యూఫోరియా 

17 Feb, 2019 02:00 IST|Sakshi

ఈవారం కథ

హంటగన్‌ దానా పాయింట్‌ దగ్గర కళ్యాణ్, నేను కారు దిగుతున్నాం. అప్పటికే వెన్నెల, అంజని దిగి పోయారు. పార్కింగ్‌ దొరక్కపోవడం వల్ల కళ్యాణ్‌ కారు పార్క్‌ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. పసిఫిక్‌ కోస్ట్‌ మీద అలా నడుస్తుంటే వాతావరణం సుందరంగా విచిత్రంగా అనిపించింది. తల వంచుకుని కళ్యాణ్, వెన్నెల వెంట కొంత దూరం నడిచాను. నడుస్తున్నానే కాని మనసంతా ఆలోచనతో  మునిగి పోయింది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ లగునా హిల్స్‌లో మా అమ్మాయి వెన్నెల, అల్లుడు కళ్యాణ్‌ ఉంటారు. ఓ వారం క్రితం నేను అంజని అమెరికా వచ్చాం ఫసిఫిక్‌ ఓషియన్‌ చూడటానికి.ఫసిఫిక్‌ ఓషియన్‌ సందడిగా ఉంది. కొందరు అలలతో భలే సందడిగా రైడ్‌ చేస్తున్నారు. కొందరు అలలతో విన్యాసం చేస్తున్నారు. దీన్ని వాళ్ళు సర్ఫింగ్‌ అంటారట. పెద్ద గ్యాంగ్‌ మరొక చోట డోలక్‌ వాయిస్తున్నారు. వివిధ రకాలైన దుకాణాలు, అమ్మకాలు...విచిత్రమేమిటంటే ఎవరి మొహమైనా నిమిషం చూస్తే చాలు, హలో అంటూ పలకరిస్తారు.వెన్నెల మా ముగ్గురిని నిలబెట్టి ఫొటో తీసింది. తరువాత కళ్యాణ్, నన్ను వెన్నెలని అంజలిని ఫొటో తీశాడు.

కాని నలుగురూ ఒకేసారి దిగాలంటే ఎలా ?‘‘షల్‌ ఐ టేక్‌ ఫొటోగ్రాఫ్‌ ?’’ ఒక తీయని గొంతు వినిపించింది. నేను వెంటనే ఆ వైపు చూశాను.ఓ..యూఫోరియా ... నేను పైకే అనేశాను. ఆమె దగ్గరగా వచ్చింది.యూఫోరియా...యూఫోరియా...అన్నాను. ఆమె మరీ దగ్గరగా వచ్చి వెన్నెల చేతిలోని కెమెరా  తీసుకొంది. కాదు..ఆమె యూఫోరియా కాదు. వేరే అమ్మాయి. యూఫోరియా లాగే ఉంది కాని ఈమె కళ్ళు అంత విశాలంగా లేవు. ఆ అమ్మాయి మా నలుగురినీ ఫొటో తీసింది. నాకెందుకో నిట్టూర్పు వచ్చింది. యూఫోరియా మళ్లీ  కనబడుతుందా? కనబడ్డా నన్ను గుర్తిస్తుందా ? ఎలా ఆమెను మళ్లీ  చూడటం...కృతజ్ఞత వల్లనా...దానికంటే ఎక్కువ ఏదైనా ఉందా ? ఏమో మరి.కృతజ్ఞత అంటే కాదా మరి ? ఆమె చేసింది తక్కువేమిటి ? నేను ఇసుకలో పడుకొని కళ్ళు మూసుకున్నాను.లగునా హిల్స్‌లో రెటినా అపార్ట్‌మెంట్‌ చాలా పెద్దది. వెయ్యి అపార్ట్‌మెంట్‌లుంటాయి, దాదాపు అన్ని దేశాలవాళ్ళు అందులో అద్దెకుంటారు. ప్లాట్లకు మధ్యలో కింది భాగంలో ఒక స్విమ్మింగ్‌ పూల్‌. స్విమ్మింగ్‌ పూల్‌లో పైన చిన్న చిన్న గుడారాలు.

