జపాన్ టు శ్రీకాకుళం

31 Jul, 2016 14:55 IST|Sakshi
జపాన్ టు శ్రీకాకుళం

కవర్ స్టోరీ: ఆగస్టు 6 హిరోషిమా డే సందర్భంగా...
సునామీ తాకిడి తర్వాత 2011 మార్చి 11న జపాన్‌లోని ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో సంభవించిన పేలుళ్లు
 
మొన్నటికి మొన్న నాగసాకి, హిరోషిమా...నిన్నటికి నిన్న ఫుకుషిమా. ఒకటి ఉద్దేశపూర్వకమైన దాడి. మరొకటి ‘అనుకోని’ దుర్ఘటన. రెండూ ‘అణు’దారుణాలే. రెండింటి పర్యవసానాలూ దాదాపు ఒకటే... భారీ ప్రాణనష్టం... ప్రాణాలు మిగిలిన జనాలకు నయంకాని వ్యాధులు. ఆ వ్యాధులు సోకిన వారికే పరిమితం కాలేదు, తరతరాలనూ వెన్నాడుతూనే ఉన్నాయి. ఇక ప్రకృతికి వాటిల్లిన నష్టం చెప్పనలవి కాదు. ఇవన్నీ అల్లక్కడెక్కడో జపాన్‌లో జరిగిన సంఘటనలు కదా అని వదిలేయగలమా?

సాటి మానవుల ప్రాణాలకు ఎక్కడ కష్టం వాటిల్లినా అది కష్టమే కదా! సాటి మానవుల ప్రాణాలకు ఎక్కడ నష్టం వాటిల్లినా అది నష్టమే కదా! ఎక్కడో జరిగిందిలే మనకెందుకని వదిలేస్తే రేపు అలాంటి ముప్పు మనకూ రావచ్చు. నాగసాకి, హిరోషిమాల మాదిరి ఉద్దేశపూర్వక దాడుల వల్ల కాకపోవచ్చు గాని, ఫుకుషిమా మాదిరి మరో‘షిమా’ మన శ్రీకాకుళం జిల్లాలోనే పునరావృతం కావచ్చు. ప్రజల ప్రాణాలను చెల్లని చిల్లరనాణేలుగా పరిగణించే పాలకశ్రేణులకు ఇవేవీ పట్టవు. అందుకే ఎంతమంది శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నా, జనాలు ఎంతగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నా మొండిగా అంతులేని ‘అణు’వ్యామోహాన్ని ప్రదర్శిస్తూ ఆ విధంగా ముందుకు పోవడానికే సిద్ధపడుతున్నాయి.

 
విల్లంబులు ఇంకా అంతరించని కాలం అది. అక్కడక్కడా వినిపించే తుప్పు తుప్పు తుపాకుల చప్పుళ్లకే జనాలు భయపడే కాలం అది. ప్రకృతిలోని పచ్చదనం ఇంకా వన్నెతగ్గని కాలం అది. అలాంటి కాలంలో జర్మన్ రసాయన శాస్త్రవేత్త  మార్టిన్ క్లాప్‌రోత్ 1789లో యురేనియం కనుగొన్నాడు. అప్పట్లో అది ఇనుము వంటి ఇతర మూలకాల్లాంటిదేనని అనుకున్నారే తప్ప వినాశనాలకు మూలం కాగలదనుకోలేదు. యురేనియం కనుగొన్న దాదాపు వందేళ్ల తర్వాత గాని రేడియం, యురేనియం వంటి మూలకాలకు గల అణుధార్మికతను శాస్త్రవేత్తలెవరూ గుర్తించలేదు.వీటి కేంద్రకాలు విచ్ఛిత్తికి గురైనప్పుడు ఉష్ణోగ్రత, శక్తితో పాటు వీటికి చెందిన ప్రమాదకరమైన పార్టికల్స్ ప్రకృతిలోకి విడుదలవుతాయి. ఇలాంటి మూలకాలకు గల ఈ ప్రత్యేక లక్షణానికి పీర్ క్యూరీ, మేరీ క్యూరీ దంపతులు 1896లో తొలిసారిగా ‘రేడియో ఆక్టివిటీ’ (అణుధార్మికత) అనే పేరుపెట్టారు. ఆ తర్వాత రేడియో ధార్మికత గల అణువులను శరవేగంగా ప్రోటాన్లతో ఢీకొట్టించడం వల్ల విస్ఫోటాన్ని సృష్టించే ప్రక్రియను, అపరిమితంగా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చనే విషయాన్ని 1930వ దశకంలోనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు.‘అణు’దుర్ఘటన
ఐదేళ్ల కిందట జపాన్‌లోని తొహుకు ప్రాంతంలో భూకంపం వచ్చింది. భూకంపం ధాటికి సునామీ చుట్టుముట్టింది. సునామీ తాకిడికి 2011 మార్చి 11న ఫుకుషిమాలోని అణు విద్యుత్ కేంద్రం విధ్వంసానికి గురైంది. సునామీ చెలరేగిన వెంటనే ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలోని నాలుగో రియాక్టర్ దెబ్బతిని, అందులోని ఇంధన కడ్డీల నుంచి విపరీతమైన వేడి విడుదలైంది. ఫలితంగా వాతావరణంలోకి రేడియో ధార్మిక పదార్థాల విడుదలతో పాటు నాలుగు రోజుల పాటు ఆ రియాక్టర్‌లో పేలుళ్లు కూడా సంభవించాయి.

ఫుకుషిమా దుర్ఘటనలో రేడియేషన్ వల్ల ఎవరూ మరణించలేదు గాని, ప్రమాదస్థలికి పరిసరాల్లోని ప్రజలను హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో దాదాపు 1600 మంది మరణించారు. అయితే, ఫుకుషిమా దుర్ఘటన పర్యవసానాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రేడియేషన్ వల్ల వెంటనే ఎవరూ మరణించకపోయినా, దాని ప్రభావం వల్ల కొందరు చిన్నారులు థైరాయిడ్ కేన్సర్‌కు, థైరాయిడ్‌కు సంబంధించిన ఇతర ఆరోగ్య సమస్యలకు గురయ్యారు. ఫుకుషిమాలో జరిగినది చాలా చిన్న ‘అణు’ప్రమాదమని వారు అంటున్నారు. దీని తీవ్రత 1.5 ఎస్‌వీగా నమోదైంది. ఈ చిన్న ‘అణు’ ప్రమాదానికే పరిస్థితి ఇలా ఉంటే, ఇక పెద్ద ప్రమాదం జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే.
 
‘అణు’దుర్వినియోగం
రేడియో ధార్మికత గల అణువులతో విద్యుత్తునే కాదు,  విధ్వంసాలనూ సృష్టించవచ్చు అని తెలిశాక అగ్రరాజ్యమైన అమెరికా ధ్వంసరచనకు ఒడిగట్టింది. బ్రిటన్ సమ్మతితో 1945లో జపాన్‌లోని నాగసాకి, హిరోషిమా నగరాలపై అణుబాంబులను ప్రయోగించింది. ఆ విధ్వంసంలో తక్షణమే 1.29 లక్షల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అణుబాంబుల రేడియో ధార్మికత ప్రభావం నాగసాకి, హిరోషిమాలపై దశాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉంది.

ఆ రెండు నగరాల పరిసరాల్లో ఉంటున్న చాలామంది రకరకాల కేన్సర్ల బారిన పడ్డారు. ‘అణు’ విధ్వంసం తర్వాత ఆ ప్రాంతంలో చాలామంది పిల్లలు జన్యులోపాలతో పుట్టారు. నాగసాకి, హిరోషిమా పరిసరాల్లో 1945-2000 మధ్య కాలంలో ల్యూకీమియా సోకి 46 శాతం మంది, ఇతర కేన్సర్ల వల్ల మరో 11 శాతం మంది మరణించారు. తాజా లెక్కల ప్రకారం నాగసాకి, హిరోషిమా పరిసరాల్లో దాదాపు 1.83 లక్షల మంది రేడియో ధార్మికత వల్ల తలెత్తిన రకరకాల వ్యాధులతో ఇంకా బాధపడుతూనే ఉన్నారు.
 
శ్రీకాకుళంలో ‘అణు’గొణలు
భారత్‌లోని ప్రతిపాదిత అణు విద్యుత్ కేంద్రాలలో ఒకటి శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న కొవ్వాడ వద్ద ఏర్పాటు కానుంది. నిజానికి ఇది గుజరాత్‌లోని మితివర్ధిలో ఏర్పాటు కావాల్సి ఉంది. మితివర్ధిలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని 2007లోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 2013 నాటికి అటవీ, పర్యావరణ అనుమతులు కూడా పొందింది. అయితే, దీనిని కొవ్వాడకు తరలిస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించింది.

గుజరాత్ ప్రజలు వ్యతిరేకించడం వల్లనే అక్కడ తలపెట్టిన అణు విద్యుత్ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఇక్కడకు తరలిస్తోందనే ఆరోపణలున్నాయి. అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం కొవ్వాడ, అల్లివలస పంచాయతీల పరిధిలో కొవ్వాడ, చిన్నకొవ్వాడ, రామచంద్రాపురం, గూడాం టెక్కలి గ్రామాలను ఖాళీ చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ గ్రామాల్లో 3500 ఇళ్లు ఖాళీ చేయించనుండగా, సుమారు ఆరువేల మంది ప్రజలు నిర్వాసితులు కానున్నారు. నిజానికి శ్రీకాకుళంలో ‘అణు’గొణలు ఇప్పటివి కావు.

మొదట 1992లోనే కొవ్వాడలో న్యూక్లియర్ పార్కు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. హడావుడిగా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో ప్రాజెక్టు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. కొవ్వాడ న్యూక్లియర్ పార్కుకు 2080 ఎకరాలు కావాల్సి ఉండగా, దాని కోసం 1480 ఎకరాల ప్రభుత్వ భూమిని, మిగిలిన 600 ఎకరాలు రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా... కొవ్వాడ, చిన్నకొవ్వాడ, రామచంద్రాపురం, గూడాంటెక్కలి, కోటపాలెం, పాతర్లపల్లి, మరువాడ గ్రామాల రైతుల నుంచి భూసేకరణకు సన్నాహాలు సాగిస్తోంది.
 
అణు హబ్బా... చావుదెబ్బా?

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రధాన ‘అణు’స్థావరంగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలిలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఇప్పటికే స్థలాన్ని గుర్తించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌కు రానున్న సందర్భంగా కావలి ‘అణు’ ప్రాజెక్టుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది.వీటితో కలుపుకొని ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఆరు అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రాన్ని న్యూక్లియర్ హబ్‌గా మారుస్తామని ప్రభుత్వం చెప్పుకొంటోంది. అయితే, అది అణు హబ్బా... ప్రజల బతుకులపై చావుదెబ్బా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు నిరసనలు ఎదురవుతూ ఉండటంతో వీటి ఏర్పాటు కోసం కేంద్రం తాజాగా ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారిస్తోంది.
 
మన కొవ్వాడ మరో ఫుకుషిమా?
జపాన్‌లోని ఫుకుషిమాకు, మన ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడకు చాలా సారూప్యతలు ఉన్నాయి. రెండు ప్రాంతాలూ సముద్రతీరంలోనే ఉన్నాయి. జపాన్‌కు భూకంపాలు కొత్త కాదు. దాదాపు దేశమంతా తరచూ భూకంపాలకు గురయ్యే ప్రాంతంలోనే ఉంది. మన దేశంలో భూకంపాలకు గురయ్యే అవకాశాలు గల ప్రాంతాల్లో కొవ్వాడ కూడా ఉంది. భవిష్యత్తులో ఇక్కడ భూకంపాలు సంభవించే ముప్పు కచ్చితంగా ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. అలాంటప్పుడు ఇక్కడ నిర్మించబోయే అణు విద్యుత్ కేంద్రం ఎంతవరకు సురక్షితంగా ఉంటుందనే దానికి ఏమాత్రం భరోసా లేదు.
 
ఒకవైపు గుజరాత్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు తమ ప్రాంతాల్లో అణు విద్యుత్ కేంద్రాలు వద్దంటే వద్దని తిరస్కరిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అణువంతైనా ఆలోచన లేకుండా వాటన్నింటినీ అక్కున చేర్చుకుంటోంది. అంతర్జాతీయ ప్రమాణాలను తుంగలోకి తొక్కి మరీ అణు విద్యుత్ కేంద్రాలకు చాలా చేరువలోనే జనావాసాల ఏర్పాటుకు అడ్డగోలుగా తెగబడుతోంది.
 
‘అణు’ వినియోగం నుంచి చాలా అభివృద్ధి చెందిన దేశాలే వెనక్కు తగ్గుతుంటే, మన పాలకులు మాత్రం ఎలాంటి ఆలోచనా లేకుండా దేశవ్యాప్తంగా ఎడాపెడా అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు తెగబడుతుండటం శోచనీయం. అణు విద్యుత్ కేంద్రాల వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడటమే కాదు, వీటిని లక్ష్యంగా చేసుకుని ఏ ఉగ్రవాదులైనా దాడులకు తెగబడితే అప్పుడు జరిగే విధ్వంసం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించనైనా ఊహించలేరు.
 
ప్యాకేజీల ఎర

అణు విద్యుత్ కేంద్రంపై వ్యతిరేకతను నీరుగార్చేందుకు ప్రభుత్వం కొవ్వాడ పరిసరాల రైతులకు ప్యాకేజీల ఎర వేస్తోంది. ఈ ప్రాంతంలో భూముల మార్కెట్ ధర ఎకరానికి రూ.3 లక్షల వరకు ఉంది. దీనికి మూడు నాలుగు రెట్లు ప్యాకేజీగా ఇస్తామని ప్రభుత్వం ఆశ చూపుతోంది. నిర్వాసితులకు నారువా గ్రామంలో 350 ఎకరాల్లో పునరావాసం కల్పించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇక అణు విద్యుత్ కేంద్రం సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణం కోసం కొత్త సుందరపాలెంలో 350 ఎకరాల స్థలాన్ని గుర్తించింది.

స్థల సేకరణ వ్యవహారమై ఇదివరకు ఆర్డీవో ఇక్కడకు వస్తే స్థానికులు అడ్డగించారు. తర్వాత గత ఏడాది శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఇక్కడ నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేశారు. తొలుత ఖాళీ చేసిన ఇళ్ల లబ్ధిదారులకు ఇల్లుతో పాటు రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తామని, మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

పరిహారంగా రూ.5 లక్షలు వద్దనుకుంటే, నెలకు రూ.2 వేల చొప్పున ఇరవయ్యేళ్ల పాటు పింఛను చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కొవ్వాడ న్యూక్లియర్ పార్కును తొలుత స్థానికులు వ్యతిరేకించినా, ప్రభుత్వం ఇక గత్యంతరం లేని పరిస్థితులు కల్పించడంతో చివరకు దీనికి అంగీకరించాల్సిన పరిస్థితి దాపురించింది.
ఇన్‌పుట్స్: అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం
 
వ్యతిరేకత ఎందుకంటే..?
పలు పర్యావరణ సంఘాలు, ప్రజా సంఘాలు కొవ్వాడ వద్ద న్యూక్లియర్ పార్కు ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం న్యూక్లియర్ పార్కుకు కనీసం 38 కిలోమీటర్ల వరకు ఎలాంటి జనావాసాలు ఉండకూడదు. అయితే, కొవ్వాడ వద్ద ఈ పరిమితిని 16 కిలోమీటర్లకు తగ్గించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
 
బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న కొవ్వాడ భూకంపాలకు అవకాశం గల ప్రాంతంలో ఉంది. భూకంపం, సునామీ వంటి ప్రకృతి విపత్తులు తలెత్తితే ఇక్కడ ఏర్పాటు చేయబోయే అణు రియాక్టర్లు విధ్వంసానికి గురికాకుండా ఉండవు. అలాంటిదేదైనా జరిగితే, దానికి ఎవరు జవాబుదారీ అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
 
నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తొలుత కొవ్వాడ ప్రాజెక్టును వ్యతిరేకించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన 2010లో ఇక్కడ పర్యటించినప్పుడు కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటును తాము వ్యతిరేకిస్తున్నామని, తాము అధికారంలోకి వస్తే, ఈ ప్రతిపాదనను రద్దు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను గాలికొదిలేసి, సర్వే పనులను వేగవంతం చేశారు.
కవర్‌స్టోరీ: పన్యాల జగన్నాథదాసు

మరిన్ని వార్తలు