అజ్ఞాతవాసం: రిమీ... కనిపించట్లేదేమి!

18 May, 2014 00:20 IST|Sakshi
అజ్ఞాతవాసం: రిమీ... కనిపించట్లేదేమి!

అచ్చమైన బెంగాలీ అమ్మాయి. కానీ తెలుగు సినిమాతో నటి అయ్యింది. ‘నీ తోడు కావాలి’ అంటూ దీపక్‌ని అడిగింది.‘అందరివాడు’తో అందరికీ దగ్గరవ్వాలని చూసింది. కొన్నాళ్లపాటు కెరీర్‌లో వేగంగా దూసుకుపోయింది. కానీ ఉన్నట్టుండి ఆ వేగానికి బ్రేక్ పడింది.
ఇప్పుడామె చేతిలో అవకాశాలు లేవు. అసలామె ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడికెళ్లింది? ఏం చేస్తోంది?
 
 అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని కొందరు ఎదురు చూస్తుంటారు. కానీ రిమీసేన్ అలా చూడలేదు. తనే అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లింది. కోరుకున్న చోటికి చేరుకుంది. కానీ ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. రిమీ అసలు పేరు... శుభోమిత్రాసేన్. 1981, సెప్టెంబర్ 11న కోల్‌కతాలో పుట్టింది. ఎందుకోగానీ ఊహ తెలిసినప్పట్నుంచీ ముఖానికి మేకప్ వేయాలన్న తపనతోనే ఉంది. కానీ ఇంట్లోవాళ్లు అంగీకరించలేదు. కళలు కూడుపెట్టవు, చదువుకోమన్నారు. మనసులో బాధ ఉన్నా మౌనంగా వారికి తల వంచింది రిమీ. కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది కానీ మనసు మాత్రం కళారంగంవైపే లాగుతూ ఉంది. రిమీ అంతర్మథనాన్ని ఆమె తాతయ్య అర్థం చేసుకున్నారు. వెళ్లి నచ్చింది చేయమన్నారు. దాంతో రిమీ ఆనందానికి అవధులు లేవు. తల్లిని తోడు తీసుకుని ముంబై రెలైక్కింది. అయితే ఆమె ముంబై వచ్చినంత తేలిగ్గా అవకాశాలు ఆమె దగ్గరకు రాలేదు. చాలా కష్టపడింది. ఎలాగో యాడ్స్‌లో నటించే చాన్స్ సంపాదించింది. చిన్నా చితకా ప్రకటనలు చాలానే చేసింది. కానీ ఆమిర్‌ఖాన్‌తో చేసిన కోకో కోలా యాడ్... ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.
 
 కోలా యాడ్ చూసిన టాలీవుడ్ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ‘నీ తోడు కావాలి’ చిత్రంలో రిమీని హీరోయిన్‌గా తీసుకున్నారు. సినిమా పెద్ద సక్సెస్ కాలేదు. టాలీవుడ్ ఆమెను అంతగా ప్రోత్సహించనూ లేదు. కానీ బాలీవుడ్ మాత్రం ఆమెను సాదరంగా ఆహ్వానించింది. మంచి మంచి అవకాశాలిచ్చింది. హంగామా, బాగ్‌బన్, ధూమ్, స్వప్నేర్ దిన్, గరం మసాలా, క్యోంకీ, దీవానే హుయే పాగల్, ఫిర్ హేరా ఫేరీ, గోల్‌మాల్ 2, దోస్త్, ధూమ్ 2, హ్యాట్రిక్, జానీ గద్దార్, దే తాలీ, షకత్ సిటీ, హార్న్ ఓకే, ప్లీజ్, యహాకే హమ్ సికిందర్, థాంక్యూ... ఇలా ఒకదాని తరువాత ఒకటిగా చేసుకుంటూ పోయింది రిమీ.
 
 ఈ కమ్రంలోనే 2005లో ‘అందరివాడు’లో చిరంజీవి సరసన నటించింది. ఈ సినిమాతో పాటు ధూమ్ 1, 2 చిత్రాలు కూడా రిమీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే వాయువేగంతో సాగిపోతోన్న రిమీ కెరీర్‌కు సడెన్‌గా బ్రేక్ పడింది. 2011లో ‘షాగిర్ద్’ చిత్రం తరువాత ఆమె మళ్లీ తెర మీద కనిపించలేదు. అటు తెలుగులో కానీ, ఇటు హిందీలో కానీ మెరిసింది లేదు. ఉన్నట్టుండి  అలా ఎలా మాయమైపోయింది? అసలేం జరిగింది?
 
 కాంట్రవర్సీయే కారణమా...
 రిమీ కెరీర్ గ్రాఫ్ పడిపోవడానికి, ఆమె సినిమాలకు దూరంగా ఉండాల్సి రావడానికి ఓ కాంట్రవర్సీయే కారణం అన్నమాట బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ‘గోల్‌మాల్’ రిలీజైన తరువాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ... రిమీ కెరీర్‌ని ఖతమ్ చేసిందంటారు చాలామంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె గోల్‌మాల్ దర్శకుడు రోహిత్‌శెట్టి గురించి చేసిన ఓ కామెంట్ కాంట్రవర్సీకి దారి తీసింది. ‘‘రోహిత్ చాలా గొప్ప దర్శకుడు. తను తలచుకుంటే ఓ నల్ల ఆఫ్రికన్‌ని కూడా అందంగా చూపించగలడు’’ అంది రిమీ. ఈ కామెంట్ ఓ పెద్ద వివాదాన్నే సృష్టించింది. ఒక బ్రిటిష్ ఆఫ్రికన్ గ్రూప్ రిమీ స్టేట్‌మెంట్‌ని బహిరంగంగా ఖండించింది. ‘ఇది అర్థం లేని కామెంట్ మాత్రమే కాదు, ఆఫ్రికన్లను అవమానించే కామెంట్, ఇలా మాట్లాడే అర్హత ఆమెకి లేదు’ అంటూ తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దాంతో రిమీకి కష్టాలు మొదలయ్యాయి.
 
 నోరు సంభాళించుకోకపోతే ఇలాగే ఉంటుంది అంటూ పలువురు బాలీవుడ్ పెద్దలు క్లాస్ పీకారని, అయినా రిమీ లక్ష్యపెట్టకపోవడంతో వాళ్లంతా ఆమెను దూరంగా పెట్టడం మొదలుపెట్టారని, అందుకే ఆమెకు అవకాశాలు రాకుండా పోయాయని వినికిడి. అయితే ధూమ్ 3 తీసినప్పుడు ఆమెని ఓ ఐటెమ్ సాంగ్ చేయమని అడిగారని, ముందు రెండు భాగాల్లో హీరోయిన్‌గా చేసిన తాను ఇప్పుడు ఐటెమ్ సాంగ్ చేయడమేంటంటూ రిమీ కోప్పడిందనే వార్తలు వచ్చాయి ఆ మధ్య. అది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ... రిమీ చేతిలో ఇప్పుడు ఒక్క అవకాశం కూడా లేదన్నది నిజం. ఆమె మన ముందుకొచ్చి మూడేళ్లు అయ్యిందన్నదీ నిజం. చాలాకాలం తరువాత ఆ మధ్య ఓ ఫంక్షన్లో కనిపించిన రిమీ... తెరమీద కూడా మళ్లీ కనిపిస్తుందా? ఇంతకుముందులా బిజీ నటి అవుతుందా? చూద్దాం... ఆ రోజు వస్తుందేమో!

మరిన్ని వార్తలు