దాని పైన ఈతలో అలసిపోయిన వాళ్ళు పడుకోవడానికి అనువైన చైయిర్లు, వాటి ప్రక్కన యాష్‌ ట్రే, ఈత  తరువాత మళ్ళీ స్నానం చేయడానికి  షవర్లు, బాత్‌ టబ్‌లు  స్విమ్మింగ్‌ పూల్‌ పక్కనే జకూజీ ఉంది.  జకూజీ ఆన్‌ చేసి లోపలి దిగాలి. మనిషికి పొట్ట పై భాగం వరకు నీళ్ళు ఉంటాయి. ఆన్‌ చేసిన వెంటనే వెచ్చని నీళ్ళు వస్తాయి. చిన్న హోల్స్‌ నుండి నీళ్ళు తడలు తడలుగా వస్తాయి. హోల్‌ పైన శరీరంలో ఏ భాగం ఆనించినా మసాజ్‌ చేసినట్టుగా ఉంటుంది.అమెరికా వచ్చే ముందు చాలా ఎక్కువ డ్రైవ్‌ చేయడం వల్ల నా కుడి భుజం విపరీతమైన నొప్పి లేచింది. డాక్టర్స్‌ మజిల్స్‌ ఫ్రీజ్‌ అయ్యాయని అన్నారు. ఎన్ని  మెడిసిన్స్‌ తీసుకున్నా తగ్గలేదు. జకూజీలోకి దిగి కాసేపు వేడినీళ్ళ  మసాజ్‌ పెట్టుకొని, పక్కనే స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొట్టేవాణ్ని. ఎప్పుడో మా ఊరి మర్రిబావిలో ఈదినట్టు గుర్తు. మళ్ళీ ఈత కొట్టే అవకాశం అమెరికాలోనే వచ్చింది. ఇటు నొప్పి తగ్గుతుంది అటు ఈత కొట్టే సరదా కూడా తీరుతుంది.ఇదంతా ప్రతి రోజూ ఉదయం నాకొక దినచర్య అయింది. ఒకరోజు ఎప్పటిలాగే వెళ్లి జకూజీ ఆన్‌ చేశాను.

బట్టలు విడిచి వాల్‌  దగ్గర పెట్టి ఈతకు ప్రత్యేకంగా వేసుకునే నిక్కరుపై జకూజీలోకి దిగాను. యథాలాపంగా భుజాన్ని జకూజీలోని ఓ మూల హోల్‌కి  ఆనించాను. ఉన్నట్టుండి జకూజీ నుండి  వేడి నీటి తీవ్రత పెరగసాగింది. నేను గుర్తించే  లోపలే నీటి వేడి విపరీతమైపోయింది. బయటకు వెళ్ళే వరకు బతుకుతానా అనిపించింది. జ్వాలలతో కూడిన నీటితో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. గట్టిగా అరిచాను, హెల్ప్‌..హెల్ప్‌ అని.ఒకమ్మాయి స్విమ్మింగ్‌ పూల్‌ నుండి  పరుగెత్తుకొచ్చింది. జకూజీ స్విచ్‌ ఉన్న దగ్గరికి వెళ్లి స్విచ్‌ ఆఫ్‌ చేసింది.అతి వేడి సాధారణమైన వేడిగా మారుతూంది. అయినా నేను తట్టుకోలేక పోతున్నాను. మంట.. మంట.. ఒళ్లంతా మంట. మెల్ల మెల్లగా నడుస్తున్నాను నీటినుంచి బయటకు రావడానికి. ఆమె గబగబా జకూజీలోకి దిగింది. నా వీపు మీద చేయి వేసి  ‘‘కమాన్‌ ...నో  ప్రాబ్లం. ఇట్స్‌ ఓ.కే’’ అంటూ నన్ను నడిపించింది.పూర్తిగా బయటకు వచ్చాను. ఆమె నన్ను తీసుకెళ్ళి పడక కుర్చీలో కుచోపెట్టింది. ఆమె గబా గబా వెళ్లి స్విమ్మింగ్‌ పూల్‌ నుండి ఓ  బకెట్‌ చల్లని నీళ్ళు తెచ్చి నా పైన గుమ్మరించింది. ఒక గుడ్డను తడిపి నా ఒంటిని రుద్దసాగింది.

