ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

28 Jul, 2019 09:59 IST|Sakshi

సం‘దేహం’

పుట్టబోయే పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందుల గురించి తెలియజేయగలరు. మావారు బాగా నలుపుగా ఉంటారు. నేను తెలుపు. పుట్టబోయే బేబీకి నా రంగు వస్తుందా? అది దేని మీద ఆధారపడి ఉంటుంది?
– పిఆర్‌. కొత్తపేట

తల్లి లేదా తండ్రిలో లేదా వారి రక్త సంబంధీకులలో ఎవరికైనా జన్యుపరమైన సమస్యలు ఉన్నా, లేకపోతే పిండం ఏర్పడే సమయంలో అండం నాణ్యత, శుక్రకణం నాణ్యత సరిగా లేకపోయినా, అండం–శుక్రకణంతో కలిసి ఫలదీకరణ చెందే సమయంలో ఏదైనా లోపాల వల్ల, లేక ఫలదీకరణ చెందిన అండంలోవి కణాల విభజన సరిగా జరగకపోయినా, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల, పుట్టే పిల్లలలో జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా జన్యుపరమైన సమస్యలు రాకుండా ఉండటానికి ఏం చెయ్యలేము. వాటికి మందులు ఏమి లేవు. కాకపోతే ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేసేముందు నుంచి భార్యభర్తలిద్దరూ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్ర రోజుకొకటి చొప్పున తీసుకోవడం మంచిది.

ఇద్దరిలో లేదా ఫ్యామిలీలో ఏవైనా జన్యుపరమైన సమస్యలు ఉంటే ఒకసారి జెనిటిక్‌ కౌన్సెలింగ్‌కు వెళితే, పుట్టబోయే బిడ్డకు, అవి వచ్చే అవకాశాలు ఎంత వరకూ ఉన్నాయి అనేది నిపుణులు విశ్లేషించి చెప్పటం జరుగుతుంది. ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేసేటప్పుడు దంపతులు ఇద్దరూ దురలవాట్లకు దూరంగా ఉంటూ, మంచి పౌష్టికాహారం తీసుకోవడం మంచిది. బిడ్డ రంగు తల్లి లేదా తండ్రి, లేదా ఇతర కుటుంబసభ్యుల మీద కొద్దిగా ఆధారపడి ఉంటుంది. ఎవరి రంగు వస్తుంది అని ముందే చెప్పలేం. ఎవరి జీన్స్‌ డామినేట్‌గా ఉంటే వారి రంగు రావచ్చు. ముందునుంచే ఫ్యామిలీలో జన్యుపరమైన సమస్యలు ఉంటే ఒకసారి జెనిటిక్‌ కౌన్సెలింగ్‌ చెయ్యించుకుని, సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటే, టెస్ట్‌ట్యూబ్‌ బేబీ పద్ధతిలోని ప్రీజెనిటిక్‌ స్క్రీనింగ్‌ పద్ధతులను అనుసరించవచ్చు.

నా వయసు 28 సంవత్సరాలు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌. పుట్టబోయే బిడ్డకు సీసా పాలు కాకుండా  నా పాలు పట్టించాలనేది నా కోరిక. ఏ హార్మోన్ల వల్ల పాల ఉత్పత్తి బాగుంటుంది? దీనికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియజేయగలరు.
–జి.పద్మ, విజయనగరం
పుట్టిన బిడ్డకు మొదటి ఆరునెలలు కేవలం తల్లి పాలు పట్టించడం వల్ల బిడ్డకు అనేక పోషకాలు అందుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దానివల్ల పిల్లల్లో ఆస్త్మా, విరోచనాలు, ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బిడ్డకు మీ పాలు పట్టించాలన్న కోరిక చాలా మంచిది. పాలు సరిగా రావాలంటే మెదడు నుంచి ఆక్సిటోసిన్, ప్రోలాక్టిన్‌ అనే హార్మోన్లు సక్రమంగా విడుదల కావాలి. దీనికోసం మానసిక, శారీరక ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉన్నప్పుడే మెదడు బాగా పనిచేసి ఈ హార్మోన్స్‌ను సక్రమంగా విడుదల చేస్తుంది.

అలాగే బిడ్డకు పుట్టిన గంట నుంచే తల్లి రొమ్మును పటి చీకించడం ద్వారా ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ విడుదలై త్వరగా పాలు పడతాయి. ఆహారంలో అన్నిరకాల ఆకు కూరలు, పప్పులు, పండ్లు, పాలు, పెరుగు వంటి వాటితో పాటు రోజుకు రెండు లీటర్ల నీరు తీసుకోవాలి. మాంసాహారులైతే గుడ్లు, చేపలు, మాంసం వంటివి ఎక్కువ కారం, మసాలాలు లేకుండా తీసుకోవచ్చు. కాబట్టి బాలింతలు కాన్పు తర్వాత సరైన పోషకాహారం తీసుకుంటూ, మానసిక ఒత్తిడి లేకుండా సరిగా నిద్రపోవాలి. అనవసరమైన ఆందోళనలకు గురికాకుండా సంతోషంగా ఉంటే పాలు సరిగా వస్తాయి.

గ్రహణం సమయంలో గర్భిణి స్త్రీలు ఇంటి నుంచి బయటికి రావద్దని అంటారు. చంద్రగ్రహణ ప్రభావం పుట్టబోయే బిడ్డపై ఉంటుందా? గర్భిణి స్త్రీలకు ఏ సమయంలో ఉదయం ఎండ తగిలితే మంచిది? దీని వల్ల ఉపయోగాలు ఏమిటి?
– సత్యశ్రీ, కర్నూలు

సూర్యుని చుట్టు భూమి, భూమి చుట్టు చంద్రుడు ఇలా ఒకదాని చుట్టు ఒకటి తిరుగుతూ ఉంటాయి. ఇవి మూడు ఒకే కక్ష్యలోకి వచ్చి ఒక దాని కిరణాలను సరిగా బయటకు రానివ్వకుండా అడ్డుపడటాన్ని గ్రహణం అంటారు. గ్రహణాల వల్ల వచ్చే కిరణాలు గర్భిణులకు తగిలితే కడుపులోని బిడ్డకు అవయవ లోపాలు ఏర్పడతాయని, గ్రహణం మొర్రి అంటే పెదవులపై చీలిక వంటి సమస్యలు వస్తాయని చాలామంది అనుకుంటుంటారు. అయితే, ఇవన్నీ అపోహలు మాత్రమే. గ్రహణాల వల్ల ఇలా జరుగుతాయని అనడానికి ఇంతవరకు జరిగిన వైద్య పరిశోధనల్లో ఏమీ తేలలేదు. కాబట్టి కంగారు పడనవసరం లేదు. అంతగా భయం ఉంటే గ్రహణ సమయంలో బయటకు వెళ్లకుండా, ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తే సరిపోతుంది.

పొద్దుట పూట వచ్చే ఎండలోని అల్ట్రా వయొలెట్‌ కిరణాలు చర్మంలోని కొలెస్ట్రాల్‌ను ప్రేరేపించి, దాని నుంచి విటమిన్‌–డి తయారవడానికి దోహదపడుతుంది. తల్లిలో విటమిన్‌–డి సరైన మోతాదులో ఉంటే అది బిడ్డకు కూడా చేరి, బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే తల్లికి రక్తంలో క్యాల్షియం చేరడానికి ఉపకరిస్తుంది. తద్వారా తల్లికి ఎముకలు దృఢంగా ఉంటాయి. కాని దానికి ఎండలో ఉండటం ఒక్కటే మార్గం కాదు. గర్భిణులు ఆహారంలో తాజా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, మాంసాహారం, క్యాల్షియం, విటమిన్‌ సప్లిమెంట్లు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్ల ప్రభావం వల్ల ముఖంపై చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.

ఈ సమయంలో మెలనిన్‌ పిగ్మెంట్‌ ఎక్కువగా విడుదల కావడం వల్ల ముఖంపై నల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇలాంటప్పుడు ఎండలో ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. దీనివల్ల శరీరం వేడెక్కడం, డీహైడ్రేషన్‌కు గురికావడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. పొద్దున్న పదకొండు గంటల నుంచి ఒంటగంట వరకు ఉండే ఎండలో అల్ట్రావయొలెట్‌ కిరణాల వల్ల విటమిన్‌–డి ఎక్కువగా తయారవుతుంది. గర్భిణులు ఈ సమయంలో ఐదు నుంచి పది నిమిషాలు వారానికి మూడుసార్లు ఉండవచ్చు. ఈ కిరణాలు కాళ్లు, చేతులు, భుజాలకు, ముఖానికి పడేటట్లు చూసుకుని ఉండవచ్చు.
- డా. వేనాటి శోభ, బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో, హైదర్‌నగర్‌, హైదరాబాద్

మరిన్ని వార్తలు