వీరమాత జిజా

6 Mar, 2016 00:52 IST|Sakshi
వీరమాత జిజా

చరితను తిరగేస్తే ఆ పుటల్లో కనిపించే ఓ గొప్ప తల్లి జిజాబాయి. కొడుకుని వీరుణ్ని చేసిన వీరమాత. తల్లి ఎలా ఉండాలి అన్నదానికి ఆమె ఒక నిర్వచనం
  - ఓ పుస్తకంలోని వాక్యాలు

 
 ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని నినదించడానికి ఎంతో ముందే మహారాష్ట్రుల స్వేచ్ఛాకాంక్ష లోకానికి వెల్లడైంది. ఆ మట్టి మహిమ కాబోలు, అక్కడ పుట్టిన జిజాబాయి పదిహేడో శతాబ్దంలోనే ఆ నినాదాన్ని ఆచరించి చూపించింది. జిజాబాయి శహాజీ భాంస్లే (జనవరి 12, 1598 - జూన్ 17, 1674) ‘క్షత్రియ కులావతంశశ్రీ రాజా శివచ్ఛత్రపతి’ శివాజీకి తల్లి అయినందుకు జనబాహుళ్యంలో ప్రసిద్ధురాలై ఉండవచ్చు. గొప్ప మాతృమూర్తిగా, ఒక సామ్రాజ్యం కోసం ప్రణాళిక రచించిన రాజనీతిజ్ఞురాలిగా గౌరవం పొంది ఉండవచ్చు.
 
 నిజానికి ఆ కాలంలో పుట్టి, ఆమె ఏర్పరుచుకున్న స్వతంత్ర భావనలు, చూపిన సంస్కరణా భావాల వల్ల చరిత్రలో మరింత సమున్నత స్థానం ఆమెకు దక్కవలసి ఉందనిపిస్తుంది.  ఆమె భర్తకు దూరంగా ఉండిపోయింది. తండ్రి లఖూజీ జాధవ్‌రావ్ సహా కుటుంబ సభ్యులంతా ఉరికంబం ఎక్కారు. పెద్ద కొడుకు యుద్ధంలో మరణించాడు. ఇదంతా ఒక సంక్షుభిత రాజకీయ వాతావరణం ఫలితం. ఐక్యత లోపించిన భారతీయ సమాజం మొగలుల బారిన పడి ఎన్ని ఇక్కట్లు అనుభవించిందో చూడాలంటే జిజా కుటుంబ గాథతో తెలిసిపోతుంది. కడుపున పుట్టిన ఎనిమిది మందిలో శివాజీ ఒక్కడే మిగిలినా ఆ సంక్షుభిత రాజకీయ పరిస్థితులకు  ఎదురీది, కొడుకుని విజేతగా నిలబెట్టిన జిజా ఒక అద్భుత, అసాధారణ మహిళ.
 
 మహారాష్ట్రలోని బుల్దానా ప్రాంతంలో పుట్టిన జిజా వివాహ జీవితమే ఒక సంఘర్షణ మధ్య ఆరంభమైంది. బాల్యంలో ఒకసారి హోలీ పండుగలో పాల్గొన్నపుడు ఒక బాలుడి మీద రంగునీళ్లు చిమ్మింది. ఆ బాలుడు కూడా చల్లాడు. అది చూసిన లఖూజీ ఈ ఇద్దరూ మంచి జంట అవుతారని సరదాగా అన్నాడు. ఆ బాలుడే శహాజీ భాంస్లే. మలోజీ అనే చిన్న ఉద్యోగి కుమారుడు. అది తెలిసి మలోజీని లఖూజీ అవమానించి పంపాడు. కానీ శహాజీ తరువాత బిజాపూర్ సుల్తాన్ సైన్యంలో ఉన్నతోద్యోగి అయ్యాక, ప్రతీకారం కోసం జిజాను వివాహం చేసుకోవడానికి ప్రయత్నాలు ఆరంభించాడు.
 
