పహిల్వాన్‌ డోలు

12 Jan, 2019 23:08 IST|Sakshi

కథా ప్రపంచం

అది చలికాలం. చల్లని నల్లని అమావాస్య రాత్రి. మలేరియా, కలరా రోగాలతో ఆ ఊరంతా భయాక్రాంతుడైన బాలుడి మాదిరి వణికిపోతూ ఉంది. నశించిపోయిన పాత వెదురు బోద గుడిసెల్లో చీకటి– నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఒకటే చీకటి స్తబ్దత.చీకటి రాత్రి కన్నీరు కారుస్తోంది. స్తబ్దత కరుణతో కూడిన వెక్కిళ్లనూ దుఃఖాన్నీ బలవంతంగా తన హృదయంలో నొక్కి పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. భూమిపైన వెలుతురు అనే మాటే లేదు. ఆకాశంలో నుంచి ఊడబడాలని ఏ నక్షత్రమైనా అనుకున్నా దాని వెలుతురూ, శక్తి మార్గమధ్యంలోనే నశిస్తాయి. మిగతా నక్షత్రాలు దాని భావుకత, అసమర్థతను చూసి కిలకిలా నవ్వుకుంటాయి. నక్కల ఊళలు, గుడ్లగూబల భయంకరమైన కూతలు అప్పుడప్పుడూ నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్నాయి. ఊరిలోని గుడిసెల నుంచి ఏడుపులు, వాంతులు చేసుకునే శబ్దాలు, ‘‘అయ్యో దేవుడా, ఓరి భగవంతుడా!’’ వంటి కేకలు మాత్రం వినపడుతున్నాయి. అమ్మా, అమ్మా అంటూ నీరసించిన గొంతులతో పిల్లల అరుపులు వినబడుతున్నాయి. కానీ వీటివల్ల రాత్రి స్తబ్దతలో ఎలాంటి మార్పులూ లేవు.పరిస్థితులను పసిగట్టే గొప్ప నేర్పు కుక్కలకుంటుంది.

అవి పగలంతా గుట్టలపైన మూటల్లా ముడుచుకుని దిగులుగా పడి ఉంటాయి. రాత్రి వేళల్లో అన్నీ కలిసి ఏడుస్తుంటాయి. రాత్రిళ్లు ఈ విధంగా భయంకరంగా గడిచిపోతూ ఉంటే, దొమ్మరివాడి డోలు మాత్రం నిరంతరం మోగుతూ ఉండేది. సాయంత్రం అయినప్పటి నుంచి తెల్లారేదాకా ‘ఫట్‌.. థా గిడ్‌... థా.. ఫట్‌.. థా గిడ్‌.. థా.. ’ (అంటే.. రా, ఢీకొను రా, ఢీకొను) అనే శబ్దం ఒకే తాళగతిలో మోగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ‘చటాక్‌ చట్‌థా.. చటాక్‌.. చట్‌ థా’ (అంటే ఎత్తి కింద పారేయి.. ఎత్తి కింద పారేయి) అనే శబ్దాలు వినిపిస్తాయి. మృత్యుముఖంలో ఉన్న ఆ ఊళ్లో ఆ డోలు శబ్దాలే సంజీవని శక్తిగా పనిచేసేవి.లుట్టన్‌ సింగ్‌ పహిల్వాన్‌ను హోల్‌ ఇండియా ప్రజలకు తెలుసునని అంటూ ఉంటాడు. కానీ అతని హోల్‌ ఇండియా హద్దు ఒక జిల్లా వరకు మాత్రమే. ఆ జిల్లాలోని ప్రజలకందరికీ అతను తెలుసు.లుట్టన్‌ తల్లిదండ్రులు అతని తొమ్మిదేళ్ల వయసప్పుడే అతన్ని అనాథగా మిగిల్చి చనిపోయారు. అదృష్టం కొద్దీ అప్పటికే అతనికి పెండ్లి అయింది. లేకపోతే తల్లిదండ్రులతో పాటు అతనూ గతించేవాడు. విధవరాలైన అత్త అతన్ని పెంచి పెద్ద చేసింది. బాల్యంలో ఆవులను మేపుతూ, వాటి పాలు తాగుతూ, కసరత్తు చేస్తూ గడిపేవాడు. పల్లె ప్రజలు అతని అత్తను నానా విధాలుగా బాధించేవారు.

వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే అతని బుర్రలో కసరత్తు నేర్చుకోవాలనే బుద్ధి పుట్టింది. క్రమం తప్పకుండా కసరత్తు చేయడం వల్ల బాల్యావస్థలోనే అతని ఛాతీ, బాహువులు బలిష్టంగా తయారయ్యాయి. పుష్టికరమైన కండరాలు ఏర్పడ్డాయి. యవ్వనంలోకి అడుగుపెడుతూనే పల్లెలోకెల్లా మంచి పహిల్వాన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రజలు అతనికి భయపడేవారు తాను రెండు వైపులా చేతులను నలభై ఐదు డిగ్రీల కోణంలో చాపి– పహిల్వాన్‌ల మాదిరిగా నడిచేవాడు. అతను కుస్తీ కూడా పట్టేవాడుఒకనాడు అతడు కుస్తీ చూడ్డానికి శ్యామ్‌నగర్‌ జాతరకు వెళ్లాడు. పహిల్వాన్‌ల కుస్తీలో వాళ్ల పట్టు విడుపులు చూస్తూ ఊరకుండలేకపోయాడు. యవ్వనపు వేడి, మదం వల్ల డోలు శబ్దాలకు అతని రక్తనాళాలు వేడెక్కాయి. ముందు వెనుకా చూడకుండా కుస్తీలో ‘‘సింహం పిల్ల’’తో సవాలు చేశాడుఆ సింహంపిల్ల అసలు పేరు చాంద్‌ సింగ్‌. వాడు పంజాబ్‌ నుంచి తన గురువు బాదల్‌ సింగ్‌ వెంట తొలిసారి శ్యామ్‌నగర్‌ జాతరకు వచ్చాడు. అందమైన యువకుడు.

వచ్చిన మూడు రోజుల్లోనే పంజాబ్‌–పఠాన్‌ల పహిల్వాన్‌ల దళంలోని తన సరిజోడు పహిల్వాన్‌లందరినీ నేల కరిపించి, ‘‘సింహంపిల్ల’’ అనే బిరుదు పొందగలిగాడు. అతను కుస్తీ మైదానంలో లంగోటా బిగించి చెంగు చెంగున విజయగర్వంతో హర్షధ్వనులు చేస్తూ గుర్రంపిల్ల మాదిరిగా ఎగురుతూ ఉండేవాడు. అతని దెబ్బకు అక్కడి యువ పహిల్వాన్‌లు అందరూ కుస్తీ మాటంటేనే భయపడేవారు. తన బిరుదును నిలుపుకొనేందుకు చాంద్‌ సింగ్‌ మధ్య మధ్యలో కుస్తీకి ఎవరైనా ఉంటే రమ్మని కాలు దువ్వేవాడు. వేటలూ, కుస్తీలంటే చెవి కోసుకునే శ్యామ్‌నగర్‌ వృద్ధ మహారాజా చాంద్‌సింగ్‌ను తన దర్బారులో పహిల్వాన్‌గా ఉంచుకోవాలని అనుకుంటుండగానే లుట్టన్‌ ఆ సింహంపిల్లతో పోటీ పడతానని సవాలు చేశాడు. బిరుదు పొందిన చాంద్‌ సింగ్‌.. లుట్టన్‌ సవాలు విని నవ్వుకున్నాడు. వెంటనే డేగ మాదిరి అతని మీదకు లంఘించాడు.నిశ్శబ్దంగా ఉన్న ప్రేక్షకుల గుంపులో కలకలం మొదలైంది. ‘‘పిచ్చోడు.. పిచ్చి ముండాకొడుకు... చచ్చచ్చ.. చచ్చ’’... ఓహో! గొప్పోడే. లుట్టన్‌ చాకచక్యంగా దాడిని తప్పించుకుని లేచి నిలబడ్డాడు. మహారాజా కుస్తీని ఆపు చేయించి, లుట్టన్‌ను తన వద్దకు పిలిపించుకుని సముదాయించాడు. అతని ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ పదిరూపాయల నోటు చేతికందించి ‘‘పో.. జాతర చూసి ఇంటికి పో..’’ అన్నాడు.

