ప్రజా కళాకారుడు రాజారావు

5 Feb, 2019 01:20 IST|Sakshi

డాక్టర్‌ గరికపాటి రాజారావు ఫిబ్రవరి 5, 1915న కృష్ణాజిల్లా పోరంకిలో జన్మించారు. దాదాపు అందరూ కొత్త నటీ నటులతో, కొత్త టెక్నీషియన్స్‌తో రాజా ప్రొడక్షన్స్‌ పతాకంపై  ‘పుట్టిల్లు’అనే సినిమా తీసారు.  కానీ హీరోయే విలన్‌ కావడం వలన ఆ చిత్రం ఆర్ధికంగా దెబ్బతింది. ఈ చిత్రంతోపాటు పొట్టి శ్రీరాములు డాక్యుమెంటరీని జత కలిపి విడుదల చేశారు. ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచ యమైన వారిలో జమున, అల్లు రామలింగయ్య, సంగీత దర్శకుడు టి.చలపతిరావు, ప్రసిద్ద బుర్ర కథకుడు నాజర్, పబ్లిసిటీ ఆర్టిస్టు కీతా ముఖ్యులు. 1943లో పృథ్వీరాజ్‌ కపూర్, కేవీ, అబ్బాస్, హరి రవీంద్రనాథ్‌ చటోపాధ్యాయ తదితరులతో ఏర్పడిన కమిటీతో కలిసి రాజారావు కూడా అఖిల భారత ప్రజానాట్య మండలిని స్థాపించారు. వివిధ కళా సంస్థల్ని, కళాకారుల్ని ఒకే వేదికపైకి తెచ్చి ప్రజానాట్య మండలి స్థాపించారు.

దాదాపు పదేళ్లు బెజవాడలో ఉండి, డాక్టరుగా, యాక్టరుగా, నాటక సంఘాల ప్రజానాట్యమండలి ఆర్గనైజరుగా పనిచేశారు. మొగల్‌రాజపురంలోని కాట్రగడ్డ వారి ఆవరణలో ప్రారంభమైన ప్రజాశక్తి దినపత్రికలోని కార్మికులకు, కార్యకర్తలకు ఉచిత వైద్యం చేశారు. 1945 డిసెంబరు 30, 1946 జనవరి 1వ తేదీల్లో రాజమండ్రిలో జరిగిన ఆంధ్రరాష్ట్ర అభ్యుదయ రచయితల మహాసభల్లో ప్రజానాట్య మండలి తరపున బుర్ర కథలు, మొదలైన ప్రదర్శనలతో చక్కని కృషి చేశారు. 1946 జూన్‌లో రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్ల మహాసభలు రాజమండ్రిలో జరిగినపుడు కోగంటి గోపాల కృష్ణయ్య తదితరులతో రూపొందించిన ప్రెస్‌వర్కరు, మున్సిపల్‌ వర్కరు నృత్య నాటికలను అద్భుతంగా ప్రదర్శించారు. 1945లో రాజమండ్రి వచ్చి లక్ష్మీవారపు పేట బుద్దుడు హాస్పిటల్‌ పక్కన ఉన్న పెంకు టింట్లో ఉండేవారు. వీరేశలింగం ఆర్ట్‌ థియేటర్‌ కూడా స్థాపించారు. రాజా ప్రొడక్షన్స్‌ స్టాపించి 1953లో ‘పుట్టినిల్లు’ సినిమా తీశారు. రాజారావు 9 సెప్టెంబరు 1963న కన్ను మూశారు. రాజరావు నటుడిగా ఆరాధన , బొబ్బిలి యుద్ధం చిత్రాలలో కనిపిస్తారు. రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వారు ఆయన జ్ఞాపకార్థం దేవీచౌక్‌ నుంచి వెళ్ళే ఒక వీధికి ఆయన పేరు పెట్టారు. ఆ రోడ్డులోనే ఆయన శిష్యులు విగ్రహాన్ని కూడా నెలకొల్పారు. (నేడు గరికపాటి రాజారావు 104వ జయంతి) 

-అడబాల మరిడియ్య, దొడ్డిగుంట, తూ.గో.జిల్లా 

మరిన్ని వార్తలు