 ఆఖరికి నిజాం చేత (ఈ సంస్థలోనే లఖూజీ పనిచేశాడు) చెప్పించి వివాహం చేసుకున్నాడు కూడా. మొగలుల రాకతో పరిస్థితులు మారాయి. ఒప్పందం ప్రకారం శహాజీ కర్ణాటకకే పరిమితమైపోయాడు. వెంట పెద్ద కుమారుడు శంభాజీని తీసుకువెళ్లాడు (తరువాత అఫ్జల్‌ఖాన్‌తో జరిగిన యుద్ధంలో ఇతడు మరణించాడు. శివాజీ కుమారుడి పేరు కూడా శంభాజీయే). నిజాం మీద మొగల్ దాడులతో లఖూజీ కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది. శహాజీ కర్ణాటకలో తుకాబాయి అనే మహిళను వివాహమాడి జిజాను దాదాపు మరచిపోయాడు. అప్పటి నుంచి జిజా పూనాలో ఉండిపోయింది.
 
 శివాజీ గర్భంలో ఉన్నప్పుడే నాలుగో నెలలో భర్తకు దూరమైంది జిజా. ఆ సమయంలో ఆమెకు సకల సౌకర్యాలు కల్పించారు. కానీ జిజా వాటిని నిరాకరించింది. నేలపై పడుకునేది. కొండలు ఎక్కేది. నిరంతరం ఆయుధాలు ధరించి ఉండేది. ఇదంతా ఒక విశ్వాసానికి సంబంధించినది. ఇలా చేస్తే పుట్టే బిడ్డలు కష్టపడే తత్వంతో, ధైర్యశాలురై ఉంటారని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. అది విశ్వాసమే అయినప్పటికీ ఆమెకు పుట్టిన ఆఖరి బిడ్డ సాహసవంతుడే అయ్యాడు. ఒక పక్క కొడుకును అత్యంత క్రమశిక్షణతో, యుద్ధ విద్యలతో పెంచుతూనే, తన అధీనంలో భర్త ఉంచిన పూనా పరిపాలనలో కూడా పాలు పంచుకునేదామె. దాదాజీ కొండదేవ్ సహకరించేవాడు. అతడే శివాజీకి యుద్ధ విద్యలు నేర్పిన గురువు.
 
 మొగలుల పాలన ఆరంభంలో అరాచకంగా సాగేది. మిహ ళలను అవమాన పరచడం, మత మార్పిడులు ఎక్కువగా ఉండేవి. వీటిని చూసి ఆమె తీవ్రంగా హెచ్చరించేది. మహిళలను రక్షించకుంటే జీవితాలు ఎందుకని ప్రశ్నించేది. అలాగే హిందూమతంలోని బలం, బలహీనతలు ఎరిగిన మహిళ ఆమె. బలవంతపు మత మార్పిడికి గురైన బాలాజీ నింబాల్కర్ అనే సిపాయి తిరిగి హిందూ మతంలో చేరడానికి ముందుకు వచ్చాడు.
 
  అతడికి ఆ అవకాశం ఇవ్వమని జిజా బ్రాహ్మణులను ఆదేశించారు. అఫ్జల్‌ఖాన్ అపార సైన్యాన్ని ఎదిరించడానికి గెరిల్లా పద్ధతి ఉపయోగించమని శివాజీకి సలహా ఇచ్చినది కూడా జిజాయే. ఆ యుద్ధంలో ఎంతో చిన్న సంఖ్యలో ఉన్న శివాజీ సేన అఫ్జల్‌ఖాన్ సేనను ఓడించింది. కానీ భర్త పోయిన తరువాత సహగమనం చేస్తానని పట్టు బడితే శివాజీయే ఆమెను నిరోధించాడు. జూన్ 17, 1674న ఆమె కన్ను మూసింది. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగిన కొద్దికాలానికే ఆమె తుది శ్వాస విడిచింది.
 

మరిన్ని వార్తలు