చల్లారని నెగళ్లు

3 Feb, 2019 01:42 IST|Sakshi

చెట్టు గురించో, పిట్ట గురించో రాసినంత తేలిక కాదు–చెట్టు వేళ్ల విస్తృతి గురించీ, పిట్ట రెక్కల శక్తి రహస్యం గురించీ రాయడం. అటువంటి తేలిక కాని పనినే తలకెత్తుకున్నారు అరవై ఏళ్ల క్రితం వరవరరావు. డజను వరకూ సంకలనాలు, వెయ్యి పేజీల పైబడి పరుచుకున్న అక్షరాలు.. రగిలించిన చైతన్యం, ఎక్కుపెట్టిన ప్రశ్నలు ఆయనకు సముచిత గౌరవాన్నే ఇచ్చి, కటకటాల వెనక్కు నెట్టాయి. కవిత్వం రాయకుండా ఉండలేక రాసినవి కావు ఈ కవితలు, రాయాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ, నొప్పిప డుతూ రాసినవి. అభిప్రాయాల్లో నిర్దిష్టత మాత్రమే కాదు, భావ వ్యక్తీకరణలోని కవి తాంశ కూడా పఠితులను విలవిలలాడేలా చేయడం వరవరరావు కవిత్వం ప్రత్యేకత. సిద్ధాంతాలను జీవితంలోకి ఇంకించుకుని సంఘంకోసం తపనతో వ్యక్తీకరించడం కేవలం ఆయనకే సాధ్యం. ఎవరైనా ఆరు దశాబ్దాల అసలు సిసలు చరిత్రను అధ్యయనం చేయాలనుకుంటే వివి కవితలన్నీ మైలురాళ్లుగా నిలుస్తాయి. ఒక్కో కవితా.. రాజ్యం చేసిన ఒక్కొక్క తప్పును వేలెత్తి చూపుతుంది. ప్రతి అక్షరం.. రాజ్యహింసలో ఒరిగిన కన్నీటి బిందువుల ఆవేదనను ప్రతిబింబిస్తుంది. వీవీ అనుభవించినంత జైలు జీవితాన్ని బహుశా ప్రపంచంలో మరే కవీ అనుభవించి ఉండడు. ఎంతో విస్తృతమైన సామాజిక కార్యాచరణలో తలమునకలుగా ఉండి, ఇంత కవిత్వాన్ని సృజించడం మాటలు కాదు. 

‘విప్లవ కవిత్వమంటే..’ అంటూ రొడ్డకొట్టుడు విమర్శకులు తొలి నాళ్ల నుంచీ నోళ్లు నెప్పెట్టేలా వాగుతూనే ఉన్నారు. ‘నెత్తురంటిన చేతుల్ని గురించి/నెత్తీనోరూ బాదుకొని మొత్తుకోవాలి తప్ప/కొత్త కాగితం వాసనో/అచ్చు వాసనో వేసే/అస్పష్ట కవిత్వం పక్కన/నీ ఫొటో తప్ప నిర్దిష్టంగా పోల్చుకునేదేమీ ఉండదు’అని ఎప్పటికప్పుడు ఆయన స్పష్టంగా సమాధానమిస్తూనే ఉన్నారు. జీవితానికీ, కార్యాచరణకీ, కవిత్వానికీ మధ్య వ్యత్యాసం లేశమాత్రమైనా లేకపోవడం వల్లే ఆయన అక్షరాలు నిప్పుల కొలిమి మీద కవాతులా కణకణమండుతూంటాయి.
 
కవి నిర్బంధంలో ఉన్నప్పుడు అతని కవిత్వాన్ని గానం చేయాల్సి రావడం ఒక ఆవేదనాపూరిత సందర్భమే కాదు, రాజ్య వైఖరికి నిదర్శనం. ఓసారి ఆ కవిత్వాన్ని పునశ్చరణ చేసుకోవడం, ఆ కవిని ఆవాహన చేసుకోవడం అక్షరాల్ని ప్రేమించే ప్రతి ఒక్కరి విధి. నెగళ్లు చల్లారకుండా చూసుకోవాల్సిన ఒక బాధ్యత.        

– దేశరాజు
(నేడు పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ రోజ్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాలులో ఉదయం పది గంటల నుంచి ‘విప్లవ కవి వరవరరావు కవిత్వంతో ఒక రోజు’ సాహిత్య సభ సందర్భంగా..) 

మరిన్ని వార్తలు