చిత్ర రచయిత్రి

16 Dec, 2018 08:29 IST|Sakshi

‘ఎవడే సుబ్రమణ్యం’, ‘కల్యాణవైభోగమే’,  ‘మహానటి’, ‘ట్యాక్సీవాలా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది మాళవిక నాయర్‌. ఢిల్లీలో పుట్టిన ఈ అమ్మకుట్టి కోచిలో చదువుకుంది. బాలనటిగా చేసింది.‘‘పాత్ర  నిడివి గురించి కాదు... అది ఎంత శక్తిమంతమైనది? అనే దాని గురించి ఆలోచిస్తాను’’ అంటున్న మాళవిక మనసులో మాటలు ఇవి....

ఆ పాత్రలో నటించాలని ఉంది...
కంఫర్ట్‌జోన్‌లో ఉండే పాత్రలు చేయడం కంటే సవాలు విసిరే పాత్రలు చేయడం అంటేనే ఇష్టం. మానసిక వైకల్యం ఉన్న యువతిగా నటించాలని ఉంది. మలయాళ చిత్రంలో ‘కూకూ’ అంధురాలిగా నటించాను. ఈ పాత్ర నాకు సంతృప్తి ఇచ్చింది.

ఆమిర్‌ఖాన్‌ ఆదర్శం
పాత్రల ఎంపికలో ఆమిర్‌ఖాన్‌తో పాటు విద్యాబాలన్‌ నాకు ఆదర్శం. కమర్షియల్‌–నాన్‌ కమర్షియల్‌ సినిమాలను సమన్వయం చేసుకోవడంలో అమీర్‌ నాకు బాగా నచ్చుతారు. బాలీవుడ్‌లోకి వెళ్లాలనే ఆతృత లేదు. ఆసక్తి కూడా లేదు. గ్లామర్‌రోల్స్‌ పోషించడం నాకు కంఫర్ట్‌ కాదు.

తొందరేమీ లేదు
ఒక సినిమా సక్సెస్‌ అయితే ‘సంతోషం’తో పాటు, స్క్రిప్ట్‌ ఎంపికలో నా మీద నాకు నమ్మకం కూడా ఏర్పడుతుంది. ‘ట్యాక్సీవాలా’ విషయంలో ఇలాగే జరిగింది. డైరెక్టర్‌ రాహుల్‌ స్క్రిప్ట్‌ నెరేట్‌ చేయగానే వెంటనే ఓకే చెప్పేశాను. నా నమ్మకం వమ్ము కాలేదు. మంచి పాత్రల విషయంలో నిడివి గురించి ఆలోచించను. ఎడాపెడా సినిమాలు చేసేయాలనే తొందర లేదు. నచ్చే పాత్రలు వచ్చే వరకు ఓపికగా ఎదురుచూస్తాను. రాకపోతే బాధ పడను.

దూరం ఎందుకంటే...
‘సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటారు ఎందుకు?’ అని అడుగుతుంటారు. మన గురించి మన సినిమాలు మాట్లాడాలి తప్ప మనం కాదు అనేది నా అభిప్రాయం. ‘వైడ్‌ రీచ్‌’ అనేది సోషల్‌ మీడియాకు ఉన్నదనేది నిజమేగానీ, టైమ్‌ ఎక్కువగా తినేస్తుంది. దానికి దూరంగా ఉండడంలో కూడా హాయిగా ఉంది. రచనలు చేయడమన్నా , పెయింటింగ్స్‌ వేయడమన్నా నాకు చాలా ఇష్టం. నా పెయింటింగ్స్‌తో ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఉంది.

నా రోల్‌మోడల్‌
ప్రజలతో మమేకమైనప్పుడే  వారి ప్రవర్తన, పద్ధతులు తెలుస్తాయి. అవి నటనకు ఉపయోగపడతాయి. కమర్షియల్‌ సినిమాలు చేయడానికి అభ్యంతరం లేదు. అయితే అందులో నేను చేస్తున్న పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. పాత్ర నచ్చకపోవడంతో ఈమధ్య ఒక కమర్షియల్‌ సినిమాను వద్దనుకున్నాను. నా రోల్‌ మోడల్‌ మలయాళ నటి పార్వతి. ఆమె చేసిన పాత్రలు  ఇష్టం. ఒక పాత్ర చేసే ముందు ఎంతో రీసెర్చి చేసిగాని ఆమె కెమెరా ముందుకు రాదు.

మరిన్ని వార్తలు