‘‘లేదు మహారాజా! కుస్తీ పడతాను. తమరు ఆజ్ఞాపించండి.’’‘‘పో.. పిచ్చోడా’’‘‘శరీరంలో శక్తి లేకపోయినా సింహంపిల్లతో కుస్తీ పట్టవచ్చావుటరా.. రాజావారు ఇంతగా నచ్చచెబుతున్నా కుస్తీ మానుకోకపోతే నీకు పుట్టగతులుండవు’’ అని మేనేజరు, భటులు అతన్ని బెదిరించారు.‘‘మీపై ఒట్టు దొరా! మీ ఆజ్ఞయే తరువాయి మహారాజా... కుస్తీ పట్టనివ్వండి దొరా. లేకపోతే ఇక్కడే ఈ రాతికి తల బద్దలుగొట్టుకుని చస్తాను’’ చేతులు జోడించి వేడుకున్నాడు. గుంపులో కలవరం మొదలైంది. పంజాబ్‌ పహిల్వాన్‌ల దళం కోపంతో లుట్టన్‌పై తిట్ల వర్షం కురిపించసాగింది. ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగింది. వాళ్లల్లో కొందరు లుట్టన్‌ తరఫున కేకలు చేస్తూ అతన్ని కుస్తీ పట్టనివ్వండి అని అరిచారు. చాంద్‌ సింగ్‌ ఒక్కడే మైదానంలో నవ్వుకుంటూ నిలబడ్డాడు. మొదటి పట్టులోనే తన ప్రత్యర్థి శక్తి ఏమిటో అతనికి అర్థమైంది.రాజావారు గత్యంతరం లేక ఆజ్ఞ జారీ చేశారు. ‘‘సరే కుస్తీ పట్టండి.’’డోలు మోగటం మొదలైంది. ప్రేక్షకుల్లో మళ్లీ ఉత్సాహం పెరిగింది. గుంపులో కోలాహలం ప్రారంభమైంది. జాతరలోని దుకాణదారులందరూ దుకాణాలను మూసివేసి ‘‘చాంద్‌ సింగ్‌కి సమ ఉజ్జీ దొరికాడు. కుస్తీ జరుగుతూంది’’ అని పరుగెత్తుకుంటూ వచ్చారు.‘‘చట్‌ థా.. గిడ్‌ థా.. చట్‌ థా.. గిడ్‌ థా..’’  ఇంతవరకు మూగబోయిన డోలు పెద్ద శబ్దంతో మోగింది.

 ‘‘డాక్‌ డినా, డాక్‌డినా డాక్‌ డినా’’ (అంటే వాహా, భలే భలే) శబ్దం చేస్తూ డోలు మోగింది. చాంద్‌ సింగ్‌ లుట్టన్‌ సింగ్‌ను గట్టిగా నొక్కి పట్టాడు.‘‘అయిపోయే! లుట్టన్‌ సింగ్‌ బజ్జీ అయిపోయే! సింహంపిల్లతో ఢీకొనడం నవ్వులాటా మరి’’ అని ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ‘చట్‌ గిడ్‌థా, చట్‌ గిడ్‌థా, థట్‌గిడ్‌థా’ (భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు) అంటూ డోలు మార్మోగింది. లుట్టన్‌ మెడపై మోచేతిని ఆనించి నేల పడేసే ప్రయత్నంలో చాంద్‌ సింగ్‌ ఉన్నాడు.‘అక్కడే పడెయ్యి’ అంటూ బాదల్‌ సింగ్‌ తన శిష్యుణ్ణి ఉత్సాహపరచాడు.లుట్టన్‌ కన్నులు బయటకొచ్చాయి. ఉఛ్ఛ్వాశ నిశ్వాసాలు ఎక్కువయ్యాయి. గుంపులోని ఎక్కువమంది జనం చాంద్‌సింగ్‌ పక్షం చేరి, అతన్ని ఉత్సాహపరుస్తున్నారు. లుట్టన్‌ పక్షాన డోలు మాత్రం మోగుతోంది. డోలు మోత ప్రకారం అతను తన ఉత్సాహాన్ని పెంపొందించుకుంటూ తలపడుతున్నాడు. ఉన్నట్టుండి డోలు నెమ్మదిగా మోగసాగింది.‘‘డక్‌ డినా– తిర్‌కిట్‌తినా, డక్‌డినా తిర్‌కిట్‌తినా’’ (అంటే పోటీ విరమించుకో, బయటకొచ్చేసేయి) అని లుట్టన్‌ సింగ్‌కు డోలు చేసిన ఈ శబ్దాలు వినపడ్డాయి. ఉన్నట్టుండి లుట్టన్‌ పట్టు నుంచి జారుకొని బయటకొచ్చి వెంటనే చాంద్‌సింగ్‌పైకి ఉరికి మెడ పట్టేశాడు.

‘‘శభాష్, భలే! మట్టిలో మాణిక్యానివిరా!’’‘‘సరే, ఆహా! బయటికొచ్చాడా?’’ అందువల్లనే కదా జనం లుట్టన్‌ వైపు మొగ్గారు.‘ఛటాక్‌ ఛట్‌ థా.. ఛటాక్‌ ఛట్‌ థా’ (ఎత్తి పడెయ్యి, ఎత్తి పడెయ్యి) అని గట్టిగా డోలు మోగింది. లుట్టన్‌ చాలా చలాకీగా ఎత్తుకు పై ఎత్తు వేసి చాంద్‌ సింగ్‌ను కింద పడేశాడు.‘థిగ్‌ థినా, థిగ్‌ థినా’ (వెల్లకిలా పడెయ్యి, వెల్లకిలా పడెయ్యి) అని డోలు మోగింది.లుట్టన్‌ సింగ్‌ శక్తినంతా బిగపట్టి చాంద్‌ సింగ్‌ను వెల్లకిలా పడేసి ఓడించాడు. ‘థాగిడ్‌ గిడ్, థాగిడ్‌ గిడ్, థాగిడ్‌ గిడ్‌’ (శభాష్‌ పహిల్వాన్, శభాష్‌ పహిల్వాన్, శభాష్‌ పహిల్వాన్‌) అని డోలు మోగింది.ప్రేక్షకులు ఎవరికి జేజేలు పలకాలో తెలియని స్థితిలో ఉన్నారు. వాళ్ల వాళ్ల ఇష్టానుసారం కొంతమంది ‘దుర్గా మాతకు జై’ అంటే మరికొందరు ‘మహావీరునికి జై’ పలికారు. మరికొందరు శ్యామానంద మహారాజుకు జై పలికారు. ఆఖరికి సామూహికంగా జేజేలతో ఆకాశం మార్మోగింది.విజయోత్సాహంతో లుట్టన్‌ ఎగురుతూ గంతులేస్తూ, తొడలు చరుస్తూ అందరి కంటే ముందు వాద్యగాళ్ల వద్దకు పరుగున వెళ్లి భక్తిపూర్వకంగా డోలుకు నమస్కరించాడు. తర్వాత పరుగున వెళ్లి రాజాగారిని పైకెత్తుకున్నాడు. రాజావారి విలువైన దుస్తులకు మట్టి అంటుకుంది. ‘అరె, అరే .. ఏమిటిది?’ మేనేజరుగారు మందలించారు. రాజావారు మాత్రం అతన్ని తన హృదయానికి హత్తుకొని ఆనంద పారవశ్యంతో ‘‘వర్ధిల్లు పహిల్వాన్‌ వర్ధిల్లు! నీవు ఈ రాజ్య గౌరవాన్ని నిలబెట్టావు’’ అన్నారు.

పంజాబీ పహిల్వాన్‌లు చాంద్‌ సింగ్‌ కన్నీళ్లు తుడవసాగారు. రాజావారు లుట్టన్‌ సింగ్‌కు బహుమానాలు ఇవ్వటమేగాక అతన్ని ఆస్థానంలో నియమించుకున్నారు. అప్పటి నుంచి లుట్టన్‌ రాజాస్థానంలో పహిల్వాన్‌ అయ్యాడు. రాజావారు గౌరవంగా అతన్ని లుట్టన్‌ సింగ్‌ అని పిలువసాగారు. మిగతా ఆస్థాన పండితులకు అది నచ్చలేదు. ‘‘ప్రభూ! వీడి జాతి ఏమిటి? వీడిని సింగ్‌ అని పిలవడం బాగులేదు’ అన్నారు.మేనేజరు క్షత్రియుడు. తన క్లీన్‌షేవ్డ్‌ ముఖాన్ని చిట్లిస్తూ ముక్కులోని వెంట్రుకలను లాగసాగాడు. క్షణంలో ఒక వెంట్రుకను లాగేసి దాన్ని నలుపుకుంటూ ‘‘అవును మహాప్రభూ! ఇది అన్యాయమే’’ అన్నాడు.‘‘అతడు క్షత్రియుడు చేయవలసిన పనే చేశాడు’’ రాజావారు చిరునవ్వుతో అన్నారు. ఆ రోజు నుంచే లుట్టన్‌ సింగ్‌ పహిల్వాన్‌ కీర్తి ప్రతిష్ఠలు దూర తీరాలకు వ్యాపించాయి. కొద్ది సంవత్సరాల్లోనే అతడు పేరుగాంచిన పహిల్వాన్‌లను ఒక్కొక్కరినే మట్టికరిపించాడు. అప్పుడు కాలాఖాన్‌ అనే మరో పేరుపొందిన పహిల్వాన్‌ ఉండేవాడు. కాలాఖాన్‌ లంగోటీ బిగించి, ఆలే అని ప్రత్యర్థి పైకి ఉరికితే, ప్రత్యర్థికి వణుకు పుట్టేదని ప్రతీతి. లుట్టన్‌ సింగ్‌ అతన్ని కూడా ఓడించి వాళ్ల భ్రమలను తొలగించాడు.క్రమంగా అతను ప్రదర్శనశాలలో ఒక వస్తువుగా తయారయ్యాడు. జంతు ప్రదర్శనశాలలో ఇనుపబోను ఊపుతూ పులి గాండ్రించినట్లు అతను హా హూ.. హా హూ అని అరిచేవాడు.

అతని అరుపులు విని, రాజావారి పులి అరుస్తోంది అనేవారు. జాతరలో అతను మోకాళ్ల వరకు అంగీ వేసుకుని, చిందరవందరగా తలపాగా కట్టి, మదించిన ఏనుగులా ఊగుతూ నడిచేవాడు. దుకాణదారులు తమ అంగడి వద్దకు పిలిచి, ‘‘పహిల్వాన్‌ గారూ! వేడి వేడి రసగుల్లాలు రెడీగా ఉన్నాయి.. నాలుగైదు ఆరగించండి’’ అని వేళాకోళం చేసేవారు.లుట్టన్‌సింగ్‌ పహిల్వాన్‌ చిన్నపిల్లాడి మాదిరి నవ్వుకుంటూ ‘అరే నాలుగైదు తింటే ఏమవుతుంది? తీసుకురా ఒకటి, రెండు శేర్లు’ అని అక్కడే కూర్చునేవాడు.రెండుశేర్ల రసగుల్లాలు తిని, పది పన్నెండు పాన్‌ చిలకల్ని నోట్లో కుక్కుకుని, గడ్డానికి పాన్‌ రసాన్ని కార్చుకుంటూ జాతరలో తిరిగేవాడు. జాతర నుంచి రాజ దర్బారుకి తిరిగొచ్చేటప్పటికి అతని ఆకృతే మారిపోయేది. కండ్లకు రంగుల అభ్రకపు కళ్లజోడు, చేతుల్లో నాట్యం చేసే బొమ్మ, నోట్లో ఇత్తడి పీకను ఊదుకుంటూ నవ్వుకుంటూ తిరిగొచ్చేవాడు. శారీరక వృద్ధి సామర్థ్యాలు పెంపొందుతున్నాయి గాని, బుద్ధి మాత్రం క్షీణిస్తూ చిన్నపిల్లల స్థాయికి చేరుకుంది. కుస్తీ మైదానంలో డోలు శబ్దం వింటూనే తన స్థూలకాయాన్ని ప్రదర్శించడం ప్రారంభించేవాడు.

అతనికి సమ ఉజ్జీ దొరికేవాడే కాదు. ఒకవేళ ఎవరైనా అతనితో పోటీ పడాలంటే రాజావారు అనుమతించేవారు కాదు. అందువల్లే పాపం అతను నిరాశతో లంగోటీ బిగించి, దేహానికి మట్టి పూసుకుని, ఎగురుతూ గంతులేస్తూ ఉండేవాడు. తనను దున్నపోతు, ఆంబోతుగా నిరూపించుకుంటూ తిరిగేవాడు. ముసలివాడైన రాజు అతన్ని చూసి మురిసిపోయేవాడు.ఇలా పదిహేనేళ్లు గడిచిపోయాయి. పహిల్వాన్‌ మాత్రం అజేయుడిగా నిలిచిపోయాడు. కుస్తీ మైదానంలోకి లుట్టన్‌ సింగ్‌ తన ఇద్దరు కుమారులను తీసుకుని వచ్చేవాడు. పహిల్వాన్‌ అత్త ఎప్పుడో మరణించింది. ఇద్దరు పిల్ల పహిల్వాన్‌లకు జన్మనిచ్చిన కొద్ది రోజులకు అతని భార్య పరమపదించింది. ఇద్దరు పిల్లలూ తండ్రిని మించిన తనయులు అవుతారు అనేవారు.ఇద్దరినీ పిల్లవాళ్లుగా ఉన్నప్పుడే కాబోయే రాజ మల్లులుగా ప్రకటించారు రాజావారు. అందువల్ల వారి పోషణ భారమంతా రాజదర్బారే చూసేది. ప్రతిరోజూ ప్రాతఃకాలాన్నే పహిల్వాన్‌ స్వయంగా డోలు వాయిస్తూ పిల్లల చేత కసరత్తు చేయించేవాడు. మధ్యాహ్నంపూట విశ్రమిస్తూనే ఇద్దరికీ ప్రపంచజ్ఞానం బోధించేవాడు.‘‘డోలు ధ్వనులపై దృష్టి కేంద్రీకరించండి. నాకు గురువు ఎవ్వరూ లేరు. ఈ డోలే నా గురువు. ఈ డోలు ధ్వనుల ప్రభావం వల్లనే నేను పహిల్వాన్‌ కాగలిగాను. కుస్తీ మైదానంలోకి అడుగిడగానే డోలుకు నమస్కారం చేయాలి.

తెలిసిందా.’’... ఈ మాదిరి ఎన్నో విషయాలు బోధించేవాడు. ఇవే కాకుండా రాజావారిని ఏవిధంగా సంతోషపరచాలి, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి మొదలైన విషయాలను వారికి బోధించేవాడు.కానీ ఏం లాభం? అతని బోధనలన్నీ వ్యర్థమయ్యాయి. రాజావారు స్వర్గస్తులయ్యారు. రాజ కుమారుడు విదేశాల నుంచి తిరిగొచ్చి రాజ్యపాలనా భారాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. నాన్నగారి కాలంలోని వైఫల్యాలన్నీ తొలగించి, కట్టుదిట్టాలు చేశాడు. కొన్ని కొత్త మార్పులు చేశాడు. ఆ మార్పుల కారణంగా పహిల్వాన్‌గిరీ ఊడిపోయింది. కుస్తీ మైదానాన్ని గుర్రపు పందేలా మైదానంగా మార్చారు.పహిల్వాన్‌లు కాబోయే రాజమల్లుల దినసరి భోజన ఖర్చు వివరాలు తెలియగానే ‘టెరిబుల్‌’ అన్నాడు కొత్త రాజు.రాజాస్థానంలో ఇంకెంత మాత్రం పహిల్వాన్‌ల అవసరం లేదని స్పష్టంగా హుకుం జారీ చేశాడు. పహిల్వాన్‌కు తన గోడు తెలుపుకునే అవకాశం సైతం దొరకలేదు.అదేరోజు డోలును మెడకు తగిలించుకుని కొడుకులను వెంట తీసుకుని పహిల్వాన్‌ తన ఊరు చేరుకున్నాడు. ఊరిలో ఒక మూల ఊరివారందరూ కలిసి ఒక గుడిసె వేయించి ఇచ్చారు. అక్కడే ఉంటూ ఊరి యువకులకు, పశువుల కాపర్లకు కుస్తీ నేర్పుతూ వచ్చాడు. తిండితిప్పలు ఊరిలో వాళ్లు చూసేవారు. ఉదయం, సాయంత్రం డోలు వాయిస్తూ శిష్యులకు, తన కొడుకులకు కుస్తీలోని పట్టు విడుపులు నేర్పేవాడు

.ఆ ఊరిలోని రైతుల పిల్లలకూ, వ్యవసాయ కూలీల పిల్లలకూ సరైన తిండి లేదు. ఇక కుస్తీ ఎలా నేర్చుకోగలరు? క్రమక్రమంగా పహిల్వాన్‌ స్కూలు ఖాళీ అయింది. ఆఖరికి డోలు వాయిస్తూ తన ఇద్దరు కొడుకులకే కుస్తీలోని పట్టువిడుపులు నేర్పుతూ ఉండేవాడు. దినమంతా ఇద్దరు కొడుకులు కూలి నాలి చేసి సంపాదించిన సొమ్ముతోనే జీవితం గడిపేవాడు.ఉన్నట్టుండి ఆ ఊరికి ఆపద వచ్చిపడింది. అనావృష్టి. తిండి గింజల లేమి. ఆ తర్వాత మలేరియా, కలరా రెండూ కలసి పల్లెను సర్వనాశనం చేయసాగాయి.ఆ ఊరు ఒక విధంగా ఖాళీ అయింది. ఇండ్లకు ఇండ్లు ఖాళీ అయిపోయాయి. ప్రతిరోజూ ఇద్దరు ముగ్గురు శవాలుగా మారేవారు. పల్లెవాసుల్లో కలవరం మొదలైంది. రోజంతా కలవరం, వ్యాకులత, హృదయాన్ని కరిగించే ఏడుపులతో గడిచిపోగా, ప్రజల ముఖాల్లో సూర్యుని వెలుగుతో పాటు కొంచెం వెలుగు కనపడేది. సూర్యోదయం అవుతూనే ఏడుస్తూ, మొత్తుకుంటూ తమ ఇండ్ల నుంచి బయటికొచ్చి ఇరుగుపొరుగు వారితో, బంధువులతో కలసి పరస్పరం ధైర్యం చెప్పుకొనేవారు.‘‘ఇప్పుడు ఏడ్చి ఏమి లాభం కోడలా, పోయినవాడు పోయాడు. వాడు నీవాడు కాదనుకో.

ముందు జరగవలసిన దానిని గురించి ఆలోచించుకో’’ అని..‘‘తమ్ముడూ! ఇంట్లో శవాన్ని పెట్టుకుని ఎంతకాలం ఏడుస్తావు? శవంపై కప్పేదానికి గుడ్డ కావాలంటావా, దాని అవసరం ఏమిటి? శవాన్ని నదిలో కలిపేసి రారాదా’’ అనే మాటలు ఊరంతా వినిపించేవి.సూర్యాస్తమయం అవుతూనే ఊరివారంతా తమ తమ గుడిసెల్లో దూరి నిశ్శబ్దంగా పడి ఉంటారు. అప్పుడు వాళ్లకు మాట్లాడే శక్తి కూడా ఉండదు. తల్లి పక్కనే ప్రాణాలు కోల్పోతున్న కొడుకును, కొడుకా అని పిలిచే ధైర్యం తల్లులకు ఉండదు.రాత్రి భీకర నీరవ స్తబ్దతను పహిల్వాన్‌ డోలు మాత్రమే గట్టిగా మోగుతూ సవాలు చేస్తుంది. సాయంకాలం నుంచి ఉదయం వరకు డోలు ఏదో విధంగా మోగుతూ ఆ పల్లెలో చావటానికి సిద్ధంగా ఉన్నవాళ్లకు, మందులూ మాకులూ లేక తిండితిప్పలు లేని మనుషులకు సంజీవని శక్తిగా పనికొచ్చేది. పిల్లల యువకుల వృద్ధుల శుష్క నేత్రాలలో అప్పుడప్పుడూ కుస్తీ మైదానంలోని దృశ్యాలు లీలగా తాండవిస్తాయి. స్పందన, శక్తి లేని నరాల్లో విద్యుత్తు ప్రవహిస్తుంది. ఆపే శక్తి లేకపోవచ్చు కాని, చనిపోయేవాళ్లు కళ్లు మూసే సమయంలో వాళ్లకు ఎలాంటి కష్టాన్నీ కలిగించకుండా, మృత్యుకూపంలోకి పోయేటప్పుడు ఎలాంటి భయం కలుగకుండా డోలు శబ్దాలు పనికొచ్చేవి.

 పహిల్వాన్‌ కొడుకులు యముని పాశంలో చిక్కుకొని భరించలేని బాధతో కొట్టుమిట్టాడుతూ ‘‘నాన్నా, ఎత్తిపడేయి’’ అన్న తాళాన్ని వాయించండి అన్నారు. ‘‘ఛటాక్‌– ఛట్‌థా, ఛటాక్‌– ఛట్‌థా’’ తాళాన్ని పహిల్వాన్‌ రాత్రంతా డోలుపై వాయిస్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో పహిల్వాన్‌ల భాషలో ‘వీరులారా! ప్రత్యర్థిని ఓడించండి’ అని ఉత్సాహపరుస్తున్నాడు.తెల్లవారేసరికి ఇద్దరు కొడుకులూ అపస్మారక స్థితిలో నేలపై పడి ఉండటం చూశాడు. ఇద్దరూ బోర్లా పడి ఉన్నారు. ఒకడు మట్టిలో కూరుకుపోయి ఉన్నాడు. దీర్ఘ ఉఛ్ఛ్వాశ తీసుకుని నవ్వే ప్రయత్నంలో పహిల్వాన్‌ ‘‘ఇద్దరు వీరులూ మట్టికరిచారా!’’ అన్నాడు.ఆ రోజు పహిల్వాన్‌ శ్యామానంద మహారాజా ఇచ్చిన పట్టు లంగోటా ధరించి ఉన్నాడు. శరీరమంతా మట్టి పులుముకొని కసరత్తు చేశాడు. తర్వాత ఇద్దరు కొడుకులను భుజాన వేసుకుని నదిలో పారేసి వచ్చాడు. ఈ విషయం విని పల్లెవాసులు ఆశ్చర్యచకితులయ్యారు. భయభ్రాంతులయ్యారు.

ఇంత జరిగినప్పటికీ పహిల్వాన్‌ డోలు శబ్దాలు రోజూ మాదిరిగానే వినబడసాగాయి. ప్రజల్లో ధైర్యం పుంజుకోసాగింది. ‘‘ఇద్దరు కొడుకులు గతించారు. అయినప్పటికీ పహిల్వాన్‌ ధైర్యం చూడండి. అతని గుండెనిబ్బరం చూడండి’’ అని తమ సంతానాన్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు అనుకున్నారు.నాలుగైదు రోజుల తర్వాత ఒకనాటి రాత్రి డోలు శబ్దాలు వినబడలేదు. డోలు మూగబోయింది. రోగగ్రస్తులైన కొందరు శిష్యులు పోయి చూడగా, పహిల్వాన్‌ శవం వెల్లకిలా పడి ఉంది. రాత్రి నక్కలు బలిష్టమైన అతని ఎడమ తొడ మాంసం తినేశాయి. కడుపును కూడా చీల్చాయి.‘‘నేను చనిపోతే చితిపైన నన్ను వెల్లకిలా పడుకోబెట్టండి. నేను జీవితంలో ఎప్పుడూ బోర్లాపడలేదు. చితికి నిప్పంటించేటప్పుడు డోలు వాయించండి’’ అని అంటుండేవారు మన గురువుగారు అని కన్నీళ్లు తుడుచుకుంటూ అతని శిష్యుల్లో ఒకడన్నాడు.పక్కనే డోలు పడిఉంది. నక్కలు డోలును తినే వస్తువు కాదనుకొని దాని చర్మాన్ని చీల్చేశాయి. 

మరిన్ని వార్తలు