అజ్ఞాతం వీడండి

16 Sep, 2023 02:28 IST|Sakshi

మావోయిస్టులకు డీజీపీ అంజనీకుమార్‌ పిలుపు

కేంద్ర కమిటీ సభ్యుడు సంజోయ్‌ దీపక్‌రావు అరెస్టు

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు, తెలంగాణకు చెందిన అగ్రనేతలు, కేడర్‌ అజ్ఞాతం వీడి పోలీసులకు లొంగిపోవాలని డీజీపీ అంజనీకుమార్‌ విజ్ఞప్తి చేశారు.  మావోయిస్టులు అజ్ఞాతం వీడి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సంజోయ్‌ దీపక్‌రావును శుక్రవారం ఉదయం కూకట్‌పల్లిలోని మలేషియన్‌ టౌన్‌షిప్‌లో అరెస్టు చేసినట్టు డీజీపీ తెలిపారు.

నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన దీపక్‌రావు ఛత్తీస్‌గఢ్‌లోని మాడ్‌ ప్రాంతంలో ఓ మావోయిస్టు సమావేశానికి హాజరుకావాల్సి ఉందని, ఆయన కదలికలపై ఎస్‌ఐబీ (స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో)కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారన్నారు.

ఒక రివాల్వర్, ఆరు లైవ్‌రౌండ్లు(బుల్లెట్లు), రూ.47,250 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మలేషియన్‌ టౌన్‌షిప్‌లో ఉండే మహేంద్రటెక్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ రంజిత్‌శంకరన్, మాదాపూర్‌కు చెందిన ఓ సినీ దర్శకుడు బి.అజిత్‌కుమార్‌లు దీపక్‌రావుకు ఆశ్రయం ఇచ్చినట్టు గుర్తించామన్నారు.

శుక్రవారం డీజీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొన్నేళ్లుగా తెలంగాణ నుంచి మావోయిస్టుల రిక్రూట్‌మెంట్‌ పూర్తిగా శూన్యమని, సంజోయ్‌ దీపక్‌రావు అరెస్టుతో ఆ పార్టీకి  ఎదురుదెబ్బ తగిలినట్టయ్యిందన్నారు. దీపక్‌రావు మావోయిస్టు అగ్రనేతలు గణపతి, బస్వరాజ్, కోసాలతో నేరుగా సంబంధాలున్నట్టు తెలిపారు. 

నాలుగు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌ 
సంజోయ్‌ దీపక్‌రావు ప్రస్తుతం కేంద్ర కమిటీతోపాటు సౌత్‌ రీజియన్‌ బ్యూరో ఇన్‌చార్జ్‌గా, వెస్ట్రన్‌ ఘాట్‌ స్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శిగా ఉన్న ఆయన మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల పోలీసులతోపాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నారు. దీపక్‌రావుపై మహారాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.

మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్‌నాథ్‌ ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శివగంధనగర్‌కు చెందిన సంజయ్‌ దీపక్‌రావు జమ్మూకశ్మీర్‌లో 1984లో బీటెక్‌ పూర్తి చేశారు. 1999లో సీపీఐఎంఎల్‌ రవూఫ్‌ గ్రూఫ్‌లో తొలుత చేరారు. నక్సల్‌బరీ గ్రూప్‌నకు మహారాష్ట్ర ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. 2000లో ఓసారి అరెస్టు,  తర్వాత విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు.

2002లో అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాల వ్యాప్తికి కీలకంగా పనిచేశారు. 2014లో నక్సల్‌బరీ, సీపీఐ మావోయిస్టులో విలీనం కావడంలో కీలక పాత్ర పోషించారు. నవంబర్‌ 2021లో పశ్చిమ కనుమల ప్రత్యేక జోనల్‌ కమిటీ కార్యదర్శి బీజీ కృష్ణమూర్తి అరెస్టు తర్వాత, ఆ జోనల్‌కు ప్రత్యేక జోనల్‌ కమిటీకి కార్యదర్శిగా నియామకం కాగా, అప్పటి నుంచి అక్కడే పనిచేస్తున్నారు. 

మరిన్ని వార్తలు