దానిని ముందే గుర్తించవచ్చా?

12 Jan, 2019 23:33 IST|Sakshi

మా బంధువులలో ఒకరికి గర్భాశయ క్యాన్సర్‌ వచ్చింది. ఇది విన్నప్పటి నుంచి  నాకు భయంగా ఉంది. ఇది ముందుగానే గుర్తించే అవకాశం ఉందా? పాప్‌స్మియర్‌ టెస్ట్‌ గురించి  తెలియజేయగలరు.

గర్భాశయ క్యాన్సర్లలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి: గర్భాశయ ముఖద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్‌. దీనిని సర్వికల్‌ క్యాన్సర్‌ అంటారు. రెండోది గర్భాశయం లోపలి పొరలో వచ్చేది. దీనిని ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ అంటారు. పాప్‌ స్మియర్‌ అనే పరీక్షలో గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్‌) దగ్గర నుంచి నీరు తీసి, దానిలోని కణాలను మైక్రోస్కోప్‌లో చూడటం జరుగుతుంది. సర్విక్స్‌ దగ్గర కణాలలో ఏమైనా మార్పులు జరుగుతున్నాయా, క్యాన్సర్‌గా మారే కణాలు కనిపిస్తున్నాయా అనేది చూడటం జరుగుతుంది. పాప్‌ స్మియర్‌లో క్యాన్సర్‌ రాక ముందు పదేళ్ల ముందు నుంచే మార్పులు తెలుస్తాయి. ఇది ప్రతి మూడేళ్లకు ఒకసారి చేయించుకోవడం మంచిది. సర్వికల్‌ క్యాన్సర్, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ల తొలిదశలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు.

లక్షణాలు కనిపించేటప్పటికి అది ముదిరి, చుట్టుపక్కల అవయవాలకు పాకే అవకాశం ఉంటుంది. గర్భాశయ క్యాన్సర్‌ లక్షణాలలో భాగంగా కొందరిలో అధికంగా తెల్లబట్ట, అందులో కొద్దిగా బ్లీడింగ్‌ కనిపించడం, కలయిక తర్వాత బ్లీడింగ్, అధిక రక్తస్రావం, నెల మధ్యలో కూడా బ్లీడింగ్, పీరియడ్స్‌ ఆగిపోయి మెనోపాజ్‌ దశ తర్వాత కూడా బ్లీడింగ్‌ వంటివి ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగ ఉండవచ్చు. ఇటువంటి లక్షణాలు గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు, పుండ్లు, గడ్డలు, పాలిప్స్, ఫైబ్రాయిడ్స్, ఒవేరియన్‌ సిస్ట్స్‌ వంటి సమస్యలు ఉన్నవారిలో కూడా ఉండవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, స్పెక్యులమ్‌ పరీక్ష, పాప్‌ స్మియర్, ట్రాన్స్‌ వజైనల్‌ స్కానింగ్‌ వంటివి చేయించుకుని, ఏదైనా తేడాగా అనిపించినప్పుడు ఎండోమెట్రియల్‌ బయాప్సీ, సర్వైకల్‌ బయాప్సీ వంటి పరీక్షలు చేయించుకుంటే, అది హార్మోన్ల మార్పులా లేక క్యాన్సర్‌ మార్పులా అనేది నిర్ధారణ జరుగుతుంది. ఏదైనా క్యాన్సర్‌ గాని, క్యాన్సర్‌ మార్పులు గాని మొదట్లోనే కనుగొంటే అది మామూలు ఆపరేషన్‌ ద్వారా నయం చేయవచ్చు.

నేను ప్రెగ్నెంట్‌. ప్రీనేటల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేసుకోవడం మంచిదని ఒకరు చెప్పారు. దీని వల్ల ఉపయోగం  ఏమిటో తెలియజేయగలరు.

ప్రీనేటల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ అంటే బిడ్డ పుట్టక ముందే, గర్భంలో ఉన్నప్పుడే బిడ్డలోని కొన్ని రకాల జన్యు సమస్యలు, అవయవ లోపాలు ఉండే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయో తెలుసుకోవడానికి చేసే పరీక్షలు. పది వారాల నుంచి పన్నెండు వారాల లోపల డబుల్‌ మార్కర్‌ టెస్ట్‌ అని తల్లి రక్తం తీసుకుని, అందులో బీహెచ్‌సీజీ, పాపె అనే బయోకెమికల్‌ మార్కర్స్‌ ఉండే సంఖ్యను బట్టి, బిడ్డలో డౌన్స్‌ సిండ్రోమ్, ఎడ్‌వర్డ్స్‌ సిండ్రోమ్‌ వంటి కొన్ని జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయో విశ్లేషించడం జరుగుతుంది. దీంతో పాటు పన్నెండు వారాల సమయంలో న్యూకల్‌ ట్రాన్స్‌లూసెన్సీ (ఎన్‌టీ) స్కాన్‌ చేయడం వల్ల ఆ సమయానికి బిడ్డలో కొన్ని అవయవ లోపాలు ఉంటే తెలుస్తాయి. అలాగే ముక్కు, మెడ వెనుక భాగంలో చర్మం మందాన్ని (న్యూకల్‌ థిక్‌నెస్‌) బట్టి బిడ్డలో జన్యుపరమైన లోపాలు, ఇతర సమస్యలు ఏ మేరకు ఉన్నాయో తెలుస్తుంది.

పదహారు నుంచి ఇరవై వారాల లోపల క్వాడ్రుపుల్‌ టెస్ట్‌ ద్వారా కూడా కొన్ని జన్యుపరమైన సమస్యలు ఎంతవరకు ఉన్నాయో తెలుస్తుంది. పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వారాల లోపల ‘టిఫా’ స్కానింగ్‌లో బిడ్డలో అవయవ లోపాలు ఉంటే 95 శాతం మేరకు తెలుస్తాయి. ప్రీనేటల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌లో కచ్చితంగా సమస్య ఉందని నిర్ధారించడం జరగదు. అయితే, సమస్య ఉండే అవకాశాలు ఎంత మేరకు ఉండవచ్చనేది మాత్రమే తెలుస్తుంది. సమస్య నిర్ధారించడానికి పదకొండు నుంచి పద్నాలుగు వారాల లోపల అయితే కొరియానిక్‌ విలస్‌ బయాప్సీ, పదహారు వారాల తర్వాత అయితే అమ్నియోసెంటెసిస్‌ అంటే బిడ్డ చుట్టూ ఉమ్మనీరు తీసి కారియోటైపింగ్‌ వంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇందులో డౌన్స్‌ సిండ్రోమ్‌ వంటి కొన్ని రకాల జన్యు సమస్యలు నిర్ధారణ అవుతాయి. కాకపోతే, ఈ నిర్ధారణ పరీక్షలు చేసేటప్పుడు వందమందిలో ఒకరికి అబార్షన్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్‌ టెస్ట్‌లకు, నిర్ధారణ పరీక్షలకు వ్యత్యాసం తెలుసుకోవాలి.

పీఆర్‌పీ థెరపీని ముఖానికి, జుట్టుకి వాడతారని విన్నాము. ఈ మధ్య దీనిని గైనకాలజీలో కూడా వాడుతున్నారని తెలిసింది. దీని గురించి వివరించగలరు.

పీఆర్‌పీ– అంటే, ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా. ఒక మనిషి రక్తం 20–30 మిల్లీలీటర్లు తీసుకొని, దానిని సెంట్రిఫ్యూజ్‌ అనే పరికరంలో వేసి తిప్పినప్పుడు ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు విడిపోయి, ప్లేట్‌లెట్స్‌ ఉన్న ప్లాస్మా మాత్రమే పైకి తేలుతుంది. ఇందులో గ్రోత్‌ ఫ్యాక్టర్స్, సైటోకైన్స్‌ ఉంటాయి. దీనిని శరీర భాగాల్లోకి ఇంజెక్షన్‌ ద్వారా పంపించినట్లయితే, ఆయా భాగాల్లో గ్రోత్‌ ఫ్యాక్టర్స్, ఫైబ్రోబ్లాస్ట్‌లు పెరిగి, కొల్లాజెన్‌ టిష్యూ వృద్ధి చెందుతుంది. రక్తప్రసరణ పెరుగుతుంది. ఇప్పటి వరకు ముఖంపై చర్మం కోసం, జుట్టు పెరగడానికి, ఇంకా ఇతర భాగాల్లోను దీనిని వాడటం జరుగుతుంది. ఇది స్టెమ్‌సెల్స్‌లాగా పనిచేసి కొత్త కణజాలం పెరగడానికి దోహదపడుతుంది.

ఇందులో ఎవరి రక్తాన్ని వాళ్లకే ఇంజెక్షన్‌ ద్వారా పంపడం జరుగుతుంది కాబట్టి దుష్ఫలితాలు తలెత్తే అవకాశాలు చాలావరకు ఉండవు. దీనిని ఇప్పుడు గైనకాలజీ విభాగంలోనూ ఉపయోగించడం జరుగుతోంది. కాన్పుల వల్ల యోని వదులైనప్పుడు పీఆర్‌పీ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల అక్కడ కణజాలం పెంపొంది, యోని కొద్దిగా బిగుతుగా అయినట్లు అనిపిస్తుంది. అలాగే సెక్స్‌ ప్రేరేపణలకు క్లిటోరిస్‌ భాగంలోను, యోనిలోని జీస్పాట్‌ భాగంలోను ఇవ్వడం వల్ల కొందరిలో కొద్దిగా ఉపయోగం ఉండవచ్చు. దీనిని ‘ఓ–షాట్‌’ అంటారు. మూత్రాశయ కండరాలు వదులయ్యి, దగ్గినా, తుమ్మినా మూత్రం లీక్‌ అయ్యేవారిలో పీఆర్‌పీ థెరపీ ద్వారా యూరెత్రా కింద పీఆర్‌పీని ఇంజెక్ట్‌ చేయడం వల్ల అక్కడ కణజాలం వృద్ధి చెంది, రక్తప్రసరణ పెరిగి కొందరిలో కాస్త ఉపశమనం దొరుకుతుంది.

పీఆర్‌పీతో పాటు హైలురోనిక్‌ యాసిడ్‌ వంటి కొన్ని ద్రవాలను, పదార్థాలను కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారిలో గర్భాశయ పొర బాగా పలచగా ఉన్నప్పుడు, దానిని ప్రేరేపించడానికి పీఆర్‌పీని గర్భాశయంలో ఇంజెక్ట్‌ చేయడం జరుగుతుంది. అండాశయాలలో అండాలు బాగా తగ్గిపోయినప్పుడు అండాలను పెంపొందించడానికి అండాశయాలలో ఇంజెక్ట్‌ చేయడం ద్వారా కొందరిలో కొత్తగా అండాలు తయారయ్యే అవకాశాలు ఉన్నాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి  పీఆర్‌పీ థెరపీ నెల వ్యవధిలో 3–4 సార్లు చెయ్యాల్సి ఉంటుంది. 
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో
హైదర్‌నగర్‌
హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు