పోరాడి ఓడిన దివిజ్‌–ఎల్రిచ్‌ జంట

28 Jul, 2019 10:00 IST|Sakshi

న్యూఢిల్లీ: అట్లాంటా ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో దివిజ్‌ శరణ్‌ (భారత్‌)–జొనాథన్‌ ఎల్రిచ్‌ (ఇజ్రాయెల్‌) ద్వయం క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించింది. పురుషుల డబుల్స్‌ టెన్నిస్‌ చరిత్రలో జంటగా 100 కంటే ఎక్కవ టైటిల్స్‌ నెగ్గిన అమెరికా కవల సోదరులు బాబ్‌ బ్రయాన్‌–మైక్‌ బ్రయాన్‌లకు దివిజ్‌–ఎల్రిచ్‌ జోడీ చివరి క్షణం వరకు గట్టిపోటీనిచ్చింది. కానీ అపార అనుభవమున్న బ్రయాన్‌ బ్రదర్స్‌ కీలకదశలో పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నారు.

అమెరికాలోని అట్లాంటాలో శనివారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో దివిజ్‌ శరణ్‌–ఎల్రిచ్‌ జోడీ 4–6, 7–6 (7/4), 7–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో టాప్‌ సీడ్‌ బాబ్‌ బ్రయాన్‌–మైక్‌ బ్రయాన్‌ జంట చేతిలో పోరాడి ఓడింది. గంటా 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో దివిజ్‌ జంట ఏడు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. క్వార్టర్స్‌లో ఓటమితో దివిజ్‌–ఎల్రిచ్‌లకు 6,240 డాలర్ల (రూ. 4 లక్షల 29 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 45 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.    

మరిన్ని వార్తలు