నేను వారించ బోయాను, ‘‘ఓకే... ఇట్సోకే.. రిలాక్స్‌’’ అంటున్న మాటలు నాకు వినిపించీ వినిపించనట్టు వినిపిస్తున్నాయి.  మా ఇంట్లోవాళ్లసెల్‌ నంబర్‌ చెప్పమంది. మా అమ్మాయి నంబర్‌ ఇచ్చాను. ఆమె ఫోన్‌ చేసింది. మా అమ్మాయి ఫోన్‌ ఎక్కడ పెట్టిందో ఎత్తలేదు. ఓ పావు గంట గడిచింది. ఆమె చల్లని చేయి నా భుజాల్ని స్పృశిస్తూనే ఉంది. ఒళ్ళు చల్ల బడింది. మెల్లగా తేరుకున్నాను. నెమ్మదిగా లేవబోయాను నా బట్టలవైపు చూస్తూ. ఆమె అక్కడే పెట్టుకున్న నా బట్టలు అందించింది. టవల్‌తో నెమ్మదిగా  తుడుచుకున్నాను. ఆమె సెల్‌ మ్రోగింది. వెంటనే పికప్‌ చేసి హలో అంది.‘‘వాట్‌ హాప్పెండ్‌ టు దిస్‌ జకూజీ’’  నెమ్మదిగా అడిగాను.‘‘ఇస్‌ దేర్‌ సమ్‌ టెక్నీషియన్‌ అవైలబుల్‌’’ మళ్లీ అన్నాను.ఆమె సమాధానం చెప్పకుండా ఫోన్‌ కట్‌ చేసి గబ గబా తన దుస్తులు ఉన్న  దగ్గరికి వెళ్ళింది. తన స్లీవ్లెస్‌ బనియన్‌ పైనుండి శాలువా కప్పుకొని ‘‘ఓ.కే. బై  టేక్‌ కేర్‌’’ అంటూ పరుగులాంటి నడకతో వెళ్లి పోయింది. దేవతలాగా వచ్చింది.కనీసం థాంక్స్‌ కూడా చెప్పలేకపోయాను. నన్ను నేను ఎంతగా నిందిచుకుంటే ఏం లాభం? మిస్‌ కాల్‌ చూసి వెన్నెల ఫోన్‌ చేస్తోంది.

ఫోన్‌ శబ్దం వింటూ బట్టలు వేసుకున్నాను. నిక్కరు పై నుండే లుంగీ కట్టుకొని నెమ్మదిగా నడుస్తూ స్విమ్మింగ్‌ ఫూల్‌ గేటు దాటి లిఫ్ట్‌ వైపుకి వెళ్లాను. అంతా చెప్పి ఆనవాళ్ళు చెప్పి ఈ అపార్ట్‌మెంట్‌లో ఎక్కడ ఉంటుంది? అని అడిగాను. ‘‘అలా చెప్పడం  కష్టం, ఎన్నో కుటుంబాలు ఉన్న అపార్ట్‌మెంట్స్‌లో పోలికలు చెప్పి ఎలా తెలుసుకోగలం?’’ అంది వెన్నెల.‘‘ఎట్లా మరి?’’ అడిగాను.‘ఏముంది? మళ్లీ కనిపించినపుడు ఆనవాళ్ళు పట్టి గుర్తు పట్టడమే’’‘‘పేరైనా అడిగారా’’ ?‘‘అడగలేదు’’  నాలో నేను గొణుగుకున్నాను. నాకు నేనే ఆమెకు పేరు పెట్టుకున్నాను. యూఫోరియా!కొద్ది రోజులకు మేం లాస్‌ ఏంజిల్స్‌ నుండి లాస్‌ వేగాస్‌కి  బయలుదేరాం. సొంత కారు సర్వీసింగ్‌ చేయబడి లేకపోవడం వల్ల కళ్యాణ్‌ వెన్నెల ఒక పెద్ద కారు అద్దెకు తెచ్చారు. లాస్‌ వేగాస్‌ విద్యుద్దీపాలకు పుట్టిల్లుగా ఉంది. ఎటు జూసినా కాంతుల వెల్లువ. లాస్‌ వేగాస్‌ ప్రవేశిస్తుంటే చెప్పలేని ఉత్సాహం, ఆకాశాన్నంటే సుందరమైన మేడలు,ట్రంపు  హోటల్‌ ఒకటుందీ. చాలా కాస్ట్‌లీ అట. వెన్నెల చెప్పింది.‘’అదిగో...నాన్నా...మనం ఉండబోయే హోటల్‌’’ వెన్నెల దూరం నుంచి చూపించింది.

స్ట్రాటోస్పియర్‌ హోటల్, నూటారెండు ఫ్లోర్లు. దిగ్భ్రమకు లోనయ్యాను. దూరం నుంచి చూస్తే ఒక ఎత్తయిన çస్తంభం లాగా కనబడుతుంది. కళ్యాణ్‌ మేం ఉండబోయే గదికి సంబంధించిన  ఫార్మాలిటీస్‌ పూర్తి చేసుకొని అరగంటలో వచ్చాడు. హోటల్‌లోనే సుమారు అరకిలోమీటరు నడచి, లిఫ్ట్‌ దగ్గరికి చేరుకున్నాం.గుండ్రని రెస్టారెంట్‌ అది. కూల్‌ డ్రింక్, బీర్, ఎవరికి కావలసినవి వాళ్ళు ఆర్డరిచ్చి సోఫాలలో కూచున్నాం. రెస్టారెంట్‌ గుండ్రంగా మెల్లగా తిరుగుతుంటుంది. లాస్‌ వేగాస్‌ ఎక్కడో కింద కనబడుతుంటుంది. విద్యుద్దీపాలు భూమికి మొలచిన నక్షత్రాలలాగా కనబడుతున్నాయి. పై భాగం నూటారెండవ భాగం  స్లోగా గుండ్రంగా తిరుగుతూ ఉంటే భూమి మీద మిణుగురుల్లాగా మెరిసిపోతున్న దృశ్యాన్ని   చూడడం ఒక గొప్ప అనుభూతి. అంతా ఒక అద్భుతం...సోఫాలో మాకు నాలుగవ వరుసలో కూచున్నది ఒకామె ...ఆమె.. ఆమె..యూఫోరియా!యూఫోరియా...నేను పెద్దగా అరిచాను. గ్లాస్‌ పక్కకు పెట్టి గబగబా దగ్గరకు వెళ్లాను. ఆమె కుడిచేతిలో డ్రింక్‌ ఉంది. ఎడమచేతిలో పొగలు కక్కే సిగరెట్‌ ఉంది.

నేను దగ్గరకు  వెళ్లి నిలబడ్డాను. ఆమె క్రిందికి చూస్తున్నదల్లా తల త్రిప్పి డ్రింక్‌ సిప్‌ చేస్తూ నావైపు చూస్తుంది.‘’హలో’’అన్నాను.ఆమె అట్లాగే నావైపు చూస్తూ హలో అంది. తన ముందు సోఫాను సూచిస్తూ ‘‘ప్లీజ్‌  బీ సీటేడ్‌’’ అంది.ఇంకొంచెం పరీక్షగా చూశాను. ఈమె యూఫోరియా కాదు. యూఫోరియా పెదాలు ఎర్రనివి. ఈమె బాగా లిప్‌స్టిక్‌ వేసుకున్నా ఆ అందం రాలేదు. అయాం సారీ ...‘‘యు ఆర్‌ రెసెంబ్లింగ్‌ మై ఫ్రెండ్, అయాం మిస్టేకెన్‌’’ నేను లేస్తూ అన్నాను. ‘‘ఇత్స్‌ ఓకే’’ అంది. వెనుతిరిగి వచ్చాను. మా వాళ్ళందరూ నవ్వుతున్నారు.∙∙ మరో రెండు రోజుల్లో ఆ హోటల్‌ ఖాళీ చేశాం. ఉదయమే అంటి లొప్‌ కెన్యాన్‌ కి బయలుదేరాం. అట్లా ఒక ఐదు గంటలు ప్రయాణించాక ఒక సెంటర్‌కి చేరుకున్నాం. అక్కడ నుండి కెన్యాకి వాహనాలు వెళ్ళవు. యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన ట్రక్కులో బయలుదేరాం. దారంతా ఇసుకమయంగా ఉంటుంది. దాదాపు పది కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ ట్రక్కు డ్రైవర్‌ ఒక రెడ్‌ ఇండియన్‌. ప్రయాణం జరిగినపుడు అతను తనపద్ధతిలో చెప్పాడు. ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని రెడ్‌ ఇండియాన్స్‌ కే వదలి వేసిందట.

రెడ్‌ ఇండియన్స్‌ అదంతా తమ సొంతంగా భావిస్తుంటారు. మూలవాసులకు అట్లాంటి ప్రాధాన్యత దొరకడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. కచ్చా రోడ్‌ మీద ఊగుతూ వెడుతుంది వాహనం. అమెరికాలో కూడా అట్లాంటి రోడ్లున్నయన్నమాట.లాస్‌ వేగాస్‌లోనే అజయ్, ప్రతిమలు కలిశారు. వెన్నెల, కళ్యాణ్‌ కుటుంబ స్నేహితులు వాళ్ళు. అంటీ లోప్‌ కెన్యాన్‌కి మరో కారులో వచ్చారు. ట్రక్కు దగ్గర అందరం కలుసుకొన్నాం.అంటిలోప్‌ కెన్యాన్‌ లోపలి వెడుతుంటే చిన్నప్పుడు చూసిన  జానపద సినిమాలు గుర్తొచ్చాయి. కొండల నడుమ చీకటి లోపలికి నడచి వెడుతున్నటనిపించింది. మధ్యలో శ్వాస ఆడకపోతే ఎలా? కొంచెం భయం వేసింది. ఇంతమంది ఉన్నారు. నాకే సమస్యా?  ధైర్యం తెచ్చుకొని కొనసాగాను. లోపలికి  వెడుతుంటే చీకటి. ..పైన బిలం నుంచి కొంత వెలుగు.్ర కమంగా భయం పోయింది. నూతనోత్సాహం వచ్చింది. మాతో వచ్చిన గైడ్‌ (డ్రైవర్‌ ) విషయాలు చెప్పుకొంటూ పోతున్నాడు. అవి చారిత్రకాంశాలు కావు. కల్పిత కథలే.అంటిలోప్‌ కెన్యాన్‌లో నేనెందుకో ఒక చోట వెనుకబడి పోయాను.

అంతా ముందు వెళ్లి పోయారు. ఆ బిలాన్ని చూస్తూ సంభ్రమంగా నేను ఒక చోట ఉండిపోయాను.నా వెనుకే వీడియోలో దృశ్యాన్ని బంధిస్తూ పైకి చూస్తోంది ఒకామె. ఆమె వీడియో తీస్తూ తీస్తూ నా వైపు తిరిగింది. ఆమె కెమెరా తీసి మెడకు తగిలించుకొంది. ఆశ్చర్యం ...ఆమె యూఫోరియా...దగ్గరికి పరిగెత్తాను. ఆమె నా వైపు ఆశ్చర్యంగా చూసింది. హలో అన్నాను. ఆమె   హలో అంది జుట్టు  సవరించుకుంటూ,పూర్తిగా దగ్గరికి వెళ్ళాక తెలిసింది ....ఆమె యూఫోరియా కాదు. యూఫొరియా నా కంటే మూరెడు పొడుగుంటుంది. ఈమె కూడా నా కన్నా పొడవేవుంది. కాని అంత పొడవు లేదు. నాకు నిరాశ కలిగింది.‘’ఐ రెమేనడ్‌ హియర్, అయాం అఫ్రైడ్‌ అఫ్‌ గోయింగ్‌ ఎలోన్‌’’ అన్నాను ఏమనాలో తెలియక.‘’ఓ, కమ్‌ ఎలాంగ్‌ విత్‌ మీ, దెన్‌’’ ఆమె దారి తీస్తూ అంది.∙∙ తరువాత రెండు రోజులకు లాస్‌ వేగాస్‌కి తిరిగివచ్చాం. లేక్‌ వ్యూ గదిలో నది ప్రక్కనే గడపడం, బోట్‌ రైడింగ్, గ్రాండ్‌ కెన్యాన్, లోయర్‌ అంటిలోప్‌ కెన్యాన్‌ వంటివన్నీ గొప్ప అనుభవాలు. లేక్‌ వ్యూలో ధవళ సుందరుల మధురమైన పాటలు ఎప్పుడు మరచిపోలేనివి.

లాస్‌ వేగాస్‌లో సీజర్‌ ప్యాలెస్‌కి వెళ్ళాం. సీజర్‌ వీరగాధ గురించి నేను కళ్యాణ్‌ కొంచెం సేపు మాట్లాడుకున్నాం. అక్కడే బాక్‌ హావెల్‌ బఫెట్‌లో వేయి రకాల డిష్‌లు ఉంటాయి. వివిధరకాల మాంసాహారాలుంటాయి. ప్రతి మాంసాహారం మీద ఆయా జంతువుల బొమ్మలుంటాయి. కుక్కల బొమ్మలు కూడా ఉన్నాయి. మేం మేక బొమ్మ ఉన్న దగ్గరికే వెళ్లి మటన్‌ కర్రీ వేసుకున్నాం. ప్లేట్‌లో ఇంకా ఇష్టమైన ఆహార పదార్థాలు వడ్డించుకొని వచ్చి మా సీట్లలో కూచున్నాం. వివిధ రకాలైన మద్యాల సరఫరా జరుగుతుంది. అట్లా ఎక్కువ సమయమే అక్కడ గడచింది.ఆడామగా తేడా లేకుండా అందరూ మద్యం తాగుతున్నారు. వాతావరణం  కొంచెం మత్తుగా ఉంది.నాకు కూడా కొంచెం మత్తెక్కినట్టు అనిపించింది. లేచి నెమ్మదిగా అడుగు వేస్తూ టాయిలెట్‌ వైపు వెళ్లి వస్తున్నాను. వస్తూ బాల్కనీలోకి వెళ్లాను సిటీ చూద్దామని. ఓ యువతి బయటకు చూస్తూ నిలబడి ఉంది. సుతారంగా సిగరెట్‌ తాగుతోంది. వెనుక నుండి చూస్తే ఆమె భుజాలు తిలక్‌ వర్ణించిన చంద్రవంకల్లా ఉన్నాయి. ఆ ఎత్తు ఆ పద్ధతి చూస్తే ఈ శ్వేతసుందరి యూఫోరియా కాదు కదా,అవును ...ఆమె యూఫోరియాయే, గబ గబా ఆమె దగ్గరికి వెళ్ళాను.

‘’ఎక్సుక్యూజ్‌ మి’’ అన్నాను. ఆమె వెనక్కి తిరిగి  ‘’ఎస్‌’’ అంది. కళ్ళు మత్తుగా వాలిపోతున్నాయి. బాగా మద్యం సేవించిందని తెలుస్తూనే ఉంది. ఆమె కళ్ళలోకి నిశితంగా చూశాను. నో...ఈ కళ్ళు చిన్నగా ఉన్నాయి. ఈమె యూఫోరియా కానే కాదు.సారీ ...అంటూ వెనుదిరిగాను. ఆమె ఆశ్చర్యంగా కళ్ళెగరేసి మళ్లీ  ఎందుకో తలూపుతూ ఏదో అంటుంది. ఆమె ఉచ్ఛారణ అర్థం కాలేదు. వెనుదిరిగి వచ్చాను. ఆమె కిసుక్కున నవ్వినట్టు అనిపించింది.∙∙ బెలాజియం హోటల్లో ఫౌంటెన్‌ షో చూసినప్పుడు, విన్‌ హోటల్లో విలేన్‌ అనే డ్రీం షో చూసినపుడు, తరువాత గండోల బోటు రైడింగ్‌ చేసినపుడు చాలా జాగ్రత్తగా ఉన్నాను. యూఫోరియాని బాగా గుర్తించ గలిగితేనే  పలకరించాలి కాని ఇట్లా పొరపాటు చేయకూడదనుకున్నాను. చివరికి లాస్‌ ఏంజిల్స్‌కి తిరుగు ప్రయాణమయ్యాను.∙∙ చివరికి మేం ఇండియాకి తిరిగి వచ్చే రోజు రానే వచ్చింది. వెన్నెల కళ్యాణ్‌లను విడిచి రావడం భారంగా అనిపించింది.విశాలమైన రోడ్లు, చక్కగా వాహనాలు పాటించే ట్రాఫిక్‌ రూల్స్, పెద్ద పెద్ద మాల్స్, విసుగు లేకుండా అందరూ అనుసరించే క్యూ సిస్టం, అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశిష్టతలున్న అమెరికా సామాజిక జీవితం ఎంతో ముచ్చట గొలిపింది.

