేపు పరిశీలించాక తూర్పువైపు గదిలో ఉన్న మీరాబాయి తంబురా, సోక్రటీస్ విషపాత్ర, కట్టబొమ్మన ఉరితాడు, భగత్‌సింగ్ తలపాగా తనివితీరా చూసొచ్చి చివర్లో నఫీసా గదిలోకడుగెట్టి ఆ ఏంటిక్స్‌ని చూస్తున్నట్టే ఈమెని కూడా తన్మయత్వంతో చూస్తా పైప్ వెలిగించి సోడా కలిసిన స్కాచ్ గ్లాసు అందుకున్నాడు.
 
రోజులు గడుస్తున్నాయి...
 తన ఇంట్లో వస్తువుల్ని చూసుకోవడం అయ్యాక నఫీసాని చూసుకుంటున్నాడు. అతని ప్రవర్తన ఒక రకమైన విసుగూ, చిరాకూ... ఒకోసారి విరక్తీ కలిగిస్తున్నాయి. పారిపోదామా అనిపిస్తుంది నఫీసాకి.
 ‘‘ఆడేదో ఊరికి జమీందారంట. కోట్ల ఆస్తంట. వజ్రాలు కూడా ఉన్నాయంట. నీకు అలవాటే గదా ఒక వజ్రం కొట్టి జంపయిపో, పంచుకుందాం’’ ఫోన్లో జాకీర్.
 ‘‘ఫోన్ కట్ చెయ్ రా,’’ నఫీసా.
 ‘‘ఆడి మీద మోజా... పూర్వం మనిద్దరం ఎన్ని చెయ్యలేదూ ఇలాంటి పన్లు...’’ జాకీర్.
 ‘‘ఎక్కువ వాగావంటే నిన్ను చంపి జైలుకెళ్తాను...’’ ఫోన్ కట్ చేసింది.
   
 ఆ సాయంత్రం బయటికెళ్లాడు జయపాల్‌రెడ్డి. చేతికున్న ఉంగరం, కడియం తీసక్కడ పెట్టేద్దాం అనుకుంది కానీ, తియ్యడానికి మనసొప్పుకోలేదు. ఎవ్వరికీ కనబడకుండా ఆ భవనం కొండ దిగి బయట కొంత దూరం నడిచి షేర్ ఆటో ఎక్కేసిందా నఫీసా. శుక్రవారం తెల్లవారుఝామున ఆ జుమేరాత్ బజార్లోకి అడుగెట్టేటప్పటికి సందడే సందడి. పెళ్లి ఊరేగింపు అప్పుడే అయిపోయినట్టుంది. ఆ టాంగా వచ్చి ఆగగానే ఒక కుర్రాడొచ్చి గుర్రాన్ని విప్పి, ఎదురుగా ఉన్న గుర్రపుశాలలోకి దాన్ని తీసుకెళ్లిపోయాడు. పక్కనే ఉన్న రంగులు వెలిసిన భవనంలో నిద్రపట్టని పిచ్చిదైన ముసలి డేన్సరు ఆ పచ్చని అద్దాల వెనుక ఆడతా పడిపోయింది.
 
ఆ కాలంనాటి ఖవ్వాలీ వినిపిస్తుందెక్కడ్నుంచో. అది వింటా ఖలీల్ భాయి మటన్‌షాపు దాటుతుంటే... ఏ నర్సరీలో కొట్టేశారో దొంగలు ఖరీదైన బోన్సాయి మొక్కలు. వాటిని చవగ్గా అమ్మేస్తుంటే తెగ మూగుతున్నారు జనం. ఆ జనం వెనుక నిలబడుంది నఫీసా...
 దగ్గరికెళ్లాడు. మాయమైపోయింది.
 మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ రిపేర్ చేసే గౌస్ షాపు దాటాకా, ఫాతిమా ఫ్లోర్‌మిల్ దగ్గర నిలువెత్తు గడియారాలు నాలుగు.  టైములు తేడా ఉండటం వల్ల రకరకాలుగా మోగుతుంటే వాటి వెనక నిలబడింది. దగ్గరకెళ్లాడు. కనబడలేదు.
 
చాలా సన్నటి సందులూ గొందులూ దాటుకుంటూ ముందుకెళ్తే... పూజా కూల్‌డ్రింక్ షాపుకీ, షబ్బీర్ లాండ్రీ షాపుకీ మధ్య పెట్టుంది జాకీర్ దుకాణం.
 వాడి పక్కనే కూర్చున్న అబూ, జయపాల్‌రెడ్డిని చూడగానే లేచి దగ్గరికొచ్చాడు.
 ‘‘తనెళ్లిపోయింది’’ అన్నాడు బాధగా.
 ‘‘మీరు సంపాయించి ఇంట్లో సర్దిన ఆ పాత సామాన్లలో ఒక సామనులా చూస్తున్నారా మనిషిని. తప్పు చేశారు.

ఆ మనిషి జీవితం నిండా అడిగో ఆ జాకీర్‌గాడి లాంటి ఎదవలే. నఫీసాకి ప్రేమ కావాలి. తీసుకెళ్లి అది ఇవ్వండి. అర్జంటుగా తీసుకెళ్లిపోండి సాబ్.’’
 తప్పు చేసినట్టు తలొంచుకున్న జయపాల్ అలాగే అన్నట్టు తలూపాడు.
 అక్కడే ఉన్నట్టుంది, మెరుపులాగ వాళ్ల మధ్యలోకొచ్చేసింది నఫీసా.
 ముగ్గురూ కదుల్తుంటే దారికడ్డంగా నిలబడ్డ జాకీర్, ‘‘రీ సేల్ ఎమౌంట్ అయిదు లక్షలు’’ అన్నాడు.
 చెప్పు తీసిన నఫీసా వాడి చెంప మీదా, ముఖం మీదా టపాటపా కొట్టేటప్పటికి మట్టిలో పడిపోయాడా జాకీర్.
 
వాత్సాయనుడి ‘కామసూత్రాలు’, వేణుదత్తుడి ‘ప్రీతికోసం’ ఇంకా స్మర ప్రదీపం, పంచసాయకం... ఈ గ్రంథాలన్నీ అమాంతంగా ఔపోసన పట్టేసిన జయపాల్ స్వర్గం చూపిస్తున్నాడా నఫీసాకి. ఎక్కడికెళ్లినా నఫీసా తోడుండాలి... ఏం చేసినా నఫీసా భాగస్తురాలు కావాలి!
   
 జాకీర్ ఫోన్ చేస్తున్నాడు.
 ‘‘మీ బంగళాలో ఖరీదైన సామాన్లు ఉన్నాయంట. మనుషుల్ని పంపిస్తాను,  నాకు చేరెయ్యాలి. కాదన్నావంటే నా దగ్గరున్న ఏంటిక్ కత్తితో ఒకసారి పొడవను, పొడిచి పొడిచి చంపేస్తాను.’’
 వాడి వాగుడికి నోట్లోంచి రాగూడని మాటలొస్తున్నాయి నఫీసాకి.
 రోజులు గడుస్తున్నాయి.
 జాకీర్ ఫోన్ చేసి బ్లాక్‌మెయిల్ చేసి బెదిరిస్తుంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని హడలగొడ్తోంది.
   
 జయపాల్ లేని టైం చూసుకుని కొందరు దొంగల్తో దిగిపోయాడు జాకీర్.
 నఫీసా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేటప్పటికి వచ్చిన పోలీసులు జాకీర్ని, వాడి జనాన్నీ బాదుకుంటా తీసుకెళ్లిపోయారు.
   
 వాళ్లిద్దరూ రంగు రంగుల నీళ్ల వర్షం జల్లుల్లో తడుస్తా, వెచ్చావెచ్చని చలిమంటలు కాగుతున్నారు. ఇంత మధురంగా ఉంటుందని ముందే తెలియని, అప్పుడే తెలిసిన వాళ్లలా శృంగార రసాన్ని ఆరారా తాగుతా దాహం తీర్చుకుంటా నిశ్శబ్దంగా నిర్మించుకున్న రాదారిలో హాయిగా ముందుకెళ్లిపోతున్నారు.
 చాలా పౌర్ణమి రాత్రులూ, అమావాస్య రాత్రులూ వచ్చి వెళ్లాయి.
 నఫీసాకి గర్భం.
 
అది తెల్సిన జయపాల్‌రెడ్డి పరమానందంతో ఊగిపోయాడు. నా వారసుడీ భూమ్మీదకి రాబోతున్నాడా... తల్చుకుంటేనే అదో రకం తన్మయత్వం...
 జయపాల్లోనూ, తనలోనూ ఆ ఆనంద సంబరాలు చూసుకుంటున్న నఫీసా, ‘ఈ జన్మకి ఈ అదృష్టం చాలు’ అంటా ఆకాశంలో ఉన్న అల్లాకి దణ్ణవెట్టుకుంటుంది.
   
దీపావళి రోజులు దగ్గర పడుతుండగా తుఫాను.. ఎప్పుడూ కురుస్తా, ఎప్పుడన్నా ఆగే వర్షాలు, ఎప్పటికీ ఆగని వింత చలిగాలులు... ఇంకా ఆ దీపావళి రాకపోయినా కాంతులీనే కోటి దీపాలు వెలిగించుకుంటున్నాడు. ఆమె నవ్వుల్లా వెలిగే జారే మతాబులు, ఆమె కోపంలా చిరపరలాడ్తున్న కాకర పువ్వత్తులు... ఇంత బావుంటుందా జీవితం? ఎంత వేస్టయిపోయిందింత కాలం? పశ్చాత్తాపపడ్తుండగా కబురు... వాళ్ల ఊరైన పర్లీ వైద్యనాథ్‌కి ఎవరికీ చెప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి.
 అలా వెళ్లిన తను సిటీలోకి తిరిగి రావడానికి పదిహేను రోజులు పట్టింది.
 రాత్రి ఎనిమిదింటికి భవనంలోకి అడుగెట్టిన జయపాల్ నఫీసాని పిలిచాడు. మళ్లీ పిల్చాడు. బంగళా అంతా అరుస్తా వెతికాడు. కనిపించలేదు.
   
 అన్నం తినడం, నిద్రపోవడం మానేసిన జయపాల్... ఆ శుక్రవారం తెల్లవారుఝామున నఫీసాని వెతుక్కుంటా జుమేరాత్ బజార్లోకెళ్లాడు. ఇరుకు సందులు దాటి జాకీర్ దుకాణం పెట్టే చోటుకెళ్లాడు.
 అక్కడాడి దుకాణం లేదు.
 ముందుకి కదుల్తున్నవాడల్లా ఆ పక్క దుకాణంలో ఉంగరం, కడియం కనబడితే ఒంగి ఆత్రంగా చేతిలోకి తీసుకున్నాడు. ‘ఇవి నావే, నా నఫీసాకి తొడిగినవి’ అని వాటిని గుండెలకద్దుకుంటుండగా వచ్చిన అబూని చూసి, ‘‘నఫీసా మళ్లీ వెళ్లిపోయింది’’ అన్నాడు జయపాల్.
 
అతని మాటలకి అదోలాగ నవ్వి, ఎటో చూసిన అబూ ఎప్పటికో అన్నాడు. ‘‘తనెళ్లిపోలేదు. తన రాజ్యం వదిలి తనెప్పటికీ వెళ్లిపోదు’’ అని.
 ‘‘జైలు నుంచి విడుదలై వచ్చిన జాకీర్‌గాడు మీ బంగ్లాకొచ్చి నఫీసాని ఎత్తుకొచ్చాడు. ఇద్దరికీ గొడవైంది. నఫీసా, జాకీర్‌జబ్బ మీద పొడిస్తే, ఆడా కత్తి లాక్కుని ఆ గర్భిణీ కడుపులో పొడిచి పారిపోయాడు. చచ్చిపోయింది సాబ్...
 ‘‘మీ కోసం ఎన్ని ఎంక్వైరీలు చేసినా మీ జాడ తెలీకపోవడంతో అనాథ అయిన ఆ మనిషి శవం కార్పొరేషనోళ్ల పాలైపోయింది.’’
- వంశీ

మరిన్ని వార్తలు