జనభారతం

10 Jul, 2016 01:48 IST|Sakshi
జనభారతం

జూలై 11 వరల్డ్ పాపులేషన్ డే
తాజా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభా 720 కోట్లు దాటింది. ప్రపంచ జనాభాలో 37 శాతం కేవలం చైనా, భారత్‌లలోనే ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనసంఖ్యలో చైనా మొదటి స్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాలూ ఆసియా ఖండంలోనే ఉన్నాయి. ఖండాల వారీగా చూసుకుంటే, ప్రపంచ జనాభాలో 60 శాతం ఆసియాలోనే ఉంది. అయితే, ఆసియాలో జపాన్ మినహా అభివృద్ధి చెందిన దేశమేదీ లేదు. అధిక జనాభా కారణంగానే ఆసియా దేశాలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోతున్నాయనే వాదనలు లేకపోలేదు.

ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పటికి భారత్ జనసంఖ్యలో చైనాను అధిగమిస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి.
 
ప్రపంచ జనాభాలో గడచిన రెండు శతాబ్దాల కాలంలోనే విపరీతమైన పెరుగుదల నమోదైంది. మరణాల రేటును మించి జననాల రేటు నమోదు కావడం, అధునాతన వైద్య సౌకర్యాలు విరివిగా అందుబాటులోకి రావడం వంటి కారణాలు జనాభా పెరుగుదలకు దోహద పడుతున్నాయి. అయితే, జనాభా ఎంతగా పెరిగినా భూ విస్తీర్ణం పెరిగే అవకాశం లేదు. అందుకే జనాభా పెరుగుతున్న కొద్దీ భూగోళం ఇరుకుగా మారుతోందనిపించే అవకాశాలు లేకపోలేదు.

పెరుగుతున్న జనాభాకు తగినంతగా ఆహార ధాన్యాల ఉత్పత్తులు పెరుగుతాయనే గ్యారంటీ కూడా లేదు. ఇప్పటికైనా అధిక జనాభా గల దేశాలు మెలకువ తెచ్చుకుని జనాభా స్థిరీకరణకు చర్యలు చేపట్టకుంటే భవిష్యత్తులో అనేక సామాజిక అసమతుల్యతలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. జనాభా పెరుగుదల తీరుతెన్నులు, దానివల్ల తలెత్తే సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితికి చెందిన యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ) జూలై 11వ తేదీని ప్రపంచ జనాభా దినంగా ప్రకటించింది.

ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా 1987 జూలై 11న యూఎన్‌డీపీ 5 బిలియన్ డేగా ప్రకటించింది. అయితే, 1989న జూలై 11న మొదటిసారిగా ప్రపంచ జనాభా దినం జరుపుకోవడం ప్రారంభమైంది. దాదాపు రెండువందల దేశాలు అప్పటి నుంచి ఏటా జనాభా దినాన్ని పాటిస్తున్నాయి. ఈ వారంలో జరుపుకోనున్న ప్రపంచ జనాభా దినం సందర్భంగా ప్రపంచ జనాభా గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలుయువతరంలో భారత్ నం:1
మొత్తం జనాభాలో భారత్ రెండో స్థానంలోనే ఉన్నా, యువతరం జనాభాలో మాత్రం అగ్రస్థానంలో ఉంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 10-24 ఏళ్ల లోపు యువతరం జనాభా 180 కోట్లు దాటింది. భారత్‌లో వీరి జనాభా 35.6 కోట్లు ఉండగా, చైనాలో 26.9 కోట్లు, ఇండోనేసియాలో 6.7 కోట్లు, అమెరికాలో 6.5 కోట్లు, పాకిస్థాన్‌లో 5.9 కోట్లు, నైజీరియాలో 5.7 కోట్లు, బ్రెజిల్‌లో 5.1 కోట్లు, బంగ్లాదేశ్‌లో 4.8 కోట్లు ఉన్నట్లు యునెటైడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్‌పీఎఫ్) తన నివేదికలో వెల్లడించింది.

యువతరం జనాభా ఎక్కువగా ఉండి, జననాల రేటు అదుపులో ఉన్న దేశాలు శరవేగంగా ఆర్థిక పురోగతి సాధించగలవని యూఎన్‌పీఎఫ్ చెబుతోంది. ఆ లెక్కన జననాల రేటును నియంత్రించే చర్యలు తీసుకోగలిగితే, త్వరలోనే ఆర్థికశక్తిగా అవతరించే అవకాశాలు భారత్‌కు మెరుగుపడతాయి.పెరిగిన పట్టణ జనాభా
గడచిన ఆరు దశాబ్దాల్లో ప్రపంచంలో పట్టణ జనాభా విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం 54 శాతం మంది పట్టణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1950 నాటికి పట్టణ జనాభా దాదాపు 74 కోట్లు ఉంటే, 2014 నాటికి 390 కోట్లకు చేరుకుంది. ప్రపంచ పట్టణ జనాభా 2045 నాటికి 600 కోట్లకు మించుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది. 2050 నాటికి పట్టణ జనాభా భారత్‌లో అత్యధికంగా 40.4 కోట్లు, చైనాలో 29.2 కోట్లు, నైజీరియాలో 21.2 కోట్లకు చేరుకుంటుందని కూడా అంచనా వేస్తోంది. పారిశ్రామికీకరణ, మెరుగైన ఉపాధి అవకాశాలు, పల్లెల్లో వ్యవసాయం కుదేలవడం, కుటీర పరిశ్రమలు కుంటుపడటం వంటి కారణాల వల్ల చాలామంది పల్లెలను వదిలి పట్టణాలకు వలస వస్తున్నారు. వలస వచ్చిన పల్లె జనాలు గత్యంతరం లేక పట్టణాల్లోనే స్థిరపడుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా పట్టణ జనాభా శరవేగంగా పెరుగుతోంది.

మరిన్ని వార్తలు