అయినా మనం ఉండాల్సిన  కాల పరిమితి అయిపోయాక తప్పదు కదా.వెన్నెల, కళ్యాణ్‌ ఎయిర్‌ పోర్టుకి వచ్చారు. వస్తున్నప్పుడు దారి సరిగా చూసుకోకపోవడం, ఇంట్లో కూడా తొందరగా తెమలక పోవడం వల్ల ఆలస్యం అయింది. ఏమిరేట్స్‌ ఫ్లైట్‌ కి కొద్ది సమయమే ఉంది.వెన్నెల మాకు వీల్‌ చైర్‌ ఏర్పాటు చేసింది. చెకింగ్‌ క్యాబిన్‌లోకి చేరిపోయాం.చకా చకా ఫార్మాలిటీస్‌ పూర్తవుతున్నాయి. లోపలికి  వెడుతూ వెనక్కి చూశాం. వెన్నెల, కళ్యాణ్, చేయి ఊపుతున్నారు. మేమూ చేయి ఊపుతూ ముందుకెడుతున్నాం.ఆశ్చర్యం...వెన్నెల, కళ్యాణ్‌ల వెనుక నిలబడింది ఆమె. ఆమె ....ఆమె ...ఆమె  ..యూఫోరియా ..అవును యూఫోరియా! చాలా పొడవైన యూఫోరియా...ధవళ దేహంతో మెరిసిపోతున్న యూఫోరియా ...విశాల నేత్రాల యూఫోరియా ...నన్ను విద్యుదాఘాతం నుండి కాపాడిన యూఫోరియా...అవును ఆమె కచ్చితంగా యూఫోరియానే ...నా శరీరం ఒక్కసారిగా జలదరించినట్టయింది. యూఫోరియా...గట్టిగా అరిచాను. వెన్నెల, కళ్యాణ్‌లతో పాటు ఆమె కూడా ఇటు చూసింది.

యూఫోరియా ...యూఫోరియా ..నేను చేతులెత్తి ఊపుతూ అరిచాను. వీల్‌చైర్‌  అతను లోపలి వీల్‌ చెయిర్ని తోయడం ఆపి నిలబడ్డాడు. యూఫోరియా ఇటు చూసింది. ఆశ్చర్యంగా చూస్తోంది. నన్ను గుర్తించలేదు. అలాగే చూస్తూ నిలబడింది. ‘‘నాన్నా..వెళ్ళండి టైమవుతుంది’’ వెన్నెల టైం చూస్తూ అంది. వీల్‌ చైర్‌ అతను వెన్నెలను గమనించాడు. వీల్‌ చైర్‌ నెట్టుకుంటూ లోపలికి నడిచాడు. యూఫోరియా  కనుమరుగయింది.∙∙ నాకు తెలుసు, యూఫోరియా నన్ను గుర్తించలేదు. బహుశా నన్ను మరచిపోయి ఉంటుంది. కాని నా ఙ్ఞాపకాలలో ఎప్పుడు ఉంటుంది.నాలో కథై దూకేలా హృదయాన్ని కదలిస్తూనే ఉంటుంది.యూఫోరియా ...వండర్‌పుల్‌ యూఫోరియా.

డా.కాంచనపల్లి

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా