ఆస్ట్రేలియా బొద్దింక, అమెరికా తేనెటీగ... ఇండియా ఈగ

27 Dec, 2015 01:51 IST|Sakshi
ఆస్ట్రేలియా బొద్దింక, అమెరికా తేనెటీగ... ఇండియా ఈగ

ఆ సీన్ - ఈ సీన్
దర్శకుడు రాజమౌళి సినిమాలు ఇప్పుడు హాలీవుడ్‌కు దీటైనవనే ప్రశంసలు పొందుతున్నాయి. ప్రత్యేకించి ‘బాహుబలి’ సినిమాతో ఇండియా లెవెల్లో సరికొత్త రికార్డులు సృష్టించాడు ఈ దర్శక మాంత్రికుడు. అయితే తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళుతున్న ఈ దర్శకుడి సినిమాల్లో హాలీవుడ్ ఛాయలు సుస్పష్టంగా కనిపించడం కాస్త ఆశ్చర్య పరిచే విషయమే. యాదృచ్ఛికం అనుకోవచ్చునేమో కానీ... సామీప్యత ఎక్కువగా ఉండటంతో రాజమౌళి సినిమాలు అప్పుడప్పుడూ కాపీ క్యాట్స్ అనిపించుకుంటూ ఉంటాయి.

అలాంటి వాటిలో ‘ఈగ’ ఒకటి. సమంత, నాని, సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించేది ‘ఈగ’. ఆ ఈగ విన్యాసాలు ఈ సినిమా రాకముందే కొన్ని విదేశీ సినిమాల్లో ఆవిష్కృతం అయ్యాయి. దీంతో ‘ఈగ’ సినిమాలోని సీన్లు కాపీ అనే వాదన ఉంది.
 
తెలుగు తెరపై వచ్చిన గేమ్ చేంజింగ్ మూవీస్‌లో ‘ఈగ’ ఒకటి. ప్రత్యేకించి చిన్న పిల్లలను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా కథలో ఒక ఆస్ట్రేలియన్ సినిమా ఛాయలు కనిపిస్తాయి.  2010లో వచ్చిన ఆ సినిమా పేరు ‘కాక్రోచ్’. ‘ఈగ’ 2012లో విడుదల అయ్యింది. ఇందులో చనిపోయిన హీరో ‘ఈగ’గా పుడితే, ‘కాక్రోచ్’లో హీరో బొద్దింక’గా వస్తాడు.

తెలుగు వెర్షన్‌లో సమంతను ప్రేమిస్తున్న నాని రోల్‌ను సుదీప్ పాత్ర చంపేస్తుంది. చనిపోయిన అతడు ఈగగా మరుజన్మ ఎత్తుతాడు. ఈగ జీవితకాలం అతి తక్కువ రోజులే. ఆ కొద్ది రోజుల్లోనే అది తన ప్రియురాలిని ఎలా చేరుకుంది, విలన్ బారి నుంచి తనను ఎలా కాపాడుకుంది, విలన్‌ను ఎలా అంతమొందించింది అనేది కథ. అయితే ‘కాక్రోచ్’లో హీరో, హీరోయిన్లిద్దరికీ పెళ్లి అవుతుంది.

హనీమూన్‌కి వెళుతున్నప్పుడు జరిగే యాక్సిడెంట్‌లో హీరో చార్లీ చనిపోతాడు. తర్వాత ఒక బొద్దింకగా జన్మించి ఒంటరిగా విషాదంలో ఉన్న తన భార్య చుట్టూ తిరుగుతుంటాడు. ఈ విషయాన్ని ఆమెకు తెలియజేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాలు కూడా ఈగ సినిమాలో కనిపిస్తాయి.
 ‘ఈగ’ సినిమాలో సమంతకు తను నానీని అని అర్థమయ్యేలా చేయడానికి ఈగ చేసే యత్నాలన్నీ ‘కాక్రోచ్’లో కనిపిస్తాయి.

తేమతో ‘నాని’ అని రాసి ఈగ తన ప్రియురాలికి తన గురించి అర్థమయ్యేలా చేస్తే, ‘కాక్రోచ్’లో బొద్దింక రాళ్లను పేర్చి ‘చార్లీ’ అని ఇంగ్లిష్‌లో రాస్తుంది!  తెలుగు సినిమాలో ప్రత్యేకంగా విలన్ ఉంటాడు. అయితే ఆస్ట్రేలియన్ సినిమాలో విధే వారి పాలిట విలన్. కథాంశం పరంగా ‘కాక్రోచ్’తో పోలికలు ఉన్న ‘ఈగ’ సినిమాలో కొన్ని సీన్లు హాలీవుడ్ యానిమేటెడ్ సినిమా ‘ద బీ’ స్ఫూర్తితో రూపొందించారేమో అనిపిస్తుంది. ఆ యానిమేటెడ్ మూవీలో తేనెటీగది ప్రధాన పాత్ర.

ఈగ సినిమాలో సుదీప్ కారులోకి ఈగ ప్రవేశించే సన్నివేశం ‘బీ’ సినిమాలో కనిపిస్తుంది. ఒక క్రికెట్ బాల్‌పై వాలిన ఈగ ఆ బంతి గాల్లోకి లేచినప్పుడు ఎగిరి, అదే వేగంతో కారు ఇంజిన్‌లోకి ప్రవేశించి... డ్రైవింగ్ సీట్‌లో ఉన్న సుదీప్‌కు ‘హాయ్’ చెబుతుంది. యానిమేటెడ్ సినిమాలో తేనెటీగ ఒక టెన్నిస్ బంతిపై వాలి, ఆటగాళ్లు దాన్ని గాల్లోకి కొట్టినప్పుడు విసురుగా ఒక కారు ఇంజిన్‌లోకి దూసుకుపోయి, అటు నుంచి కారులోకి ప్రవేశించి కారులోని ఫ్యామిలీకి ‘హాయ్’ చెబుతుంది. దాదాపు సేమ్ సీన్ కదా!
 
అయితే ‘ద బీ’ సినిమాకి, ‘ఈగ’ సినిమాకి కథాంశం పరంగా ఎలాంటి సంబంధమూ ఉండదు. కానీ అదే సినిమా లోని మరో సీన్ కూడా ఈగలో కని పిస్తుంది. ‘ఈగ’ రూపంలో ఉన్నది నాని అని గుర్తించాక సమంత తనతో సరదాగా గడుపుతుంది. ఆ క్రమంలో వాళ్లిద్దరూ కాఫీ తాగే సీన్ ఒకటుంది. ఇదే సీన్ ‘ద బీ’ లోనూ ఉంటుంది. ఓ కుటుంబంతో తేనెటీగకు స్నేహం కుదిరాక అది వారితో సరదాగా మెలుగుతూ ఉంటుంది.

ఇంటి యజమానురాలితో కలిసి అది కాఫీ తాగడం, ఆమె దానితో సంభాషించడం, ఇంట్లోకి వచ్చిన వ్యక్తి ఆమె ఎవరితో మాట్లాడుతోందో అర్థం కాక గాభరా పడటం... ఈ సీన్ మొత్తం ‘ద బీ’లో ఉంటుంది. ‘ఈగ’లో తాగుబోతు రమేశ్ అలాగే కన్‌ఫ్యూజ్ అవడం గుర్తుంది కదా!
 ఈ విధంగా ‘ఈగ’లో కొన్ని సినిమాల్లోని సన్నివేశాలు దర్శనమిస్తాయి. అయితే మనకు ఇవన్నీ కాపీ అనిపిస్తే, కేవలం యాదృచ్ఛికం అనేది ‘ఈగ’ రూపకర్తల వాదన!
 - బి.జీవన్‌రెడ్డి

మరిన్ని వార్తలు