నాకు ఆ సమస్య ఉంది

14 Jul, 2019 09:09 IST|Sakshi

సందేహం

నాకు తరచుగా మైగ్రేన్‌ వస్తోంది. అయితే ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్లకు మైగ్రేన్‌ సమస్య ఉంటే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుందని, లేదంటే పుట్టబోయే బిడ్డ తక్కువ బరువుతో పుడతారని విన్నాను. ఇది నిజమేనా?
– కె.శైలజ, ఒంగోలు
మైగ్రేన్‌ సమస్య ఉన్నవాళ్లు గర్భం దాల్చిన తర్వాత, ఒక్కొక్కరి శరీతత్వాన్ని బట్టి, వారిలో విడుదలయ్యే హార్మోన్స్‌ మోతాదుని బట్టి... కొందరిలో మైగ్రేన్‌ సమస్య తగ్గుతుంది. కొందరిలో అంతే ఉంటుంది. కొందరిలో పెరుగుతుంది. కొందరిలో దీని వల్ల అబార్షన్స్‌ కావు కానీ, ప్రెగ్నెన్సీకి బీపీ పెరగడం, బిడ్డ బరువు సరిగా పెరగకపోవడం, నెలలు నిండకుండా కాన్పు కావడం, సిజేరియన్‌ డెలివరీలు ఎక్కువ అవ్వడం, పుట్టిన తర్వాత బిడ్డలో.. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం,  ఫిట్స్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఈ సమయంలో వికారం, వాంతులు, తలనొప్పి వల్ల సరిగా నిద్రలేకపోవడం, సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా పైన చెప్పిన సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి ఈ సమయంలో మైగ్రేన్‌ ఉన్నవాళ్లు, సరైన విరామం, నిద్ర, మానసిక ప్రశాంతత ఉండేటట్లు చూసుకోవడం మంచిది. అలాగే ధ్యానం, యోగా, నడక వంటివి పాటించడం మంచిది. అవసరమైతే డాక్టర్‌ పర్యవేక్షణలో మందులు వాడుకోవచ్చు. అలాగే మైగ్రేన్‌ అటాక్‌ను ప్రేరేపించే అంశాలు అంటే.. స్ట్రెస్‌ వంటి అంశాలకు దూరంగా ఉండటం చాలా అవసరం.

నా వయసు 29 సంవత్సరాలు. నెలసరి ఆలస్యం అవుతోంది. ఫ్రెండ్‌ ఒకరు ‘ఫైబ్రాయిడ్‌ సమస్య కావచ్చు’  అంటున్నారు. మరొకరేమో ‘మెనోపాజ్‌ టైమ్‌లో తప్ప ఈ వయసులో అలాంటిదేమీ ఉండదు’ అంటున్నారు. ఏది నిజం?
– జి.గీత, ఆదిలాబాద్‌

హార్మోన్లలో అసమతుల్యత, బరువు పెరగటం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, థైరాయిడ్‌ సమస్య, అండాశయంలో నీటి బుడగలు, కణితులు వంటి అనేక సమస్యల వల్ల 29 సంవత్సరాల వయసులో నెలసరి ఆలస్యం అవుతుంది. ఫైబ్రాయిడ్‌ సమస్య ఉన్నప్పుడు పీరియడ్స్‌ త్వరగా రావటం, బ్లీడింగ్‌ ఎక్కువగా అవ్వడం, మధ్య మధ్యలో బ్లీడింగ్‌ కనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. కానీ పీరియడ్స్‌ ఆలస్యం అవ్వవు. పీరియడ్స్‌ ఆలస్యం అవ్వడం అనేది మెనోపాజ్‌ సమయంలోనే కాకుండా.. పైన చెప్పిన సమస్యల వల్ల ఏ వయసులోనైనా ఉండవచ్చు.

మీకు నెలసరి ఆలస్యం అంటే.. ఎన్ని రోజులు అని రాయలేదు. కొందరిలో శరీరతత్వాన్ని బట్టి ప్రతి నెలా వారం రోజులు ఆలస్యం అంటే.. 35 రోజులకొకసారి రావటం జరుగుతుంది. ఇది వారి శరీరంలో ఉండే హార్మోన్స్‌ను బట్టి ఉంటుంది. అది వాళ్లకి మామూలే అయ్యి ఉండవచ్చు. అదేం సమస్య కాదు. మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి పీరియడ్స్‌ ఎందుకు ఆలస్యం అవుతున్నాయోనని తెలుసుకోవటానికి అవసరమైన రక్తపరీక్షలు, స్కానింగ్‌ వంటి పరీక్షలు చెయ్యించుకుని సమస్యకు తగ్గ చికిత్స తీసుకోవడం మంచిది.

నా వయసు 21 సంవత్సరాలు. పీరియడ్స్‌ టైమ్‌లో నొప్పి చాలా ఇబ్బందిగా ఉంటోంది. నొప్పిని అధిగమించడానికి, తగ్గించడానికి చిట్కాలు, మందులు ఏమైనా ఉన్నాయా?  పోస్ట్‌ అబార్షన్‌ బ్లీడింగ్‌ అంటే ఏమిటి?
– బీఆర్, నర్సంపేట
సాధారణంగా పీరియడ్స్‌ సమయంలో విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్స్‌ అనే హార్మోన్స్‌ మోతాదుని బట్టి, కొందరిలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. కొందరిలో కొద్దిగా ఉంటుంది. కొందరిలో అసలు ఉండదు. కొందరిలో గర్భాశయంలో కణితులు, ఇన్‌ఫెక్షన్లు, ఎండోమెట్రియోసిస్‌ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా పీరియడ్స్‌ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే.. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి స్కానింగ్‌ చేయించుకుని సమస్యను బట్టి చికిత్స తీసుకోవాలి.

సమస్య ఏం లేకపోతే నొప్పి ఉన్న రోజులు, నొప్పి నివారణ నెలలో రెండు రోజులు నొప్పి నివారణ మందులు వేసుకోవడం వల్ల ప్రమాదం ఏం లేదు. మాత్రలు వాడుకోవచ్చు. ఆ సమయంలో పొత్తికడుపు మీద వేడి నీళ్లతో కాపడం పెట్టుకోవచ్చు. వేడి నీళ్లతో స్నానం చెయ్యవచ్చు. చిన్న చిన్న యోగాసనాలు, చిన్నగా నడవడం వంటివి చెయ్యడం వల్ల కూడా చాలా వరకూ నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. సాధారణంగా అబార్షన్‌ తర్వాత అయ్యే రక్తస్రావాన్ని పోస్ట్‌ అబార్షన్‌ బ్లీడింగ్‌ అంటారు. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, ఇంకా అనేక అంశాలను బట్టి అబార్షన్‌ తర్వాత రెండు మూడు రోజుల నుంచి మూడు వారాల దాక అవ్వవచ్చు. కొందరిలో బ్లీడింగ్‌ కొద్దికొద్దిగా ఉంటుంది. కొందరిలో చాలా ఎక్కువగా ఉండవచ్చు. కొందరిలో ఇన్‌ఫెక్షన్స్‌ రక్తంలో క్లాటింగ్‌ సమస్యలు, ముక్కలు ఉండిపోవడం గర్భాశయానికి చిల్లు పడటం వంటి అనేక సమస్యలు వల్ల కూడా అబార్షన్స్‌ తర్వాత బ్లీడింగ్‌ ఎక్కువగా అవ్వొచ్చు. అలాంటప్పుడు డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన రక్తపరీక్షలు స్కానింగ్‌ చెయ్యించుకుని, సమస్యకు తగ్గ చికిత్స తీసుకోవచ్చు.

- డా. వేనాటి శోభ, బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో, హైదర్‌నగర్‌, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు